Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అసమగ్ర చికిత్స

అనారోగ్యం పాలబడిన ఏ వ్యక్తికైనా వైద్య చికిత్స, ఔషధ సేవనాల దరిమిలా సాంత్వన చేకూరాలేతప్ప, అదనపు సమస్యలు దాపురించకూడదు. దురదృష్టవశాత్తు వైద్య పరికరాల వల్ల అలా ఏదైనా జరిగితే, ప్రస్తుతం దేశంలో బాధితులెవరూ పరిహారం కోరే వీల్లేదు. వివిధ వైద్య పరికరాల్ని వినియోగిస్తున్నప్పుడు ఎవరైనా గాయపడినా, వాటి కారణంగా మరింత అనారోగ్యం చుట్టుముట్టినా ఇకమీదట కోటిరూపాయల వరకు నష్టపరిహారం డిమాండు చేయవచ్చంటోంది ‘నీతి ఆయోగ్‌’ కొత్త ముసాయిదా బిల్లు. వైద్య పరికరాల్ని ఔషధాలుగా పరిగణించాలన్న కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సూచనతో విభేదించిన నీతి ఆయోగ్‌, ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను ప్రతిపాదిస్తోంది. వైద్య పరికరాల (భద్రత, ప్రభావశీలత, నవకల్పన) బిల్లు 2019 పేరిట రూపొందిన నిబంధనలు స్థానికంగా తయారైన వాటితోపాటు దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకూ వర్తించాలంటున్న ముసాయిదా- విస్తృత ప్రాతిపదికన నూతన వ్యవస్థ అవతరణను లక్షిస్తోంది. తద్వారా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) పరిధి కుంచించుకుపోనుంది. దేశీయంగా వైద్య పరికరాల విపణి దాదాపు రూ.50వేల కోట్లకు చేరుకుందని అంచనా. 2022 నాటికి రమారమి రూ.68 వేలకోట్లకు విస్తరించనుందంటున్న విపణిని క్రమబద్ధీకరించడంలో వైద్య పరికరాల పరీక్ష విభాగాలు, ప్రయోగశాలలు, చర్యల అమలు విభాగాలతో కూడిన ప్రతిపాదిత నూతన వ్యవస్థ కీలక భూమిక పోషించాల్సి ఉంటుంది. ఇన్నేళ్లూ వైద్య పరికరాలు, ఔషధాల నియంత్రణ బాధ్యత నిర్వర్తించడంలో సీడీఎస్‌సీఓ ఉదాసీన పాత్ర ఎన్నో సమస్యలకు అంటుకట్టింది. పొరుగున చైనా సహా పలు దేశాలు లోపభూయిష్ఠ వైద్య ఉత్పత్తుల కట్టడి నిమిత్తం కొన్నేళ్లుగా పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. ఇక్కడా అందుకు దీటైన వ్యవస్థ నెలకొనాలంటే- మరిన్ని బిగింపులతో శాసననిర్మాణం, పకడ్బందీగా నిబంధనావళిని అమలుపరచడం తప్పనిసరి.

రెండేళ్ల క్రితం ఇంటర్‌పోల్‌, డబ్ల్యూసీఓ(ప్రపంచ కస్టమ్స్‌ సంస్థ)లతో జట్టుకట్టి 123 దేశాలకు చెందిన శాసన వ్యవస్థలు చేపట్టిన ఉమ్మడి ‘ఆపరేషన్‌’- వందల కోట్ల రూపాయల విలువైన నకిలీ ఔషధాలు, నాసి పరికరాల గుట్టు రట్టు చేసింది. అప్పట్లో మూడున్నర వేలకు పైగా వెబ్‌సైట్లు మూతపడ్డాయి. సిరంజీలు, కాంటాక్ట్‌ లెన్సులు, వినికిడి సాధనాలు, శస్త్రచికిత్స పరికరాలకు అసంఖ్యాకంగా డూప్లికేట్ల పట్టివేత దేశదేశాల్లో ప్రజారోగ్య సంక్షోభ తీవ్రతను కళ్లకు కట్టింది. వైద్యపరికరాలు, ఔషధ ఉత్పత్తుల రంగాన బహుళ జాతి దిగ్గజ సంస్థగా ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’కు వరసగా తలబొప్పి కడుతున్న వైనం అమెరికా వంటిచోట్ల విస్తృత జనచేతన తాలూకు సంఘటిత శక్తిని చాటేదే. ‘రిస్పర్‌ డాల్‌’ అనే ఔషధ దుష్ప్రభావాన్ని దాచిపెట్టి రోగులకు సిఫార్సు చేయాల్సిందిగా అనుచిత ఒత్తిళ్లు తెచ్చినట్లు రుజువై గత నెలలో సుమారు రూ.56 వేలకోట్ల జరిమానా కక్కాల్సి వచ్చిన ఆ సంస్థ బేబీ పౌడర్‌లో ఆస్‌బెస్టాస్‌ (రాతినార) ఆనవాళ్ల తాజా కథనాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. లక్షకు పైగా దాఖలైన వ్యాజ్యాలు ఒక కొలిక్కి వచ్చేసరికి ఆ సంస్థ లక్షా 40 వేలకోట్ల రూపాయలకు పైగా మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నారు. తప్పిదాలను సాక్ష్యాధార సహితంగా నిరూపించే పర్యవేక్షణ యంత్రాంగం, తీవ్రతకు అనుగుణంగా భారీ జరిమానాల విధింపు వసూలు వ్యవస్థ ఉంటేనే- ఇక్కడా నాణ్యత ప్రమాణాల మెరుగుదల సాధ్యపడుతుంది. భారత్‌లో సురక్షిత, నాణ్యమైన వైద్య పరికరాల వినియోగం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు ఉద్దేశించామంటున్న నీతిఆయోగ్‌ ముసాయిదాలో ఆ మేరకు సముచిత మార్పులు తేవాల్సి ఉంది. సంపన్న రాజ్యాల్లో భారీ జరిమానాలు చెల్లిస్తున్న దిగ్గజ సంస్థలు, అటువంటి తప్పిదాలకే దేశీయంగా నామమాత్ర శిక్షతో నిక్షేపంగా బయటపడే పరిస్థితి లేకుండా - విధి నిషేధాల్ని పరిపుష్టీకరించాల్సిందే!

విశ్వవ్యాప్తంగా ఎనిమిది శాతం దాకా వైద్యపరికరాలు నకిలీలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2010లో వెల్లడించిన తరవాత, ఎప్పటికప్పుడు ముప్పు ముమ్మరిస్తోందేగాని తగ్గకపోవడం- తక్షణ దిద్దుబాటు చర్యల అత్యావశ్యకతను సూచిస్తోంది. దేశీయంగా నాసి మందుల ఉత్పాతం అంతకన్నా పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. భారత విపణిలో 25 శాతం వరకు ఔషధాలు నకిలీవేనన్న ‘అసోచామ్‌’ (వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య), దేశంలో రమారమి రూ.30 వేలకోట్ల మేర అక్రమ దందా సాగుతున్నట్లు నాలుగేళ్ల క్రితమే లెక్కకట్టింది. యాంటీ బయాటిక్స్‌, మలేరియా చికిత్సకు దగ్గు తగ్గడానికి కుటుంబ నియంత్రణకు ఉపయోగించే మాత్రలు, నొప్పి బిళ్లలు... అన్నింటికీ నాసి అనుకరణలు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. చౌక వ్యయంతో మాత్రలు, క్యాప్సూళ్లతోపాటు సూదిమందులు, ఇన్‌హేలర్లను (లోపలికి పీల్చే మందుల్ని) సైతం నకిలీ ఔషధ పరిశ్రమ పెద్దయెత్తున ఉత్పత్తి చేస్తున్నట్లు నిపుణులు పదిహేనేళ్లుగా హెచ్చరిస్తున్నారు. తయారీ నుంచి వాడకం దాకా అడుగడుగునా ప్రమాణాలు పరమ లోపభూయిష్ఠమని జాతీయ ఔషధ సర్వే నిగ్గుతేల్చి రెండేళ్లు గతించాయి. పలు రాష్ట్రాల సర్కారీ దవాఖానాల్లో రోగులకు పంపిణీ చేస్తున్న మందుల్లోనూ నాసి సరకు ఉంటున్నదంటే, జనారోగ్యానికి ఎంతగా తూట్లు పడుతున్నాయో వేరే చెప్పాలా? రోగుల ప్రాణాలతో ఈ చెలగాటం ఇక ఎంతమాత్రం కొనసాగడానికి వీల్లేదు. ఆన్‌లైన్‌ కొనుగోళ్లను నియంత్రించేందుకు, ఔషధ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు నిలబెట్టేందుకంటూ అడపాదడపా ప్రకటనలు వెలుగు చూస్తున్నాయి. అన్ని రకాల వైద్య పరికరాలు, మందులకు వర్తించేలా సమర్థ నిఘా, పర్యవేక్షణ యంత్రాంగం దేశంలో కుదురుకుంటేనే జనారోగ్యం తెరిపిన పడుతుంది!

Posted on 06-11-2019