Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సుహృద్భావమే శ్రీరామరక్ష

‘అయోధ్యపై వ్యాజ్యంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చే తీర్పు ఏ తీరుగా ఉన్నప్పటికీ అది కోట్లాది పౌరుల మనోభావాల్నే కాదు, భావి తరాల్నీ ప్రభావితం చేస్తుంది’- చారిత్రక కేసులో ముస్లిముల పక్షాన వాదించిన రాజీవ్‌ ధావన్‌ సుప్రీంకోర్టుకు సమర్పించిన లిఖితపూర్వక పత్రంలో చేసిన వ్యాఖ్య అది. స్వతంత్ర భారతావని చరిత్రలో ఏడు దశాబ్దాలుగా భిన్నదశల్లో సామాజిక రాజకీయ రంగాల్ని కుదిపేసిన అయోధ్య వివాదానికి మరి కొన్నాళ్లలో రాజ్యాంగ ధర్మాసనం తెర దించనున్న తరుణమిది. 40 రోజుల వరస విచారణ దరిమిలా అక్టోబరు 16న తీర్పును ‘రిజర్వ్‌’ చేసిన సుప్రీంకోర్టు- ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ పదవీ విరమణ (ఈ నెల 17న)లోగా తీర్పు వెలువరించనుండటంతో దేశవ్యాప్తంగా ఉద్విగ్నత అలముకొంటోంది. మతపర మనోభావాలతో ముడివడిన అంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం యూపీలో నాలుగు వేలమంది భద్రతా బలగాల్ని మోహరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఉద్రిక్తతల్ని ప్రజ్వరిల్లజేసే వ్యాఖ్యలు పోటెత్తే ప్రమాదాన్ని శంకించి యూపీ ప్రభుత్వం 16 వేలమందితో వడబోత యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. ఫైజాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం కదలబారకుండా కాచుకొనేందుకు మరో 16 వేలమంది స్వచ్ఛంద సేవకుల్ని సమాయత్తపరచింది. రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు, బాబ్రీ కట్టడాన్ని కూల్చే దృశ్యాల్ని ప్రసారం చేయవద్దంటూ వార్తా ప్రసార ప్రమాణాల ప్రాధికార సంస్థ మూడు వారాలనాడే మార్గదర్శకాల్ని వెలువరించింది. జాతి సమైక్యత సమగ్రతలకు మూలకందమైన మత సహిష్ణుత ఏ దశలోనూ కదలబారకూడదన్న లక్ష్యంతో ఈ జాగ్రత్తలకు జతపడి జరిగిన మరో కీలక భేటీ- ఓరిమి, కూరిమి అత్యావశ్యకమని ఎలుగెత్తి చాటింది. ఆరెస్సెస్‌, భాజపా నేతలు నిర్వహించిన సమావేశంలో జమాత్‌ ఉలేమా ఇ హింద్‌, అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యులు పాల్గొని తీర్పు ఎవరి పక్షమైనా సుహృద్భావం చెదరకూడదంటూ చేసిన ప్రకటన, గెలిచినవాళ్లు సంబరాలకు ఓడినవారు దుందుడుకు చర్యలకు పాల్పడరాదన్న సందేశం- ఇరు వర్గాల్లో వెల్లివిరిసిన పరిణతికి అద్దం పడుతున్నాయి!

దశాబ్దాల న్యాయపోరాటానికే కాదు, సుదీర్ఘకాల మత వైమనస్యాలకూ అయోధ్య తీర్పు అంతిమ పరిష్కారం అవుతుందని హిందూ ముస్లిం కక్షిదారులు ప్రగాఢంగా విశ్వసిస్తున్న వేళ ఇది. 1992లో బాబ్రీ కట్టడ విధ్వంసం దరిమిలా నాటి పీవీ సర్కారు రాష్ట్రపతి నివేదన రూపేణా తన శిరోవేదనను సుప్రీంకోర్టుకు బదిలీ చెయ్యాలనుకొంది. ‘1992 డిసెంబరు ఆరు వరకు బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో పూర్వం ఎప్పుడైనా దేవాలయం ఉండేదా?’ అన్న ఏక వాక్య ప్రశ్నకు ‘సుప్రీం’ ఇచ్చే సమాధానం- చుట్టుముట్టిన సంక్షోభం నుంచి తన ప్రభుత్వాన్ని ఒడ్డున పడేయగలదనుకొంది. ఎప్పటికైనా తెమిలిపోయే అయోధ్య తుపాను కారణంగా అత్యున్నత న్యాయస్థానం గౌరవ ప్రతిష్ఠలపై రాజీ పడలేమంటూ నాటి నివేదనను నిష్కర్షగా తోసిపుచ్చిన సుప్రీంకోర్టు- పాతికేళ్ల తరవాత అదే అంశంపై త్వరలో తీర్పు ఇవ్వనుంది. రాజకీయం దట్టించిన నివేదనను కాదుపొమ్మన్న న్యాయపాలికే, కక్షిదారుల వేదనగా తన గడప తొక్కిన వివాదంపై 180 గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిపింది. 15 రోజులపాటు హిందువులు, 20 రోజులపాటు ముస్లిం వర్గీయుల వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం- పరస్పర వాదనల ఖండనలకు అయిదు రోజులు కేటాయించింది. శతాబ్దాల క్రితం బహుశా విక్రమాదిత్యుడు అయోధ్యలో ఆలయం నిర్మించాడని, 11వ శతాబ్దిలో పునర్నిర్మించిన దాన్ని 1526లో బాబర్‌ కూలగొట్టాడంటూ, అయోధ్య రామజన్మ స్థలి అన్న జనబాహుళ్య విశ్వాసమే తిరుగులేనిదని హిందువుల వాదన సాగిపోయింది. పురావస్తు శాఖ 1993లో ఇచ్చిన నివేదిక అసమగ్రమంటూ అన్ని గెజెట్లలోనూ మసీదు ప్రస్తావనే ఉందిగాని, మందిరం ఆనవాళ్లు లేవంటూ ముస్లిముల పక్షానా బలీయ వాదనలు వినవచ్చాయి. సుప్రీంకోర్టులో ఉద్విగ్నభరిత వాదనలతో హోరాహోరీ తలపడిన ఇరువర్గాలూ సుహృద్భావం పరిఢవిల్లాలంటూ ఒక్కతాటి మీదకొచ్చి చేస్తున్న విజ్ఞప్తిని అందరూ ఔదలదాల్చాలి!

‘ఇక్కడ దేవతలు నడయాడటానికి సైతం భయపడే చిన్న భూభాగం ఉంది’ అంటూ 2010 సెప్టెంబరులో అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ న్యాయమూర్తి రాసిన తీర్పు- ఇరు వర్గాల మనోభావాలతో ముడివడిన వ్యాజ్యం ఎంత పదునైనదో చాటుతోంది. కాబట్టే హైకోర్టు, అత్యంత కీలకమైన 1500 గజాల స్థలాన్ని మూడు వాటాలు వేసి కేసును ముగించింది. మొత్తం స్థలం యాజమాన్య హక్కులు తమకే దక్కాలంటూ దాఖలైన 14 అప్పీళ్లపై సుప్రీంకోర్టు ద్విముఖ వ్యూహం అనుసరించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఖలీఫుల్లా, పండిట్‌ రవిశంకర్‌, విఖ్యాత మధ్యవర్తి శ్రీరామ్‌ పంచుల సారథ్యంలో న్యాయపాలిక ఏర్పాటు చేసిన కమిటీ- అయోధ్య కేసు విచారణ కడపటి రోజున తన నివేదిక కూడా సమర్పించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిపై తమ హక్కు వదులుకొని రామాలయ నిర్మాణానికి ఇచ్చేయడానికి ముస్లిం వర్గాలు అంగీకరించాయని, సంబంధిత పరిష్కార పత్రంపై సున్నీ వక్ఫ్‌ బోర్డుతోపాటు నిర్మోహి అఖాడా ప్రతినిధి, హిందూ మహాసభ తదితరులు సంతకాలు చేశారని వార్తా కథనాలు చాటుతున్నాయి. ‘అన్ని మతాలను గౌరవించాలని హిందుత్వం నాడు ప్రబోధించింది... రామరాజ్య రహస్యం అందులో నిబిడీకృతమై ఉంద’న్నారు మహాత్మాగాంధీ. సర్వమత సమభావననే భిన్న మతావలంబకుల భారతావని సమగ్రతకు పునాది. రేపు ‘సుప్రీం’ తీర్పు ఎలా ఉన్నా ఆవేశకావేషాలు ప్రజ్వరిల్లకుండా హుందాగా దాన్ని అన్ని వర్గాలూ ఔదలదాల్చి జాతి సమైక్యతా సౌశీల్యాన్ని వేనోళ్ల చాటాలి. ఇరు వర్గాల పెద్దల భేటీ- ఉద్విగ్నతలు ఉద్రిక్తతలుగా మారకుండా చూసే క్రమంలో ఎన్నదగిన మైలురాయి!

Posted on 07-11-2019