Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

శేషన్‌లా ఇంకెవరు?

‘అసాధ్యమనదగ్గ అత్యున్నత ప్రమాణాల్ని తనకు తాను నిర్దేశించుకొని వాటికి తగ్గట్లు పనిచేయని వారిమీద ఆయన ప్రదర్శించే అసహనం అర్థవంతమైనది’- మదురై జిల్లా ధిండికల్‌ సబ్‌కలెక్టర్‌గా శేషన్‌ పనిచేస్తున్నప్పుడు ఆయన మీద వార్షిక రహస్య నివేదికలో కలెక్టర్‌ వెలిబుచ్చిన అభిప్రాయమిది. దాన్ని వ్యక్తిత్వలోపంగా భావించిన ప్రభుత్వం అదేమని అడిగితే, కలెక్టర్‌ విశ్లేషణ ‘మీకు అలా అర్థమైతే అలాగే అనుకోండి’ అని ప్రత్యుత్తరమిచ్చిన శేషన్‌- ప్రభుత్వాల దృష్టిలో జగమొండి! ముఖ్యమంత్రి జయలలిత చేత దురహంకారిగా ముద్ర వేయించుకున్న శేషన్‌- ఎన్నికల షెడ్యూలు విషయంలో నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీకి రాజ్యాంగ పరిధుల్ని సున్నితంగా గుర్తుచేసిన బాధ్యతాయుత అధికారి. 1990 డిసెంబరులో కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్‌గా శేషన్‌ నియుక్తులయ్యాకే, నిర్వాచన్‌ సదన్‌ కేంద్రప్రభుత్వ ఉపాంగం కానేకాదని, అదొక రాజ్యాంగబద్ధ వ్యవస్థ అని దేశ ప్రజలకు మొట్టమొదటిసారిగా తెలిసొచ్చింది. 1996లోనే సీఈసీగా శేషన్‌ పదవీ విరమణ చేసినా, ‘ఇప్పుడు గనక శేషన్‌ ఉండి ఉంటేనా...’ అని నేటికీ జనం అనుకొంటున్నారంటేనే- యావద్దేశంపై ఆయన వేసిన ప్రగాఢ ముద్ర ఎంత బలీయమైనదో బోధపడుతుంది. ‘రాజకీయ నాయకుల్ని కాదు... భ్రష్ట రాజకీయాల్నే అసహ్యించుకొంటా’నంటూ, దశమహా పాతకాల ఉరవడిలో ‘తమాషా’గా మారిపోయిన ఎన్నికల ప్రక్రియ పవిత్రతను పరిరక్షించడానికి సీఈసీగా శేషన్‌ సాగించిన ఒంటరి పోరాటం అనుపమానం. ఓటర్లను గొర్రెలుగా జమకట్టి ‘కర్ర ఉన్నవాడిదే బర్రె’ చందంగా సాగిన దాదాగిరి రాజకీయాల భరతం పట్టేలా- పరిమిత అధికారాల పరిధిలోనే వ్యవస్థ సమూల క్షాళనకు సమకట్టిన ‘ఒకే ఒక్కడు’గా దేశ జనావళి గుండెల్లో చండశేషన్‌ చెదరని జ్ఞాపకం. ‘శేషన్‌ తరవాత ఎవరు’ అన్నది రెండు పుష్కరాలనాడు జనం మనసుల్ని తొలిచిన ప్రశ్న. ‘శేషన్‌లా ఇంకెవరు’ అన్న అశేష జనావళి నిట్టూర్పు సెగలే ఆ ధన్యజీవి ఔన్నత్యానికి దాఖలా!

మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు అసలు ఓటుహక్కు అంటే ఏమిటో ప్రజానీకానికి తెలియజెప్పాయని, విచక్షణాయుతంగా ఓటు ఎలా వేయాలో రెండో సార్వత్రికం నాటికే పౌరులకు తెలిసొచ్చిందనీ ఎన్నికల సంఘం లోగడ ప్రకటించింది. తొలితరం త్యాగధనుల శకం అంతరించాక సమస్త అవినీతి అక్రమాల వరద ముంపులో ఎన్నికల స్ఫూర్తి కొట్టుకుపోగా, అయిదేళ్లకోమారు ఎలెక్షన్ల క్రతువు ఏదో విధంగా జరిగిపోయిందనిపించడానికే ఈసీ పరిమితమైపోయింది. ఆ సమయంలో నిర్వాచన్‌ సదన్‌ సారథ్య బాధ్యతలు చేపట్టిన శేషన్‌- ‘రాజకీయ నాయకులు చేసే ప్రజాస్వామ్య దోపిడిని నేను అనుమతించాలంటారా?’ అని ప్రశ్నిస్తూ, జనస్వామ్యాన్ని పరిహాస భాజనం చేసే పోకడలపై కత్తి ఝళిపించారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి సమగ్రతలకు పాదుచేసి, స్వీయహక్కులపై చైతన్యపరచడం ద్వారా ఓటర్లకు సాధికారత కల్పించి, ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళించి సీఈసీగా శేషన్‌ తెచ్చిన మార్పులు చిరస్మరణీయమైనవి. కోరల్లేని పాములా పడిఉన్న ప్రవర్తన నియమావళినే ఈసీ చేతి పాశుపతం చేసి- అధికార పార్టీలు ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించడాన్ని, సర్కారీ యంత్రాంగాన్ని దుర్వినియోగం చెయ్యడాన్ని, తమకు అనుకూలురు కాని అధికారుల్ని అడ్డగోలుగా బదిలీ చెయ్యడాన్ని కట్టుదిట్టంగా అరికట్టింది శేషన్‌ మహాశయుడే! గోడలపై అడ్డగోలు రాతలు, చెవులు చిల్లులు పడేలా లౌడ్‌స్పీకర్ల మోతలు ఆగిపోవడమూ ఆయన చలవే. అక్షరాలా రణక్షేత్రాన్ని తలపించే యూపీ బిహార్‌ వంటిచోట్ల కేంద్ర బలగాల మోహరింపు, పలు విడతల పోలింగ్‌, వందలమంది పరిశీలకులు, తేడావస్తే ఎన్నిక రద్దు వంటి చర్యలు- రౌడీ తండాల రాక్షసత్వాన్ని చాలావరకు పరిహరించాయి. అంతెందుకు- ఇప్పుడు కూడా ఈసీ ఏమంటుందోనని పార్టీలు నిబంధనల చట్రానికి ఒదిగి ఉండేలా నిర్వాచన్‌ సదన్‌ పలుకుబడి పెంచిన శేషన్‌- చిత్తశుద్ధి ఉండాలేగాని వ్యవస్థల క్షాళన అసాధ్యమేమీ కాదని రుజువు చేసిన సెన్సేషన్‌!

సారథ్య బాధ్యతల్లోని వ్యక్తుల మంచి చెడ్డలబట్టే ఆయా వ్యవస్థల బాగోగులుంటాయని భారతరత్న అంబేడ్కర్‌ చెప్పింది అక్షర సత్యం. ఎన్నికల్లో బోగస్‌ ఓట్ల నివారణకు ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు, పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్య సూచికగా సంస్థాగత ఎన్నికలు, వాటి జమాఖర్చుల ఆడిటింగ్‌ వంటివాటిపై పట్టుబట్టి, అవిలేకుంటే ఎన్నికల్ని నిర్వహించేది లేదని పంతంపట్టి శేషన్‌ మొదలుపెట్టిన సంస్కరణ క్రతువు కొంతమేర సత్ఫలితాలిచ్చిందన్నది కళ్లకు కడుతున్న వాస్తవం. అతి చేస్తే గతి చెడుతుందన్నట్లుగా కొన్ని అంశాల్లో పంతానికిపోయి శేషన్‌ న్యాయపాలిక చేత మొట్టికాయలు వేయించుకొన్న మాట నిజమే. శేషన్‌ ధోరణి ‘తోక కుక్కను ఊపిన చందం’గా ఉందన్న ఆయన పదవీ వారసులు- ధనస్వామ్యం వేయి బాహువులతో విరుచుకుపడి, ఎన్నికల పవిత్రతను మంటగలుపుతున్నా ఏమీ చెయ్యలేకపోతున్నారన్నదీ చర్విత చర్వణమే. శేషన్‌ ఉద్యోగ జీవితం నేర్పుతున్న స్ఫూర్తి పాఠాలు రెండు. ఏయే తరహా ఎన్నికల సంస్కరణలు అవసరమో కేంద్రానికి నివేదించి చేతులు దులుపుకోవడం కాకుండా, స్వీయ అధికారాన్ని విశాల జనహిత కరంగా ఎలా వినియోగించగల వీలుందో నిర్వాచన్‌ సదన్‌ పెద్దలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సివిల్‌ సర్వీసుల్లో చేరిన కొత్తల్లో గరమ్‌ గరమ్‌గా ఉండేవారు క్రమంగా నరమ్‌ నరమ్‌గా కడకు బేషరమ్‌గా దిగజారడం మెజారిటీ అధికారుల విషయంలో రుజువైన నిజమే అయినా, నిజాయతీ రుజువర్తనలతో విధ్యుక్త ధర్మానికి కట్టుబడితే వ్యవస్థల్ని మెరుగుపరచి శేషన్‌లా చిర కీర్తిశేషులయ్యే అవకాశం ఉంది. ఆ ఘనత సాధించినందుకే రామన్‌ మెగసెసే పురస్కారంతో పాటు చెదరని ప్రజాదరణా శేషన్‌ సొంతమయ్యాయి!

Posted on 12-11-2019