Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

వైద్య వ్యవస్థకు చికిత్స?

అసంఖ్యాక భారతీయులకు నేటికీ అక్కరకు రాని చుట్టం- సర్కారీ వైద్యం! దేశంలో ప్రజారోగ్యరంగ దయనీయ స్థితిగతులకు ‘నీతి ఆయోగ్‌’ తాజా నివేదికే నిలువుటద్దం. నూతన భారత్‌కు మెరుగైన స్వస్థ విధానం రూపొందించే కసరత్తులో భాగంగా తాను గమనించిన లోటుపాట్లు ఎన్నింటినో నీతి ఆయోగ్‌ గుదిగుచ్చింది. జనారోగ్య పరిరక్షణకు వెచ్చిస్తున్న వ్యయాన్ని జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో శాతంగా లెక్కించి చూస్తే- శ్రీలంక, ఇండొనేసియా, ఈజిప్ట్‌, ఫిలిప్పీన్స్‌ల సరసనా ఇండియా వెలాతెలా పోతోంది. అంతర్జాతీయంగా పౌరుల సొంత ఆరోగ్య వ్యయ సగటు 18శాతమే. అదే దేశీయంగా అనారోగ్యం పాలబడినవారు చికిత్సకయ్యే ఖర్చులో సుమారు 63శాతందాకా తామే భరించాల్సి వస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ప్రధానమంత్రి జనారోగ్య యోజన’ పరిధిలో చేరేది జనాభాలో దాదాపు 40శాతమేనని, వివిధ ప్రభుత్వ ప్రైవేటు బీమా పథకాలకింద లబ్ధి పొందే మరో అయిదు శాతం పోను అత్యధికులకు స్వాస్థ్య రక్షణ అన్నది లేనేలేదని గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. గత్యంతరంలేక చికిత్స కోసం అప్పులపాలై ఏటా ఆరు కోట్లమందికి పైగా ఆర్థికంగా చితికిపోతున్నట్లు పార్లమెంటరీ స్థాయీసంఘమే లోగడ ధ్రువీకరించింది. ఆరోగ్య బీమాకు సంబంధించి కచ్చితమైన విధినిషేధాలు, ఇదమిత్థమైన మార్గదర్శకత్వం కొరవడి నెలకొన్న గందరగోళ వాతావరణంలో- ఖర్చుపెట్టీ తగిన రక్షణ పొందలేకపోతున్న వారొక పార్శ్వం. సకాలంలో సరైన వైద్య సేవలందక ప్రతి సంవత్సరం దాదాపు 24 లక్షల నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతుండటం, యథేచ్ఛగా కొనసాగుతున్న అవ్యవస్థకు మరో పార్శ్వం. ఈ దుస్థితిని చెదరగొట్టి ఆరోగ్య సేవారంగంపై ప్రజలకు గట్టినమ్మకం ఏర్పడేలా నిర్దిష్ట చర్యల్ని నీతిఆయోగ్‌ సూచిస్తోంది. 2030నాటికి పది లక్షల పసికందుల ప్రాణాలు కాపాడాలని, పనిచేయగల స్థితిలోని వయోజనుల మరణాల్ని 16 శాతం మేర తగ్గించాలని, ప్రజలపై వైద్యభారం నియంత్రించాలని గిరిగీస్తోంది. తద్వారా ‘వైద్య పర్యాటకాభివృద్ధి’ వినసొంపుగా ఉన్నా, జనశ్రేయానికి పెద్దపీట వేయడంలో ప్రభుత్వాల చొరవే కీలక నిర్ణాయకాంశం కానుంది.

స్వస్థ సేవల లభ్యత, నాణ్యతల రీత్యా 195 దేశాల జాబితాలో భారత్‌ 145వ స్థానాన ఈసురోమంటోంది. చైనాతోపాటు బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌ సైతం మనకన్నా మెరుగ్గా రాణిస్తున్నాయి. వెలుపలి అధ్యయన నివేదికలు చేదు నిజాలను క్రోడీకరించేదేముంది- దేశం నలుమూలలా 20 శాతానికిపైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 శాతం మేర సామాజిక స్వాస్థ్య కేంద్రాలు తరుగుపడ్డాయని కేంద్రప్రభుత్వమే లోక్‌సభాముఖంగా అంగీకరించింది. 20 లక్షల మంది వైద్యులకు, 40 లక్షలమంది నర్సులకు కొరత జనభారతం ఆరోగ్యభద్రతనే ప్రశ్నార్థకం చేస్తోంది. వైద్యపరమైన అర్హత లేకుండానే ఎకాయెకి 57 శాతం అల్లోపతీ సేవలందిస్తున్నట్లు ప్రభుత్వమే వెల్లడించింది. ఈ దుర్భర స్థితిలో నకిలీ నాటువైద్యుల పాలబడి లక్షలాది నిస్సహాయ రోగులు ‘సొమ్మూ పోయె- శనీ పట్టె’ అని గొల్లుమనకుండా పకడ్బందీ వ్యూహాల్ని సత్వరం పట్టాలకు ఎక్కించాల్సిందే. 98 శాతం ఆస్పత్రుల్లో సిబ్బంది పదిమందిలోపే ఉంటున్నారన్న ‘నీతి ఆయోగ్‌’ నిర్ధారణ- అప్పోసొప్పో చేసి వ్యయభారం తలకెత్తుకోవడానికి సిద్ధపడినవారికీ అరకొర వైద్యసేవలే దిక్కవుతున్నాయని చెప్పకనే చెబుతోంది. ఆస్పత్రి పడకలు, వైద్యులు ప్రధానంగా పట్టణాల్లోనే కేంద్రీకృతమవుతున్న దృష్ట్యా- గ్రామీణ వైద్యం అక్షరాలా గాలిలో దీపం చందమవుతోంది. బహుముఖ సమస్యల్ని చక్కదిద్దడంలో అలవిమాలిన నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ఆరోగ్య రక్షణ రంగం అసమర్థ బీమా సంస్థలతో లుకలుకలాడుతూ, సొంతంగా వైద్యవ్యయం భరించాల్సినవారి సంఖ్య ఇంతలంతలవుతుందన్న ‘నీతి ఆయోగ్‌’ హెచ్చరిక- పాలకశ్రేణులకు మేలుకొలుపు కావాలి!

సమర్థ మానవ వనరుల నిర్మాణంలో ప్రజారోగ్య సంరక్షణ అత్యావశ్యకమన్న వివేచనతో దక్షిణ కొరియా, చైనా, టర్కీ, పెరూ, మాల్దీవుల వంటివి వైద్యసేవల్ని ప్రామాణీకరించి స్వస్థ రంగాన రికార్డులు నెలకొల్పుతున్నాయి. కెనడా, ఖతార్‌, ఫ్రాన్స్‌, నార్వే, న్యూజిలాండ్‌ ప్రభృత దేశాలు నాణ్యమైన ఆరోగ్య సేవలకు చిరునామాగా వెలుగొందుతున్నాయి. అక్కడికి ఇక్కడికి హస్తిమశకాంతరం నెలకొనడానికి పుణ్యం కట్టుకున్న కారణాల జాబితాలో మొట్టమొదట నిలిచేది వనరుల కొరతే. భారత్‌ తలసరి ఆరోగ్య వ్యయం 63 డాలర్ల (రూ.4,517)తో పోలిస్తే చైనా వెచ్చిస్తున్నది అంతకు ఏడింతలు! క్యూబా, ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్‌ వంటివి జీడీపీలో ఏడెనిమిది శాతానికి పైగా నిధుల్ని ప్రజారోగ్య పరిరక్షణకు మళ్ళిస్తుండగా- ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వైద్యానికి ఖర్చుపెడుతున్నది కేవలం 1.1 శాతమే. ఇటలీ, గ్రీస్‌, హాంకాంగ్‌ వంటిచోట్ల పౌరుల సొంత వైద్యవ్యయాన్ని కనిష్ఠస్థాయికి కుదించడంలో సార్వత్రిక ఆరోగ్య రక్షణ పథకాల ప్రాముఖ్యం ఎనలేనిది. తమ గడ్డపై నివసించే ప్రతి ఒక్కరూ ఆరోగ్య రక్షణ పొందేలా స్విట్జర్లాండ్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. మైక్రోసాఫ్ట్‌ సంస్థ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ వ్యాఖ్యానించినట్లు- ‘ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణలో తక్కిన దేశాలకు ఒరవడి దిద్దే సదవకాశాన్ని ఇండియా అందిపుచ్చుకోగల స్థితిలో ఉంది’! ఆ అంచనా నిజమై, అంచెలవారీగా ప్రభుత్వాస్పత్రుల స్థాయీప్రమాణాలు ఇనుమడించాలంటే- కేటాయింపులు మొదలు సిబ్బంది ఖాళీల భర్తీ వరకు అడుగడుగునా లోటుపాట్లు సమసిపోవాలి. మేలిమి వైద్యసేవల్ని ప్రజలకు చేరువచేసే జాతీయ స్వస్థ వ్యూహ రూపకల్పనకు వెన్నంటి పకడ్బందీ కార్యాచరణకు ప్రభుత్వాలు నేరుగా పూచీపడాలి. జావగారిన సర్కారీ వైద్యసేవలకు సరైన చికిత్స జరిగినప్పుడే ప్రజారోగ్యం స్థిమితపడేది!

Posted on 20-11-2019