Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

కనీస మద్దతూ కష్టమేనా?

* స్వామినాథన్‌ సిఫార్సులకు బూజు

వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా గత నాలుగు సంవత్సరాల నుంచి దేశాన్ని అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు పీడిస్తున్నాయి. ప్రకృతి తెచ్చిపెడుతున్న పంట నష్టాలకుతోడు పెరుగుతున్న సాగు వ్యయం, తరిగిపోతున్న ఆదాయాలు రైతులను అప్పుల వూబిలోకి నెట్టి, ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. భూతాపం, విపణి వ్యత్యాసాలవల్ల నెలకొన్న అస్థిర పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించాలంటే, సాగు వ్యయంకన్నా యాభై శాతం ఎక్కువ ధరను కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)గా చెల్లించాలని ఎం.ఎస్‌.స్వామినాథన్‌ అధ్యక్షతలోని జాతీయ రైతు సంఘం 2006లో సూచించింది. వ్యవసాయంపై పార్లమెంటరీ సంఘం లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించిన నివేదిక కూడా ఇదే సిఫార్సు చేసింది. అంతకుముందు ఒక పార్లమెంటు స్థాయీసంఘమూ ఉత్పత్తి వ్యయంకన్నా 50శాతం ఎక్కువ ఎంఎస్‌పీని చెల్లించాలని సూచించింది. తాము అధికారంలోకి వస్తే స్వామినాథన్‌ సిఫార్సును అమలు చేస్తామని భారతీయ జనతా పార్టీతోపాటు శిరోమణి అకాలీదళ్‌ వంటి మిత్రపక్షాలూ 2014లో వాగ్దానం చేశాయి. కానీ, కేంద్రంలో భాజపా నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏణ్నర్థం అవుతున్నా ఇంతవరకు ఆ హామీ వూసే లేదు.

సర్కారు విడ్డూర సమాధానాలు

అసలు ప్రభుత్వం ఎందుకోసం కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నట్లు? దీనికి ప్రభుత్వ సమాధానం చిత్రంగా ఉంది. 'ఎంఎస్‌పీ అనేది కనీస ధర వంటిది. మార్కెట్‌ ధరలు కనీసస్థాయికన్నా దిగువకు పడిపోతే, రైతును ఆదుకోవడానికి ఉద్దేశించిన చర్య ఇది. తన పంటకు విపణిలో ఎంఎస్‌పీకన్నా ఎక్కువ ధర లభిస్తే, రైతు నిక్షేపంగా హెచ్చు ధరకు అమ్ముకోవచ్చు. మార్కెట్‌ ధరలు ఎంఎస్‌పీకన్నా తక్కువకు పడిపోతే ప్రభుత్వం ఎంఎస్‌పీ కింద సేకరణ జరుపుతుంది. అంతేతప్ప ఎంఎస్‌పీ అనేది ఆదాయ హామీ పథకం కాదు' అని వ్యవసాయశాఖ వ్యాఖ్యానించింది. సేద్యంపై స్థాయీసంఘ సిఫార్సులపై ఈ ఏడాది ఏప్రిల్‌లో సమర్పించిన కార్యాచరణ నివేదికలో కేంద్ర వ్యవసాయశాఖ ఈ వ్యాఖ్య చేసింది. ఉత్పత్తి వ్యయంకన్నా ఎక్కువ ధరను ఎంఎస్‌పీగా నిర్ణయిస్తే సాగువ్యయాన్ని తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుందని సెలవిచ్చింది. దీనికితోడు ద్రవ్యోల్బణమూ పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తీకరించింది. కానీ, 2006-12 మధ్యకాలంలో ధాన్యం ఎంఎస్‌పీ సగటున 12.53శాతం, గోధుమ 11.62శాతం పెరగ్గా, టోకు ధరల సూచీ కన్నా ఎంఎస్‌పీ పెరుగుదల కేవలం నాలుగు శాతమే ఎక్కువ.

ఎడతెగని పోరాటం

స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల్లో కొన్నింటిని జాతీయ రైతు విధానంలో పొందుపరచినా, 50శాతం ఎక్కువ ఎంఎస్‌పీ వంటి కీలక సిఫార్సులను మాత్రం వదిలేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో భారతీయ రైతు సంఘాల కన్సార్టియం, ఆంధ్ర-తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో కె.కరుణాకర్‌రెడ్డి అనే సామాజిక కార్యకర్త ప్రజాహిత వ్యాజ్యాలు(పిల్‌) దాఖలు చేశారు. మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లలో భారీ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టిన దృష్ట్యా 2011లో కన్సార్టియం 'పిల్‌' దాఖలు చేసింది. కానీ, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సును అమలు చేయడం సాధ్యంకాదని ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు, అక్టోబరులో ఉమ్మడి హైకోర్టుకు కేంద్ర వ్యవసాయ శాఖ తెగేసి చెప్పింది. ఇది చాలదన్నట్లు, పంట ధరల నిర్ణయం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కాబట్టి, అందులో జోక్యం చేసుకునే అధికారం రాజ్యాంగపరంగా హైకోర్టుకు లేదని సుప్రీంకోర్టు 2002లోనే స్పష్టం చేసింది. ఈ సంగతిని ఉమ్మడి హైకోర్టులో దాఖలు చేసిన ధ్రువీకరణ పత్రంలో కేంద్ర వ్యవసాయ శాఖ గుర్తుచేసింది. సాగువ్యయంకన్నా యాభై శాతం ఎక్కువ ధరను ఎంఎస్‌పీగా నిర్ణయిస్తే ధరలు పెరిగిపోవడమే కాకుండా, అసమర్థ సాగు విధానాలను ప్రోత్సహించినట్లవుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. అన్నింటినీమించి ఇంత ఎక్కువ ఎంఎస్‌పీని చెల్లించడానికి తన వద్ద డబ్బు లేదంటోంది.

వరి, గోధుమ, జొన్న, సజ్జ, రాగి, సోయా, పత్తి, పొద్దుతిరుగుడు వంటి 22 పంటలకు కనీస మద్దతుధరను సిఫార్సు చేసే అధికారం వ్యవసాయ వ్యయాలు, ధరల సంఘం(సీఏసీపీ) చేతిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలతో సంప్రతించిన తరవాత, కేంద్రం సీఏసీపీ సిఫార్సును ఆమోదిస్తుంది. చెరకు ఎంఎస్‌పీని కేంద్రమే ప్రకటిస్తుంది. వివిధ పంటల ఉత్పత్తి వ్యయం, ఎరువులు, తదితర సాధనాల ధరల్లో మార్పులు, పంటలకు గిరాకీ-సరఫరాల్లో వ్యత్యాసాలు, పౌరుల జీవన వ్యయం వంటి సమాచారాన్ని కేంద్ర ఆర్థిక, గణాంక డైరెక్టరేట్‌ నుంచి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సంబంధిత సంస్థల నుంచి సీఏసీపీ సేకరిస్తుంది. ఎంఎస్‌పీని పెంచడంవల్ల పారిశ్రామిక ఉత్పత్తి, సబ్సిడీలు, ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) జారీ ధరలపైన పడే ప్రభావాన్ని, వివిధ పంటల అంతర్జాతీయ ధరలను కూడా పరిగణనలోకి తీసుకొంటుంది. కేవలం ఉత్పత్తి వ్యయం ఆధారంగా కాకుండా, ఇలా అనేక ఇతర అంశాల ప్రాతిపదికపై ఎంఎస్‌పీని నిర్ణయిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ ఉమ్మడి హైకోర్టుకు తెలియజేసింది. రైతుల ఆత్మహత్యలకు పంట వైఫల్యమే కాకుండా అనారోగ్యం, కుటుంబ సమస్యలు, పేదరికం వంటి ఇతర కారణాలూ ఉన్నాయని వాదించింది. అక్కడికీ వ్యవసాయంలో పెట్టుబడులు పెంచడం, మెరుగైన సేద్య విధానాల అమలు, గ్రామీణ మౌలిక వసతుల విస్తరణ వంటి చర్యలు తీసుకొన్నామని గుర్తు చేసింది. జాతీయస్థాయిలో సేద్య సామర్థ్యాన్ని పెంచడమే ఎంఎస్‌పీ విధాన మూల ఉద్దేశం. కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రాంతాలు కొన్ని పంటలను సమర్థంగా పండించగలుగుతాయి. అయినా ప్రాంతాలవారీగా ఎంఎస్‌పీని నిర్ణయించాలనే స్థాయీసంఘ సిఫార్సును వ్యవసాయ శాఖ తోసిపుచ్చింది. ఇప్పటికి అయిదు దశాబ్దాల నుంచి దేశమంతటికీ ఒకే ఎంఎస్‌పీని వర్తింపజేస్తున్నామని, దాన్ని మార్చడం కుదరదని ఉమ్మడి హైకోర్టులో తేల్చిచెప్పింది. ఈ విధమైన వాదనలతో ఎంఎస్‌పీకి సంబంధించిన పిటిషన్లను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరింది.

ఎంఎస్‌పీని పెంచడం వల్ల సరకుల ధరలు, పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాలు, పీడీఎస్‌ జారీ ధరలు పెరుగుతాయని వాదించడం ద్వారా ప్రభుత్వం పారిశ్రామిక ప్రయోజనాలకు పెద్దపీట వేసిందని, సీఏసీపీ ఈ అంశాలను కాకుండా రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎంఎస్‌పీని నిర్ణయించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఎంఎస్‌పీని తక్కువగా నిర్ణయించడం వల్ల రైతులకు కలిగిన నష్టం, బొగ్గు, 2జీ కుంభకోణాల్లో ప్రభుత్వం నష్టపోయిందనుకుంటున్న మొత్తంకన్నా ఎంతో ఎక్కువని ఒక రైతు నాయకుడు వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ ప్రదేశ్‌ తూర్పు భాగం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అనావృష్టి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతుల స్థితి దారుణంగా ఉంది. 'అనావృష్టి వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 20శాతం తగ్గిపోవచ్చు. దీనివల్ల రైతులు నష్టాలపాలవుతారు. వారిని ఆదుకోవడానికి ఎంఎస్‌పీ పెంపు వంటి విధానాలను చేపట్టకపోతే, 1960లలో మాదిరిగా తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉంది' అని నీతిఆయోగ్‌ సలహాదారుడు, వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్‌ అశోక్‌ గులాటి హెచ్చరించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) షరతుల వల్లే భారత ప్రభుత్వం ఎంఎస్‌పీని తక్కువగా నిర్ణయిస్తోందనే ఆరోపణ ఉంది. కానీ, ఈ విషయంలో చైనా, పాకిస్థాన్‌లకు లేని తంటా భారత్‌కు ఎందుకో? 'భారత ప్రభుత్వం క్వింటాలు గోధుమకు రూ.1,400 ఎంఎస్‌పీని నిర్ణయించగా, పాకిస్థాన్‌ రూ.2,000, చైనా రూ.2,500 చెల్లిస్తోంది' అని డాక్టర్‌ గులాటి వివరించారు.

సేద్యం పుంజుకోవాలంటే...

ఎంఎస్‌పీని పెంచితే ధరలు విజృంభిస్తాయని ఆర్థికవేత్తలు డాక్టర్‌ అరవింద్‌ సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ అరవింద్‌ పనగడియాలు గత నవంబరులో హెచ్చరించారు. ఆ తరవాత పంటల ధరలు భారీగా పతనమయ్యాయి. బాస్మతి బియ్యం ధరలు 35శాతం, పత్తి ధరలు 25శాతం, రబ్బరు ధరలు 40శాతం పడిపోయాయి. పశుగ్రాసం ధర మాత్రం 50శాతం పెరిగింది. సీఏసీపీ 22పంటలకు ధరలను సిఫార్సు చేసినా, వాస్తవంలో ఆరు పంటల సేకరణ మాత్రమే జరుగుతోంది. అదీ ప్రభుత్వ సేకరణ వ్యవస్థ నెలకొన్న రాష్ట్రాల్లో మాత్రమే! అంతర్జాతీయంగా వ్యవసాయ సరకుల ధరలు పడిపోయిన దృష్ట్యా, ఆహారోత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని, దీన్ని ఎదుర్కోవడానికి రైతులకు ఎక్కువ ధరలు చెల్లించాలని పలు దేశాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. భారతదేశంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయంలో ఏటా నాలుగు శాతం అభివృద్ధి సాధించాలని లక్షించారు. అనావృష్టి వల్ల ఈ రంగం ఏటా 1.7శాతం చొప్పునే పెరుగుతోంది. వ్యవసాయంలో అధిక వృద్ధిరేటు సాధించాలంటే అధిక ఎంఎస్‌పీని చెల్లించక తప్పదని రైతు సంఘాలు బల్లగుద్ది చెబుతున్నాయి. 50శాతం అధిక ఎంఎస్‌పీని ఒకే దఫాలో చెల్లించడానికి ప్రభుత్వం వద్ద చాలినంత డబ్బు లేకపోతే, దాన్ని మూడేళ్ల వ్యవధిలో చెల్లించవచ్చునని ఎం.ఎస్‌.స్వామినాథన్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. 'నేడు 50శాతం లాభం కళ్లజూడని వ్యాపారమే లేదు. ఫార్మా కంపెనీలు 500శాతం లాభాన్ని వెనకేసుకుంటున్నాయి. రైతులకూ 50శాతం లాభం దక్కినట్లయితే ఎక్కువమంది సేద్య వృత్తిలో కొనసాగుతారు. బిహార్‌ ఎన్నికల ప్రచారంలో మహా కూటమిలోని పక్షాలు ఎంఎస్‌పీ గురించి విస్తృతంగా లేవనెత్తాయి. రైతులకు, పేదలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యతిరేకి అని దుమారం రేపాయి. రాగల రెండేళ్లలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న దృష్ట్యా మోదీ ప్రభుత్వం ఎంఎస్‌పీపై రైతు అనుకూల విధానాన్ని ప్రకటించాల్సిన అగత్యం తోసుకువస్తోంది.

- ఏఏవీ ప్రసాద్‌
Posted on 21-11-2015