Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సంక్షోభ స్థాయికి నీటి కొరత

* నదుల అనుసంధానం కీలకం

జలం... సామాజిక, ఆర్థిక అభివృద్ధిని, జీవన నాణ్యతల్ని మెరుగు పరచడంలో కీలక భూమిక పోషిస్తుంది. దేశంలో తీవ్రస్థాయిలో నీటి సమస్య నెలకొన్న దరిమిలా నదీజలాల నిర్వహణ కీలకంగా మారింది. నదుల నిర్వహణ సంక్లిష్ట రాజకీయ, ఆర్థిక చట్రంలో జరుగుతోంది. ఇదంతా ఒక అధికార క్రీడలా మారింది. నదీ పరీవాహక ప్రాంతంలో ఉండే రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తడం చూసి ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నదులు ద్వైపాక్షిక సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. జలాలకు సంబంధించి తరచూ సవాళ్లు ఎదురవుతుండడంతో సునిశితమైన నదీ విధానాల్ని అనుసరించడం ముఖ్యం. అదే సమయంలో రాజకీయ వాస్తవిక పరిస్థితుల్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుతమున్న ఒప్పందాల్లో చాలావాటిని తాజాగా మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త ఒప్పందాల్ని జలాలకు సంబంధించి ఇప్పుడున్న పరిజ్ఞానం ఆధారంగా రూపొందించుకోవాలి. కీలక ప్రాంతీయ శక్తిగా ఎదిగిన భారత్‌కు ఈ ప్రాంతంలో నెలకొన్న జల సమస్యల్ని పరిష్కరించుకోవడం అత్యావశ్యకంగా మారింది.

భూగోళం అధిక భాగం జలంతోనే నిండిపోయింది. అయితే, అందులో కేవలం మూడు శాతమే తాగునీరు. అందులోనూ రెండు శాతం హిమానీ నదాలు, హిమశిఖరాల్లో గడ్డకట్టుకుని ఉంది. కేవలం ఒక్క శాతం నీరు మాత్రమే చెరువులు, సరస్సులు, నదులు, ప్రవాహాలు, తదితర రూపాల్లో అందుబాటులో ఉండి, మానవ వినియోగానికి సిద్ధంగా ఉంది. దానిపైనే మనుషులంతా ఆధారపడాల్సి వస్తోంది. ఒకవైపు నీటికి సంబంధించిన సమస్యలు పెరుగుతుండగా, పరిమిత స్థాయిలోనే నీరు అందుబాటులో ఉండటం పెద్ద సమస్యగా మారింది. గత శతాబ్ది కాలంలో ప్రపంచ జనాభా మూడు రెట్లయింది. నీటి వినియోగం ఆరు రెట్లు పెరిగింది. 2030 నాటికి నీటికి గిరాకీ 40 శాతానికి చేరుకుంటుందని అంచనా. భారత్‌, చైనా సహా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నీటి అవసరం 50 శాతం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. జనాభా అడ్డగోలుగా పెరిగిపోయిన దేశాల్లో ఇప్పటికే నీటి కొరతకు సంబంధించిన సమస్యలు వేధిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ, జనాభా పెరుగుదలతో తలెత్తే అవసరం, నీటి లభ్యతల మధ్య అంతరం భారీగా పెరిగి పోతుండటంతో రాబోయే దశాబ్దాల్లో నీటి కొరత తీవ్ర సమస్యగా పరిణమించనుంది. ముఖ్యంగా జనాభా అధికంగా ఉండే దేశాల్లో ఇది మరింత ముప్పుగా మారనుంది. భారత్‌లో నీటి అవసరాల అంచనాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రపంచబ్యాంకు 1999లో రూపొందించిన నివేదిక ప్రకారం... తలసరి నీటి లభ్యత తగ్గిపోయింది. 1947లో సంవత్సరానికి అయిదువేల ఘనపు మీటర్లున్న నీటి లభ్యత, 1997లో సంవత్సరానికి రెండువేలకన్నా తక్కువ ఘనపు మీటర్లకు తగ్గిపోయింది. 2025 నాటికి ఏడాదికి 1,500 ఘనపు మీటర్లకు పడిపోనుంది. భారత్‌లోని 20 ప్రధాన నదీ బేసిన్లలో ఆరింటిలో నీటి లభ్యత తక్కువ స్థాయిలో ఉన్నట్లు తేలింది. జనాభా వృద్ధితోపాటు, వరి, గోధుమ, చెరకు పంటల కోసం ఏర్పడే గిరాకీ నీటి కొరతను పెంచే అవకాశం ఉంది. ఈ క్రమంలో భవిష్యత్తులో సవాళ్లకు దారితీసే అంశాల్లో ఆర్థిక వృద్ధి, భారీస్థాయిలో నీటిని ఉపయోగించే వ్యవసాయ రంగం వృద్ధి వంటివన్నీ ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. నీటి పొదుపు, సమర్థ వినియోగం వంటి అంశాలతో కూడిన నీటి నిర్వహణ వ్యూహం కారణంగా అదనంగా సరఫరా చేసే సామర్థ్యం పెరిగినా, సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి ఇదొక్కటే సరిపోదు. నీటి సరఫరా నిర్వహణ కోసం సమర్థ వ్యూహం అవసరం. నీటి లభ్యతపై భారీగా ప్రభావం చూపుతుందని భావిస్తున్న వాతావరణ మార్పుల సమస్య పొంచి ఉన్న ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

దేశంలో నీటి సమస్యను తీర్చేందుకు నదుల అనుసంధానం ఒక ప్రధాన పరిష్కారం. జాతీయ నదీ అనుసంధాన ప్రాజెక్టు (ఎన్‌ఆర్‌ఎల్పీ)పై రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయం ఉన్నా, ఈ ప్రాజెక్టును ప్రారంభించే విషయంలో నిర్మాణాత్మక చొరవ కొరవడింది. ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన సుప్రీంకోర్టు 2012 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని, అందుకు కార్యదళాన్ని ఏర్పాటు చేయాలంటూ 2002లోనే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానంపై 2003లో కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ప్రాజెక్టు అమలు పట్టాలెక్కలేదు. కార్యదళం నివేదిక సైతం వెలుగులోకి రాలేదు. ఎన్‌ఆర్‌ఎల్పీ లక్ష్య సాధనకు సంబంధించి ఆర్థికంగా సాధ్యాసాధ్యాలు, వ్యూహాత్మక ప్రాధాన్యం స్పష్టంగానే ఉన్నాయి. దీన్ని ఆర్థిక, చట్ట, రాజకీయ పరమైన అవరోధాల్ని తట్టుకుంటూ సంప్రదింపులు జరిపి, అమలులోకి తీసుకురావాల్సి ఉంది. వ్యయం, ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఎన్‌ఆర్‌ఎల్పీ అమలు ఒకేసారి చేపట్టడమే మేలు. ఆచరణాత్మక, వ్యూహాత్మక కోణం నుంచి చూస్తే దశలవారీగా అమలు చేయడం మంచిది. ఖర్చు తక్కువయ్యే ప్రాంతాల్లో, చట్టపరమైన, రాజకీయ పరమైన సమస్యలు తక్కువగా తలెత్తే చోట్ల నదుల అనుసంధానంపై దృష్టి సారించాలి. నిర్దిష్ట కాలవ్యవధిలోనే అనుసంధాన ప్రక్రియల్ని అమలు చేయాలి. దీనివల్ల ఆర్థికపరమైన భారం తగ్గుతుంది. మరిన్ని సంక్లిష్టమైన నదీ అనుసంధానాలను సైతం అమలు చేసేందుకు వీలవుతుంది. జల అభివృద్ధి, రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారాల విషయంలో కేంద్రప్రభుత్వం తన పాత్ర, పరిధిని పెంచుకునేందుకు చట్టపరమైన, సంస్థాగతమైన సంస్కరణల దిశగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సంస్కరణలు, వ్యూహాలు... నదుల అనుసంధాన ప్రాజెక్టు అమలు అవకాశాల్ని మెరుగుపరచే అవకాశం ఉంది.

- పీవీ రావు
(రచయిత- ఆర్థిక, సామాజిక విశ్లేషకులు)
Posted on 22-11-2019