Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఉసూరుమంటున్న ఉన్నతవిద్య!

* సత్వర సంస్కరణలేవీ?

మానవ వనరుల సూచికలో 189 దేశాలలో భారత్‌ 130వ స్థానంలో ఉండగా, విద్యా రంగంలో 145 దేశాలలో 92వ స్థానంలో ఉంది. 43 అభివృద్ధి చెందుతున్న దేశాలలో అగ్రస్థానంలో నిలిచిన 200 విద్యా సంస్థలలో 25 భారత్‌కు చెందినవి కావడం గమనార్హం. కానీ ఇటీవల విడుదల అయిన ప్రపంచంలోని 300 అత్యున్నత విశ్వవిద్యాలయాల జాబితాలో దేశానికి చెందిన విశ్వవిద్యాలయం ఒక్కటీ లేకపోవటం దురదృష్టకరం. ఇది ఆందోళన కలిగించే పరిణామం. విద్యారంగం దుస్థితికి ఇది దర్పణం పడుతుంది. నిన్న దిల్లీలో ఉన్నతవిద్యపై జరిగిన సదస్సులో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ రంగం తీరుతెన్నులపై ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, ఫిక్కీ (భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ప్రథమ పౌరుడు ఈ రంగం మరింతగా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకతను వివరించారు.

ఉద్యోగార్హతలో వైఫల్యం
ఉన్నత విద్యకు సంబంధించి ఈ ఏడాది సెప్టెంబరులో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎనిమిదో అఖిల భారత వార్షిక సర్వే విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో ఏటా 90.92 లక్షల యువకులు ఉన్నత విద్యను అభ్యసిస్తుండగా వారిలో 65 లక్షల మంది పట్టభద్రులవుతున్నారు. దాదాపు రెండు లక్షల యువకులు ఏటా ఎంఫిల్‌, పీహెచ్‌డీ పూర్తి చేయగలుగుతున్నారు. మొత్తానికి దేశంలో ఏటా 3.74 కోట్ల విద్యార్థులు ఉన్నత విద్యలో చేరుతుండగా అందులో 40 లక్షల మంది దూరవిద్యను అభ్యసిస్తున్నారు. జనాభాలో 18 నుంచి 23 సంవత్సరాల వయస్సు కలిగిన వారిలో 26 శాతం మాత్రమే ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందుతున్నారు. వీరిలో 49 శాతం మహిళలు. ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసిన సీఎంఐఈ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ) సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగిత 8.19 శాతం. ఇది అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో- ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌) ప్రపంచ స్థాయి సగటు నిరుద్యోగ అంచనా 4.95 శాతం కన్నా ఎక్కువగా ఉందని తేలింది. సీఎంఐఈ గణాంకాల ప్రకారం దేశంలో 10 కోట్ల పట్టభద్రులు ఉండగా వారిలో 6.3 కోట్ల మంది ఉద్యోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగ శాతం పురుషులలో 6.1 శాతం, మహిళలలో 17.6 శాతం ఉంది. స్థూలంగా దేశంలో ఏటా కోటి మంది నిరుద్యోగులు తయారవుతున్నారని అంచనా. 2019 ఇండియా నైపుణ్యత నివేదిక మేరకు కేవలం 47.38 శాతం పట్టభద్రులు మాత్రమే ఉద్యోగార్హత కలిగి ఉన్నారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం ఆరు నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత. రాజ్యాంగ రీత్యా ఇది పిల్లల ప్రాథమిక హక్కు కిందకు వస్తుంది. రాజ్యాంగం ప్రకారం విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. అందువల్ల దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చట్టాలు చేయవచ్చు. 2011లో 7-18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల్లో అక్షరాస్యత 88.3 శాతం ఉందని తేలింది. 2014-15 నాటి అంచనాల ఆధారంగా బడిలో చేరేవారి సంఖ్య ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో 6.76 కోట్లు, ఉన్నత పాఠశాల స్థాయిలో 3.91 కోట్లు, జూనియర్‌ కళాశాల స్థాయిలో 2.47 కోట్లుగా గుర్తించారు. 2014-15 నాటి లెక్కల ప్రకారం ప్రాథమిక స్థాయిలో చదువు మానేసిన వారు 4.13 శాతం. ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో ఈ సంఖ్య 4.03 శాతం, ఉన్నత స్థాయి విద్యలో 17.06 శాతంగా ఉండటం గమనార్హం. ఉన్నత విద్యలో చదువు మానేసే వారి సంఖ్యను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది.

వృత్తి విద్యను అభ్యసించిన వారిలో 18 శాతానికి ఉపాధి దొరుకుతుండగా వారిలో ఏడు శాతం ప్రైవేటు రంగంలో ఉద్యోగ లబ్ధిని పొందుతున్నారని ఒక సర్వేలో వెల్లడైంది. వృత్తి విద్యలో శిక్షణ పొందిన వారిలో నైపుణ్యం కొరత ఉందని 70 శాతం యాజమాన్యాలు ఒక సర్వేలో పేర్కొన్నాయి. వృత్తి విద్యను అభ్యసించిన వారిలో ఉద్యోగార్హత కొరవడిందని ఈ సర్వేలో 72 శాతం యాజమాన్యాలు పేర్కొన్నాయి. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉన్నత విద్య అభ్యసించే వారి సంఖ్యను ప్రస్తుతం ఉన్న 26 శాతం నుంచి పెంచడం, పట్టభద్రులలో ఉద్యోగ సమర్థతను పెంపొందించడం అవసరం. అదే సమయంలో ఉద్యోగ సామర్థ్యం గలిగిన యువకులకు ఉపాధి కల్పించడం కీలకం.

పరిశ్రమలతో అనుసంధానం
విద్యాలయాలు, పారిశ్రామిక రంగాల మధ్య అనుసంధానంతో పట్టభద్రులలో ఉద్యోగార్హత మెరుగుపరచడం వల్ల విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెంచవచ్చు. యువకులలో నైపుణ్య వృద్ధికి, స్వయం ఉపాధి కల్పనకు ఊతం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ ఆశించిన ఫలితాలు లభించలేదు. విశ్వవిద్యాలయాలకు పాఠ్యాంశాలు నిర్ణయించడమే కాకుండా కాలానుగుణంగా వాటిని సవరించే వెసులుబాటు ఉండాలి. విద్యార్థులకు కనీసం ఆరు నెలలు తప్పనిసరిగా పరిశ్రమలలో వృత్తిపరమైన శిక్షణ అందించాలి. ఈ చర్యలవల్ల విద్యార్థులలో నైపుణ్యత, ఉద్యోగార్హత పెరిగే అవకాశం ఉంది. ఇందుకు విద్యాలయాలు, పరిశ్రమల మధ్య సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉండాలి. అధ్యాపకులు సైతం విరివిగా పరిశ్రమలలో కన్సల్టెన్సీ, ప్రాజెక్టులు చేపట్టినట్టయితే వారికి పరిశ్రమలపై మరింత అవగాహన పెరుగుతుంది. తద్వారా కళాశాలలో బోధన విధానం మెరుగుపడే అవకాశం ఉంటుంది. అమెరికా వంటి దేశాలలో మాదిరిగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఒక విభాగం నుంచి మరొక విభాగానికి మారడానికి వెసులుబాటు కల్పించాలి.

దేశంలోని 71 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 2017-18 గణాంకాల ప్రకారం నష్టాలలో కూరుకుపోయాయి. వాటిలో పది ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటిల్లిన మొత్తం నష్టం రూ.26,480 కోట్లు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నూతన మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. నష్టాలలో కూరుకుపోయిన పరిశ్రమల్ని పునరుద్ధరించడానికి కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. అధ్యాపకులు కూడా ఈ అధ్యయనంలో పాలుపంచుకొని ఆ సంస్థలు లాభాలబాట పట్టడానికి ప్రణాళిక రూపొందించాలి. దీనివల్ల విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య పరస్పర సహకారం, అవగాహన పెరుగుతుంది. తద్వారా విద్యార్థులలో ఉద్యోగ సమర్థత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు ఈ దిశగా నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంది!

పరిశోధనలకు ప్రాధాన్యం
ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం పరిశోధన రంగంలో కృషి చేసే విశ్వవిద్యాలయాలలోని స్కాలర్లకు వేతనాలు పెంచింది. తద్వారా పరిశోధన రంగానికి ఇస్తున్న ప్రాధాన్యమెంతో తెలియజేసింది. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌) సైతం తన వంతుగా ప్రమాణాలతో కూడిన పరిశోధన ప్రక్రియను ప్రోత్సహించడానికి ఇటీవల కొన్ని సంస్కరణలు అమలు చేసింది. ఫిన్లాండ్‌లో అనువర్తిత శాస్త్ర విజ్ఞానానికి (అప్లైడ్‌ సైన్సెస్‌) సంబంధించి ప్రత్యేక విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. ఇవి సామాజిక ప్రయోజకత్వంపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తాయి. మన దేశంలోనూ ఇటువంటి వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

- బి.ఎన్‌.వి.పార్థసారథి
Posted on 28-11-2019