Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

విద్యుత్‌ బండి... సవాళ్లు దండి

* హరిత రవాణాకు బాలారిష్టాలు

దేశమంతా విద్యుత్‌ వాహనాలు రోడ్డెక్కితే... గాలి శుభ్రంగా మారుతుంది. శబ్దాలు తగ్గుతాయి. హరిత రవాణాకు మార్గం సుగమ మవుతుంది. చమురు దిగుమతి వ్యయాలు దిగివస్తాయి... కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం భవిష్యత్తులో విద్యుత్‌ వాహనాలు (ఈవీలు) పెద్ద సంఖ్యలో దౌడు తీసినప్పుడు నెలకొనే పరిస్థితి ఇది. అన్నీ అనుకున్న ప్రకారమే జరిగితే చైనాలాగే భారత్‌ కూడా విద్యుత్‌ వాహనాల తయారీ కేంద్రంగా మారుతుంది. చైనా కేవలం వాహనాలు మాత్రమే కాకుండా, పలురకాల పారిశ్రామిక విద్యుత్‌ ఉత్పత్తుల్ని రూపొందించింది. అలాంటి పరిస్థితి మనదేశంలో ఎప్పటికి సాధ్యపడుతుందన్నది ప్రస్తుతం పలువురి మదిని తొలుస్తున్న ప్రశ్న.

మౌలిక సదుపాయాల కొరత
భారత్‌లో తొలి విద్యుత్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ)ని గత వేసవిలో హ్యుందయ్‌ మోటార్‌ కార్పొరేషన్‌ విడుదల చేసింది. కొన్ని నెలల తరవాత చూస్తే, అది ఒంటరి పక్షిగానే మిగిలిపోయింది. కోనా విద్యుత్‌ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టగా, ఆగస్టు వరకు కేవలం 130 మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా, అమ్మకాలు పెద్దగా పెరగకపోవడం గమనార్హం. సామాన్య భారతీయుల సగటు ఆర్జన ఏడాదికి రూ.1.45 లక్షలు ఉండగా, ఆ సంస్థ వాహనాన్ని సుమారు రూ.25 లక్షలకు విక్రయిస్తోంది. భారత్‌లో విద్యుత్‌ వాహనాల అమ్మకాలు ఊపందుకోకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌కు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఇక్కడ లేవు. వాహనం కొనుగోలు సందర్భంగా ఆర్థిక సహాయానికి బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి. ఈ వాహనాల్ని ఉపయోగించే విషయంలో ప్రభుత్వ శాఖల్లో తిరస్కార భావన వంటి సమస్యలున్నాయి. గత ఆరేళ్ల వ్యవధిలో స్థానికంగా ఎనిమిది వేల విద్యుత్‌ వాహనాలు మాత్రమే అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. చైనా రెండు రోజుల్లో ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో అమ్ముతుంది. భారత్‌లో విద్యుత్‌ కార్లను కొనే స్థోమత అన్ని వర్గాలకూ సమకూరలేదు. వచ్చే రెండు, మూడేళ్లలో పరిస్థితి మెరుగుపడవచ్చని ప్రభుత్వంగానీ, కార్ల కంపెనీలుగానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవడం లేదు. ప్రభుత్వం హరిత వాహనాల్ని ఉపయోగించాలంటూ ప్రచారాన్ని ప్రారంభించి నాలుగేళ్లు దాటినా, ఈ రంగం ఇప్పటికీ అర్థవంతమైన దిశగా సాగడం లేదు.

ఒకటి మాత్రం నిజం- ప్రజలు ఈ వాహనాల్ని ఇష్టపడుతున్నా, ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం సమస్యగా మారుతోంది. ఈవీలకు సెకండరీ మార్కెట్‌ ఏర్పడే వరకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కొనుగోలు కోసం రుణాలు ఇచ్చేందుకు సంశయిస్తాయి. విద్యుత్‌ వాహనాలు మార్కెట్‌లో నిలదొక్కుకునే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. పన్నుల తగ్గింపు, ఆదాయ పన్ను ప్రయోజనాలు, కొన్ని విడిభాగాలకు దిగుమతి సుంకం మినహాయింపు వంటి ప్రోత్సాహకాల్ని బడ్జెట్‌లో కల్పించారు. దీనివల్ల స్కూటర్లు, మోటారు సైకిళ్లు తొలి ప్రయోజనాలు పొందాయి. 55 వేల విద్యుత్‌ కార్లతో పోలిస్తే, సబ్సిడీల కారణంగా పది లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగానూ విద్యుత్‌ వాహనాలను ఉపయోగించిన అనుభవం తక్కువగానే ఉంది. ఈ వాహనాల్ని ఉపయోగించే దేశాల్లో ప్రజల ఐచ్ఛికాలు, ఉపయోగించే వాహనాల రకాలు, మౌలిక సదుపాయాల లభ్యత- భారత్‌తో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి. అందుకని, ఈ మార్గంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఇందులో ఏమాత్రం పొరపాటు దొర్లినా తీవ్రమైన ఆర్థిక, రాజకీయ దుష్పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న సంగతి మరవకూడదు.

దేశీయ బ్యాటరీలతో ముందుకు
వాహన పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్‌లో ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న ఉద్యోగుల్లో మూడు లక్షల మంది ఈ ఏడాది ఉద్యోగాల్ని కోల్పోనున్నారు. విద్యుత్‌ వాహనాలు వస్తున్నాయనే అంచనాలూ ఇందుకు ఒక కారణమనే వాదనా ఉంది. విద్యుత్‌ కార్లు ఆటొమొబైల్‌ వ్యవస్థను సమూలంగా మార్చివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చమురు ఉపయోగించే కార్లలో వాడే గేర్లు వంటి ఉపకరణాల అవసరం చాలా వరకు ఉండదు. సహజంగానే, ఇలాంటి ఉపకరణాలపై పెట్టుబడులు పెట్టే ముందు ఉత్పత్తిదారులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.

సాధారణ చమురు వాహనాల నుంచి విద్యుత్‌ రంగంలోకి మారిపోతే తలెత్తే ప్రభావాలపై పాలకులు క్షుణ్నంగా అధ్యయనం చేశారా అనే విషయంపై స్పష్టత లేదు. దేశంలో వందశాతం విద్యుదీకరణనే సాధించలేదు. విద్యుదీకరించిన ప్రాంతాల్లో సైతం సరఫరాలో నాణ్యత మెరుగ్గా లేదు. లక్షల సంఖ్యలో విద్యుత్‌ వాహనాలు వినియోగంలోకి వస్తే ఏటా ఎంతమేర విద్యుత్‌ అవసరమవుతుందనే విషయంలోనూ సరైన అంచనాలు లేవు. ఈ దిశగా చర్చించాల్సిన ముఖ్యమైన అంశం- ఇంధన అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోలు, డీజిల్‌లపై వచ్చే పన్ను ఆదాయం కీలకం. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా విద్యుత్‌ వాహనాల కోసం అలాంటి ఆదాయాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉంటుందా అనేది అనుమానమే. చమురు అమ్మకాల ద్వారా అన్ని రాష్ట్రాలకు వచ్చే వార్షిక ఆదాయం రూ.1.9 లక్షల కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. ఈ తరహా ఆదాయ నష్టం రాష్ట్రాల బడ్జెట్లను దెబ్బతీసే అవకాశం ఉంది.

భారతీయ రహదారులపై కనిపించిన మొదటి విద్యుత్‌ వాహనం కారే. అందులో సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండగా, ధర మాత్రం అధిక స్థాయిలో ఉంది. సహజంగానే, ప్రజల నుంచి సానుకూల ప్రతిస్పందన వ్యక్తంకాలేదు. వినియోగదారుల కోణం నుంచి చూసినప్పుడు సర్వీసులకు సంబంధించిన ధర, వ్యయాలు చాలా ముఖ్యం. పెట్రోలు, డీజిల్‌ కార్లతో పోలిస్తే, విద్యుత్‌ వాహనాలకు తరచూ సర్వీసింగ్‌, విడిభాగాలు మార్చడం అక్కర్లేదు. అలాగైతే, ప్రస్తుతం వాహనాల సర్వీసులు, విడిభాగాల అమ్మకాలపైనే గణనీయమైన ఆదాయాన్ని గడిస్తున్న డీలర్లను కంపెనీలు ఎలా తృప్తిపరచగలవనేదీ సమస్యే. విడిభాగాల అమ్మకాల నుంచి వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకునేందుకు వారెంత మాత్రం ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్‌ వాహనాలకు కంపెనీలు ఎక్కువ ధరల్ని నిర్ణయించి, అందులో నుంచి డీలర్లకు తగిన మొత్తం అందేలా చూసే అవకాశమూ ఉంది.

విద్యుత్‌ వాహనాల వ్యవస్థ నుంచి పూర్తి ప్రయోజనాల్ని పొందాలంటే, వాటిలో వాడే బ్యాటరీలను పూర్తిగా భారత్‌లోనే తయారు చేయాల్సి ఉంటుంది. బ్యాటరీల దిగుమతులపై ఆధారపడటం సరికాదు. ఈ విషయంలో భారత్‌కు అవసరమైనది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం. అది దేశీయంగా తయారు చేసేదైనా కావచ్చు, దిగుమతైనా చేసుకోవచ్చు. ఒక విద్యుత్‌ కారును రోజువారీ ఉపయోగించుకోవడంలో ఎదురయ్యే పెద్ద సమస్య బ్యాటరీ ఛార్జింగే. ఈ విషయంలో తలెత్తే ఎలాంటి ఇబ్బందులైనా పెద్ద సమస్యగా పరిణమిస్తాయి. ప్రభుత్వాన్నే దోషిగా నిలబెట్టే ప్రమాదం ఉంటుంది. విద్యుత్‌ వాహనాలు... ప్రస్తుతానికి ఆసక్తికరంగా అనిపిస్తున్నా, విస్తృత స్థాయి జనామోదం పొందే విషయంలో మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. ఈ విషయంలో చేయాల్సిందేమిటంటే- ముందుగా భారతీయులకు స్కూటర్ల వంటి విద్యుత్‌ ద్విచక్ర వాహనాల్ని అలవాటు చేయాలి. చైనా ఇలాగే చేసింది. ఆ తరవాత చిన్న కార్లు, పెద్ద వాహనాలకు వెళ్లొచ్చు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ ప్రతినిధులు తదితర భాగస్వామ్య వర్గాలందరితో చర్చించడం మంచిది.

‘ఛార్జింగ్‌’ సమస్యలను అధిగమించాలి
భారత్‌లోని విద్యుత్‌ వాహనాల విపణికి ఉన్న శక్తిసామర్థ్యాలను విస్మరించడానికి వీల్లేదు. ప్రతి వెయ్యిమంది భారతీయులకు 27 కార్లు ఉండగా, జర్మన్లకు 570 ఉన్నాయి. ఈ పరిస్థితి ప్రపంచ వాహన తయారీదారులకు మంచి అవకాశం కల్పిస్తోంది. మారుతి వచ్చే ఏడాది వరకు తన తొలి విద్యుత్‌ వాహనాన్ని ప్రవేశపెట్టే అవకాశం కనిపించడం లేదు. టాటా మోటార్స్‌, మహీంద్రా సంస్థలు కొన్ని ప్రాథమిక స్థాయి విద్యుత్‌ కార్లను రూపొందించే పనిలో ఉన్నాయి. అవి పరిమిత శ్రేణికి చెందినవే కాకుండా, కేవలం ప్రభుత్వ వినియోగం కోసమే తయారు చేస్తున్నాయి.
భారత్‌లో గత ఏడాది అమ్ముడైన వాహనాల్లో సగానికన్నా ఎక్కువగా ప్రయాణికుల వాహనాలే ఉండగా, వాటి వ్యయం రూ.5.80 లక్షలు, అంతకన్నా తక్కువే. విద్యుత్‌ కార్ల ధరలు చమురు కార్ల ధరలతో పోటీపడటానికి 2030 వరకూ పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్‌ వాహనాలకు సంబంధించి వినియోగదారుల్లో ఆసక్తి ఉన్నా, ధర గురించి తెలియగానే ఆగిపోతున్నారు. కోనా సంస్థ కార్ల వ్యయాన్ని భరించే స్థోమత ఉన్న వినియోగదారుల్ని ఛార్జింగ్‌ సమస్య వేధిస్తోంది. దేశంలో 2018లో విద్యుత్‌ కార్లు, ఎస్‌యూవీల కోసం 650 ఛార్జింగ్‌ స్టేషన్లు ఉన్నట్లు అంచనా. విద్యుత్‌ వాహనాలకు భారీ విపణిగా పేరొందిన చైనాలో 4.56 లక్షల ఛార్జింగ్‌ కేంద్రాలున్నట్లు అధికారిక సమాచారం సూచిస్తోంది. గత నెలలో జరిగిన దిల్లీ సదస్సులో ప్రభుత్వ అధికారులు, ఈవీ ఉపకరణాల తయారీదారులు- ఛార్జింగ్‌ సదుపాయాల్ని కల్పిస్తే అమ్మకాలు పెరుగుతాయా, రోడ్లపైకి తగినన్ని విద్యుత్‌ వాహనాలు వచ్చేదాకా వేచిచూడాలా... అనే అంశంపై చర్చించారు.

పరిశ్రమకు కొత్త లక్ష్యం
భారత్‌లో కంపెనీలు తయారు చేస్తున్న కార్లలో కనీసం రెండు శాతం నుంచి మూడు శాతం విద్యుత్‌ వాహనాలే ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం పరిశ్రమను కోరింది. సగటు ఇంధన వినియోగ లక్ష్యాలను చేరుకున్న తయారీదారులు ఈ మేరకు ఈవీలపై పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కార్పొరేట్‌ సగటు ఇంధన ఆర్థిక వ్యవస్థ (సీఏఎఫ్‌ఈ) నిబంధనలను అనుసరించి ఇప్పుడు వాహన తయారీదారులు ఇంధన వినియోగంలో కనీసం 30 శాతం ఆదాఅయ్యే వాహనాలను తయారు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే వాహనాలతో భారత వాహనాలు పోటీ పడగలుగుతాయి. వాహనరంగంలో ఊపు తెచ్చేందుకు భారత్‌లో సీఏఎఫ్‌ఈ ప్రమాణాలను పెంచేందుకూ కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంది.

- పీవీ రావు
(రచయిత- ఆర్థిక, సామాజిక విశ్లేషకులు)
Posted on 29-11-2019