Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అరచేతిలో ఆరోగ్య సమాచారం

* త్వరలో డిజిటల్‌ వైద్య సేవలు

అవసరమైన సమయంలో లభించే సరైన సమాచారం ఎంతో విలువైనది. ఆధునిక ప్రపంచంలో సమాచారాన్ని మించిన సంపద మరొకటి లేదు. అన్ని రంగాలూ ఆధునిక విధానాల్లో సమాచారాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతున్నాయి. అర్థం చేసుకోనంతవరకే సాంకేతికత ఒక ఆశ్చర్యకరమైన అంశం. సంక్లిష్ట సమయాల్లో సాంకేతికతను వాడుకోవడం మరింత ఆవశ్యకం. మానవాళి మనుగడలో వైద్యరంగం ఎంతో కీలకమైంది. వ్యాధులకన్నా సమాచార లోపంతోనే అనేకమంది బలవుతున్నారనేది బాధాకరమైన వాస్తవం. సాంకేతిక పరిజ్ఞానం చేయూతగా వైద్యరంగంలో అనేక అద్భుతాలు సాధించవచ్చు. దానికి సమాచారమే కీలకం. అన్ని వయసులవారికీ అత్యున్నత స్థాయి ఆరోగ్యం, శ్రేయస్సు సాధించే విధంగా జాతీయ ఆరోగ్య విధానం(నేషనల్‌ హెల్త్‌ పాలసీ)- 2017 ఓ లక్ష్యాన్ని రూపొందించింది. తక్కువ ఖర్చుతో, నాణ్యమైన వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మాత్రమే దీన్ని సాధించవచ్చు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించేందుకు జవాబుదారీతనంతో కూడిన విధానాలను రూపొందించడం ఇందులో ప్రధాన సూత్రం. ఆరోగ్య సేవల పంపిణీ సామర్థ్యాన్ని పెంచడానికి డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం దీని పరమార్థం. ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో ఉన్న లోపాలను సమీక్షించుకుంటూ, పూర్తిగా డిజిటలీకరించిన ఒక సంపూర్ణ నమూనా మార్పును సిఫార్సు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సమగ్ర ఆరోగ్య వ్యవస్థ నిర్మాణానికి నాంది పలికింది.

అత్యంతావశ్యకం
ఆరోగ్య సంరక్షణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే ఈ ప్రయత్నం ఒక నిరంతర ప్రక్రియ. వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేసి, భద్రపరచడం ప్రజలకు కష్టసాధ్యం. ఆసుపత్రులకు సైతం దీనిపై నిర్దిష్ట విధానాలు లేవు. దీంతో ఒకే రోగికి రోగనిర్ధారణ పరీక్షలను పదేపదే చేస్తున్నారు. వైద్యులకు సరైన సమాచారం లేక లోపభూయిష్ఠమైన వైద్యాన్ని అందించే ప్రమాదమూ ఉంది. సమర్థ ఆరోగ్య సేవలను అందించడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రోగికి సంబంధించిన సమాచారం అత్యంత ఆవశ్యకం. ఇందుకోసం ఒక సౌకర్యవంతమైన వ్యవస్థ అందుబాటులోకి రావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య రంగంలో తలపెట్టే మార్పులకు సైతం ఇది తోడ్పడుతుంది. రాబోయే అయిదేళ్లలో అనేక లక్ష్యాలను సాధించే విధంగా రూపకల్పన చేసిన ఈ సమగ్ర డిజిటల్‌ సేవల ద్వారా ప్రస్తుత వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరించి అభివృద్ధి చేయడం అవసరం. అందుకే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి దాకా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు, విధాన రూపకర్తలకు ‘ఎలక్ట్రానిక్‌ ఆరోగ్య నమోదు(ఈహెచ్‌ఆర్‌)’ను అందుబాటులోకి తేబోతున్నారు. దేశంలోని అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో దీన్ని అనుసంధానించి, మరింత పటిష్ఠమైన, సమాఖ్య స్ఫూర్తితో కూడిన వ్యవస్థగా రూపొందించనున్నారు.

నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పరచిన కమిటీ ‘నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ బ్లూప్రింట్‌(ఎన్‌డీహెచ్‌బీ)’ని రూపొందించింది. ప్రపంచంలోని అత్యంత ఆధునిక డిజిటల్‌ సాంకేతిక విధానాలను అధ్యయనం చేసి, నిర్మాణాత్మకమైన కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాలను ఇందులో ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి జాతీయస్థాయిలో అనువర్తించేలా వ్యక్తిగత గోప్యతతో కూడిన నిర్దిష్ట గుర్తింపు కార్డును జారీ చేస్తుంది. ప్రామాణికమైన ‘ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డు’ను రూపొందిస్తుంది. అందరికీ అందుబాటులో ఒక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తుంది. డిజిటల్‌ హెల్త్‌ పోర్టల్‌ను, ‘మై హెల్త్‌’ అనే యాప్‌ని తయారుచేస్తుంది. దీనికి అయిదంచెల వ్యవస్థను రూపొందించింది. ఇందుకోసం ‘నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ ఎకో-సిస్టమ్‌(ఎన్‌డీహెచ్‌ఈ)’ను ప్రోత్సహించి, అభివృద్ధిచేసే విధంగా ‘నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌డీహెచ్‌ఎం)’ అనే ప్రత్యేక సంస్థను స్థాపించాల్సిన అవసరాన్ని ఎన్‌డీహెచ్‌బీ గుర్తించింది.

ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌-7, ఇతర నిర్దిష్ట విధానాల ద్వారా గుర్తించిన ప్రతి పౌరుడికి ఒక వ్యక్తిగత ఆరోగ్య రికార్డు ఉంటుంది. వ్యాధులకు సంబంధించిన డైరెక్టరీలు, రిజిస్ట్రీలను కూడా రూపొందించే అంశాలను కమిటీ ఇందులో పొందుపరచింది. వ్యక్తిగతమైన అంశాల గోప్యత, భద్రత ఆవశ్యకతను నొక్కి చెప్పింది. ఈ సంక్లిష్టతను అధిగమించడానికి పౌరుడి సమ్మతిని తప్పనిసరి చేసే గోప్యతాపాలనకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలను పాటించవలసిన అవసరాన్నీ పేర్కొంది. ఈ సేవల వినియోగార్థం ‘మొబైల్‌ ఫస్ట్‌’ సూత్రాన్ని చెబుతూ, దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకోసం వెబ్‌సైట్‌, యాప్‌తో పాటు కాల్‌సెంటర్‌ను రూపొందించింది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాలనూ వాడుకోవాలని సూచించింది. అన్ని ఆరోగ్య శాఖలను అనుసంధానిస్తూ- స్వయంప్రతిపత్తితో వినూత్నమైన విలువల ఆధారిత సేవలను అందిస్తూ, ఆరోగ్య సమాచారాన్ని సేకరించాల్సిన అవసరాన్ని ఈ బ్లూ ప్రింట్‌ వివరిస్తుంది. ఆధార్‌, జీఎస్టీ తరహాలో స్వయంప్రతిపత్తి కలిగిన సంపూర్ణ ప్రభుత్వ రంగ వ్యవస్థగా ఎదిగేందుకు ‘జాతీయ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌’కు తగిన సంస్థాగత నిర్మాణం ఉండాలని సిఫార్సు చేసింది. ‘డిజిటల్‌ హెల్త్‌’లో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అనేక సంస్థలు ఆరోగ్య రంగంలో అపారమైన సమాచారాన్ని (డేటాను) తయారు చేస్తున్నాయి. 135 కోట్ల భారతీయులందరికీ వ్యక్తిగతమైన ఆరోగ్య రికార్డును ఏర్పరచడం అసాధారణమైన విషయం. ఇందుకోసం ‘హెల్త్‌ లాకర్‌’ విధానాన్ని ప్రవేశపెట్టింది. పౌరుడి ఆరోగ్య ప్రధానమైన అంశాలను అందులో పొందుపరుస్తారు. దీనిద్వారా వ్యక్తిగతమైన ఆరోగ్య రికార్డు(పీహెచ్‌ఆర్‌)ను వ్యక్తి సమ్మతిపై మాత్రమే సృష్టిస్తారు. మారుమూల ప్రదేశాల్లో సైతం ఇంతటి వ్యవస్థను ఏర్పరచడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ‘హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌’ను పొందుపరచారు. ఇందులో అన్ని వనరులు అందుబాటులో ఉన్నదాన్ని ప్రధానమైన కేంద్రం(హబ్‌)గా, తక్కువ వనరులు ఉన్న కేంద్రాలను ‘స్పోక్‌’గా ఏర్పరచి సమాచారాన్ని (డేటాను) కేవలం కేంద్రంలో మాత్రమే పొందుపరుస్తారు.

నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ బ్లూ ప్రింట్‌ కార్యాచరణకు నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌డీహెచ్‌ఎం) ప్రధాన వేదికగా నిలుస్తుంది. ఇది ఎప్పటికప్పుడు కావలసిన సాంకేతిక సహకారాన్ని అందించడంతోపాటు, ఆరోగ్యరంగ సమాచారం సేకరించి నిల్వ చేస్తుంది. సమాచార నాణ్యతను పరిశీలిస్తుంది. వాటిపై పరిశోధనలు చేస్తుంది. ఇంగ్లాండ్‌, దక్షిణ కొరియాల్లోని ఈ తరహా వ్యవస్థలు మన దేశానికి ఆరోగ్య రంగ డిజిటలీకరణలో మార్గదర్శకంగా ఉన్నాయి. అంతర్జాతీయ న్యాయ చట్రాల అధ్యయనం సూచించిన ప్రకారం... కేంద్ర కమిటీ రెండు వేర్వేరు సాధికార విభాగాలను సిఫార్సు చేసింది. విధాన రూపకల్పన, పరిపాలన, అమలు మొదలైనవి నియంత్రణ సంస్థలో భాగంగా ఉంటాయి. ఉత్తమ సాంకేతిక పరిష్కారాలను రూపొందించడం, భద్రత, గోప్యతలకు చెందిన ప్రక్రియల పర్యవేక్షణకోసం మరో సంస్థ ఏర్పాటవుతుంది.

ముప్పిరిగొంటున్న సందేహాలు
ఎంతటి ప్రస్థానమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఆరోగ్యరంగానికి ఇలాంటి దిశానిర్దేశం చేయాల్సిన ఆవశ్యకతను కాదనలేం. భారత దేశంలో వైద్యులు రోగులను చూసే విధానం విభిన్నంగా ఉంటుంది. పాఠ్యపుస్తకాల్లో ప్రవచించిన విధానాలను కేవలం ఒక శాస్త్రంగా మాత్రమే కాకుండా- ఓ కళగా భావించే అనేక మంది వైద్యులకు ఈ ఒరవడి నచ్చకపోవచ్చు. అనేక అంశాలను రోగులనుంచి సేకరించడం కూడా వీరికి తలకు మించిన భారమవుతుంది. ఒక రోజులో కేవలం నలుగురైదుగురిని మాత్రమే చూసే పాశ్చాత్య దేశాల వైద్యులకు, రోజూ రెండువందలమంది రోగులను చూసే భారతీయ వైద్యులకు పోలిక ఎక్కడ? అపారమైన ఈ సమాచారాన్ని మారుమూల ప్రాంతాల్లో సైతం పద్ధతిగా క్రోడీకరించడానికి కావాల్సిన సాంకేతిక ఉపకరణాలు, సిబ్బందిని ఏర్పరచుకోవడం అత్యంత దుర్లభమైన ప్రక్రియగా కనిపిస్తుంది. అనేక రాష్ట్రాలు ఇంకా ఆయుష్మాన్‌ భారత్‌ను స్వీకరించలేదు. అలాంటప్పుడు సమాచారం సంపూర్ణమయ్యే అవకాశమేదీ? దీనికోసం కార్యాచరణను ప్రకటించలేదు. దీర్ఘకాలిక వ్యాధులమీద ఏర్పాటు చేసిన అనేక రిజిస్ట్రీలు సఫలమైన దాఖలాలు లేవు. జీఎస్టీ, యూఐడీఏఐలను ఆదర్శంగా తీసుకున్నా- వాటి అమలులో అనేక లుకలుకలు బయటపడ్డ సందర్భాలు అందరికీ తెలుసు. రికార్డుల నాణ్యత, గోప్యతకు సంబంధించి సంపూర్ణ స్పష్టత కానరాలేదు. అన్ని సంస్థలనూ ఒకేతాటికిందకు తెచ్చే యత్నం ఎంతవరకు సఫలీకృతమవుతుందనేది సందేహాస్పదమే. ఆధునిక సాంకేతికత మాటున పొంచి ఉన్న అపాయాల వలయాలను అధిగమించే ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వైద్యులను, సాంకేతిక నిపుణులను ఆ దిశగా తయారుచేయడం ఒక విశ్వప్రయత్నమే. ఈ వ్యవస్థలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కూడా ఇమిడి ఉండటంతో అది సక్రమంగా అమలవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

భారత ప్రభుత్వం ఒక భగీరథ ప్రయత్నాన్ని తలకెత్తుకుంది. సాంకేతిక సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయిలో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. అరచేతిలో ఇమడనున్న ఆరోగ్యసూత్రావళి ద్వారా వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడేలా భారత్‌లో ఈ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంది.

అసాధారణ రీతిలో...
అందరికీ ఆరోగ్యం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పరచిన జాతీయ ఆరోగ్య విధానానికి (ఎన్‌హెచ్‌పీ-2017కు) కొనసాగింపుగా, 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ‘ఆయుష్మాన్‌ భారత్‌ యోజన’ను ప్రకటించారు. ఒకవైపు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నివారణ కార్యక్రమాలను ప్రోత్సహించే విధంగా దేశవ్యాప్తంగా లక్షన్నర సమగ్ర ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేయడం, మరోవైపు ప్రధాన్‌ మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) పథకం కింద అయిదు కోట్లకు పైగా పేద, బలహీన వర్గాల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల వరకు ద్వితీయ, తృతీయ శ్రేణిలో ఆరోగ్య బీమా కల్పించడం ఇందులో భాగాలు. ఆయుష్మాన్‌ భారత్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ద్వారా సేవలు లభించడం మాత్రమే కాదు- అత్యాధునిక డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దేశవ్యాప్తంగా అపారమైన ఆరోగ్యరంగ సమాచారం (డేటా) సృష్టించడంపై దృష్టి పెట్టడం మరొక ప్రధానాంశం. బహుళ వాటాదారుల మధ్య ఉన్న సమాచారాన్ని దేశవ్యాప్తంగా ఒకే తాటిపైకి తీసుకురావాలనే సంకల్పాన్ని ఈ డిజిటలీకరణ సుసాధ్యం చేస్తుంది.

- డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజు
(రచయిత- హైదరాబాద్‌ నిమ్స్‌లో నెఫ్రాలజీ విభాగాధిపతి)
Posted on 10-12-2019