Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

నైపుణ్యాలు లేకనే నిరుద్యోగ భారతం

ఓ వ్యక్తి చేసే పని లేదా వృత్తిని 'ఉపాధి'గా నిర్వచించవచ్చు. చేయగలిగిన వ్యక్తికి పని కల్పించి, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వడాన్ని కూడా ఉపాధిగా చెప్పవచ్చు. ఉపాధి అవకాశాలే దేశ అభివృద్ధికి, సాంకేతిక పురోగతికి గీటురాళ్లు. ఉపాధి రెండు రకాలు. వ్యవసాయంతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల్లో పనిచేయడం ఒకటి. విద్యాపరమైన ఉపాధి అవకాశాలు రెండో రకమైనవి. మొదటి తరగతికి చెందినవి దేశవ్యాప్తంగా ఆరు కోట్లమందికి ఉపాధి కల్పిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ విద్యావంతులకు దక్కుతున్న ఉపాధి అంతంతమాత్రమే! అదే సమయంలో తగిన నైపుణ్యం గల మానవ వనరులు లభించక చాలా ఉద్యోగాలు భర్తీకి నోచుకోని పరిస్థితి కనిపిస్తోంది. 2011 గణాంకాల ప్రకారం, దేశంలో దాదాపు 12కోట్లమందిని నిరుద్యోగులుగా గుర్తించారు. 2014-'15లో 5.5లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, వాటిని ఆశించేవారి సంఖ్య రెండు కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18శాతం నిరుద్యోగులు ఉన్నట్లు జనాభా లెక్కల్లో నమోదైంది. ప్రభుత్వ ఉద్యోగాలను సరిగా భర్తీచేయనందువల్ల, స్వయం ఉపాధికి ప్రోత్సాహం కరవై నిరుద్యోగిత పెరుగుతోందని ఇటీవలి జాతీయ ఆర్థిక సర్వే వెల్లడించింది. నిరక్షరాస్యుల్లో నిరుద్యోగిత 3.7శాతం, అక్షరాస్యుల్లో అది 19శాతంగా నమోదైంది.

పలు అనుభవాలు

దక్షిణ కొరియాలో స్నాతకోత్తర విద్య(యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌)లో 80 శాతంమంది విద్యార్థులు ప్రవేశిస్తున్నారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 15 నుంచి 40 శాతం మాత్రమే ప్రవేశిస్తున్నారు. స్నాతకోత్తర విద్యలో ప్రవేశాలను పెంచడం వల్ల నిరుద్యోగిత పెరిగిందనడం సబబు కాదు. వారిలో తగిన నైపుణ్యాలు కొరవడడమే సమస్యకు ప్రధాన కారణం. 2013 నవంబరులో కేంద్ర కార్మిక శాఖ గణాంకాల ప్రకారం, దేశంలోని ప్రతి ముగ్గురు పట్టభద్రుల్లో ఇద్దరు నిరుద్యోగులని తేటతెల్లమవుతోంది. అన్నిరకాలుగా అభివృద్ధి చెందిన సింగపూర్‌లో పట్టభద్రుల నిరుద్యోగిత 2013లో 3.3 నుంచి 3.6 శాతానికి పెరిగింది. నిరుద్యోగిత సగటు రెండు శాతాన్ని మించిపోయింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ సచివాలయంలో 400 బంట్రోతు ఉద్యోగాల భర్తీకోసం అభ్యర్థులు ప్రాథమిక విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. దాదాపు 23లక్షల మంది దరఖాస్తు చేశారు. అందులో అయిదో తరగతి చదివినవారు 53వేల మంది; ఉన్నత పాఠశాల చదువు పూర్తిచేసినవారు 11.21లక్షల మంది; పట్టభద్రులు 1.5లక్షల మంది; స్నాతకోత్తర పట్టభద్రులు 25వేలమంది; పీహెచ్‌డీ చేసిన విద్యాధికులు 255 మంది ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. అలాగే రెవిన్యూ రికార్డుల నిర్వహణదారు ఉద్యోగాల కోసం 26లక్షలమంది పైగా దరఖాస్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో వెలువడిన వీఆర్‌వో ఉద్యోగాల ప్రకటనకు 11లక్షలమంది స్పందించారు. పదో తరగతి విద్యార్హత సరిపోయే 2,500మంది అబ్కారీ కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు పట్టభద్రులు, సాంకేతిక ఉన్నత విద్యావంతులతో సహా అయిదు లక్షల మంది పోటీపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో వంద కళాసీ ఉద్యోగాల కోసం ఇంజినీర్లు, పట్టభద్రులు సహా 10వేలమంది అర్జీలు పెట్టారు. మరోవైపు, భారత్‌లో ఇప్పటికీ నిపుణులైన అభ్యర్థులు లభించడంలేదని 58శాతం స్వదేశీ సంస్థలు, పరిశ్రమలు అనేక సందర్భాల్లో చెబుతున్నాయి.

సామాజిక అవసరాలే మిన్న

వృత్తిపరమైన శిక్షణ పొందినవారు వివిధ దేశాల్లో గణనీయంగా లభిస్తున్నారు. కొరియాలో 96, జపాన్‌లో 80శాతంమంది వృత్తిపరమైన శిక్షణ పొందినవారు ఉన్నారు. భారత్‌లో అది మూడు శాతమే ఉండటం దురవస్థకు నిదర్శనం. చైనాలో ఏటా తొమ్మిదికోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. భారత్‌లో 40లక్షల మందితోనే సరిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. నైపుణ్యంగల మానవ వనరులను తయారుచేసుకోవాల్సిన, వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక అవసరాలకు అనుగుణంగా యువతకు వివిధ రంగాల్లో ఆయా స్థాయుల్లో శిక్షణ ఇవ్వగలిగితే చాలు- చైనా, జర్మనీల మాదిరిగా భారత్‌లోనూ విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. విజ్ఞాన ఆధారిత సమాజాలే ప్రపంచ ఆర్థిక రంగాన్ని, తద్వారా ఉపాధిని పెంపొందించుకుంటున్నాయి. భారత్‌ ప్రపంచ తయారీ రంగంలో ఉత్పత్తిపరంగా రెండున్నరశాతం మాత్రమే నమోదు చేయగలిగింది. తయారీ రంగానికి వూతమివ్వగలిగితే, ఉపాధి పెరిగి పారిశ్రామికరంగం బలపడుతుంది. పరిశ్రమలకు తోడ్పాటు అందిస్తూ, రకరకాల వస్తువులు ఉత్పత్తి చేస్తూ- చైనా, జపాన్‌, జర్మనీ, కొరియా వంటి దేశాలు ప్రపంచ మార్కెట్‌ను అందిపుచ్చుకొన్నాయి. లఘు పరిశ్రమలకు రక్షణ కల్పించడం ఎంత ప్రయోజనకరమో గ్రహించిన అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, థాయ్‌లాండ్‌ వంటివి తగిన విధానాలు అనుసరిస్తున్నాయి. ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోగలిగితే, ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ కేంద్రంగా ఆవిర్భవించగల సామర్థ్యం భారత్‌కు ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచీకరణతో ఉత్పన్నమైన సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి యువతకు అనువైన శిక్షణ ఇవ్వాలి. నైపుణ్యం గల మానవ వనరులుగా వారిని తీర్చిదిద్దాలి. సామాజిక, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పట్టభద్రులను రూపొందించాలి. ఉన్నత విద్యలో నాణ్యత పెరిగితేనే ఉపాధి అవకాశాలు అందివస్తాయి.

దృక్పథం మారాల్సిందే

భారత్‌ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ 'మేకిన్‌ ఇండియా' నినాదాన్ని సాకారం చేయడానికి కృషి సాగిస్తోంది. వస్తువులను మనదేశంలోనే ఉత్పత్తి చేయగలిగితే- ఎగుమతులు పెరిగి, విదేశీ మారకద్రవ్యం దక్కుతుంది. అదే సమయంలో దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా అటు వస్తువుల దిగుమతిని నిరుత్సాహపరచడంతో పాటు, ఇటు విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించవచ్చు. వీటితో దేశ వృద్ధిరేటు రెండంకెలు దాటి, ఉపాధి పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, వ్యవసాయాధారిత పరిశ్రమలు, నిర్మాణ రంగాలకు ప్రభుత్వం వూతమివ్వాలి. ఖాయిలాపడిన పరిశ్రమలను పునరుద్ధరించాలి. తయారీ రంగాన్ని బలోపేతం చేసే ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనను అన్నివిధాలా ప్రోత్సహించాలి. ఏ దేశంలోని ఉపాధి అవకాశాలైనా అక్కడి పని సామర్థ్యం, యువత నైపుణ్యాలు, నిబద్ధత కోసం ఎదురుచూస్తాయి. అందుకోసమే పలు ప్రైవేటు పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ముందు చూపుతో వృత్తివిద్యా పథకాలు నిర్వహిస్తున్నాయి. ఇతర పారిశ్రామిక, వ్యాపార, ప్రభుత్వరంగ సంస్థలూ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటుచేయడం ద్వారా యువత ఉపాధి అవకాశాల్ని బాగా మెరుగుపరచాల్సి ఉంది. మారుతున్న కాలం, సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక అవసరాలకు అనుగుణంగా యువత దృక్పథంలోనూ మరింత మార్పు రావాలి. అప్పుడే భారత్‌ పాటవం అంతటా ఇనుమడిస్తుంది!

మానవ వనరులు వినియోగమయ్యేలా...

* భారత్‌ నుంచి విదేశాలకు వెళ్లిన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, పరిశోధక విద్యార్థులు లక్షల్లో ఉన్నారు. వారిలో పలువురు వివిధ రంగాల్లో ఉన్నతస్థాయితోపాటు, పాలనా రంగంలోనూ ఎదిగి దేశానికి కీర్తి తెస్తున్నారు. మరికొందరు తమ సంపాదనలో కొంతభాగాన్ని మాతృదేశానికి తరలించి, పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో- దేశంలోని యువతకు ప్రభుత్వం తగినన్ని ప్రోత్సాహకాలిచ్చి, అవసరమైన తర్ఫీదునూ అందజేస్తే ఇక్కడా అభివృద్ధి విస్తరిస్తుంది. ఉపాధి విస్తృతమవుతుంది.
* దేశంలోని ఐటీఐలను సంస్కరించి, అన్ని 'ట్రేడ్‌'లనూ సక్రమంగా నిర్వహించాలి. సరైన శిక్షణ ఇవ్వగలిగితే, కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో స్పష్టీకరించారు. 2012 గణాంకాల ప్రకారం- మనదేశంలో 2,271 ప్రభుత్వ ఐటీఐలలో 4.87 లక్షల సీట్లు ఉన్నాయి. ప్రైవేటు రంగంలోని 8,074 ఐటీఐలలో సీట్లు 9.79 లక్షలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 148 ప్రభుత్వ ఐటీఐలలో 28,446 సీట్లు, ప్రైవేటు రంగంలోని 581 ఐటీఐలలో 1.18 లక్షల సీట్లున్నాయి. పదో తరగతి, ఇంటర్‌ విద్యతో ప్రవేశం పొందిన ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యార్థులు శిక్షణ పూర్తిచేసుకొని పరిశ్రమల్లో ఉపాధి లేదా స్వయం ఉపాధి పొందగలుగుతున్నారు. అందువల్ల, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ యువ నైపుణ్యాన్ని ఇంకా ప్రోత్సహిస్తే, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
* ఆర్థిక వ్యవస్థలో విధానపరమైన అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో- ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణలకు అనుగుణంగా ప్రభుత్వాలు మానవ వనరులను (ముఖ్యంగా యువతను) సర్వసన్నద్ధం చేసుకోవాలి. ఒక అంచనా ప్రకారం- 2022 నాటికి నిర్మాణ రంగంలో కొత్తగా మూడు కోట్లకు పైగా మానవ వనరుల అవసరం ఉంటుంది. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు వంటి ఆరు లక్షల మందితో పని ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఎలక్ట్రానిక్స్‌, హార్డ్‌వేర్‌ రంగాల్లోనూ అదనంగా 46లక్షలమంది కావాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. జాతీయ నైపుణ్యాభివృద్ధి మండలి అంచనా ప్రకారం- ఇక నిర్మాణం, చిల్లర వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే మనదేశంలోని పెద్ద నిర్మాణ సంస్థలు సిబ్బంది కొరతను అధిగమించేందుకు పలుచోట్ల శిక్షణ కేంద్రాలు నెలకొల్పాయి.

- ప్రొఫెస‌ర్ జి. సూర్యనార‌య‌ణ (విద్యారంగ నిపుణులు)
Posted on 02-12-2015