Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఆలస్యంగా న్యాయం... అన్యాయమే!

* వ్యవస్థలో లోపాలు... అసాధారణ జాప్యాలు

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సామూహిక హత్యాచారం ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లాయి. నేరం రుజువు కాకముందే నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉదంతాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై నేరాలు పెచ్చరిల్లుతున్నందువల్ల ఈ ఘటన న్యాయ వ్యవస్థకు మేలుకొలుపు లాంటిదిగా భావించవచ్ఛు చిన్నారులపై అత్యాచారాలకు సంబంధించి 1.67 లక్షల వరకు ఉన్న అత్యాచార కేసుల్ని వేగంగా విచారించేందుకు వెయ్యి ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటు చేయాలనే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత హైకోర్టులు ముందడుగేయాల్సిన అవసరం ఉంది. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం కావడంతో ఈ విషయంలో క్రియాశీలంగా ప్రతిస్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇలాంటి కార్యక్రమాలకు నిధుల్ని మాత్రం కేంద్రం సమకూర్చాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనలు, కేసుల విషయంలో ఎన్నో ఏళ్లుగా బాధితుల్లో గూడుకట్టుకుపోయిన నిరాశనిస్పృహల్ని విస్మరిస్తుండటంతో వారు తక్షణ పరిష్కారాల్ని కోరుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు మూకన్యాయాన్ని కోరుకుంటున్నారంటే, దాన్ని పాలన వ్యవస్థ వైఫల్యంగా భావించాలి. ఏడేళ్ల తరవాతా నిర్భయ అత్యాచారం-హత్య కేసులో దోషులు ఇప్పటికీ జైలులో జీవించే ఉన్నారు. ఏడేళ్ల అనంతరం అత్యాచార ఘటనలో దోషికి శిక్ష వేయలేకపోతే మనం ఏ తరహా వ్యవస్థలో ఉన్నామనేది తరచి చూసుకోవాల్సిన ప్రశ్న. న్యాయ వ్యవస్థలో ఇలాంటి ఆలస్యం వల్లే ప్రజలు తక్షణ న్యాయం కోసం ఒత్తిడి చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి.

సమస్యల పుట్ట
దేశంలో న్యాయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. న్యాయ పాలన వ్యవస్థలో తొలిశ్రేణి, జిల్లా కోర్టులపై అపరిష్కృత కేసుల భారం అంతకంతకూ పెరుగుతోంది. మూడింట రెండోవంతుకన్నా ఎక్కువ పెండింగ్‌ కేసులు క్రిమినల్‌ నేరాలకు సంబంధించినవే. ప్రాసిక్యూషన్‌ సమర్థంగా సాగకపోవడం వల్ల కేసులు వేగంగా పరిష్కారం కావడంలేదని దీన్నిబట్టి అర్థమవుతోంది. భారీ సంఖ్యలో క్రిమినల్‌ కేసులు అపరిష్కృతంగా ఉండటం రెండు రకాలుగా ఆందోళనకరమైన విషయం. ఒకటి- పెద్ద సంఖ్యలోని బాధితులకు న్యాయం దక్కకపోవడం, రెండోది- క్రిమినల్‌ కేసుల్లో పురోగతి నెమ్మదిగా సాగడం వల్ల విచారణలో ఉండే ఖైదీలు ఎక్కువ కాలం జైళ్లలో మగ్గిపోవాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో వారు చేసిన నేరానికి పడే జైలుశిక్ష కన్నా... విచారణ ఖైదీల్లా జైళ్లలో గడిపే సమయం ఎక్కువగా ఉంటుండటం బాధాకరం.

అత్యాచార కేసులు పెద్ద సంఖ్యలో అపరిష్కృతంగా ఉండటం నిజంగా పెద్ద సమస్యే. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడం ఒక కోణం మాత్రమే. అత్యాచార కేసుల్లో తక్కువ సంఖ్యలోనే శిక్షలు పడుతున్నాయి. ఇది కేవలం సుమారు 32 శాతంగా ఉంటోంది. నేరన్యాయ వ్యవస్థలోని అన్ని విభాగాల పనితీరు అవసరానికి తగినట్లుగా ఉండటం లేదు. కేసుల్ని తగిన రీతిలో దర్యాప్తు చేయడంలో పోలీసులు విఫలం అవుతుండగా, విచారణల్ని ప్రాసిక్యూషన్‌ సమర్థంగా చేపట్టలేకపోతోంది. జడ్జీల కొరత కేసులు పేరుకుపోవడానికి దారితీస్తోంది. హైకోర్టుల స్థాయిలో 1079 పోస్టులకుగాను 410 ఖాళీగా ఉంటున్నాయి. దేశంలోని వివిధ కోర్టుల్లో 3.5 కోట్లకుపైగా కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిలో చాలావరకు పదేళ్లకుపైగా అపరిష్కృతంగా ఉన్నవే. సుప్రీం, హైకోర్టు, జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 1.09 కోట్ల సివిల్‌ కేసులు, 2.28 కోట్ల క్రిమినల్‌ కేసులు, 13.1 లక్షల రిట్‌ పిటిషన్లు అపరిష్కృతంగా ఉన్నాయి. ఏదేని జూనియర్‌ కోర్టులో ఒక సివిల్‌ స్వభావమున్న కేసు పరిష్కారమయ్యేందుకు సగటున మూడు నుంచి నాలుగేళ్లు పడుతోంది. అప్పీలుతో హైకోర్టుకు చేరితే సగటు పరిష్కార కాలం పదేళ్లుగా ఉంటోంది. అదే కేసు సుప్రీంకోర్టుకు చేరితే సగటున పదేళ్లు పడుతోంది. క్రిమినల్‌ కేసు విషయానికొస్తే, దిగువ కోర్టులో రెండేళ్లు పడుతుండగా- హైకోర్టు, సుప్రీంకోర్టులకు అప్పీలుకు వెళ్తే సుమారు అయిదు నుంచి ఎనిమిదేళ్లు పడుతోంది. చాలా కేసులు అపరిష్కృతంగా ఉండటం, దిగువ న్యాయ వ్యవస్థలో నియామకాలు తగిన రీతిలో లేకపోవడం, మౌలిక సదుపాయాల లేమి వంటివన్నీ సమస్యకు కారణంగా నిలుస్తున్నాయి.

హక్కులపై సామాన్యుల్లో పెరిగిన చైతన్యం సహా పలు కారణాలు వ్యాజ్యాల సంఖ్య పెరగడానికి దోహదపడుతున్నాయి. ఇటీవలి కాలంలో సామాజిక-ఆర్థిక పురోగతి, న్యాయ హక్కులపై పెరిగిన అవగాహన సామాన్యులకు సైతం న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే ధైర్యాన్ని కల్పించింది. సమాచార హక్కు, విద్యా హక్కు వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో అసంతృప్తి నెలకొన్న వర్గాలు న్యాయం కోసం వెంటనే కోర్టు తలుపు తట్టడం పెరిగింది. క్రియాశీల న్యాయవ్యవస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం వంటి ఉపకరణాల్ని కనిపెట్టడం కేసుల సంఖ్య మరింతగా పెరగడానికి దారితీసింది. జనాభా స్థాయికి తగిన రీతిలో జడ్జీల సంఖ్య లేకపోవడమూ సమస్యగా మారింది. పది లక్షల మందికి ఇరవై మంది వరకు జడ్జీలు ఉన్నారు. 1987 నాటి న్యాయసంఘం నివేదిక ప్రతి పది లక్షలమందికి కనీసం 50 మంది జడ్జీలు ఉండాలని సిఫార్సు చేసింది. అప్పటి నుంచి దేశజనాభా 25 కోట్లకు పైగానే పెరిగింది. జడ్జీల సంఖ్యను పెంచే విషయంలో రాష్ట్రాలు ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా, ఆ పని కేంద్రమే చేయాలని రాష్ట్రాలు స్పష్టీకరిస్తున్నాయి. ఈ పీటముడి ఇలాగే కొనసాగుతుండటంతో జడ్జీల సంఖ్య ఎక్కడిదక్కడే ఉండి, నిందితులు జైళ్లలోనే మగ్గాల్సి వస్తోంది. సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు జడ్జీల సంఖ్య తక్కువగా ఉంటున్నా, దీర్ఘకాల సెలవులు వంటి వలసకాలం నాటి పద్ధతులు సమస్యగా పరిణమిస్తున్నాయి. భారత న్యాయ వ్యవస్థ వద్ద తగినన్ని వనరులు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవీ ఈ వ్యవస్థపై ఖర్చు పెట్టేందుకు ఆసక్తిగా లేవు. దిల్లీ మినహా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తమ బడ్జెట్‌లో కనీసం ఒక శాతం నిధులనైనా న్యాయవ్యవస్థకు కేటాయించని దురవస్థ నెలకొని ఉంది.

అంతులేని జాప్యం!
దేశానికి మరిన్ని కోర్టులు, ధర్మాసనాలు అవసరం. ఆధునికీకరణ, కంప్యూటరైజేషన్‌ అన్ని కోర్టుల్లోనూ ప్రవేశపెట్టాల్సి ఉంది. ప్రభుత్వం జడ్జీల సంఖ్యను రెట్టింపు చేయడంతోపాటు అఖిల భారత న్యాయ సర్వీసును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జడ్జీల పోస్టులను ప్రస్తుతమున్న 21 వేల నుంచి కనీసం 50 వేలకు పెంచాలి. విస్తృతస్థాయిలో చర్చల ద్వారా తీవ్రస్థాయిలో ఆత్మపరిశీలన చేసుకోవాలి. న్యాయవ్యవస్థలో తీర్పుల ఆలస్యం వెనకున్న మూల కారణాల్ని గుర్తించేందుకు సంప్రతింపులు కొనసాగాలి. పరిస్థితి మెరుగుదలకు సరైన, సహేతుకమైన పరిష్కారాల్ని గుర్తించాలి. అనవసరమైన పేచీలు, అడ్డంకులు ఏర్పడకుండా సంబంధిత భాగస్వాములందరితో విస్తృత, సమగ్ర రీతిలో సంప్రతింపులు జరిపిన తరవాతే ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాలు, నియంత్రణల్ని రూపొందించాలి. ఇటీవల ఆమోదించిన ‘సుప్రీంకోర్టు (జడ్జీల సంఖ్య) సవరణ బిల్లు (2019)’ ప్రకారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తితో కలుపుకొని 31 నుంచి 34కు పెరిగింది. న్యాయం సత్వరం, సకాలంలో సిద్ధించడం ప్రాథమిక హక్కు మాత్రమే కాదు- న్యాయపాలన సాగించేందుకు, సుపరిపాలన అందించేందుకు అత్యవసరం. ఇది లేనిపక్షంలో, న్యాయవ్యవస్థ అవినీతి, చట్ట ఉల్లంఘనుల ప్రయోజనాల్ని పరిరక్షించేదిగా మారిపోతుంది. న్యాయ సంస్కరణల విషయంలో గట్టిగా కృషి చేస్తే సత్వర, సమర్థ న్యాయం అందరికీ దక్కుతుంది. ప్రపంచ బ్యాంకుతోపాటు న్యాయ ప్రక్రియల్ని అధ్యయనం చేసే ఇతర సంస్థల నివేదికల్లో భారత్‌ పరిస్థితి మెరుగవుతుంది.

ప్రభుత్వ వ్యాజ్యాలే అధికం
ప్రభుత్వం వైపు నుంచి లిటిగేషన్లు అధికంగా ఉండటమూ పెద్ద సమస్యే. మన దేశంలో అతిపెద్ద వ్యాజ్యదారు ప్రభుత్వమే. సగందాకా అపరిష్కృత కేసులకు కారణం సర్కారే. ఇందులో చాలావరకు ప్రభుత్వంలోని ఒక విభాగం, మరొక విభాగంపై దావా రూపంలో వేసినవే. ప్రభుత్వం దాఖలు చేసిన అనేక కేసుల్లో, తమ వాదనను రుజువు చేసుకోవడంలో విఫలమైన ఉదంతాలే అధికం.

దిగువ కోర్టుల్లో నాణ్యత తక్కువగా ఉండటమూ సమస్యగా మారుతోంది. భారత న్యాయ వ్యవస్థ ప్రతిభావంతులైన విద్యార్థులు, అత్యుత్తమ మేధావుల్ని తన రంగంలోకి ఆకర్షించడంలో దారుణంగా విఫలమైంది. దిగువ కోర్టుల్లో జడ్జీల పనితీరులో నాణ్యత అంతంతమాత్రంగానే ఉంటోంది. దిగువ కోర్టుల నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టుల్లో అప్పీళ్లు దాఖలవుతున్నాయి. ఫలితంగా కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. వాయిదాలపై వాయిదాలు పడుతూ ఎంతకూ తెమలని కేసులు అనేకం. ప్రాచీనకాలంనాటి చట్టాలు, వాటిపై వేర్వేరు న్యాయస్థానాలు బహుళ సంఖ్యలో చేసిన వ్యాఖ్యానాలు వంటివన్నీ లిటిగేషన్లు సుదీర్ఘకాలంపాటు సాగేందుకు కారణమవుతున్నాయి. 1880ల నాటికి చెందిన కేసులు సైతం కొన్ని ఉన్నాయి. ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే, వెంటనే క్రితం శతాబ్దంలో రూపొందించిన చట్ట ముసాయిదాను చూపి, ఆ పనిని ఆపేయడం జరుగుతోంది. న్యాయ వ్యవస్థపై సామాన్యుల్లో విశ్వాసం అత్యల్ప స్థాయిలో ఉంది. పేదలకు, విచారణలో ఉన్న ఖైదీలకు న్యాయం దక్కడం లేదు. సకాలంలో న్యాయంపై విదేశీ పెట్టుబడిదారుల్లో అనుమానాలున్నాయి. ఇది ‘మేకిన్‌ ఇండియా’ వంటి కార్యక్రమాల విజయంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. న్యాయవ్యవస్థ లిటిగేషన్ల తాకిడిని తట్టుకోలేకపోతోంది. తీవ్ర పనిభారంతో బలహీనపడుతోంది. న్యాయం ఆలస్యమైతే- అన్యాయం జరిగినట్లే! అదే విధంగా ఆదరాబాదరాగా జరిగే న్యాయం కూడా అందని ద్రాక్ష కిందే లెక్క.

Posted on 24-12-2019