Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

‘ప్రైవేటు’ బాటలో ఆచితూచి...

* సంపన్నులకేనా ఉన్నత విద్య?
దేశ ప్రగతిపథంలో విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో కీలకం. ఉన్నత విద్యావ్యవస్థను మరింత నాణ్యంగా రూపొందించడంతోపాటు, దాన్ని అందరికీ చేరువ చేయడమెలా అన్న అంశంపై దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. గడచిన ఏడాదిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై విస్తృతంగా మంతనాలు సాగుతున్నాయి. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఉనికే లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏడాదిన్నరగా ఈ దిశగా ఆలోచనలు మొదలుపెట్టింది. నిపుణులతో కూడిన ఒక ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఆవశ్యకతను తెల్పుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇటీవలి శాసనసభ సమావేశాల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదమూ లభించింది.వచ్చే విద్యా సంవత్సరంనుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఇవి ఏర్పాటు కానున్నాయి. మరోవంక తెలంగాణలోనూ కేసీఆర్‌ ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుపట్ల మొగ్గుచూపుతున్న నేపథ్యంలో- అందులోని మంచి చెడ్డలను, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను చర్చించాల్సిన అవసరం ఉంది.

గాడి తప్పుతున్న ప్రభుత్వ వర్సిటీలు!

ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లుకు రూపకల్పన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. అప్పట్లో సుమారు 15విద్యాసంస్థల యాజమాన్యాలు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. శాసనసభలో బిల్లు ఆమోదం పొందడంలో చోటుచేసుకున్న జాప్యంవల్ల అది పూర్తిగా మరుగున పడిపోయింది. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తరవాత ఆ ప్రయత్నాలు తిరిగి వూపందుకున్నాయి. అమెరికాలో సుమారు 80శాతం విశ్వవిద్యాలయాలు ప్రైవేటు సంస్థలే. ఎంఐటీ, హార్వర్డు, స్టాన్‌ఫోర్డు వంటివి ప్రైవేటు విశ్వవిద్యాలయాలే. అవి విజయవంతంగా, నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందిస్తున్నాయి. అయితే అక్కడ అవి నడుస్తున్న పద్ధతి వేరు. లాభాపేక్షతో కాకుండా ప్రజాప్రయోజనార్థం అక్కడ ప్రైవేటు విద్యాసంస్థలు నడుస్తున్నాయి. కానీ ఆ పరిస్థితి మన దేశంలో ఉందా అంటే లేదన్నదే సమాధానం. కాబట్టి దేశంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచడంతోపాటు- తగిన మౌలిక సౌకర్యాలు కల్పించి, మెరుగైన బోధన సిబ్బందిని అందుబాటులోకి తెచ్చి వాటిని పరిపుష్టం చేయడమే ఉత్తమం. భారత్‌కన్నా తక్కువ జనాభా ఉన్న జపాన్‌లో 726 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, జర్మనీలో 350, యూకేలో 125, అమెరికాలో 2,466 విశ్వవిద్యాలయాలు ఉంటే మనదేశంలో మాత్రం 700కు పైచిలుకు యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి. జాతీయ విజ్ఞాన సంఘం దేశంలో కనీసం 1500 విశ్వవిద్యాలయాలు అవసరమని సూచించింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ స్థాయిలో విద్యను దిద్దుకోవడానికి బదులు ప్రైవేటుకు పట్టం కట్టి- విద్యను కొందరికే పరిమితం చేస్తామనడం సరికాదు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లులోని కొన్ని నిబంధనలు ఇలా ఉన్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల పాలక మండలిలో ఆరుగురు సభ్యులు, నిర్వాహక మండలిలో ఎనిమిదిమంది సభ్యులు ఉంటారు. వాటితోపాటు అకడమిక్‌ మండలి ఉంటుంది. మొత్తంగా సొసైటీ చట్టం-2001, భారత ధార్మిక సంస్థల చట్టం- 1882, కంపెనీల చట్టం- 2013 కింద ఏర్పాటై అయిదేళ్లుగా తమ ఆర్థిక వ్యవహారాలన్నింటిపైనా ‘ఆడిటింగ్‌’ జరిగిన సంస్థలు ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపనకు అర్హమైనవి. పురపాలక సంఘాల పరిధిలో 30ఎకరాలు, ఇతర ప్రాంతాల్లో 40ఎకరాల్లో వాటిని ఏర్పాటు చేయాలి. వాటిపై పర్యవేక్షణకు ప్రభుత్వంవైపునుంచి ఒక నియంత్రణ సంస్థ, ముగ్గురు సభ్యులు ఉంటారు. బోధనలో నాణ్యత లేకుండా పెద్దయెత్తున రుసుములు వసూలు చేస్తున్న విశ్వవిద్యాలయాలపై చర్యలు తీసుకోవాలంటూ ఈ నియంత్రణ సంస్థ ప్రభుత్వానికి నివేదించవచ్చు. అయిదు కోట్ల రూపాయల ధర్మనిధితో ఈ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి. వాటినే ‘గ్రీన్‌ఫీల్డ్‌ విశ్వవిద్యాలయాలు’గా పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉన్న విద్యాసంస్థలను విశ్వవిద్యాలయాలుగా మార్చరాదు. పూర్తిగా కొత్తగా మాత్రమే వాటిని నెలకొల్పాల్సి ఉంటుంది.

ఇప్పటికే 15విశ్వవిద్యాలయాలు అధ్వాన స్థితిలో, అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని మెరుగుపరిచి ఒడ్డుకు చేర్చడానికి బదులు వాటి ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇవ్వడాన్ని అనేకులు తప్పుపడుతున్నారు. ప్రాథమిక విద్య, ప్రాథమికోన్నత విద్య, కళాశాల విద్య ప్రైవేటుపరమయ్యాయి. ఆ రకంగా ప్రభుత్వ విద్యాసంస్థలు నిర్వీర్యమయ్యాయి. మున్ముందు ఇదే పరిస్థితి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకూ ఎదురుకావచ్చు. ఎంతో చరిత్ర కలిగిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు వీటి రాకతో కనుమరుగవుతాయి. గతంలో నిజమైన సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాజులు, జమిందారులు విద్యాలయాలు స్థాపించేవారు. కానీ ఇప్పుడు పెట్టుబడిదారీ వర్గం విద్యను వ్యాపారంగా మార్చేస్తోంది. ప్రభుత్వంనుంచి అనేక రాయితీలు పొందే ఈ సంస్థలు ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఏ కొందరికైనా ఉచితంగా విద్యనందిస్తాయా అంటే అదీ లేదు. దురదృష్టకరమైన పరిస్థితి ఇది. తీవ్రమైన సామాజిక అసమానతలకు బాటలు పరిచే పరిణామమిది. ఏమాత్రం సామాజిక సంక్షేమ కోణం లేకుండా వ్యవహరించే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కనీసం నాణ్యతమీదైనా శ్రద్ధ పెడతాయా అంటే అదీ ఉండదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని బోధన సిబ్బందితో పోలిస్తే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని సిబ్బందిలో నైపుణ్యం, అర్హతలు బాగా తక్కువ. తక్కువ జీతాలకు ప్రతిభలేని అధ్యాపకులను నియమిస్తారు కాబట్టి నాణ్యత అత్తెసరుగానే ఉంటుందనడంలో సందేహం లేదు.

ప్రైవేటు విశ్వవిద్యాలయాల సంక్షేమ కోణం

స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం: ఏడాదికి లక్షా25వేల డాలర్లకన్నా తక్కువ సంపాదిస్తున్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజులనుంచి మినహాయింపు. సంవత్సరానికి 65,000డాలర్ల కంటే తక్కువ ఆదాయం పొందుతున్న కుటుంబాల విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలనూ కల్పిస్తున్నారిక్కడ.
హార్వర్డ్‌ యూనివర్సిటీ: సంవత్సరానికి 65వేల డాలర్లకంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.
యేల్‌ విశ్వవిద్యాలయం: ఏడాదికి 65వేల డాలర్లకంటే తక్కువ సంపాదిస్తున్న కుటుంబాలకు ట్యూషన్‌ ఫీజు చెల్లింపునుంచి మినహాయింపు ఇవ్వడంతోపాటు- వసతి, భోజన సదుపాయాలు, పుస్తకాల కొనుగోలు వంటి విషయాల్లోనూ రాయితీలు ఇస్తోంది.
ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం: సంవత్సరానికి 60వేల డాలర్లకంటే తక్కువ సంపాదిస్తున్న కుటుంబాలకు ట్యూషన్‌ ఫీజులనుంచి మినహాయింపుతోపాటు, వసతి భోజన సదుపాయాలు కూడా ఉచితంగా కల్పిస్తున్నారు.

ప్రైవేటు వర్సిటీలు పూర్తి లాభాపేక్షతో పనిచేస్తాయి. అది వాటి నైజం. బోధన, బోధనేతర సిబ్బందిని బాగా కుదించి ఉన్నవారిపై ఎక్కువ పనిభారం మోపుతాయి. సిబ్బంది నియామకాల్లో సామాజిక న్యాయానికీ చోటుండదు. విద్యార్థులనుంచి పెద్దయెత్తున ఫీజులు గుంజడానికే ఈ సంస్థలు అధిక ప్రాధాన్యమిస్తాయి. ఫలితంగా విద్యార్థుల్లో ధనిక, పేద అనే రెండు వర్గాలు ఏర్పడతాయి. ఆదాయంలేని కోర్సులను తప్పించి ఆకర్షణీయమైన కోర్సులవైపు మొగ్గుచూపే ఇలాంటి విద్యాసంస్థలవల్ల విద్యార్థుల్లో- సామాజిక అవగాహన, ప్రజా సంక్షేమాభిలాష పూర్తిగా కొడిగట్టే ప్రమాదం ఉంది. అమెరికాలోని స్టాన్‌ఫోర్డు, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాలు ప్రైవేటు సంస్థలైనప్పటికీ సంక్షేమ కోణంలో విద్యను అందిస్తున్నాయి. నాణ్యమైన విద్యను అందరికీ చేరువలోకి తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో వాటిని స్థాపించారేగానీ- లాభాపేక్షతో కాదు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ వార్షిక బడ్జెట్లో మూడో వంతును విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లకోసం కేటాయిస్తున్నారు. భారత్‌లోని ఏ ప్రైవేటు విశ్వవిద్యాలయమూ ఒక్క రూపాయిని సైతం పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల రూపంలో కేటాయించడం లేదు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఏటా 60శాతం విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల ద్వారా లబ్ధి పొందుతున్నారు.

సామాజిక బాధ్యతను విస్మరించరాదు

ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఎప్పుడైతే మార్గం సుగమం అవుతుందో విదేశీ విశ్వవిద్యాలయాలూ వాటితోపాటే ప్రవేశిస్తాయి. ఎన్నో విదేశీ సంస్థలతోపాటు దేశంలోని కొన్ని రాష్ట్రాలూ ఇందుకోసం ఎదురుచూస్తున్నాయి. ఉన్నత విద్యారంగాన్ని జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ ఇన్‌ సర్వీసెస్‌ (గాట్స్‌)లో భాగంగా వాణిజ్య సేవగా మార్చేందుకు 2005 ఆగస్టులో భారతప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. విద్యకు సంబంధించిన నిర్ణయాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలివి. ప్రైవేటీకరణ మూలంగా అధికసంఖ్యలోని బడుగు బలహీనవర్గాలకు ఉన్నత విద్య దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రైవేటు రంగంలో ఉన్నత విద్య కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమయ్యే అవకాశముంది. పేద విద్యార్థులు గత్యంతరంలేక అప్పుచేసి చదువుకోవాల్సిన దుస్థితిలో పడిపోతారు. విద్య అంగడి సరకుగా మారినందున అనివార్యంగా దాని ఉత్పత్తులూ(విద్యార్థులు) వాణిజ్య సరకులుగా మారతాయి. బోలెడంత డబ్బు పోసి కొనుక్కున్న విద్య ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్న విద్యార్థులు సమాజం, సామాజిక బాధ్యతలు గురించి ఆలోచించరు. విద్యపై పెట్టిన పెట్టుబడిని తొందరగా రాబట్టుకోవాలని చూస్తుంటారు. దేశంలో కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులు, ఇతర రాయితీల రూపంలో ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఆ వ్యయంలో పావు వంతును ఉన్నతవిద్యపై వెచ్చించగలిగినా నేడు విద్యారంగం అభివృద్ధికి ప్రైవేటు సంస్థలవైపు చూడాల్సిన అగత్యం ఉండదు. స్థూల దేశీయ ఉత్పత్తిలో ఆరు శాతాన్ని విద్యకోసం, అందులో ఒకటిన్నర నుంచి రెండు శాతం మొత్తాన్ని ఉన్నత విద్యకు కేటాయించాలని జాతీయ విజ్ఞాన సంఘం సూచించింది. కోట్ల రూపాయలు ఏటా విద్యాసుంకం రూపేణా వసూలు చేస్తున్న ప్రభుత్వాలు నాణ్యమైన ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి సంబంధించి మాత్రం ఆలోచించకపోవడం శోచనీయం. సాహసోపేతమైన ఆలోచనలకు కేంద్రాలుగా, మానవనాగరికతను భావితరాలకు పదిలంగా అందించే విద్యాక్షేత్రాలుగా విశ్వవిద్యాలయాలు భాసిల్లాలి. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న యువశక్తినుంచి సత్ఫలితాలు పొందాలంటే ఆర్థిక అంతరాలతో నిమిత్తం లేకుండా అందరికీ అద్భుతమైన ఉన్నత విద్యను పొందగల అవకాశాలు కల్పించాలి. ప్రైవేటు సంస్థలెప్పుడూ లాభాపేక్షతోనే పనిచేస్తాయి. ఈ విషయంలో వాటిని తప్పుపట్టలేం. కానీ ఆలోచించాల్సింది ప్రభుత్వమే. సర్కారీ విశ్వవిద్యాలయాలను వెనక్కినెట్టి ప్రైవేటుకు పెద్దపీట వేసే కార్యక్రమాలు ఎంతమేరకు సమంజసమో ప్రభుత్వాలు పునరాలోచన చేసుకోవాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రైవేటు వైపు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో ఆలోచించాల్సిన కీలకాంశాలివి.

- ప్రొఫెస‌ర్ బి. రామకృష్ణారావు
(ర‌చ‌యిత - వాణిజ్యరంగ నిపుణులు)
Posted on 26-12-2015