Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

యువత చేతిలో జాతి భవిత!

‘ఎక్కడ స్వచ్ఛమైన వివేకధార ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ నిరంతర ఆలోచన, ఆచరణ వైపు నీవు బుద్ధిని నడిపిస్తావో... ఆ స్వేచ్ఛాస్వర్గానికి నా దేశాన్ని మేల్కొలుపు’- అని గీతాంజలి సమర్పించాడు రవీంద్ర కవీంద్రుడు. దోపిడి పీడనల పరాయి ఏలుబడికి భరతవాక్యం పలికేలా ప్రాణాల్నే పణం పెట్టిన కోట్లాది జనావళి అవిరళ త్యాగనిరతే దారిదీపమైతే ఏడు దశాబ్దాల గణతంత్రం- ఈ సరికే స్వేచ్ఛాస్వర్గం అయి ఉండేదనడంలో సందేహం లేదు. తన శక్తిసామర్థ్యాల మేరకు ఇండియా ఎదగగలిగిందా అన్న ధర్మసందేహాలతో పాలక శ్రేణులు పొద్దుపుచ్చితే- మానవాభివృద్ధి సూచీల మందగమనంతో, దేశ ప్రగతికి చోదక శక్తులుగా భావితరాల్ని తీర్చిదిద్దలేని మందభాగ్యంతో ఆశలు ఆకాశంలో- అవకాశాలు పాతాళంలో చందంగా నిట్టూర్పు సెగలు చుట్టుముడుతున్న వేళ ఇది. ఇరవయ్యో శతాబ్ది ద్వితీయార్ధంలో తూర్పు ఆసియా దేశాల స్థూల దేశీయోత్పత్తిని విశేషంగా ప్రభావితం చేసిన యువజన సంద్రం ఘోష- కొత్త ఏడాదిలో ఇండియా భాగ్యరేఖలపై సరికొత్త ఆశలు పెంచేలా సడి చేస్తోంది. చైనా, జపాన్లతో పోలిస్తే భారతీయుల సగటు వయసు బాగా తక్కువగా 28 ఏళ్లు కానుందని, పని చేసే వయసులోని శ్రామికశక్తి ఎకాయెకి జనాభాలో 64 శాతంగా నమోదవుతోందన్న గణాంకాలు- భావిభారత భాగ్యోదయానికి మేలుబాటల్ని సూచిస్తున్నాయి. 2025 నాటికి అమెరికా, చైనా, జపాన్ల తరవాత నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే ఇండియా ప్రపంచ జీడీపీకి ఆరు శాతం దాకా సమకూర్చే స్థాయికి చేరుతుందని 2014 నాటి జాతీయ యువజన విధానం ఆశావహ దృశ్యాన్ని ఆవిష్కరించింది. ప్రగతి లక్ష్యాల్ని అలవోకగా వల్లెవేసే ప్రభుత్వాలు అందుకు దీటైన మానవ వనరుల అభివృద్ధిపై దీర్ఘకాలిక వ్యూహంతో, నెత్తురు మండే శక్తులు నిండే యువతరాన్ని భారత భాగ్యవిధాతలుగా రూపొందించే పటుతర కార్యాచరణకు నిష్ఠగా నిబద్ధమై ఉంటే- దేశ ప్రగతికి ఆకాశమే హద్దు అయి ఉండేది. అయినా నిస్పృహకు వేళ కాదిది. జీవితంలో ఎదగాలన్న తపన తపస్సుగా మారి, బుద్ధి కుశలతకు సానపట్టి ముందడుగేస్తే- భారతీయ యువత సాధించలేనిది ఏముంది?

అసమాన సాంకేతిక శక్తిగా అమెరికా విరాజిల్లడానికి, 22 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక మేరునగంగా అది పురోగమించడానికి- ఎప్పటికప్పుడు భావి సవాళ్లకు రేపటి తరాన్ని సన్నద్ధం చేసే నేతాగణాల దార్శనికతే కారణమైంది. నేడు ఇండియా లాగే, 1990లో చైనా జనాభాలో అత్యధికంగా 38.2 శాతంగా ఉన్న యువజనం శక్తియుక్తులు మూడు దశాబ్దాల్లో ఆ దేశాన్ని అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రగతి కక్ష్యలో నిలిపాయి. 2000 సంవత్సరంలో జపాన్‌ మాదిరిగానే 2020లో చైనా శ్రామికశక్తిలో యువజనం వాటా కోసుకుపోతుండగా ఇండియా ‘గొప్ప ముందడుగు’కు సంసిద్ధమవుతోంది. జాతి నిర్మాణంలో క్రియాశీల భూమిక పోషించగలిగేలా యువతరాన్ని నైపుణ్య శక్తులుగా ఇండియా ఇప్పటికీ తీర్చిదిద్దుకోలేకపోవడమే దిగులు పుట్టిస్తోంది. ‘దేశ ప్రగతిపథ ప్రస్థానంలో భాగస్వాములు అయ్యేలా యువతకు తోడ్పాటునందించడం జాతిబాధ్యత’ అంటూ తొలి జాతీయ యువజన విధానం 1988లో రూపొందగా, పిమ్మట పదిహేనేళ్లకు మరొకటి సందడి చేసింది. సాంకేతిక అభివృద్ధి కొత్తమార్పులకు అంటుకడుతున్నప్పుడు పాత విధానంతో పనిలేదన్న గ్రహింపు మంచిదే అయినా కొత్త వ్యూహం అమలు దేవతా వస్త్రాన్ని తలపించింది. జనాభాలో 27.5శాతంగా ఉన్న 15-29 సంవత్సరాల మధ్య వయస్కులు స్థూల దేశీయోత్పత్తికి 34 శాతం సమకూరుస్తున్నారని, అది మరెంతో పెరగాల్సి ఉందన్న శుభకామనలకు అయిదేళ్ల నాటి విధానం ఘనతర లక్ష్యాల్నీ జోడించింది. యువజనాభివృద్ధి కార్యక్రమాలకు ఏటా రూ.90 వేలకోట్లు వ్యయీకరిస్తున్నట్లు ప్రకటించినా- ‘ఉత్పాదక శ్రామికశక్తి’లో ఏ మేరకు పెరుగుదల సాధ్యపడిందంటే నీళ్లు నమలాల్సిందే. నాలుగున్నర దశాబ్దాల్లోనే అత్యధికమంటున్న నిరుద్యోగిత ప్రభుత్వాలు విస్మరించరాని పెను ప్రమాద హెచ్చరికే!

అగ్రరాజ్యం అమెరికాను శక్తిమంతం, సుసంపన్నం చేస్తూ ఆసియా నుంచి వలసపోయిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు దాదాపు 30 లక్షలమంది ఉంటే అందులో మూడోవంతు భారతీయులే. అనుకూల వాతావరణంలో భారతీయ మేధావికాసం అద్భుతాలు స్పష్టిస్తుందనడానికి సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ల, నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ సేన్‌ తాజా రుజువులే! నిరుడు మాతృదేశానికి ప్రవాసులు పంపిన పైకం అయిదున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా అందుకొన్న ఇండియా- మేధావలస (బ్రెయిన్‌ డ్రెయిన్‌) కారణంగా ఎంత నష్టపోతున్నదీ ఊహకందదు. ప్రవాస శాస్త్రవేత్తల్ని తిరిగి రప్పించేలా వారికి సకల సౌకర్యాలూ కల్పిస్తున్న చైనా వ్యూహాన్ని ఇండియా ఇప్పటికైనా అనుసరించక తప్పదు. వెతికి పట్టుకోవాలేగాని ప్రతి తరగతి గదిలో ఓ జగదీశ్‌ చంద్రబోస్‌, సీవీ రామన్‌, హరగోవింద్‌ ఖురానా దొరుకుతారన్న పస లేని ఉద్బోధలకు చెల్లుకొట్టి, జీవన నైపుణ్యాలకు పాఠశాల స్థాయిలోనే చోటుపెట్టి, పనికొచ్చే చదువులను చక్కగా బోధించే గురువుల నియామకంతో- భావితరాల్ని తీర్చిదిద్దే మహాక్రతువు ఆరంభం కావాలి. ‘ఎంత చదువుకు అంత నిరుద్యోగిత’గా గుల్లబారిన అవ్యవస్థను ప్రక్షాళించి, దక్షిణ కొరియా మాదిరిగా నిపుణ శ్రామిక శక్తుల కేంద్రస్థలిగా ఇండియా పదునుతేలాలి. రెండు వైపులా పదునుగల కత్తి లాంటి యువత దారి తప్పితే ‘దిశ’ లాంటి ఘోర నేరాలు, రేపటి అవసరాలకు దీటైన జాతి రత్నాలుగా తీర్చిదిద్దగలిగితే దేశ ప్రతిష్ఠను దశదిశలా ఇనుమడింపజేసే ఘనకార్యాలు- ఏది కావాలో ప్రభుత్వాలే తేల్చుకోవాలిప్పుడు! ‘చేవ మనది చేత మనది చేయి కలిపితే ఉజ్జ్వల భవిత మనది’ అని ఉద్యమ స్ఫూర్తితో యువజనం కదిలితే, భారతావనికి తిరుగేముంది?

Posted on 31-12-2019