Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సుస్థిరాభివృద్ధిలో దక్షిణాది!

నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన దేశీయ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీ దక్షిణాది రాష్ట్రాల ధాటిని కళ్లకు కడుతోంది. ఇంకో పదేళ్లలో నెరవేర్చాల్సినవిగా నిర్దేశించుకున్న లక్ష్యాలను ధీమాగా సాధించే క్రమంలో కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌ శీఘ్రగతిన పురోగమిస్తుండగా- వాటిని వెన్నంటి తమిళనాడుతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలూ సంయుక్తంగా మూడో ర్యాంకును ఒడిసిపట్టాయి. హిమాచల్‌ను మినహాయిస్తే జాబితాలోని తొలి ఆరింటిలో అయిదు దక్షిణాది రాష్ట్రాలే! కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్‌ నూటికి 70 మార్కులు సంపాదించి కేరళకు దీటుగా నిలవడం విశేషం. ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగపరమైన సమానత్వం, పరిశుభ్ర జలాలు పారిశుద్ధ్యం, ఆకలి పేదరికాల కట్టడి తదితరాల్లో అంశాలవారీగా రాష్ట్రాల పనితీరును మదింపు వేసిన కసరత్తు ఇది. దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నూటికి 50 మార్కులే సాధించగా- ఆకలి, పోషకాహార లోపాల ఉద్ధృతిని చాటుతూ ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ 30 కన్నా దిగువస్కోరుకు పరిమితమయ్యాయి. వాటితో పోలిస్తే 65, అంతకన్నా ఎక్కువ పాయింట్లు సంపాదించిన రాష్ట్రాల జాబితాలో చేరిన గోవా, సిక్కిమ్‌ తామెంతగానో మిన్నగా నిరూపించుకున్నాయి. ఏడాదిక్రితం నీతి ఆయోగ్‌ క్రోడీకరణలో హిమాచల్‌, కేరళ, తమిళనాడు- ఈ మూడే పురోగామి రాష్ట్రాలుగా కితాబులందుకోగలిగాయి. ఈసారి ఆ శ్రేణిలోకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, సిక్కిమ్‌, గోవా అదనంగా చేరడం శుభ సూచకం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో గుజరాత్‌, మహారాష్ట్రలకన్నా దక్షిణాది రాష్ట్రాలు ముందుకు దూసుకుపోవడం ప్రాథమ్యక్రమంలో చోటుచేసుకున్న మార్పులకు అద్దం పడుతోంది. పంట దిగుబడి, అర్ధాంతరంగా బడి మానేస్తున్న పిల్లల సంఖ్య తదితరాల్లో మెరుగైన దిద్దుబాటు చర్యలు చేపడితే- అది దక్షిణ భారతావని సమగ్రాభివృద్ధిలో మేలుమలుపవుతుంది!

ఆసేతు హిమాచలాన్ని పరిగణిస్తే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో జాతీయ స్కోరు నిరుటికన్నా మూడు పాయింట్లు పెరిగి అరవైకి చేరింది. తాగునీరు, పారిశుద్ధ్యం, ఇంధనం ప్రభృత రంగాల్లో భారీ విజయాల నమోదు స్వాగతించదగ్గ పరిణామమే అయినా- పోషకాహార లోపాలు, లింగపరమైన దుర్విచక్షణ వంటివి జాతి ప్రతిష్ఠను ఇంకా దిగలాగుతూనేఉన్నాయి. రాష్ట్రాలవారీ విశ్లేషణలో కేరళ (ఆరోగ్యం), గుజరాత్‌ (పారిశ్రామిక సృజన, మౌలిక వసతులు), ఏపీ (పారిశుద్ధ్యం), తెలంగాణ (అసమానతల తగ్గింపు), సిక్కిమ్‌ (శుద్ధ ఇంధనం) వంటివి తమకు తక్కినవాటికి అంతరమేమిటో సోదాహరణంగా విశదీకరిస్తున్నాయి. ఎప్పటిలాగే బిహార్‌ అట్టడుగు స్థానాన ఈసురోమంటోంది. అరవై దశకంలోనే బిమారు (రుజాగ్రస్త) రాష్ట్రాలుగా బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ ముద్ర వేయించుకోవడం తెలిసిందే. దశాబ్దాలు గతించినా ముఖచిత్రం మారని దుర్దశ బిహార్‌నింకా వెన్నాడుతూనే ఉంది. ఈ ఏడాది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో బిహార్‌తోపాటు ఝార్ఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, యూపీలను అధమ రాష్ట్రాలుగా నీతి ఆయోగ్‌ తీర్మానించింది. యూపీ నిరుటికన్నా కొంత తేరుకుని 29నుంచి ఇరవై మూడో స్థానానికి, ఒడిశా 23నుంచి పదిహేనో స్థానానికి చేరినా- బిహార్‌ తలరాత చెక్కు చెదరనే లేదు! ఏడు దశాబ్దాలుగా భూరి మొత్తం నిధులు వెచ్చించినట్లు ఎవరెన్ని గణాంకాలు వల్లె వేస్తున్నా- లెక్కకు మిక్కిలి పథకాలు, ప్రత్యేక వ్యూహాలెన్నో చిల్లికుండతో నీళ్లు మోసిన చందమవుతున్నాయనడానికి బిహార్‌ దురవస్థే ప్రత్యక్ష నిదర్శనం. పేదరిక నిర్మూలన నినాదాలకు పరిమితమై, క్షేత్రస్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనువైన కార్యాచరణ ఊపందుకోనన్నాళ్లు ఇటువంటి అప్రతిష్ఠ అనివార్యం.

నివారించదగ్గ వ్యాధుల పాలబడి నేలరాలుతున్న పసినలుసుల్ని ఆదుకునే క్రమంలో సహస్రాబ్ది లక్ష్యాలపరంగా మందకొడితనాన్ని చెదరగొడతామని నాలుగేళ్లక్రితమే మోదీ ప్రభుత్వం ప్రతినపూనింది. వివిధ రాష్ట్రాల మధ్య తీవ్ర అసమతుల్యతల్ని సరిదిద్దడానికి 184 జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని అప్పట్లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా వెనకబాటు కాటుకు గురై కుములుతున్న 115 జిల్లాల్ని గుర్తించి, వాటిని సత్వరాభివృద్ధి వ్యూహాలతో కదం తొక్కిస్తామని 2018 జనవరిలో కేంద్రం వెల్లడించింది. బిమారు రాష్ట్రాలకు చెందిన 65 జిల్లాల్ని నీతి ఆయోగ్‌ ఆ జాబితాలో చేర్చింది. ఆకలి చావులకు నెలవులైన కలహండి, కోరాపుట్‌లతోపాటు మరో అయిదు ఒడిశా జిల్లాల్నీ ప్రత్యేక కార్యాచరణ నిమిత్తం అప్పట్లో గుర్తించారు. చూడబోతే, వెనకబడిన రాష్ట్రాల వాస్తవ స్థితిగతుల్లో ఏమంత మెరుగుదల సాధ్యపడలేదని- నీతి ఆయోగ్‌ సూచీ సోదాహరణంగా చాటుతోంది. అంతర్జాతీయ ఆకలి సూచీ ప్రకారం 117 దేశాల ఇటీవలి జాబితాలో 102వ స్థానానికి పరిమితమైన ఇండియాది దక్షిణాసియాలో కడగొట్టు ర్యాంకు. అరవై ఆరేళ్ల సగటు ఆయుర్దాయాన్ని భారత్‌ 2012లో నమోదు చేయగా, అంతకన్నా పదేళ్ల ముందే బంగ్లాదేశ్‌ ఆ ఘనతను సాధించింది. మెరుగైన విద్య, ఇతర అవకాశాల్ని అందుకోవడంలో తరాల తరబడి వెంటాడుతున్న ఆర్థిక సుడిగుండాలు, స్థానిక ప్రాథమ్యాలకు అనుగుణంగా ప్రణాళికల కూర్పు అమలులో నికార్సయిన తోడ్పాటు కొరవడటం- కొన్ని రాష్ట్రాల్ని, అనేక జిల్లాల్ని స్థిర పురోగతికి ఆమడ దూరాన నిలబెడుతున్నాయి. రాజ్యాంగం ప్రస్తావించిన జిల్లా ప్రణాళికా మండళ్ల స్ఫూర్తికి గొడుగుపట్టి- ఆకలి, శిశుమరణాలు, లింగపరమైన దుర్విచక్షణల మీద పైచేయి సాధించే సమర్థ కార్యాచరణకు పరస్పర సమన్వయంతో కేంద్రం రాష్ట్రాలు సమకట్టినప్పుడే... యావత్తు భరత జాతీ సగర్వంగా శిరసెత్తుకోగలుగుతుంది. అప్పుడే నవ దశాబ్ది కాంతులు జనజీవనంలో ప్రతిఫలిస్తాయి!

Posted on 01-01-2020