Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఓటు హక్కుపై వేటు!

స్థానిక సంస్థలు- పునాది స్థాయి ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు. అంచెలవారీ జనస్వామ్య పాలన వ్యవస్థలో నిర్దుష్టంగా ఓటర్ల పట్టికల కూర్పు నిర్వహణలు- కేంద్ర రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాల దక్షతకు ఆనవాళ్లు. ఏడు దశాబ్దాల గణతంత్ర భారతావనిలో ఓటును హక్కుగానో, విధ్యుక్త పౌరధర్మంగానో కాకుండా స్వీయ అస్తిత్వ చిహ్నంగా భావించే స్థాయిలో ఓటర్ల పరిణతి అబ్బురపరుస్తుంటే- తప్పులతడక జాబితాలతో స్వేచ్ఛగా అక్రమాలకు ఎలక్షన్‌ కమిషన్ల నిర్వాకాలే పుణ్యం కట్టుకొన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 120 పురపాలక సంఘాలు, పది కార్పొరేషన్లకు ఈ నెల 22న జరగనున్న ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 53 లక్షల 37 వేలమంది! ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితా ముసాయిదా తీరుతెన్నుల్ని పరికిస్తే అదెంత ప్రహసనప్రాయంగా తయారైందో బోధపడుతుంది. రిజర్వేషన్ల ఖరారుకు ముందే ఎన్నికల కాలపట్టిక (షెడ్యూలు)ను ఇవ్వడం కొత్తపద్ధతి అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ సమర్థించుకొన్నా- ఓటర్లకు సంబంధించిన ఎస్‌సీ ఎస్‌టీ బీసీ వంటి కుల వర్గీకరణ వివరాలే సమూలంగా మారిపోయే స్థాయిలో పునాదిస్థాయి అక్రమాలు విక్రమించాయని వార్తాకథనాలు చాటుతున్నాయి. వార్డుల రిజర్వేషన్లకు కీలకమైన వర్గాల ఓటర్లను గుర్తించడంలో పురపాలక అధికారుల ఉదాసీన ధోరణి కారణంగా- అత్యధిక పురపాలక సంఘాల జాబితాలు తప్పుల కుప్పగా మారాయి. ఎస్‌సీ ఎస్‌టీ బీసీ ఓటర్ల గుర్తింపులో పురపాలక అధికారులకు ఎలాంటి శాస్త్రీయ విధానం లేదని, కార్యాలయాల్లోనే కూర్చుని ఇంటి పేర్లు వృత్తుల ఆధారంగా కులాల్ని నిర్ధారించేసిన పెద్దలు, స్థానిక నేతల ఒత్తిళ్లకు లొంగి పలుచోట్ల మార్పులు చేశారన్న ఆరోపణలకు రుజువులూ పోగుపడుతున్నాయి. ఓటర్ల పేర్ల నమోదులోనూ చిత్రవిచిత్రాలు, వాటికి అదనంగా బోగస్‌ ఓట్ల చేరికలు, స్త్రీలను పురుషులుగా, మగవారిని మహిళలుగా గుర్తించడం, తప్పుడు ఫొటోల విన్యాసాలు- ఓటి జాబితాలకు అదనపు ఆకర్షణలై ఎన్నికల సంఘం సామర్థ్యంపైన పలు శంకలు రేకెత్తిస్తున్నాయి!

తొంభై కోట్లకు పైబడిన ఓటర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పేరెన్నికగన్న భారతావని, నూరు శాతం కచ్చితత్వంతో ఓటర్ల జాబితాల్నే తీర్చిదిద్దుకోలేక ప్రతి ఎన్నికలోనూ నగుబాటుకు గురవుతోంది. ఒక్క ఓటు తేడాతో ఫలితాలు తారుమారయ్యే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అర్హులైనవారి రాజ్యాంగబద్ధ హక్కుకు మన్నన దక్కేలా, బోగస్‌ శాల్తీల చేతివాటానికి అవకాశమే లేకుండా కాలానుగుణ సవరణలతో జాబితాల్ని పరిపుష్టీకరించలేక ఈసీ మొహం వేలాడేస్తోంది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ఎనిమిదిన్నర కోట్ల నామధేయాలు బోగస్‌ లేదా నకిలీలేనని సీఈసీగా లోగడ హెచ్‌ఎస్‌ బ్రహ్మ నిష్ఠురసత్యం పలికారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రెండు దశల్లో ఆ ప్రక్రియ చేపట్టదలచినట్లు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి అయిదు నెలల క్రితం ప్రకటించారు. ఈ కసరత్తు ఏమైందో ఏమోగాని, 2018 డిసెంబరు నాటి అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగానే పురపాలికల్లో వార్డులవారీగా జాబితాలు రూపొందుతాయని నిర్ధారించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి జారిపోవడంపై రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ‘సారీ’ చెప్పడం తెలిసిందే. ఆ జాబితాయే ప్రామాణికంగా- అందులోనూ స్థానిక నేతల ఒత్తిళ్లతో కొత్త తప్పులకు అధికార శ్రేణులే పూనిక వహించడం దిగ్భ్రాంతపరచేదే! ముసాయిదా జాబితాపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాల్ని అటకెక్కించి వాటినే యథాతథంగా కొనసాగించేందుకు యంత్రాంగం సిద్ధపడుతోందంటున్న వార్తాకథనాలు- జనస్వామ్య స్ఫూర్తికి అక్షరాలా తిలోదకాలు!

రాబర్ట్‌ హచిన్స్‌ అనే అమెరికన్‌ తత్వవేత్త చెప్పినట్లు- ‘ఏ హత్యాయత్నాలతోనో ప్రజాస్వామ్యం మృత్యువాత పడే అవకాశం లేదు... కానీ ఉదాసీనత, నిర్లక్ష్యభావం, పదిలంగా కాపాడుకోలేకపోవడం వల్లే ప్రజాస్వామ్యం క్రమేణా కనుమరుగైపోతుంది’! స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికల్ని నిర్వహించేందుకు వీలుగా విస్తృతాధికారాల్ని రాజ్యాంగమే ఈసీకి కట్టబెట్టినా, సవాళ్లకు దీటుగా ఎదగని దాని నైజం- ఓటర్ల జనస్వామ్య కాంక్షలకు కొరివిగా మారింది. వార్డులవారీగా ఫొటోలతో రూపొందించిన ఓటర్ల జాబితాలో పేరున్నవారే ఓటు వెయ్యగలుగుతారని, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా, ఇటీవలి ఎన్నికల్లో ఓటు వేశామన్నా చెల్లదనీ మొన్న అక్టోబరు 25న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన వెలువరించింది. వార్డులవారీ ఓటర్ల జాబితాల తయారీకి రాష్ట్ర ఈసీ అనుమతించిన వ్యక్తి తనంత తానుగా కూడికలు తీసివేతలు, ఇతర మార్పులు చేర్పులకు పాల్పడరాదని నిర్దేశిస్తున్నా- అలాంటివాళ్ల విధిద్రోహం వల్ల అర్హులైన ఓటర్లు నష్టపోతే ఆ బాధ్యత ఎవరిది? అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం పరిమళించాలంటే, స్థానిక ప్రభుత్వాలు వాటికి జరిగే ఎన్నికలకు ప్రాధాన్యం దక్కితీరాలంటూ 2018 అక్టోబరులో జరిగిన అంతర్జాతీయ సదస్సు ‘ముంబయి ప్రకటన’ను వెలువరించింది. ప్రామాణిక, నిర్దుష్ట ఓటర్ల జాబితాల కూర్పు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘాలు సృజనాత్మక పద్ధతులు పాటించాలని ఆ సదస్సు సూచించింది. అయినా ఎప్పటి వ్యధే! జాబితాలో ఓటర్ల ఫొటోల బదులు కిటికీ, బీరువా వంటివి కొలువుతీరితే, ఆ కారణంగా ఓటుహక్కు హుళక్కి అయితే బాధ్యత ఎవరు వహిస్తారో ఈసీ సెలవివ్వాల్సిందే! జాబితాల్నే సక్రమంగా రూపొందించలేకపోయిన ఎన్నికల సంఘం ఎలెక్షన్లు స్వేచ్ఛగా సజావుగా నిర్వహించగలదంటే విశ్వసించేదెలా?

Posted on 04-01-2020