Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

‘ఫాస్ట్‌ట్రాక్‌ ’న్యాయం సాధ్యమేనా!

* సౌకర్యాల లేమితో సతమతం

మహిళలపై అత్యాచారాలు, హత్యలు కొనసాగుతూ ఉండటంపై సర్వత్రా ఆందోళన నెలకొంటోంది. తెలంగాణలో ‘దిశ’ ఉదంతంతో ప్రజాగ్రహం తారస్థాయికి చేరింది. అబలలపై అమానవీయ కాండ కొనసాగడం, నేరగాళ్లను శిక్షించడంలో తాత్సారం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చలు చోటు చేసుకున్నాయి. నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలంటూ జనం ముక్తకంఠంతో కోరారు. పార్లమెంటు ఉభయ సభల ప్రతినిధులు సైతం గొంతెత్తి నినదించారు. తరవాత పోలీసుల ఎన్‌కౌంటర్లో నిందితులు హతమయ్యారు. ఆ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే స్పందించారు. న్యాయం ప్రతీకార రూపాన్ని సంతరించుకుంటే సహజత్వాన్ని కోల్పోతుందని వ్యాఖ్యానించారు. ‘తక్షణ న్యాయం’ అంటూ ఉండదన్నారు. అంటే కోర్టు తీర్పుల పట్ల నమ్మకం ఉండాలన్నది ఆయన అభిప్రాయం.

ఇటీవల ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వరమే వెలువడిన తీర్పులు ఇక్కడ ప్రస్తావనార్హం. రాజస్థాన్‌లోని చారు జిల్లాలోని ఓ నాలుగేళ్ల చిన్నారిపై దయారాం మేఘ్‌వాలా అనే యువకుడు 2019 నవంబర్‌ 30న అత్యాచారానికి ఒడిగట్టాడు. పోక్సో చట్టం కింద అరెస్టయిన నిందితుడిపై పోలీసులు డిసెంబర్‌ 7న అభియోగాలు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు డిసెంబర్‌ 17న తీర్పు వెలువరిస్తూ నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అంటే కేవలం 17 రోజుల వ్యవధిలోనే తీర్పు వచ్చింది. వరంగల్‌ నగరంలో తొమ్మిది నెలల చిన్నారిపై అఘాయిత్యం జరిగిన ఘటనలో ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టి 60 రోజుల వ్యవధిలోనే నిందితుడికి మరణశిక్ష విధించినప్పటికీ, అది యావజ్జీవ కారగార శిక్షగా మారింది. ఎన్నో మలుపులు తిరిగిన ఉన్నావ్‌ కేసూ ముగిసింది. ఉన్నావ్‌ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌పై విచారణ చేపట్టిన దిల్లీ తీస్‌ హజారీ కోర్టు- అతడిని దోషిగా ప్రకటిస్తూ, జీవన పర్యంత కారాగార శిక్ష విధించింది. ఇలాంటి సత్వర నిర్ణయాలు ప్రజలకు కాస్త ఊరట కలిగించే అంశంగా భావించవచ్చు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దిల్లీ న్యాయస్థానం నిందితులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా ఇటీవల డెత్‌వారెంట్‌ జారీ చేయడం తెలిసిందే. నిర్భయ తరహా కేసులకు సంబంధించి దర్యాప్తు, ఫోరెన్సిక్‌, వైద్యపరమైన సాక్ష్యాధారాలు, బాధితుల వాంగ్మూలం నమోదు, విచారణ పరిస్థితులపై 2020, ఫిబ్రవరి 7 నాటికి సమగ్ర నివేదిక అందించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అంతకుముందే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టం కింద మూడు వందలకు పైగా కేసులు నమోదైన ప్రతి జిల్లాలో రెండు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 2000లో నాటి కేంద్ర ప్రభుత్వం 1,734 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తూ వాటి నిర్వహణ వ్యయం కోసం సుమారు 500 కోట్ల రూపాయలు కేటాయించింది. వీటివల్ల కొంతమేరకు పెండింగ్‌ కేసుల పరిష్కారం చోటుచేసుకుంది. ఈ కోర్టుల నిర్వహణను మరో అయిదేళ్లపాటు పొడిగిస్తూ, నాటి ప్రభుత్వం మరో 509 కోట్ల రూపాయలు కేటాయించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతో- నిధుల కేటాయింపులో జాప్యం నెలకొని కోర్టుల నిర్వహణ స్తంభించింది. ఆ వ్యయాన్ని భరించలేమని అనేక రాష్ట్రాలు ఆ బాధ్యత నుంచి తప్పుకొన్నాయి. దానివల్ల 172 కోర్టులు మూతపడ్డాయి. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు మూసివేయవద్దంటూ బ్రిజ్‌ మోహన్‌లాల్‌ న్యాయపోరాటం చేశారు. ఆ కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు- ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దాంతో అనేక రాష్ట్రాలు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులకు స్వస్తి పలికాయి.

భారత్‌లో 2019 జూన్‌ నాటికి 581 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు మాత్రమే ఉన్నాయి. 22 రాష్ట్రాల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులే లేవు. జాతీయ నేరగణాంక సంస్థ తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2018 చివరి నాటికి 1.38 లక్షల అత్యాచార కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 22.6 శాతం కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. తెలంగాణాలో 3.5, ఆంధ్రప్రదేశ్‌లో 1.7 శాతాల చొప్పున కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పోక్సో చట్టం కింద 389 జిల్లాల్లో- ఒక్కో దాంట్లో వందకు పైనే కేసులు ఇంకా అపరిష్కృతంగా ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ కేసుల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 389 కోర్టులను పూర్తిగా పోక్సో చట్టం కింద నమోదైన కేసులనే విచారించాలని నిర్దేశించింది. ఈ కోర్టులు 2019 అక్టోబర్‌ రెండో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. మిగతా 634 కోర్టులు అత్యాచారం, పోక్సో చట్టం కింద నమోదైన కేసులను విచారించనున్నాయి. ఈ కోర్టుల ఏర్పాటులో అభ్యంతరాలుంటే 2019, డిసెంబర్‌ 31 నాటికి తెలపాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు కేటాయించిన 36 కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిర్భయ ఉదంతం అనంతరం కేంద్ర ప్రభుత్వం 2013లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులకు సుమారు 770 కోట్ల రూపాయలు కేటాయించింది. ఒక్కో కోర్టు నిర్వహణకు సుమారు 75 లక్షల రూపాయలు అవసరం అవుతుందని అంచనా వేసింది. జిల్లా కోర్టుల సముదాయంలోనే వీటి నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోక్సో కేసులు విచారించే కోర్టుల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో పాటు జడ్జీల సంఖ్యనూ పెంచాలి. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు పరిమితకాలం కాకుండా నిరంతరం పనిచేసేలా చర్యలు చేపట్టాలి. చాలా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు సౌకర్యాల లేమితో సతమతమవుతున్నాయి. వీటన్నింటిమీదా ప్రభుత్వాలు దృష్టి సారిస్తేనే కేసుల పరిష్కార లక్ష్యం నెరవేరేందుకు మార్గం సుగమమవుతుంది.

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌
(రచయిత- రిసెర్చ్‌ అసిస్టెంట్‌; ఆర్థిక, సామాజిక అంశాల అధ్యయన కేంద్రం- సెస్‌)
Posted on 11-01-2020