Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పౌర హక్కులకు రక్షరేకు!

ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంలో చట్టబద్ధంగా నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు. కర్కశంగా దాన్ని తొక్కిపట్టే పెడ ధోరణులు దేశవ్యాప్తంగా ఊడలు దిగి విస్తరిస్తున్న వేళ- శాసనకర్తలు, అధికార శ్రేణులకు రాజ్యాంగబద్ధ పరిమితుల్ని గుర్తు చేస్తూ ‘సుప్రీం’ త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు, కారుచీకట్లో కాంతిపుంజమనడంలో సందేహం లేదు. నిరుడు ఆగస్టు అయిదున జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర హోదా, ప్రత్యేక ప్రతిపత్తి రద్దు దరిమిలా అక్కడ విధించిన నిషేధాజ్ఞలు, టెలిఫోన్‌ ఇంటర్నెట్‌ సదుపాయాల రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ ‘కశ్మీర్‌ టైమ్స్‌’ పత్రిక సంపాదకురాలు, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిమ్మట పౌరసత్వ సవరణ చట్టం, దానితో ముడివడి జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) భయాందోళనలతో పలు నగరాల్లో ప్రజానీకం నిరసనలు ముమ్మరం కావడంతో- కశ్మీర్‌ తరహా ఆంక్షలతోనే వాటిని కట్టడిచేస్తున్నాయి. ప్రభుత్వాలు! దేశం సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే సహేతుకంగా స్పందించిన వాతావరణంలో కశ్మీర్‌ వ్యాజ్యాలను పరిష్కరిస్తూ జస్టిస్‌ రమణ, జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డిల ధర్మాసనం ఇచ్చిన తీర్పు- మూడు కీలకాంశాల్ని స్పృశిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత మప్పుతోంది! అక్టోబరు 16న తాము విస్పష్టంగా ఆదేశించినా నిషేధాజ్ఞల ఉత్తర్వులను కేంద్రం అందజేయలేదంటూ విమర్శించిన ధర్మాసనం- పారదర్శకత జవాబుదారీతనాలు పట్టుగొమ్మలైన ప్రజాస్వామ్యంలో తెలుసుకొనేందుకు ప్రజలకుగల హక్కు రీత్యా ఉత్తర్వుల్ని అందించాల్సిన అవసరం ఉందని స్పష్టీకరించింది. అహంకారపూరిత ధోరణులతో రాజ్యాంగబద్ధ హక్కుల్ని హరించకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న ధర్మాసనం- రాజ్యాంగం కల్పించిన పత్రికాస్వేచ్ఛ అత్యంత పవిత్రమైనది, ప్రజాస్వామ్యానికి కీలకమైనదనీ నేతాగణాలకు గుర్తు చేసింది. పత్రికల నెత్తిపై నిరంతరం కత్తిని వేలాడదీసే ధోరణులు న్యాయబద్ధం కాదంటూ, సీఆర్‌పీసీ కింద నిషేధాజ్ఞలు, అంతర్జాల హక్కుపై ఇచ్చిన ఆదేశాలు- అక్షరాలా ప్రజాస్వామ్య స్ఫూర్తి కళికలు!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని భుజాలు చరచుకోవడమేగాని- ఆ స్ఫూర్తికి గొడుగుపట్టి, చట్టబద్ధ నిరసనలకు చోటుపెట్టే ధోరణి నేతాగణాల్లో కనుమరుగైపోతోంది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పరిస్థితుల నివారణ కోసమంటూ 1861లో బ్రిటిషర్ల జమానాలో వెలుగు చూసిన నిషేధాజ్ఞల చట్టం- 1973నాటి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోనూ చోటు దక్కించుకొంది. నిరసన తెలిపేందుకు పౌరులకుగల స్వేచ్ఛ, పరిస్థితులు అదుపు తప్పి సమాజ హితానికి చెరుపు రాకుండా కాచుకోవాల్సిన సర్కారీ బాధ్యతల మధ్య ప్రభుత్వాలు సమతూకం పాటించకపోవడం వల్లనే- నిషేధాజ్ఞలు, లాఠీ ఛార్జీల్లో ప్రజల రాజ్యాంగబద్ధ హక్కులు నెత్తురోడుతున్నాయి. 144 సెక్షన్‌ రాజ్యాంగ బద్ధతను 1970లోనే నిర్ధారించిన సుప్రీం కోర్టు- ఎప్పుడు, ఎలా, ఏ మేరకు, ఏయే ప్రాతిపదికల ఆధారంగా నిషేధాజ్ఞల్ని అమలు చేయగల వీలుందో ఆయా సందర్భాల్లో నిర్దేశించింది. పౌరుల ప్రాథమిక హక్కుల్ని తొక్కిపట్టే 144 సెక్షన్‌ వినియోగం రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రస్తావించిన ‘సహేతుక ఆంక్షల’ గీటురాయి పరీక్షకు నిలబడుతుందో లేదో చూడాలంటూ 2016, ’17 సంవత్సరాల్లో ‘సరైన ప్రాతిపదికల్నీ’ సుప్రీంకోర్టు విపులీకరించింది. అయినా వాటికి ప్రభుత్వాలు కట్టుబడుతున్నదెక్కడ? పౌరసత్వ సవరణ చట్టం నేపథ్యంలో 22 కోట్ల జనాభాగల యూపీ మొత్తాన్నీ రాష్ట్ర డీజీపీ ట్విటర్‌ ప్రకటన ద్వారా 144 సెక్షన్‌ పరిధిలోకి తీసుకురావడం అరాచకత్వానికి పరాకాష్ఠ! ‘ప్రతి నిరసనా హింసాత్మకం అవుతుందన్న భావనతో ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించగలదా?’ అని ఇటీవలే కర్ణాటక హైకోర్టు ప్రశ్నించింది. ఏపీ రాజధాని గ్రామాల్లో నిషేధాజ్ఞలు, లాఠీ ప్రహారాలు అధికార దండధరుల కండకావరానికి ప్రతీకలై శాంతియుత నిరసనలపైనా ఉక్కుపాదం మోపుతున్నవేళ- ‘సుప్రీం’ తీర్పు, బాధిత హృదయాలకు ఒకింత ఓదార్పు!

ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధమైన భావ వ్యక్తీకరణ, అభిప్రాయాలు, గోడు వెళ్లబోసుకొనే హక్కుల్ని అణచివేయడానికి 144వ సెక్షన్‌ కింద జారీ చేసే నిషేధాజ్ఞలు పనిముట్లు కారాదని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనుకొన్నప్పుడు- సరైన పద్ధతిలో పౌరుల హక్కుల్ని పరిగణనలోకి తీసుకొని, అవసరమైనంత మేరకే తగు నిషేధపుటుత్తర్వులు ఇవ్వాలన్న ఆదేశాలు- ఇష్టారీతి అణచివేతలు చెల్లవని స్పష్టీకరిస్తున్నాయి. ఆయా ఉత్తర్వులన్నీ న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయంటూ, బాధితులు న్యాయ పాలికను ఆశ్రయించడానికి వీలుగా వాటిని బహిర్గతం చేయాలన్న ‘సుప్రీం’ నిర్ణయం సంస్తుతిపాత్రమైనది. అంతర్జాల (ఇంటర్నెట్‌) సేవలకు అవరోధాల్లో ఇరాక్‌, సూడాన్‌ తరవాత మూడోస్థానంలో ఉన్న ఇండియా, ఆ రూపేణా నిరుడు రూ.10,000 కోట్లు నష్టపోయినట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. అంతర్జాల సేవలు పొందడమూ పౌరుల ప్రాథమిక హక్కుగా తీర్మానించిన న్యాయపాలిక- దీర్ఘకాలం ఆ సేవలను నిలిపివేయడం కుదరదని ప్రభుత్వాలకు లక్ష్మణ రేఖలు గీసింది. 2017నాటి నిబంధనావళిలో ‘తాత్కాలికంగా’ అన్న పదాన్ని నిర్వచించకపోవడంతో ప్రభుత్వం నిర్నిరోధంగా నిషేధాన్ని కొనసాగిస్తోందంటూ, ఆ లోపాన్ని సరిదిద్దాలని కోర్టు చట్టసభను కోరింది. ఆలోగా అంతర్జాల సేవల నిలిపివేతపై వారంలోగా పునస్సమీక్ష జరపాలన్న ఆదేశాలు భేషుగ్గా ఉన్నాయి. డెబ్భయ్యేళ్ల గణతంత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మప్పలేకపోయిందన్నది నిష్ఠుర సత్యం. పౌరుల రాజ్యాంగబద్ధ హక్కుల వనమాలిగా న్యాయపాలిక చూపుతున్న చొరవే భవిష్యత్తుకు ఆశాదీపం!

Posted on 13-01-2020