Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

‘సౌర’ స్వప్నం సాకారమయ్యేనా?

* పునరుత్పాదక విద్యుత్‌ - పుట్టెడు సమస్యలు

సౌర విద్యుత్‌ విషయంలో భారతదేశానికి భారీ కలలే ఉన్నాయి. 2019 అక్టోబరు 31నాటికి దేశ సౌర విద్యుత్‌ వ్యవస్థాపిత సామర్థ్యం 31.696 గిగావాట్లకు చేరుకుంది. 2022నాటికి 20 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలనేది అంతకుముందు కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. నిర్దేశిత లక్ష్యాన్ని నాలుగేళ్ల ముందే చేరుకున్నట్లయింది. 2022నాటికి 100 గిగావాట్ల సౌర సామర్థ్యాన్ని సాధించాలని 2015లో లక్ష్యాన్ని పెంచారు. ఇందులో 40 గిగావాట్లు ఇంటి పైకప్పులపై అమర్చే ఉపకరణాల ద్వారా సాధించేవే. పది వేలకోట్ల డాలర్ల పెట్టుబడుల లక్ష్యంతోపాటు, ఉత్పాదన కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులకు అవసరమైన భూమిని అందుబాటులో ఉంచేందుకు దేశంలో సుమారు 42 సౌరపార్కుల్ని ఏర్పాటు చేశారు.

కలవరపెడుతున్న కనిష్ఠ రుసుములు
భారత్‌లో సౌర ఇంధన రుసుము(టారిఫ్‌)లు ప్రపంచంలోనే అత్యంత చవకగా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని మరింత తగ్గించే పనిలో పడ్డాయి. భరించలేని విధంగా కనిష్ఠానికి దిగజారిన రుసుములు వ్యవస్థాపకులను కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వారు నాణ్యత విషయంలో రాజీ పడే అవకాశమూ ఉంటుంది. మరోవైపు కొన్ని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) ఏడాదికిపైగా తమ విద్యుత్‌ బిల్లులు చెల్లించకుండా మొరాయిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థాపకులు సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్నారు. వీరిని రాష్ట్రం రెండు ఇబ్బందికరమైన ఐచ్ఛికాల మధ్య ఇరుక్కుపోయేలా చేసింది. అవి- గత ప్రభుత్వం అంగీకరించిన రుసుములను తగ్గించేందుకు ఒప్పుకోవడం లేదా ఉత్పాదనను ఆపివేయడం! దీంతో ఒకప్పుడు ఈ రంగంలోకి పెట్టుబడులు స్థిరంగా కొనసాగినచోట, ఒక్కసారిగా కుళాయిని కట్టేసినట్లయింది. స్వతంత్ర విద్యుత్‌ వ్యవస్థాపకులు (ఐపీపీ) మందగమనం విషయంలో జాగ్రత్తగా ఉన్నా, దానికి సంబంధించిన సంకేతాలు సుస్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం, రాష్ట్రాలు 64 గిగావాట్లకు వేలం వేయగా, 26 శాతాన్ని ఎవరూ కోరుకోకపోవడమో, అంతంతమాత్రం స్పందనతో కూడిన బిడ్లు రావడమో చోటుచేసుకుంది. మరో 10 శాతం రద్దయ్యాయి.

రాష్ట్రాలు చెల్లించే రుసుములపై యూనిట్‌కు రూ.2.50 నుంచి రూ.2.80గా పరిమితి విధించడంతో ఐపీపీలు తమ లాభాల్ని మెరుగుపరచుకునే అవకాశాల్ని పరిమితం చేయడమే కాకుండా, నాణ్యమైన ప్రాజెక్టుల్ని నిరుత్సాహపరచినట్లయింది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. క్షేత్రస్థాయి దాకా వచ్చిన ప్రాజెక్టుల అమలు సైతం మందకొడిగా సాగుతోంది. ఇది భారత ఇంధన రంగం పరివర్తన ప్రణాళికల్ని దెబ్బతీయవచ్చు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం పొందకపోతే, హరిత ఇంధన లక్ష్యాల గురించి పట్టించుకునే అవకాశమే ఉండదన్నది నిష్ఠుర సత్యం. అప్పుడు ఇది ప్రాధాన్యాంశాల జాబితాలో కిందికి జారిపోతుందనేది సుస్పష్టం. జర్మనీ ఇంధన రంగంలో 46 శాతం పునరుత్పాదక వనరుల నుంచే వస్తోంది. చైనాలోనూ గత ఏడాదే ఇది 26 శాతాన్ని దాటింది. ప్రపంచవ్యాప్తంగా పలురకాల ఇంధన వనరుల్ని ఉపయోగించడం వల్ల ఆర్థిక వ్యవస్థలకు సరికొత్త శక్తి సమకూరితే, అవన్నీ ఆయా రంగాలవైపు మారిపోక తప్పనిసరి పరిస్థితులు నెలకొంటాయి. ఈ రంగంలో నెమ్మదిగా సాగుతున్న భారత్‌ ఆ అవకాశాలను ఏ మేరకు ఒడిసిపట్టుకోగలదన్నది సందేహమే.

రాష్ట్రానికి విద్యుత్తును అందజేస్తున్న సౌర, పవన ఐపీపీలు తమ రుసుములు తగ్గించుకోవాలని, లేకపోతే తమ దీర్ఘకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్ని (పీపీపీ) రద్దు చేస్తామని నిరుడు జులైలో ఏపీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్రెడిట్‌ రేటింగ్‌ను నిర్ధరించే క్రిసిల్‌ అంచనా ప్రకారం, ఏపీ నిర్ణయం ప్రభావం స్థాపిత సామర్థ్యంలో 5.2 గిగావాట్ల మేర ప్రభావం చూపి, రూ.21 వేలకోట్ల బాకీ చెల్లించలేని ప్రమాదం ఏర్పడింది. డిస్కమ్‌లు బ్యాంకులకు చేసే చెల్లింపులు ఆలస్యం కావడంతోపాటు, పునరుత్పాదక ఇంధన సంస్థలకు చెందిన సుమారు రూ.10,600 కోట్ల రుణాలు చెల్లింపు ప్రమాదంలో పడినట్లు రేటింగ్‌ ఏజన్సీ గుర్తించింది. ఒప్పందాల్ని రద్దు చేసుకోవడం సరికాదన్న మాటలతో సరిపెట్టకుండా- కేంద్రం ప్రభుత్వం మధ్యవర్తిత్వం నెరపాలి. జనాకర్షక పథకాల కోసం రాష్ట్ర విద్యుత్‌ బోర్డులను దివాలా తీయించిన ఫలితంగా ఈ రంగానికి ఎదురైన దయనీయ స్థితి ఇది. రాష్ట్రాల డిస్కమ్‌లు 2019 జులై నాటికి రూ.9,735.62 కోట్ల మేర పునరుత్పాదక ఇంధన కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.6,500 కోట్లు కేవలం ఏపీ, తమిళనాడు, తెలంగాణ డిస్కమ్‌ల నుంచే రావాలి. 13 నెలలుగా బాకీల్ని తీర్చలేదు. డిస్కమ్‌ల నుంచి చెల్లింపులు అనిశ్చితిలో పడినప్పటికీ పునరుత్పాదక ఇంధన రంగంలో ఇప్పటిదాకా సాధించినది నిస్సందేహంగా భారీ విజయంగానే చెప్పుకోవాలి. ఆకస్మికంగా విధానాలు మారడం ఇతర రాష్ట్రాల్లోనూ ఉంది. ఏపీ తరహాలోనే ఉత్తర్‌ ప్రదేశ్‌ సైతం పాత పునరుత్పాదక ఇంధన టారిఫ్‌లపై మళ్ళీ బేరసారాలకు యత్నించింది. రాష్ట్ర డిస్కమ్‌లకు విద్యుత్తును సరఫరా చేసే సంస్థలే, రాష్ట్రంలో భూముల్ని ఉపయోగించుకోవచ్చని గుజరాత్‌ పేర్కొంది. అంతర్రాష్ట్ర పంపిణీ వ్యవస్థ కింద ఏర్పాటయ్యే ప్రాజెక్టులకు సంబంధించిన కేంద్ర సేకరణ ఏజన్సీ నిబంధనల్ని తుంగలో తొక్కింది. సౌరవిద్యుత్‌ విషయంలో అందరూ ఆసక్తి చూపే రాజస్థాన్‌ ఇతర రాష్ట్రాల్లో విద్యుత్‌ను అమ్ముకునే ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ.2.5 నుంచి అయిదు లక్షల రూపాయల రుసుము విధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

పెరుగుతున్న అనిశ్చితి
సౌర విద్యుత్‌ రంగంలో బయటకు కనిపించని ఇబ్బందులెన్నో ఉంటాయి. మాడ్యూళ్ల దిగుమతి, వాటి ధరల్లో తేడాల వంటి సమస్యలుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో నియంత్రణ సమస్యలు, రుణాల అందుబాటు వంటివి పెద్ద సవాలు. ఇప్పటివరకు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు చాలావరకు ప్రైవేట్‌ ఈక్విటీ నుంచే వస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం పెట్టుబడుల్ని ఆకర్షించగలిగే సంస్థల సంఖ్య బాగా తగ్గిపోయింది. పెద్ద బ్యాంకులేవీ ఈ రంగంలోని కంపెనీలకు ఎంతోకాలం రుణాల్ని కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదు. ఒప్పందాల్ని తిరస్కరించిన ఏపీ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి అనిశ్చితంగా ఉంది. పలు పునరుత్పాదక ఇంధన సంస్థలు నిధుల పరంగా కటకటలో పడ్డాయి. ఇప్పుడు, రుణాలు ఇస్తున్నా, ఏపీ, తెలంగాణ, యూపీల్లో ప్రాజెక్టుల్ని చేపట్టే అవకాశం లేదు. ఈ మూడు రాష్ట్రాల్లో చెల్లింపుల వైఫల్యం ముప్పు అధికంగా కనిపిస్తోంది. పెరుగుతున్న ముప్పులు, నియంత్రణ అనిశ్చితి వంటి సమస్యల్ని పక్కనపెడితే, భారత్‌లో ఏర్పాటవుతున్న సౌర ఇంధన సంస్థల నాణ్యతా ఆందోళనకరమైన అంశమే. చాలా సంస్థలు సత్వర లాభాల కోసం చైనా నుంచి చవక ప్యానళ్ల వైపు మొగ్గు చూపడమే అందుకు కారణం. భారత్‌లో ఏర్పాటు చేసిన సౌర ఇంధన ఉత్పత్తి కేంద్రాల్లో నెలకొల్పిన ఫొటోవోల్టాయిక్‌ (పీవీ) మాడ్యూళ్లు తదితర ఉపకరణాలపై ఐఐటీ బాంబే 2016లో చేపట్టిన అఖిల భారత సర్వే పెదవి విరిచింది. విపణిలో అందుబాటులో ఉన్న మంచి నాణ్యమైన మాడ్యూళ్లను ఐపీపీలు ఉపయోగించినట్లయితే సౌర విద్యుత్తును చౌకగా ఉత్పత్తి చేయవచ్చు.

మరోవైపు విద్యుత్‌ కోసం పరిశ్రమల నుంచి గిరాకీ తక్కువగా ఉండటమూ ప్రతికూల పరిణామమే. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ, విద్యుత్‌ గిరాకీ ఇనుమడిస్తున్నట్లయితే ఈ తరహా సమస్యలేవీ ఉండవు. ప్రస్తుతం డిస్కమ్‌లు ఖరీదైన విద్యుత్తును బలవంతంగా కొనుగోలు చేస్తున్నా, ఛార్జీలు పెంచుకోకుండా రాజకీయ ఒత్తిళ్లు అడ్డుకుంటున్నాయి. అదనపు విద్యుత్‌ కోసం గిరాకీ లేకపోతే రాష్ట్రాలు, ఉత్పత్తిదారుల మధ్య ప్రతిష్టంభనలు చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక వృద్ధి వేగం అందుకునే వరకు ఈ పరిస్థితి మారే అవకాశం లేదు. సౌరప్యానళ్ల కోసం 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. స్వదేశీ ఉత్పత్తులు ఇకనైనా మెరుగుపడాలి. దిగుమతుల వల్ల విలువైన విదేశ మారకాన్ని కోల్పోతున్నాం. దాన్ని సంపాదించే అవకాశాన్ని వదిలేస్తున్నాం. దేశీయ ఉత్పత్తిదారులకు సరైన వాతావరణం కల్పిస్తే, ఇలాంటి నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. సౌరవిద్యుత్‌ రంగం బలమైన వృద్ధి దిశగా సాగాలంటే కొన్ని విధాన, ఆచరణపరమైన అడ్డంకుల్ని తొలగించాల్సి ఉంది. ప్రపంచస్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించే దిశగా కృషిచేస్తున్న ఈ రంగాన్ని అకస్మాత్తుగా చోటుచేసుకునే విధానపరమైన మార్పులు దెబ్బతీస్తాయి. ఈ రంగంలో పెట్టుబడిదారుల ప్రయోజనాల్ని కాపాడేందుకు వేలం ప్రక్రియల్ని, పీపీఏల్ని గౌరవించడం ముఖ్యం.

మందకొడి గమనం
భారతదేశ ఆర్థిక వృద్ధి, విద్యుత్‌ గిరాకీ మందగమనంలో ఉండటంతో దేశ పునరుత్పాదక ఇంధన పరిశ్రమపై మరింత ఒత్తిడి పెరిగింది. నిరుడు సెప్టెంబరులో నూయార్క్‌లో ఐరాస వాతావరణ కార్యాచరణ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, 2022నాటికి 450 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఉత్పత్తి సామర్థ్యం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టీకరించారు. దీంతో 2018లో లక్ష్యంగా పెట్టుకున్న 175 గిగావాట్ల హరిత ఇంధన లక్ష్యాన్ని రెట్టింపు చేసినట్లయింది. అయినా వాతావరణ మార్పుల వంటి తీవ్రమైన సవాలును అధిగమించాలంటే ప్రస్తుతం మనం చేస్తున్న కృషి సరిపోదన్న సంగతిని అంగీకరించి తీరాలి. మోదీ చాలా ఆశలు పెట్టుకున్న పునరుత్పాదక ఇంధన పరిశ్రమ గమనం మందకొడిగానే సాగుతోంది. ప్రస్తుతం భారత హరిత ఇంధన స్థాపిత సామర్థ్యం సుమారు 65 గిగావాట్ల మేరకు ఉంది. 2022 డిసెంబర్‌ నాటికి 100 గిగావాట్లను అధిగమిస్తుందని అంచనా. ఇది ప్రభుత్వ లక్ష్యమైన 175 గిగావాట్ల లక్ష్యానికి తక్కువే. 450 గిగావాట్ల ప్రకటనకు అల్లంతదూరాన నిలిచింది. 2022 అంచనా ప్రస్తుతానికైతే కొంత ఆశాజనకంగానే ఉంది. పెరుగుతున్న బొగ్గు ధరలు, దేశీయ విపణి నుంచి సహజ వాయువు తగ్గడం, అందరూ హరిత ఇంధనం వైపు నడవాలని కోరుకుంటున్న నేపథ్యంలో కొన్నేళ్లుగా, బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి క్రమంగా వెనకంజ వేస్తోంది. హరిత ఇంధనంలో కొత్తగా వస్తున్న పెట్టుబడులు ఎక్కువగా సిలికాన్‌ ప్యానళ్లకే మరలుతున్నాయి. సూర్యరశ్మి నుంచి ఇంధనాన్ని తయారు చేయడంలో ఈ ప్యానళ్లే ఉపయోగపడతాయి. కొన్నేళ్లుగా ఆ వేగం మందగించి, సౌర, పవన రంగాల కష్టాలు తీవ్రమయ్యాయి.

Posted on 13-01-2020