Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

చైనా దూకుడుకు అడ్డుకట్ట

* భారత్‌ వ్యూహానికి రష్యా బాసట!
చైనా జోరుగా సాయుధ దళాల పునర్వ్యవస్థీకరణ, ఆధునికీకరణను చేపట్టిన దరిమిలా దాని లక్ష్యాలేమిటని ఆరా వస్తోంది. ఇనుమడించిన చైనా సైనిక సామర్థ్యానికి దీటైన ప్రతివ్యూహాన్ని రూపొందించుకోవలసిన అవసరం భారత్‌, అమెరికా, జపాన్‌లకు వచ్చి పడింది. అందుకే ఈ మూడు దేశాలు ఇటీవల ఆపరేషన్‌ మలబార్‌ పేరిట సంయుక్త నౌకా విన్యాసాలు జరిపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుత రష్యా పర్యటనలో అత్యాధునిక ఆయుధాల సేకరణకు ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు. అయితే భారతదేశం చేయవలసింది ఇంకా చాలా ఉంది. సైనిక, నౌకా, వైమానిక దళాల సంయుక్త నియంత్రణకు త్రివిధ సాయుధ దళాధిపతి (సీడీఎస్‌)ని నియమించాలని, 1999 కార్గిల్‌ యుద్ధానంతరమే అడ్వాణీ కమిటీ సూచించినా ఇంతవరకు దాని అతీ గతీ లేదు. సీడీఎస్‌ను త్వరలో నియమించే అవకాశం ఉందని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఇటీవల చెప్పారు. మరోవైపు చైనా దూకుడుగా తన సాయుధ బలగాలన్నింటినీ సంయుక్త నిర్వహణ వ్యవస్థ (కమాండ్‌) ఛత్రం కిందకు తీసుకురావాలని నిశ్చయించింది. 2020 కల్లా తమ బలగాలను ఉత్కృష్ట పోరాట దళాలుగా తీర్చిదిద్దడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ ప్రకటించారు. ఆయన ప్రకటించిన సంస్కరణల కింద 23 లక్షల సైనికులున్న చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) నుంచి మూడు లక్షల మంది సైనికులను తగ్గిస్తారు. 2017 కల్లా త్రివిధ సాయుధ దళాధికారులలో 1,70,000 మందిని తగ్గిస్తారు. కాలం చెల్లిన ఆయుధాలున్న దళాలను, కార్యాలయ సిబ్బందిని, పోరాటేతర విధుల్లో ఉన్నవారిని ఇంటికి పంపేసి, మిగిలిన దళాలకు అత్యాధునిక అస్త్రశస్త్రాలను సమకూరుస్తారు. సిబ్బంది వ్యయం తగ్గడం వల్ల ఆదా అయ్యే నిధులను ఆధునిక ఆయుధాల రూపకల్పన, ఉత్పత్తికి వెచ్చిస్తారు.

సముద్రాలపై ఆధిపత్యం

భూతల సైన్యమైన పీఎల్‌ఏ ఆధిక్యాన్ని తగ్గించి నౌకా, వైమానిక దళాల ప్రాధాన్యాన్ని పెంచడం చైనా సంస్కరణల ప్రధాన లక్ష్యం. చైనాను ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపిన ఘనత చవక ఎగుమతులదే కాబట్టి, అవి సముద్ర మార్గాల గుండా నిరాటంకంగా సాగేలా చూడటం కోసం నౌకాదళాన్ని విస్తరిస్తోంది. ఎగుమతుల ద్వారా ఆర్జించిన అపార విదేశీ ద్రవ్య నిల్వలను ఇతర దేశాల్లో మౌలిక వసతులు, పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడి పెట్టి తన భవిష్యత్తును సుస్థిరం చేసుకోవాలని చైనా ఉద్దేశం. దీన్ని సాకారం చేయడానికి భూతల, సముద్రతల సిల్క్‌ రూట్‌ (ఒకే బెల్ట్‌-ఒకే రోడ్‌) ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు సాఫల్యానికి బలీయ నౌకాదళం కీలకమని గుర్తించి, విమాన వాహక యుద్ధ నౌకలనూ జలాంతర్గాములనూ తయారుచేస్తోంది. ఈ క్రమంలో పసిఫిక్‌, హిందూ మహాసముద్రాలతోపాటు దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో చైనా నౌకల దూకుడు పెరిగింది. హిందూ మహాసముద్రం భారతదేశానికి పెరడు వంటిదనే వాదనతో చైనా విభేదిస్తోంది. హిందూ మహాసముద్రంలోకి తరచూ తన యుద్ధ నౌకలను, జలాంతర్గాములను పంపుతోంది. వాణిజ్య అవసరాల పేరిట శ్రీలంక, పాకిస్థాన్‌లలో రెండు రేవులను నిర్మించి, ఇప్పుడు ఆఫ్రికాలోని జిబూటీ దేశ తీరంలో మరొక రేవు నిర్మాణానికి సన్నాహాలు చేపట్టింది. సముద్ర చోరుల ఆట కట్టించడానికి ఈ రేవును ఉపయోగించుకుంటామని చైనా చెబుతున్నా, ఉత్తరోత్రా అది హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు మొట్టమొదటి పూర్తిస్థాయి నౌకా స్థావరంగా మారుతుందనే అనుమానాలున్నాయి. పాక్‌లో కూడా ఇలాంటి నౌకా స్థావరాన్ని నిర్మించినా ఆశ్చర్యం లేదు. గడచిన రెండేళ్లలో సముద్ర పహరా సాకుతో చైనా జలాంతర్గాములు భారత తీరానికి దగ్గర్లో 68 సార్లు సంచరించాయి. తనను చక్రబంధంలో ఇరికించడానికి అమెరికా కుట్ర చేస్తోందని నిరసన ధ్వనులు చేస్తూనే, భారతదేశాన్ని ఇరుకున పెట్టడానికి చైనా చేయవలసినదంతా చేస్తోంది.

అమెరికా మాదిరిగా ప్రపంచంలో ఎక్కడైనా సరే బల ప్రదర్శనకు, బలప్రయోగానికి దిగే సత్తాను తన సాయుధ దళాలకు సమకూర్చడమే చైనా కొత్త వ్యూహం. అందులో భాగంగా సైన్య పునర్వ్యవస్థీకరణ, ఆధునికీకరణలను చేపట్టింది. వీటి కింద చైనా భూభాగంలోని ఏడు పీఎల్‌ఏ సైనిక మండలాలను నాలుగింటికి కుదిస్తారు. భారత్‌, చైనాల మధ్య 4,057 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొని ఉన్న రెండు మండలాలు ఇకమీదట ఒకే మండలంగా ఏర్పడతాయి. టిబెట్‌, షింజియాంగ్‌ రాష్ట్రాలు రెండూ ఈ పశ్చిమ మండలంలో అంతర్భాగాలవుతాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌, తదితర ఈశాన్య రాష్ట్రాలలో రోడ్లు, రైలు మార్గాలను, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా చైనాకు అడ్డుకట్ట వేయాలని భారత్‌ ఆశిస్తున్నా, తన ఉద్దేశం నెరవేర్చుకోవడంలో కాలయాపన చేస్తోంది. సముద్ర, భూ, గగన, అంతరిక్ష, సైబర్‌ సీమల్లో పోరుకు చైనా సంయుక్త కమాండ్‌ను నిర్మించుకొంటున్నా, భారత్‌ ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగైనా వేయలేదు. 2001లో మూడు బలగాలతో అండమాన్‌-నికోబార్‌ కమాండ్‌(ఏఎన్‌సీ)ని, 2003లో అణ్వస్త్ర నిర్వహణ కమాండ్‌ను ఏర్పాటు చేసినా పూర్తిస్థాయి సంయుక్త కమాండ్‌ను ఏర్పాటు చేయకపోవడం పెద్ద లోపం. ఎదుటివాళ్లను మభ్యపెట్టడానికి చైనా రకరకాల మాటలు చెప్పవచ్చు. కానీ, తన లక్ష్య సాధనకు అది సమకూర్చుకొంటున్న సైనిక సామర్థ్యం దాని మనోగతాన్ని పట్టి ఇస్తుంది. నవంబరు నాలుగో వారంలో చైనా హైపర్‌ సోనిక్‌ డీఎఫ్‌జడ్‌ఎఫ్‌ అస్త్రాన్ని ఆరోసారి విజయవంతంగా పరీక్షించింది. శబ్దవేగంకన్నా పది రెట్లు ఎక్కువ వేగంతో పయనిస్తూ శత్రు నిఘా వ్యవస్థలకు చిక్కకుండా భూతల, సముద్రతల లక్ష్యాలను ధ్వంసం చేసే సత్తా డీ.ఎఫ్‌.-జడ్‌.ఎఫ్‌. సొంతం. చైనీస్‌ డీఎఫ్‌-41 ఖండాంతర క్షిపణి వేదికకు అమెరికా విమాన వాహక యుద్ధ నౌకలను తుత్తునియలు చేసే శక్తి కూడా ఉంది.

అత్యాధునిక ఆయుధాల సేకరణ

2009లో తన సైబర్‌ చోరులు అమెరికా కంపెనీ లాక్‌ హీడ్‌ మార్టిన్‌ నుంచి దొంగిలించిన ఎఫ్‌-35 డిజైన్లతో చైనా అయిదో తరం జె-31, చెంగ్డు జె-20 ఫైటర్‌ విమానాలను తయారుచేస్తోంది. ఇవి పేరుకు అయిదో తరం విమానాలైనా వాటిలో నాలుగో తరం రష్యన్‌ ఫైటర్‌ ఇంజన్లను బిగించనున్నారు. దీనికోసం 24 సుఖోయ్‌-35 నాలుగో తరం రష్యన్‌ యుద్ధ విమానాలను చైనా 200 కోట్ల డాలర్లు పోసి కొనుగోలుచేసింది. చైనీస్‌ అయిదో తరం ఫైటర్లలో అమర్చడానికి వీటి ఇంజన్‌ డిజైన్లను చైనా కాపీ చేస్తుందని నిపుణుల అంచనా. వీటికితోడు రష్యా నుంచి ఇటీవలే కొనుగోలు చేసిన ఎస్‌-400 క్షిపణి రక్షణ వ్యవస్థలు తైవాన్‌, జపాన్‌, భారత్‌, వియత్నాం, దక్షిణ కొరియాలకు ప్రమాదం తెచ్చిపెడతాయి. ఇతర దేశాల ఉపగ్రహాలను నాశనం చేయగల క్షిపణులను చైనా 2005 నుంచి ఇంతవరకు ఎనిమిదిసార్లు పరీక్షించింది. ఈ అస్త్రశస్త్రాలను సమకూర్చుకోవడం వెనుక చైనా ఉద్దేశం ఏమిటనే చర్చను పక్కనపెట్టి, తన పోరాట సత్తాను పెంచుకోవడానికి భారత్‌ ఉపక్రమించాలి. రష్యాతో కలసి అయిదోతరం యుద్ధ విమానమైన సుఖోయ్‌ టీ50 రూపకల్పనకు, ఈ తరగతిలో సొంతగా ఏఎంసీఏ ఫైటర్‌నూ రూపొందించాలనుకొంటోంది. దీనిలో అమర్చే జెట్‌ ఇంజన్ల రూపకల్పనకు అమెరికా సహకారం కూడా తీసుకోనుంది. అణు శక్తి చోదిత విమాన వాహక యుద్ధ నౌకల డిజైన్‌లోనూ రెండు దేశాలూ సహకరించుకోవచ్చు. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకూ భారత్‌ ఆసక్తి చూపింది. ఈ ప్రతిపాదనలన్నీ శీఘ్రమే ఆచరణలోకి రావాలి. అన్నింటినీ మించి త్రివిధ సాయుధ దళ కమాండ్‌ వ్యవస్థను సత్వరం ఏర్పాటుచేయాలి.

(ర‌చ‌యిత - కైజర్‌ అడపా)
Posted on 26-12-2015