Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

చదువులు కావాలి నిత్యనూతనం

* కాలానుగుణ కోర్సులే కీలకం

సరికొత్త అంశాలను సృష్టించడంలో యువత పాత్ర కీలకం. భావి భారత నిర్మాతలైన యువకులకు సరైన విద్య, నైపుణ్యాలు, మంచి ఆరోగ్యం ఉంటేనే జాతి భవిష్యత్తును తీర్చిదిద్దగలరు. దేశ జనాభాలో సగం వరకు అంటే 60 కోట్లకు పైగా పాతికేళ్ల లోపువారే ఉన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం 10-24 ఏళ్ల మధ్య వయసున్న యువశక్తి 180 కోట్ల వరకు ఉంది. ఈ వయోపరిమితిలో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో 35.6 కోట్లమంది ఉండటం మరో విశేషం. తరవాతి స్థానం చైనాది. అక్కడ 26.9 కోట్ల మంది ఉన్నారు. ఇండొనేసియా (6.7 కోట్లు), అమెరికా (6.5 కోట్లు), పాకిస్థాన్‌ (5.9 కోట్లు), నైజీరియా (5.7 కోట్లు), బ్రెజిల్‌ (5.1 కోట్లు), బంగ్లాదేశ్‌ (4.8 కోట్లు) తదుపరి స్థానాల్లో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) నివేదిక స్పష్టీకరిస్తోంది.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత దేశం ఒకటి. యువశక్తే దేశానికి అత్యంత విలువైన ఆస్తి. ఇది దేశానికి బహుముఖ ప్రయోజనాలను అందిస్తోంది. అదే సమయంలో మానవ మూలధన అభివృద్ధిపై తగిన పెట్టుబడులు పెట్టకపోతే అందివచ్చిన సదావకాశం నీరుగారిపోతుంది. భారత్‌లో ఆర్థికంగా, జనాభాపరంగా, సామాజికంగా, సాంకేతికపరమైన మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఆ క్రమంలో సమాజంలోని అన్ని వర్గాలు వృద్ధిని పంచుకునేలా చూడాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వృద్ధి అభివృద్ధి ప్రక్రియలో యువత భాగస్వాములు కాగలిగితేనే భారత్‌ తన లక్ష్యాలను సాకారం చేసుకోగలదు. దురదృష్టవశాత్తు మనదేశంలో 2.3 శాతం శ్రామిక శక్తికి మాత్రమే విద్యాభ్యాసానంతరం అవసరమైన నైపుణ్య శిక్షణ అందుతోంది. అదే దక్షిణ కొరియాలో ఇది 96 శాతంగా ఉంది. భారత్‌లోని పట్టభద్రుల్లో కేవలం 20 శాతానికే ఉద్యోగం పొందేందుకు అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు ఉంటున్నాయి.

ప్రపంచ జీడీపీ ర్యాంకుల పరంగా 2019లో భారత్‌ ఆరో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో 19 శాతం యువత మనదేశంలో ఉండగా, ప్రపంచ జీడీపీలో భారత్‌ వాటా మూడు శాతానికే పరిమితమైంది. ప్రపంచ యువతలో మూడు శాతం వాటా మాత్రమే ఉన్న అమెరికా, ప్రపంచ జీడీపీకి 25 శాతం సమకూరుస్తూ అగ్రస్థానంలో ఉంది. 15 శాతం యువతతో చైనా 16 శాతం జీడీపీని అందజేస్తూ రెండో స్థానంలో నిలిచింది. భారత యువత వాస్తవిక సామర్థ్యానికి, మొత్తం జీడీపీకి, ప్రపంచ జీడీపీలో శాతానికి మధ్య ఎంత అంతరం ఉందనేది ఈ గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితి ఇదీ
భారత ఉద్యోగ విపణిలో 2020లో లభించే ఉద్యోగ విభాగాలను ఓ నివేదిక ఇటీవల వెలువరించింది. దీని ప్రకారం బ్లాక్‌చైన్‌ డెవలపర్స్‌, కృత్రిమ మేధ నిపుణులు, జావాస్క్రిప్టు డెవలపర్‌, రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ కన్సల్టెంట్‌, రోబొటిక్స్‌ ఇంజినీర్‌, సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌ వంటి ఉద్యోగాలు వేగంగా పుట్టుకొస్తున్నాయి. హైపర్‌ లెడ్జెర్‌, సోలిడిటీ, నోట్‌జేఎస్‌, స్మార్ట్‌కాంటాక్ట్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, టెన్సర్‌ ఫ్లో, పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ వంటి సరికొత్త నైపుణ్యాల్ని సొంతం చేసుకున్న వారికోసం బహుళజాతి సంస్థలు అన్వేషిస్తున్నాయి. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అత్యధిక గిరాకీ కలిగిన అయిదు సాంకేతిక నైపుణ్యాలు- యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌, అనలిటిక్స్‌, ఆటోమేషన్‌, ఐటీ ఆర్కిటెక్చర్‌, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) అని 2019లో ఇన్ఫోసిస్‌ వెలువరించిన ‘టాలెంట్‌ రాడార్‌’ నివేదిక పేర్కొంది. వాస్తవానికి ఈ సరికొత్త నైపుణ్యాల్ని ఏ విశ్వవిద్యాలయంలో, సాంకేతిక ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో బోధించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో నెలకొన్న పోటీకి తగినట్లుగా యువతను సిద్ధం చేసే విషయంలో ఎదురవుతున్న ప్రధాన సమస్య ఇదే.

దేశంలో అనేకమంది పట్టభద్రులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారన్నది విద్యావేత్తల ఆవేదన. కళాశాల చదువుల తరవాత ఉపాధి పోటీలో ఎదురయ్యే నైపుణ్యాలను దేశ విద్యావ్యవస్థ నేర్పించలేకపోవడమే అసలైన లోపం. భారతీయుల్లో ప్రతిభను మదింపు చేసే ఓ సంస్థ అధ్యయనం ప్రకారం, ప్రస్తుత విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో 80 శాతానికిపైగా భారతీయ ఇంజినీర్లు ఉద్యోగార్హులు కాదని తేలింది. దేశంలోని వాణిజ్య విద్యా కళాశాలలకు చెందిన విద్యార్థుల్లో కేవలం ఏడు శాతమే ఉద్యోగార్హులని భారత పరిశ్రమల, వాణిజ్య సమాఖ్య (అసోచామ్‌) అధ్యయనం నిరుడు కుండ బద్దలుకొట్టింది. వ్యాపార నిర్వహణ నైపుణ్యాల పెంపుదలకు కేంద్ర సర్కారు అంకుర పరిశ్రమల(స్టార్టప్‌ ఇండియా) కార్యక్రమం, స్కిల్‌ ఇండియా మిషన్‌, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార నిర్వహణకు ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. పరిశ్రమల ఆధ్వర్యంలో నైపుణ్య మండళ్ల ఏర్పాటు, పారిశ్రామిక శిక్షణ కేంద్రాల ప్రక్షాళన వంటివి చేపట్టింది. సరైన దిశగా పడిన మంచి అడుగులుగా వీటిని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఉద్యోగాలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి అవసరమైన నైపుణ్యాల బోధనపై ప్రభుత్వం దృష్టి సారించింది. కృత్రిమ మేధ, రోబొటిక్స్‌, భాషా శిక్షణ, ఐఓటీ, త్రీడీ ప్రింటింగ్‌, వర్చువల్‌ రియాలిటీ, బిగ్‌డేటా వంటి కొత్త అంశాలపై శిక్షణ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టింది. ఇవి మన యువతను దేశవిదేశాల్లో ఉద్యోగాలకు సంసిద్ధం చేస్తాయనడంలో సందేహం లేదు. భారతీయ యువత తమకు సరిపోయే ఉద్యోగ అవకాశాల్ని దక్కించుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నందువల్ల వారికి మరింతగా మార్గదర్శకత్వం, కెరీర్‌ కౌన్సెలింగ్‌ అవసరం.

యుక్తవయస్కుల్లో కుంగుబాటు విషయంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దేశంలో ప్రతి నలుగురు యుక్తవయస్కుల్లో ఒకరు కుంగుబాటుతో బాధపడుతున్నారు. గత అయిదేళ్ల కాలంలో గంటకు ఒకరు చొప్పున 40 వేలమందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ అధ్యయనం గుర్తించింది. యుక్తవయస్కుల్లో కుంగుబాటు గుర్తింపు, చికిత్స మరింత క్లిష్టతరమైన సమస్యగా మారింది. ప్రతి అయిదుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. దేశ యువతలో నిజమైన శక్తిసామర్థ్యాల్ని హరించే ఇలాంటి ఆరోగ్య సంబంధ సమస్యల్ని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువతీ యువకులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలి. వీరికి విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం వంటి అంశాల విషయంలో వేర్వేరు వ్యూహాలు అనుసరించాలి. దేశంలోని కొత్తతరమైన ‘మిలీనియల్స్‌, జనరేషన్‌ జడ్‌’ వంటి ఉపసమూహాల సమస్యల్నీ పరిగణనలోకి తీసుకోవాలి. యువతకు సాధికారత కల్పించడంలో సాంకేతిక పరిజ్ఞానానిదీ కీలక పాత్ర. ప్రస్తుతం ప్రపంచం అంతర్జాలం, మొబైల్‌ కమ్యూనికేషన్‌పైనే నడుస్తోంది. అన్నిచోట్లా, అన్ని వేళలా అంతర్జాలం అందుబాటులో ఉండటం వృద్ధిపథంలో కీలకం. ప్రస్తుత తరం విద్యార్థులు- కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లు, స్మార్ట్‌ఫోన్లు వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో దిట్టలు. విద్యా వ్యవస్థ, నైపుణ్యాభివృద్ధిలో సాంకేతికతను జోడించడం చాలాముఖ్యం. అంతర్జాల సర్వర్లు, డేటాసెంటర్లు, కంప్యూటింగ్‌ సౌకర్యాలు, ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌లు, అంతర్జాలం బ్యాండ్‌విడ్త్‌ పెంచడం, ఉపగ్రహ కమ్యూనికేషన్‌ వంటి ఐటీ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి ఉంది. యువత తమలోని సాంకేతిక నైపుణ్యాల్ని అభివృద్ధి చేసుకునేలా, ఉత్పాదకత ఇనుమడించేలా సహకారం అందించడం మంచి ప్రయోజనాల్ని ఇస్తుంది.

ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీల విద్యార్థులతో జాతీయ స్థాయిలో సమస్యల పరిష్కార సారథ్య కమిటీల ఏర్పాటు ఉపయుక్తమని చెప్పవచ్చు. ప్రస్తుతం దేశంలోని సమస్యల పరిష్కారానికి వారి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం మంచిది. సమస్యల పరిష్కారంలో అద్భుత ప్రతిభ కనబరచే విద్యార్థులు, విద్యార్థి బృందాలకు విద్యాపరంగా ‘క్రెడిట్లు’ ఇవ్వడం ద్వారా ప్రయోజనం కల్పించవచ్చు. అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకూ దశలవారీగా దీన్ని విస్తరింపజేయవచ్చు. దీనివల్ల రాబోవు తరాలు దేశ సమస్యలపై చిన్న వయసు నుంచే ఆలోచించడం అలవరచుకుంటుంది.

రానున్నది రోబోల యుగం
పని ప్రదేశాల్లో యంత్రాలు ఉండటం తప్పనిసరిగా మారే రోజులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ ధోరణిని అందిపుచ్చుకొంటున్నాయి. గార్టర్‌ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాల్లో రోబోల సంఖ్య 2015లో 49 కోట్లు ఉండగా, 2020 నాటికి వాటి సంఖ్య 250 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. భవిష్యత్తులో యంత్రాలతో కలిసి పనిచేయడానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలతో యువత సిద్ధంగా ఉండాలి. ప్రాథమిక, మాధ్యమిక విద్యాస్థాయుల్లోనే చిన్నపాటి రోబోటిక్‌ కార్యశాలల్ని ప్రవేశపెట్టడం ద్వారా దీన్ని సుసాధ్యం చేయొచ్చు. ప్రస్తుత ప్రపంచీకరణ కాలంలో వేగంగా మారిపోయే పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు నైపుణ్యాల్ని మెరుగుపరచుకునేలా యువ నిపుణులకు ప్రేరణ అందించాలి. ప్రాథమిక విద్య దశలోనే విద్యార్థుల్లో సామర్థ్యాల్ని పెంపొందించే దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కృషి చేయాలి. మాధ్యమిక, ఉన్నత విద్య దశలో విద్యార్థుల్లో అవసరమైన మార్పుల్ని సాధించి, వారిని దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దే విషయంలో ఉపాధ్యాయుల పాత్ర పెరగాలి. అన్ని విద్యాస్థాయుల్లో మానసిక నిపుణులు, విద్యార్థి కౌన్సెలర్లకు ఉపాధ్యాయ బృందంలో చోటుకల్పించడం శ్రేయస్కరం.

నైపుణ్యాల పెంపు తక్షణావసరం
తరగతి గదిలో సంపాదించే జ్ఞానానికి, నైపుణ్యాలకు; ప్రపంచీకరణ నేపథ్యంలో పరిశ్రమ అవసరాలకు మధ్య అంతరం తీవ్రంగా పెరిగిపోతోంది. కొత్త సాంకేతిక నైపుణ్యాలపై కళాశాల ప్రాంగణాల్లోనే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సరైన శిక్షకులను, తగిన వనరుల్ని సమకూర్చినప్పుడే ఈ అంతరం పూడుతుంది. మరోవైపు వాణిజ్య కార్యకలాపాల డిజిటలైజేషన్‌ కొత్త సాంకేతిక నైపుణ్యాలకు గిరాకీని పెంచుతోంది. ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా ప్రకారం 2025 నాటికి ఆటోమేషన్‌, కృత్రిమ మేధ కారణంగా 7.5 కోట్ల ఉద్యోగాలు పోతాయి. కొత్తగా 13.3 కోట్ల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఆ మేరకు యువతకు సరికొత్త సాంకేతిక నైపుణ్యాలు అందజేసి సాన పట్టాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతను తీర్చిదిద్దుకోవడం తక్షణావసరం!

- డాక్టర్‌ కె.బాలాజీరెడ్డి
(రచయిత- సాంకేతిక విద్యారంగ నిపుణులు)
Posted on 19-01-2020