Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అమ్మభాషతోనే అస్తిత్వం

* గిడుగు 80వ వర్ధంతి నేడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు వేలాది భాషలు మాట్లాడుతున్నారు. కొన్ని భాషలకు లిపులు ఏర్పడి అభివృద్ధి చెందగా, మరికొన్నిటికి ఈనాటి వరకు లిపులు ఏర్పడలేదు. అయినప్పటికీ లిపులతో సంబంధం లేకుండా ఆయా భౌగోళిక పరిసరాల్లో జీవిస్తున్న ప్రజలు వారి భాషలను సంరక్షించుకుంటూనే ఉన్నారు. కొన్ని జాతులు అంతరించిపోవడం వల్లనో, లేక మరికొన్ని జాతులతో కలసి జీవించడం వల్లనో ఆయా జాతుల పూర్వపు భాషలు అంతరించిపోతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామం. కోట్లాది ప్రజలు తెలుగులో మాట్లాడుతున్నారు. తెలుగేతర ప్రాంతాల్లోనూ విస్తరించిన తెలుగువారు తమ భాషా సంస్కృతులను పరిరక్షించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు తెలుగు అస్తిత్వానికి ముంచుకువచ్చే ప్రమాదం ఏమీ లేదని చెప్పొచ్చు. తెలుగు మాట్లాడే మాతృభాషా ప్రియులకు అన్యభాషల మీద మోజు ఉండటంలో తప్పులేదు. కానీ, ఆ మోజు ఇటీవల కాలంలో ‘శ్రుతి మించి రాగాన పడుతుండటమే’ ఆందోళన కలిగిస్తోంది. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి ఎనభయ్యో వర్ధంతి నేడు. తెలుగును మహోజ్జ్వలంగా వెలిగించాలని అహరహం తపించిన ఆ మహానుభావుడి ఆశయాలే స్ఫూర్తిగా పురోగమించాల్సిన అవసరం ఉంది.

మాతృభాషలో విద్యాబోధన ప్రాముఖ్యతకు సంబంధించి గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు తెచ్చుకోవడం సందర్భోచితం అవుతుంది. 1857లో ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం జరిగింది. దానితో స్వాతంత్య్రం రాకపోయినా, మౌలికమైన కొన్ని మార్పులు దేశంలో చోటుచేసుకున్నాయి. అందులో ప్రధానమైనది విశ్వవిద్యాలయాల స్థాపన. మద్రాసు, బొంబాయి, కలకత్తా ప్రెసిడెన్సీలలో మూడు విశ్వవిద్యాలయాలు ఆవిర్భవించాయి. వీటిలో ఆంగ్ల మాధ్యమంగా విద్యాబోధన సాగింది. 1905లో లార్డ్‌ కర్జన్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు విద్యాపరమైన ప్రగతిని సమీక్షిస్తూ- 1857నుంచి 1905నాటికి భారతీయ విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తూ, తాము సంపాదించిన పరిజ్ఞానాన్ని ఏ మేరకు దేశ ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఉపయోగించారో తెలుసుకోవాలనుకున్నారు. దీని కోసం ఒక కమిటీని వేశారు. అది దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు, విద్యావంతుల అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించిన భారతీయ విద్యార్థులు తమ విజ్ఞానాన్ని ఆయా ప్రాంతీయ భాషలు మాట్లాడే ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వారిని చైతన్యవంతం చేయలేకపోయారని ఆ నివేదికలో పేర్కొంది. ప్రాంతీయ భాషల్లో విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను ఆ నివేదిక నొక్కి చెప్పింది. అప్పటి నుంచి జాతీయ విద్యావిధానానికి సంబంధించిన ఆలోచనలు దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారంలోకి వచ్చాయి. అందులో భాగంగా పుట్టుకొచ్చినవే జాతీయ కళాశాలలు. తెలుగు మాట్లాడే ప్రాంతంలో అప్పట్లో ఈ కళాశాల 1910లో బందరు (నేటి మచిలీపట్నం)లో ఏర్పాటైంది. ఆ తరవాత వివిధ ప్రాంతాల్లో ప్రారంభించారు. ఈ జాతీయ కళాశాలల్లో తెలుగు మాట్లాడే ప్రాంతంలో తెలుగు మాధ్యమంగా బోధన ప్రారంభమైంది. అప్పటికే తెలుగులో గ్రాంథిక శైలిలోనూ, వ్యావహారిక శైలిలోనూ రచనలు చేసే వారున్నారు. పాఠ్యపుస్తకాల్లో వ్యావహారిక భాషను ప్రవేశపెడితే అక్షరాస్యత పెరుగుతుందన్న వాదం బయలుదేరింది. దీనికి గిడుగు రామమూర్తి సారథ్యం వహించారు. అనంతరం ఇది వ్యావహారిక భాషోద్యమానికి దారి తీసింది. గిడుగు వాదాన్ని సమర్థించిన వారిలో గురజాడ అప్పారావు ప్రథములు. ఆ తరవాతి కాలంలో ఆ పంథాను కందుకూరి వీరేశలింగం పంతులు అంగీకరించక తప్పని పరిస్థితులు ఏర్పడినాయి. భాషా సరళత కలిగిన వ్యావహారికమే అక్షరాస్యతను పెంచుతుందన్న కీలక నిర్ణయం వెలువడిన సందర్భమది. వ్యావహారికం ప్రజాభాష. దానికి పట్టాభిషేకం జరిపితే అది జాతి వికాసానికి దోహదం చేస్తుంది. మాతృభాషల్లో విద్యాబోధనకు స్వస్తి చెప్పి, ఆంగ్లానికి పెద్దపీట వేస్తే జాతి వికాసం దెబ్బతింటుంది. ఇది ఒకరకంగా తిరోగమన చర్య.

ఆంగ్లేయుల జమానాలోనూ సివిల్‌ సర్వీసులకు ఎంపికైన భారతీయ లేదా విదేశీ విద్యార్థులు విధిగా రెండు భారతీయ భాషలు నేర్చుకోవాలన్న నిబంధన ఉండేది. ఎంపికైన అభ్యర్థులను, వారు మాట్లాడే ప్రాంతీయ భాషలను బట్టి ఆయా ప్రాంతాలకు ఉద్యోగరీత్యా పంపించేవారు. పాలనలో ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను ఆనాడు బ్రిటిష్‌ పాలకులు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో ఆంగ్లం ఎంత అవసరమొచ్చినా ముందు తెలుగు నేర్చుకోవాలన్న వాస్తవాన్ని గుర్తించాలి. మాతృభాష మీద సాధికారత లేనివారు ఏ భాషపైనా పట్టు సాధించలేరని భాషావేత్తలు ఏకరవు పెడుతున్నారు. ఇది నూటికి నూరు శాతం నిజం! ఆంగ్ల భాషలో విద్యార్థులను మేధావులుగా తయారు చేయాలంటే, ముందుగా తెలుగుమీద వారికి సాధికారత ఏర్పడేటట్లు తీర్చిదిద్దాలి. లేకపోతే, అటు ఆంగ్లానికీ, ఇటు తెలుగుకూ రెంటికీ కాకుండా పోయే ప్రమాదం ఉంది. ఆంగ్లం ప్రభావం కారణంగా ప్రాంతీయ భాషలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఆంగ్లంమీద మోజు అంతకంతకూ పెరుగుతూ ఉంది. పల్లెటూరి పెద్దమ్మలు, పెద్దయ్యలు సైతం తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించాలని ఆసక్తి చూపుతున్నారు. ఇందులో తప్పులేదు. కానీ, మాతృభాషను మరచిపోయేంత మోజు ప్రమాదకరం. దీనివల్ల భాష ఒక్కటే కాదు, దానితోపాటు సంస్కృతీ సంప్రదాయాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ భాషల నడుములు విరగ్గొట్టి వాటిని జీవచ్ఛవాలుగా మార్చడం మంచి పరిణామం కానేకాదు. ఆంగ్లం నేర్చుకోవద్దని ఎవరూ చెప్పడం లేదు. తెలుగును విస్మరించవద్దని మాత్రమే హితవు పలుకుతున్నారు. ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడం మంచిదే. ఇది విద్యార్థుల మేధో పరిజ్ఞానాన్ని పదునెక్కిస్తుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. కానీ, అదే సమయంలో మాతృభాషను సంరక్షించుకోవడం, దానిలోని మాధుర్యాన్ని ముందుతరాలకు అందజేయడం మనందరి బాధ్యత!

- డాక్టర్‌ దాశరథుల నర్సయ్య
Posted on 22-01-2020