Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అమ్మభాషకు కొత్త ఆలంబన

* ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆరంభం

దేశంలోని అన్ని తెలుగు విద్యావిభాగాల్లో పరిశోధనలను వినూత్నంగా, శక్తిమంతంగా ప్రోత్సహించి వివిధ విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో జరుగుతున్న పరిశోధనలపై ప్రత్యేక శ్రద్ధ వహించే విధంగా ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం మార్గ నిర్దేశం చేయాలి. భారత ప్రభుత్వం తలపెట్టిన ప్రణాళికల్లో ప్రాచీన భారతీయ భాషల పరిరక్షణ, పోషణ, అభ్యున్నతి, ప్రాచుర్యం వంటివి అత్యంత ప్రాధాన్యాంశాలు. దేశవ్యాప్తంగా వివిధ భాషల అభివృద్ధి కోసం మైసూరులోని భారతీయ భాషల కేంద్రం పని చేస్తోంది. భారత ప్రభుత్వం ప్రాచీన భాషల్ని వర్గీకరించాలని 2004లో నిర్ణయించింది. అనేక సంవత్సరాలుగా ప్రజలు చేస్తున్న విజ్ఞప్తుల మేరకు 2011లో తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించారు. మైసూరులో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం పనిచేయడం ప్రారంభమైంది. ఆపై దానికి సంబంధించి ప్రత్యేక కృషి అంటూ ఏమీ జరగలేదు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసిన తరవాత మైసూరు నుంచి ప్రాచీన కేంద్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగు పరిశోధనలకు ఊతమిస్తూ భాషకు ఎంతో ప్రయోజనకరమైన ఈ సంస్థకు తెలుగు భాషాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అద్దెలేకుండా ఉచితంగా కార్యాలయాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చిన స్వర్ణభారత్‌ ట్రస్టుకు అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు భాష సామాన్యుడికి మరింత చేరువ కావడానికి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం తన కార్యక్రమాల ద్వారా కృషి సల్పాలి. పలు విభాగాల్లో విస్తరించేందుకు కృషి చేయాలి. భాషా శాస్త్రజ్ఞులు, సాహిత్య నిపుణులు, చరిత్రకారులు, పురాతత్వ శాస్త్రవేత్తలు, కళా చరిత్రకారులను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి, ప్రాచీన తెలుగుకు సంబంధించి వివిధ అంశాలను అన్వేషించాలి. ఇతర భాషలపై ప్రాచీన తెలుగు చారిత్రక ప్రభావం గురించి పరిశోధించాలి.

బహుముఖ బాధ్యతలు
సాహిత్యం, భాషాశాస్త్రం, వివిధ భాషల్లో అనువాదాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. నిఘంటు నిర్మాణ శాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, మానవ నిర్మాణ శాస్త్రం, పురావస్తు సాక్ష్యాలు, లిఖితప్రతులు, ప్రాచీన లిపి శాస్త్రం, కళ, వాస్తుకళ, ప్రవాసాంధ్ర గాథలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. తెలుగుకు బహుళ ఆదరణ కల్పించడం కోసం భాష, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, కార్యశాలలు నిర్వహించాలి. ఇతర యూనివర్సిటీలు, సంస్థలు చేసే ఇలాంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలి. పరిశోధన గ్రంథాలు, తెలుగులో ప్రాచీన మూల రచనలు, ఆంగ్లం, ఇతర భారతీయ భాషల్లో అనువాదాల ప్రచురణకూ తోడ్పాటు ఇవ్వాలి. పీహెచ్‌డీలు, పోస్ట్‌ డాక్టొరల్‌ పరిశోధనకు ఫెలోషిప్‌లను అందజేయాలి. ప్రాచీన తెలుగు రంగానికి సంబంధించి విశిష్టమైన సేవలందించినవారికి పురస్కారాలను నెలకొల్పాలి. దేశ విదేశాల్లో ప్రాచీన తెలుగు విద్యకు ప్రోత్సాహం అందజేయాలి. ప్రాచీన తెలుగుకు సంబంధించిన సమాచారానికి ప్రధాన కూడలిగా వ్యవహరించాలి. డిజిటల్‌ ప్రాచీన భాండాగారాలు, ప్రదర్శన, ప్రచురణలు మొదలైనవి ఈ సంస్థలో లభ్యం అవుతాయి. దీనికి సంబంధించిన గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌లు కూడా మంజూరు చేయాలి. ఈ సంస్థ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాపకంతో ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా వ్యవహరించాలి. క్షేత్రస్థాయి అధ్యయనాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల పరిశోధన ప్రాజెక్టులకూ అండగా నిలవాలి. సుసంపన్నమైన మన సాంస్కృతిక వారసత్వ సంపద, ప్రాచీన తెలుగుకు సంబంధించిన గ్రంథాల ప్రచురణ ప్రక్రియను మరింత పెంచాలి. మానవ సంబంధాల అభివృద్ధి క్రమంలో ఏర్పడిన భావ వ్యక్తీకరణే భాష. వివిధ చారిత్రక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక కారణాల వల్ల వ్యక్తీకరణ అనేక రకాలుగా జరుగుతుంది. ప్రతి నాగరికతా తన గొప్పతనాన్ని భాష ద్వారా వ్యక్తం చేసింది. ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు. వ్యాపార సంబంధాలు... ఇవన్నీ భాష లేకుండా పెంపొందలేవు. భాష సమాజాన్ని సృష్టిస్తుంది. జాతిని బలపరుస్తుంది. అభివృద్ధికి మార్గం వేస్తుంది.

సామాజిక పరిణామంలో భాష ఇరుసు లాంటిది. భాష సజీవ సమాజ దర్పణం. భాష మానవ సంబంధాలను అభివృద్ధిపరచే సంస్కృతికి ప్రతిబింబం. నువ్వెవరనే ప్రశ్నకు చక్కని సమాధానమే మాతృభాష. మాతృభాష నేర్చుకోవడం కేవలం మాట్లాడటం కోసమే కాదు- మనమేమిటో, మన గతమేమిటో, మనం ఎక్కణ్నుంచి వచ్చామో, మన సంస్కృతి ఏమిటో తెలుసుకోవడానికీ ఎంతో అవసరం. తరతరాలుగా పూర్వీకులు సంస్కృతి మన భాషలోనే నిక్షిప్తం చేశారు. ఆ మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించిన ఎవరికైనా అమ్మపాలు ఇచ్చినంత బలాన్ని, మాతృభాష అందించి తీరుతుంది. మిగతా భాషల్లోనూ సాహిత్యం ఉంది, మరి తెలుగే ఎందుకు నేర్చుకోవాలి అంటారా... ఆయా భాషలవారు వారి వారి సాహిత్యాలను నేర్చుకుంటారు. తెలుగువాడిగా పుట్టిన తరవాత మాతృభాషా సంస్కృతులను పెంపొందించుకోవడాన్ని ప్రతి తెలుగువాడూ బాధ్యతగా గుర్తెరగాలి. ప్రత్యేకించి మన తెలుగు భాష, సంస్కృతం మొదలుకుని, ఉర్దూవరకు ఎన్నో భాషల చినుకుల్ని; శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఆదిలాబాద్‌ నుంచి అనంతపురం వరకూ ఎన్నో యాసల చెణుకుల్ని తనలో పొదువుకుంది.

తెలుగు భాషకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. అందుకు తగిన సాక్ష్యాధారాలూ లభించాయి. ఈ విషయంలో ఎంతో శ్రమించిన ఉభయ తెలుగు రాష్ట్రాల భాషా పరిశోధకులు, భాషాభిమానులకు అభినందనలు. తెలుగులో మహాభారత రచనను మొదలు పెట్టిన నన్నయను ఆదికవిగా పిలుచుకున్నాం. నన్నయకు ముందు సాహిత్యం లేదా అనే విషయం సాహిత్య చరిత్రకారులకు వదిలిస్తే, భాషాపరంగా తెలుగు భాషకు మూలాలు మనకు అంతకు ఎన్నో సంవత్సరాల ముందు లభిస్తాయి. క్రీ.పూ. మొదటి శకంలో హాలుడి గాథా సప్తశతి, గుణాఢ్యుడి బృహత్కథా మంజరిలో తెలుగు పదాలు కనిపిస్తాయి. తెలుగువారి ప్రస్తావన మహాభారతంలోనూ ఉంది. బౌద్ధుల కాలంలోనూ ఉంది. తెలుగునేలలో కరీంనగర్‌తో పాటు అనేక ప్రాంతాల్లో లోహయుగం, కొత్త రాతియుగం నాటి అవశేషాలు లభించడమే తెలుగు భాష ప్రాచీనతకు దాఖలాలు. తెలుగు సాహిత్యం ఎంతో ఉత్కృష్టమైనది. తొమ్మిదో శతాబ్ది నుంచి తెలుగు నేలపై పద్యకవిత విలసిల్లుతోంది. అప్పటి నుంచి 19వ శతాబ్ది వరకు పద్యసాహిత్యమే రాజ్యమేలింది.

జీవన విధానంలో ఆయువు పట్టు లాంటిది మాతృభాష. ఒకప్పుడు మన పద్యం, గద్యం జగద్విదితం. దాన్ని మళ్ళీ దశదిశలా వ్యాపింపజేయాలి. మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, చివరకు మన తిట్టు సహా అన్ని సంప్రదాయాలనూ పునరుజ్జీవింపజేయాలి. ఈ గడ్డపై వికసించిన తెలుగు సాహిత్యం ఘనతను గర్వంగా చాటాలి. పాత తరంనాటి భాషా నుడికారాలు, సాహిత్య సౌరభాలను కొత్త తరానికి అందించాలి. విభిన్న భాషల సమాహారమైన భారత దేశంలో తెలుగుకున్న ప్రత్యేకతను నిలబెట్టుకుందాం. వివిధ ప్రాంతాల్లో ఎందరో మహానుభావులు మనకందించిన మాండలికాల సౌరభాలను మళ్ళీ పరిమళింపజేయాలి. ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలుగు భాషను మన పద్ధతుల్లో అన్వయించుకోవాలి.

ఎందరో మహానుభావులు
మహాకవులు అనేకమంది తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. వారి కావ్యాల్లో సంస్కృతిని నిక్షిప్తం చేశారు. వేమన, బద్దెన లాంటివారు శతక సాహిత్యంతో మార్గనిర్దేశం చేశారు. తెలుగు పదాలతో ధైర్యం చెప్పారు. ఏనుగు లక్ష్మణకవి రాసిన భర్తృహరి సుభాషితాల్లో ఏ పద్యం చూసినా, మానసికంగా మనకు ధైర్యాన్ని పంచేదే. వేమన రాసిన ప్రతి పద్యం మనిషిగా ఎలా బతకాలో చెప్పేదే. సుమతీ శతకం అణువణువునా జీవన గమనాన్ని తెలియజేసేదే. అన్నమయ్య ప్రతి కీర్తనలోనూ తెలుగు సంస్కృతి అణువణువునా ప్రతిబింబించింది. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రాసిన సాహిత్యంలో నాటి చరిత్ర మనకు అవగతమవుతుంది. ఎన్ని తరాలు మారుతున్నా పోతన కృష్ణుడు, త్యాగయ్య రాముడు, అన్నమయ్య పరబ్రహ్మం... ఇవన్నీ దేవుళ్ళ పేర్లను మాత్రమే చెప్పవు... నాటి సంస్కృతిని కళ్ళ ముందు ఆవిష్కరిస్తాయి. ఇన్ని ప్రత్యేకతలున్న తెలుగును నామమాత్రంగా నేర్చుకుంటే ఓనమాలు వస్తాయేగాని, లోతుల్లోకి వెళ్ళి నేర్చుకుంటే ఆనవాళ్ళు తెలుస్తాయి. అన్నం పెట్టే చదువులు నేర్చుకోవద్దని ఎవరూ అనరు. అన్నీ నేర్చుకోమనే అంతా చెబుతారు. నీవెవరో తెలుసుకోవడానికి తెలుగు భాష, నీ దేశం గురించి తెలుసుకోవడానికి హిందీ భాష, నీ గురించి ప్రపంచం తెలుసుకోవడానికి ఆంగ్లభాష... ఇలా దేశంలో ప్రతి భాషను అభ్యసించే హక్కు, అందరికీ ఉంటుంది. కానీ మాతృభాష నేర్చుకోవడం ప్రాణావసరం. అమ్మా నాన్న అని పిలిచినంత మాత్రాన తెలుగు వస్తుందా అంటే... అలవాటు అవుతుంది. ఆనవాళ్ళను వెలిగిస్తుంది. ఏ సెలవు రోజో పిల్లలకు పద్యాలు నేర్పండి, ఆ మాధుర్యాన్ని వివరించండి. వారిలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇదో మంచి ప్రయత్నమే.

తెనాలి రామకృష్ణుడి కథలు చదివిన ప్రతి పిల్లాడిలో సమయస్ఫూర్తి పెరుగుతుంది. భట్టి విక్రమార్క కథలు తెలిసిన ప్రతి పిల్లాడికీ ప్రపంచం అర్థమవుతుంది. పంచతంత్రం కథలను నేర్చుకుంటే, దాన్ని కూడా మాతృభాషలో నేర్చుకుంటే, అంతకుమించిన భావనా బలం ఏముంటుంది? భాషా పరిరక్షణలో పత్రికలతో పాటు సినిమా, టెలివిజన్‌లకూ విశేష బాధ్యత ఉంది. మాతృభాష కళ్ల వంటిది, పరభాష కళ్లజోడు లాంటిది అంటారు. కళ్లు ఉంటే కళ్లద్దాలు వెలుగునిస్తాయి. బ్రిటిష్‌వారు ప్రభుత్వ పాలనలో ఇంగ్లిషు భాషకు, ఉద్యోగానికి ముడిపెట్టారు. అందుకే ఆంగ్ల వ్యామోహం వచ్చింది. మనం చదువును, ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానించాలి. అందుకోసం ఉభయ తెలుగు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలి. తెలుగు భాషాభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేసేందుకు, తెలుగు వెలుగుల బావుటా అంతర్జాతీయ వేదికలపై సమున్నతంగా ఎగరాలి. పండితులను గౌరవించుకునేందుకు, సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు తద్వారా తెలుగు ఆలోచనల్ని ప్రపంచానికి పంచేందుకు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం కృషి చేస్తుందని ఆకాంక్షిస్తున్నాను. ఎన్నో ప్రత్యేకతలున్న మన మాతృభాష తెలుగును మల్లెపూలతో పూజించక్కర్లేదు. నాలుగు మాటలు నేర్చుకుంటే చాలు, పిల్లలకు మరో నాలుగు మాటలు నేర్పితే చాలు- రత్నాలతో పూజించినంత ఫలం దక్కుతుంది.తెలుగువారిగా పుట్టినందుకు తెలుగును నేర్చుకుందాం... ఆ వెలుగుల్ని అందరితో పంచుకుందాం!

Posted on 23-01-2020