Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

వైద్య విద్యకు సమగ్ర చికిత్స

సకాలంలో సరైన వైద్యసేవలందక ప్రతి సంవత్సరం 24 లక్షలమంది వరకు ప్రాణాలు కోల్పోతున్న దేశం మనది. మరోవైపు, వైద్య ఖర్చులు భరించలేక ఏటా కోట్లమంది దుర్భర దారిద్య్రంలో కూరుకుపోతున్న దుస్థితి గుండెల్ని పిండేస్తోంది. భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన జీవించే హక్కు అలా లెక్కకు మిక్కిలి సందర్భాల్లో కొల్లబోతోంది. దేశ ఆరోగ్య అవసరాల్ని సమగ్రంగా తీర్చగలిగేలా వైద్యవిద్య లేనేలేదని లోగడ తప్పుపట్టిన పార్లమెంటరీ స్థాయీసంఘం, ప్రమాణాల పరంగానూ ఎన్నో కంతల్ని వేలెత్తిచూపింది. ఈ దురవస్థను చెదరగొట్టేందుకు దేశానికిప్పుడు లక్షల సంఖ్యలో వైద్య సిబ్బంది, స్పెషలిస్టుల సేవలు అవసరం. ఎయిమ్స్‌ (అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ)- దిల్లీ సంచాలకులు డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సారథ్యంలో, పదిహేనో ఆర్థికసంఘం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ కీలక సిఫార్సులు వచ్చే అయిదేళ్లలో గుణాత్మక మార్పుల్ని లక్షిస్తున్నాయి. ఆరోగ్యం పొందడాన్ని ప్రాథమిక హక్కుగా ప్రకటించాలంటున్న కమిటీ, వైద్య సంరక్షణను రాష్ట్రాల జాబితాలోంచి ఉమ్మడి పద్దులోకి బదలాయించాలంటోంది. 2025 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్యకు సమానంగా పీజీ ప్రవేశాలు ఉండాలంటున్న రణ్‌దీప్‌ సంఘం- వైద్య విద్యార్థులకు పాఠ్యాంశాల్లో మార్పుల్నీ ప్రతిపాదిస్తోంది. విస్తృత సంస్కరణల్లో భాగంగా ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలూ పట్టణాల్లో ఒక్కోటీ రెండువందల దాకా పడకలతో 3000-5000 వరకు ప్రైవేటు ఆస్పత్రుల అవతరణ ఆవశ్యకతనూ ప్రస్తావిస్తోంది. ఎంబీబీఎస్‌ స్థాయిలోనే కొద్దిపాటి స్పెషలైజేషన్‌కు వీలుండాలంటున్న సిఫార్సుల్ని, క్షేత్రస్థాయి స్థితిగతుల్లో మెరుగుదలను అభిలషించేవిగా స్వాగతించాలి. వైద్య కళాశాలల కొరత రీత్యా ప్రముఖ ప్రైవేటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీజీ విద్యార్థులు శిక్షణ పొందే అవకాశం కల్పించాలనడంపై భిన్నగళాల స్పందన నేపథ్యంలో- సిఫార్సులపై కేంద్రం ఆచితూచి స్పందించాల్సి ఉంది!

ప్రపంచ జనాభాలో 17శాతానికి నెలవైన దేశం ఇండియా. నవజాత శిశువుల మరణాల్లో 27శాతం, అయిదేళ్లలోపు పిల్లల చావుల్లో 21శాతం, అంతర్జాతీయంగా వ్యాధుల భారంలో 20శాతం మేర ఇక్కడి పద్దులో జమపడుతున్నాయన్నది అధికారిక అంచనా. ప్రతి వెయ్యి జనాభాకు కనీసం ఒక వైద్యుడు ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాల సాధనకు భారత్‌ దశాబ్దం పాటు నిరీక్షించాలన్న విశ్లేషణలు- స్వాస్థ్య యోజనలు ఎందుకు నీరుకారుతున్నాయో చాటుతున్నాయి. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఎంబీబీఎస్‌ సీట్లకు దీటుగా పీజీ ప్రవేశాలూ ఇనుమడించాలన్న ప్రతిపాదనను పట్టాలకు ఎక్కించడంలో, ఖర్చు అత్యంత కీలకాంశం. ప్రస్తుతం దేశంలో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య సుమారు 80 వేలు. పీజీ సీట్లు అందులో మూడోవంతు. 2021-22నాటికి 75 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15,700 ఎంబీబీఎస్‌ సీట్లను అదనంగా అందుబాటులోకి తేనున్నట్లు కేంద్రం అయిదు నెలల క్రితం ప్రకటించింది. ఎక్కడైనా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా ఎంబీబీఎస్‌, పీజీ సీట్లు మంజూరైతే మౌలిక సదుపాయాల అభివృద్ధి నిమిత్తం తమవంతుగా ఆయా రాష్ట్రాలు 40శాతం వ్యయభారం తలకెత్తుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన పాత, కొత్త ఎంబీబీఎస్‌ సీట్లకు సమానంగా స్నాతకోత్తర వైద్య విద్యా ప్రవేశాలు సాధ్యపడాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు భూరి ఖర్చు భరించాల్సి వస్తుంది. ఇప్పటికే ఆర్థిక క్లేశాలతో కిందుమీదులవుతున్న రాష్ట్రాలు మరిన్ని కడగండ్లపాలు కాకుండా నివారించే నిమిత్తం ప్రస్తుత విధి విధానాలను కేంద్రం సాకల్యంగా ప్రక్షాళించడం మేలు. కొత్తకొత్త సాంక్రామిక రోగాలు కోరచాస్తున్న కాలమిది. వాస్తవిక అవసరాలకు అనుగుణంగా వైద్య విద్యా ప్రవేశాల్ని ఇనుమడింపజేయడంతోపాటు- బోధనలో సర్వశ్రేష్ఠ ప్రమాణాలు నెలకొల్పి నాణ్యమైన ఆరోగ్య సేవలకు ఢోకా లేకుండా కాచుకోవడం కేంద్రానికి ప్రాధాన్య అజెండా కావాలి.

ధనికులు పేదలనే భేదం లేకుండా తమ పౌరులందరికీ జాతీయ ఆరోగ్య సేవా (ఎన్‌హెచ్‌ఎస్‌) పథకాన్ని బ్రిటన్‌ అమలుపరుస్తుండగా, జర్మనీ మూడొంతుల జనాభాకు నిర్బంధ సామాజిక బీమా యోజన వర్తింపజేస్తోంది. తమ గడ్డపై నివసించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్య రక్షణ సమకూరేలా స్విట్జర్లాండ్‌ సకల జాగ్రత్తలూ తీసుకుంటోంది. చైనా, ఇటలీ, గ్రీస్‌ వంటివి సార్వత్రిక ఆరోగ్య రక్షణ ప్రణాళికల రూపేణా సమున్నత ప్రమాణాల సాధనలో పోటీపడుతున్నాయి. అంతర్జాతీయంగా పౌరుల సొంత ఆరోగ్య వ్యయ సగటు సుమారు 18శాతం. అదే ఇక్కడ, వైద్య చికిత్సలకయ్యే ఖర్చులో 63శాతం దాకా జనమే భరించాల్సి వస్తోంది. స్థూల దేశీయోత్పత్తిలో పది శాతానికిపైగా ఆరోగ్య కేటాయింపులు స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ తదితరాల స్వాస్థ్య యోజనల్ని తేజరిల్లజేస్తుండగా; జీడీపీలో ఒకటిన్నర శాతంలోపు భారత్‌ ఖర్చు- ప్రజానీకం జేబుల్ని కాల్చేసి బతుకుల్ని గుల్లబారుస్తోంది. యూపీ, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ఆరోగ్య సంరక్షణ వ్యయం సైతం జీఎస్‌డీపీ (రాష్ట్ర స్థూలోత్పత్తి)లో బొటాబొటీగానే లెక్కతేలుతోంది. 2025నాటికి జాతీయ స్థాయి ప్రజారోగ్య పద్దు కేటాయింపులు జీడీపీలో 2.5శాతానికి తగ్గరాదంటున్న రణ్‌దీప్‌ కమిటీ, అందులో మూడింట రెండొంతులు ప్రాథమిక వైద్య సంరక్షణకే దఖలుపడాలంటోంది. స్వస్థ సేవల లభ్యత, నాణ్యతల ప్రాతిపదికన 195 దేశాల జాబితాలో భారత్‌ నేటికీ 145వ స్థానానికి పరిమితం కావడం జాతికే తలవంపులు. ప్రజారోగ్య సంరక్షణ ఖాతాకు బడ్జెట్‌ కేటాయింపులు ఇనుమడింపజేసి సిబ్బంది ఖాళీల భర్తీ, ఆవశ్యక పరికరాలూ ఔషధాల సరఫరా, పారదర్శక పర్యవేక్షణలను గాడిన పెట్టడం బాధ్యతాయుత ప్రజాప్రభుత్వాల విధ్యుక్త ధర్మం. అందులో అవి నెగ్గితేనే, అసంఖ్యాక బాధిత జనావళికి ఉపశమనం!

Posted on 25-01-2020