Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సమున్నత విలువల దీపస్తంభం!

‘భారత ప్రజలమైన మేము’ అంటూ రాసుకొన్న రాజ్యాంగం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర భారతావనిని ఏర్పాటు చేసిన మహోజ్జ్వల ఘట్టానికి నిన్నటితో డెబ్భయ్యేళ్లు నిండాయి. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం- ఈ నాలుగు మూల స్తంభాలపై భారత రాజ్యాంగం నిలిచిందన్న అవతారిక ఆదర్శంలోనే కోట్లాది స్వాతంత్య్ర త్యాగధనుల కలలు పండాయి! ఈ సమున్నత ఆశయ ప్రకటనల్ని బట్టి కాదు, వాటి అమలుకు కచ్చితంగా ఏయే చర్యలు తీసుకొన్నామన్న దాన్ని బట్టే మన పనితీరు నిగ్గుతేలుతుందని 1950 జనవరి 26న డాక్టర్‌ సర్వేపల్లి వారు స్పష్టీకరించారు. ఏడు దశాబ్దాల కాలగమనంలో 90 కోట్లకుపైగా ఓటర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియా రాణకెక్కిందనడంలో సందేహం లేదు. ప్రపంచ ప్రజాస్వామ్య సూచీలో ఏకంగా పది స్థానాలు దిగజారి, పన్నెండేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా 51వ స్థానానికి చేరడం గణతంత్ర భారతావనికి ఏమాత్రం శోభస్కరం కాదు! ‘మన వైఫల్యాలకు రాజ్యాంగం కారణమా, రాజ్యాంగం విఫలం కావడానికి మనం కారకులమా?’ అని రాజ్యాంగ స్వర్ణోత్సవ వేళ రాష్ట్రపతిగా నారాయణన్‌ సూటి ప్రశ్న సంధించారు. సమున్నత మానవీయ విలువల దీపస్తంభం లాంటి రాజ్యాంగాన్ని దాని స్ఫూర్తిని పాలక శ్రేణులు పుణికిపుచ్చుకొని సవ్యపథంలో పరిపాలన సాగించి ఉంటే- చైనా, జపాన్‌, దక్షిణ కొరియాల మాదిరిగా ఇండియా జయకేతనం ఎగరేసేదనడంలో మరోమాట లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మానవాభివృద్ధి సూచీలో 86వ స్థానంలో ఉన్న భారత్‌ నేడు 130వ స్థానంలో కుములుతోంది. 2030 నాటికి ప్రపంచ దేశాలన్నీ సాధించదలచిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇండియాకు మరీచికగా మారే సూచనలే కనిపిస్తున్నాయి! ‘ఇస్రో’ సాధిస్తున్న రోదసి విజయాలతో శిరసెత్తుకోగలుగుతున్న ఇండియా- ఆకలి అవిద్య, అనారోగ్యం మౌలిక సదుపాయాల లేమి, కొరవడిన ఉపాధి వంటి ప్రాథమిక సమస్యలకూ పరిష్కారాలు కనుగొనలేక తలదించుకోవాల్సి వస్తోంది. అంతకుమించి సమాఖ్య భావనకు తూట్లు, రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు, ప్రశ్నించే గళాలకు సంకెళ్లు నిత్యకృత్యమైన వేళ- రాజకీయ అసురసంధ్యను ఎదుర్కొనే జాగృత జనవాహినికి రాజ్యాంగమే మార్గదర్శి!

భారత పరిపాలన వ్యవస్థ పనిపోకడల అధ్యయనానికి తొలి ప్రధాని నెహ్రూ నియమించిన పాల్‌ ఆపిల్‌ బై కమిటీ సర్కారీ వ్యవహారాల సరళిని సరిగ్గా విశ్లేషించింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరే అవకాశమే లేకుండా ముందరి కాళ్లకు బందాలు వేసుకొనే వ్యవస్థ ఇండియాలో తప్ప మరెక్కడా లేదని తొలి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే కుండ బద్దలుకొట్టింది. దురదృష్టవశాత్తు నేటికీ కొనసాగుతున్న ఆ పోకడలకు ఎక్కడికక్కడ అవినీతి జతపడి దేశాభివృద్ధిని కరిమింగిన వెలగపండు చేసేస్తోంది! రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులకు ఉపాధితోపాటు గ్రామ సీమల్లో మౌలిక సౌకర్యాల వృద్ధిని లక్షించిన ఉపాధి హామీ పథకంలో అవినీతి చొరబడి ప్రాథమిక సదుపాయాల కల్పన దేవతావస్త్రమైపోగా- పేదలకు ఒక్క రూపాయి మేలు చేకూర్చడానికి ప్రభుత్వం అయిదు రూపాయలు వ్యయం చేయాల్సి వస్తోందని అధ్యయనాలు చాటుతున్నాయి! అమెరికన్‌ శాస్త్రవేత్త జార్జి వాషింగ్టన్‌ కార్వర్‌ మాటల్లో- ‘చదువంటే, స్వేచ్ఛా స్వర్గపు బంగరు తలుపును తెరిచే తాళం చెవి’! పద్నాలుగేళ్లలోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్యాగంధం అందించాలన్న జాతి నిర్మాతల ఆశయం ఆదేశిక సూత్రాల్లోనే దశాబ్దాలపాటు మలిగిపోగా, స్థల కాలమాన పరిస్థితులకు ఏమాత్రం పొసగని కొరగాని చదువుల జాతర- సమర్థ మానవ వనరుల నిర్మాణ మహా లక్ష్యానికే తలకొరివిగా పరిణమించింది! ‘దేశమంటే మనుషులోయ్‌’ అన్న స్పృహగల దేశాలన్నీ శారీరకంగా మానసికంగా మేధాపరంగా భావితరాల్ని రేపటి సవాళ్లకు దీటుగా తీర్చిదిద్దుకొంటుంటే, ప్రపంచ పోటీతత్వ సూచీలో పదిర్యాంకులు పడిపోయి ఇండియా 68వ స్థానాన నిలిచింది. ఇదా జాతి నిర్మాతలు ఆకాంక్షించిన భారతావని?

గణతంత్ర రాజ్య గమనంలో తొలి నాలుగు దశాబ్దాలూ ‘హిందూ వృద్ధి రేటు’ స్థిరపడి నవ్వులపాలైన దశలో సాగిందంతా లైసెన్స్‌ పర్మిట్‌ కోటాల కోలాటం. ఆర్థిక సంస్కరణల దరిమిలా పారిశ్రామిక సేవారంగాల అగణిత ప్రగతి వృద్ధి రేట్లకు కొత్త రెక్కలు తొడిగినా- పొలంగట్లకు చేరని సంస్కరణల కారణంగా రైతాంగం బతుకులు చితికిపోయాయన్నది నిర్ద్వంద్వం! జాతి ఆహార భద్రతకు వెన్నుదన్నుగా నిలిచే అన్నదాతలు మూడు లక్షలమందికిపైగా గత పాతికేళ్లలో బలవన్మరణాలకు పాల్పడిన ఘోరకలి- రాజ్యాంగ సమన్యాయ సూత్రాల్ని ఏలికలు కాలదన్నిన దుష్ఫలితమేనని చెప్పాలి. నిలకడగా ఏళ్లతరబడి భారీవృద్ధి రేట్లను సాధించే కొద్దీ ప్రగతి ఫలాలు అట్టడుగు స్థాయికి చేరతాయన్న పాలకుల ఆలోచనా విధానం గురితప్పి- పేదరికం కన్నా పెరిగిపోతున్న అసమానతలే పెను సవాలై ఉరుముతున్నాయి! జనాభాలో ఒక్క శాతంగా లెక్కతేలిన అత్యంత ధనవంతుల చెంత దేశ సంపదలో సగానికిపైగా పోగుపడగా, 13.6 కోట్లమంది అత్యంత నిరుపేదలు పద్నాలుగేళ్లుగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు! మంచినీటికీ మొహం వాచే జనావళికి పౌష్టికాహారం, స్వస్థ సేవలు అక్షరాలా అందని ద్రాక్షలు! ప్రతి వ్యక్తి గౌరవప్రద జీవనానికి రాజ్యాంగం ఇచ్చిన భరోసా క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ దిక్కులేనిదవుతుంటే- లౌకికవాద పునాదులపైనే గునపం పోటుగా పౌరసత్వ సవరణ చట్టం తీవ్రాందోళన రేకెత్తిస్తోంది. చట్టానికే చాపచుట్టి ధర్మకర్తలైన అమరావతి రైతులపై ‘లాఠి’Èన్యం ప్రదర్శించే స్థాయిలో ఏపీ రాజధానికి సంకుచిత రాజకీయ గ్రహణం పట్టింది. నేరగ్రస్త రాజకీయమే నారూనీరుగా అవినీతి పుంజాలు తెంచుకొంటున్న వేళ, అన్ని స్థాయుల్లో సమగ్ర సంస్కరణలకు చోటుపెట్టి దేశ భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలంటే- భారత రాజ్యాంగాన్ని మించిన ఆశారేఖ ఇంకేముంది?

Posted on 27-01-2020