Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

లక్ష్యం ‘నీరు’గారి... గమ్యం ఎడారి!

* వట్టిపోయిన అంతర్జాతీయ నీటి దశాబ్దం
ప్రపంచవ్యాప్తంగా సాధారణ జనజీవనాన్ని నీటిఎద్దడి అస్తవ్యస్తం చేస్తోంది. వేలకోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా, సమస్య పరిష్కారం కాకపోగా- ఏటికేడు ముదురుతోంది! రక్షిత మంచినీటికి, మురుగునీటి వ్యవస్థకు దూరమవుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. నీటిసమస్య జటిలం కావడాన్ని గమనించిన ఐక్యరాజ్య సమితి, 2005-2015ని ‘జీవనం కోసం జలం’ దశాబ్దంగా ప్రకటిస్తూ 2003లో తీర్మానం చేసింది. అందుకు అనుగుణంగా 2005 మార్చి 22న ప్రపంచ జలవనరుల దినోత్సవం నుంచి ఈ దశాబ్దం మొదలైంది. ఈ దశాబ్దంలో నీటికి సంబంధించిన అన్ని అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని సమితి ఆనాడే నిర్ణయించింది. వివిధ కార్యక్రమాలు చేపట్టడం, ప్రాజెక్టులు రూపొందించి అమలుపరచడం, మహిళలను భాగస్వాములుగా చేయడం, అన్నిస్థాయుల్లో పరస్పర సహకారం ఏర్పరచడం తదితర లక్ష్యాలతో నీటి ఎద్దడిని పారదోలాలని నిర్ణయించింది. గమ్యం చేరడానికి వీలుగా ప్రతీ సంవత్సరానికి నిర్దిష్ట లక్ష్యం నిర్దేశించారు. 2050నాటికి నీటి సమస్య లేకుండా చేయాలని సంకల్పించారు.

నీటి యుద్ధాల ప్రమాదం

మూడో ప్రపంచ యుద్ధమంటూ జరిగితే, అది నీటికోసమేనన్న వాదం బలపడుతున్న సమయంలో- ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకొంది. దశాబ్దకాలం తరవాత ఇప్పుడు ఐరాస, ఇతర సంస్థలు, శాస్త్రవేత్తలు సమర్పించిన గణాంకాలు చూస్తే- పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. సమితి అంచనాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120కోట్ల జనాభా నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. 50దేశాల్లోని 200మంది ప్రముఖ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో 20శాతం ప్రజలకు రక్షిత తాగునీరు, 50శాతానికి రక్షిత మురుగునీటి వ్యవస్థ అందుబాటులో లేనట్లు వెల్లడైంది. ప్రపంచ వాతావరణ సంస్థ అధ్యయనం ప్రకారం- పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025నాటికి ప్రతి ముగ్గురిలో ఇద్దరు నీటి సమస్యతో సతమతం కావాల్సి వస్తుంది.

ప్రపంచ జనాభా 2050నాటికి 900కోట్లకు చేరుతుందని అంచనా. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం అప్పటికి నీటి వినియోగం ప్రస్తుత వినియోగంతో పోలిస్తే 55శాతం పెరుగుతుంది. 2030నాటికి అవసరమైన నీటిలో కేవలం 60శాతమే అందుబాటులో ఉంటుందంటున్నారు. నీటిఎద్దడివల్ల పంట దిగుబడి తగ్గి, పేదలు పెరిగి, వివిధ దేశాల్లో వివాదాలు రాజుకుంటాయని నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా నేడు 350కోట్లమంది నగరాల్లో జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువమందికి రక్షిత మంచినీటి సౌకర్యం లేదు. 2020నాటికి 90కోట్ల మంది మురికివాడల్లో నివసిస్తారని అంచనా. కలుషిత జలాలవల్ల ఏటా 120కోట్లమంది అనారోగ్యం బారినపడుతుండగా, అయిదు సంవత్సరాల్లోపు వయసున్న పిల్లల్లో 1.5కోట్లమంది చనిపోతున్నారు. ప్రజల అవసరాలు తీరాలంటే 2050నాటికి ప్రపంచవ్యాప్తంగా 60శాతం అధిక ఆహారోత్పత్తి జరగాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనైతే అది 100శాతం పెరగాల్సి ఉంటుంది. అందుకోసం నీటివనరులను ఇతోధికంగా పెంచుకోవాల్సి ఉంది. పైగా 2050నాటికి ఉత్పత్తి రంగ అవసరాలు 400శాతం మేర పెరుగుతాయి. ఇది నీటివనరులపై పెద్దయెత్తున ఒత్తిడి కలిగించబోతోంది.

ప్రపంచవ్యాప్తంగా నీటివనరుల విస్తరణ సమంగా లేదు. కొన్ని దేశాల్లో నీటివనరులు పుష్కలంగా ఉంటే, మరికొన్ని దేశాల్లో చాలా కొద్దిగా ఉన్నాయి. ఒకే దేశంలో కూడా ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు దక్షిణ ఆఫ్రికా ఖండంలో 14 దేశాలు నీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040నాటికి మరో 11 దేశాలు ఈ జాబితాలోకి చేరతాయని అంచనా. వివిధ దేశాల్లో సగటు తలసరి నీటి వినియోగంలోనూ తేడాలు ఉన్నాయి. అమెరికాలో ఒక వ్యక్తి రోజుకు 382 లీటర్లు వినియోగిస్తుండగా ఇజ్రాయెల్‌లో 137, భారత్‌లో 100 లీటర్లు వినియోగిస్తున్నారు. ప్రపంచదేశాలు గత దశాబ్దంకన్నా 2015-2025 దశాబ్దంలో ఎంతో జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుందనేది సుస్పష్టం. 2025నాటికి 611 శతకోటి ఘనమీటర్ల సాగునీరు అవసరం. అది 2050 నాటికి 807శ.ఘ.మీ.లకు చేరుతుందని అంచనా. తాగునీటి అవసరం 62 నుంచి 111శ.ఘ.మీ.కు పెరుగుతుంది.

దేశంలో కష్టాలు

మనదేశంలో సగటు తలసరి నీటిలభ్యత తక్కువ. లభించే నీరూ నాణ్యమైనది కాదు. నీటి సరఫరాలో క్రమబద్ధత లేదు. ఇలాంటి అంశాలు నీటి సమస్యలకు కారణమవుతున్నాయి. దేశంలో 2000లో 63,400 కోట్ల ఘనమీటర్ల నీరు అవసరమైంది. 2025నాటికి ఇది 1,09,300; 2050నాటికి 1,44,700 కోట్ల ఘ.మీ.లకు చేరుతుందని అంచనా. గడచిన 50 సంవత్సరాల్లో సగటు సంవత్సర నీటి తలసరి లభ్యత 3,000 నుంచి 1,123 ఘ.మీ.కు పడిపోయింది. 1951లో 5,177 ఘ.మీ. ఉన్న లభ్యతా పరిమాణం 2001నాటికి 1,820కు, 2011కు 1,545 ఘ.మీ.కు పడిపోవడం దేశచరిత్రలో అతిపెద్ద విషాదం. ఇది మరింతగా తగ్గి 2025నాటికి 1,340, 2050నాటికి 1,140 ఘ.మీ. స్థాయికి పతనమవుతుందని అంచనా. దేశంలోని పెద్ద నగరాల్లో స్థానికంగా నీటి లభ్యత సమస్యాత్మకమవుతోంది. విశాఖలో 91.8శాతం మేర లోటు ఉంది. ఇండోర్‌ 72.8, జబల్‌పూర్‌ 65.4, చెన్నై 53.8, కోల్‌కతా 44, ముంబయి 43.3, బెంగళూరు 39.5, ఉత్తర దిల్లీ 29.8, హైదరాబాద్‌ 24.2శాతం మేర నీటికొరత ఎదుర్కొంటున్నాయి. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) సర్వే ప్రకారం- ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌, కాన్పూరు నగరాల్లో మొత్తం 50లక్షల ఇళ్లకు రక్షిత నీటి సరఫరా లేదు. ఇక గ్రామ ప్రాంతాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వూహించవచ్చు.

భారత్‌లో చాలా ప్రాంతాల్లో నీటివనరులు కలుషితమయ్యాయి. నీటి నాణ్యతపై సర్వేచేసిన 122దేశాల్లో మనదేశం 120వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం దేశంలో 9.7కోట్లమందికి నాణ్యమైన జలం అందడం లేదు. కలుషిత నీటి కారణంగా 21శాతం అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని ప్రపంచబ్యాంకు తన నివేదికలో తెలిపింది. దేశంలో ప్రవహిస్తున్న 445 చిన్నాపెద్దా నదుల్లో కనీసం సగం, మురుగువల్ల కలుషితమయ్యాయి. పర్యావరణ పరిశోధన సంస్థ(టెరీ) జూన్‌ 2015లో విడుదల చేసిన వివరాలనుబట్టి విజయవాడ (కృష్ణా నది), దిల్లీ (యమున), కటక్‌ (మహానది), దిబ్రుగఢ్‌ (బ్రహ్మపుత్ర), జబల్‌పూర్‌ (నర్మద), సూరత్‌ (తపతి), వారణాసి (గంగ) నగరాల వద్ద ఆయా నదుల్లో జలాలు కలుషితమయ్యాయి. ఆ నీటిని శుద్ధి చేయకుండా తాగడం ప్రమాదకరం. ప్రధాన నగరాల నుంచి వెలువడుతున్న మురుగు నీటిలో కేవలం 31శాతం శుద్ధి అవుతోంది. మిగిలిన మురుగు, నదుల్లో చేరడంవల్ల ఈ పరిస్థితి తలెత్తింది. వివిధ రాష్ట్రాల్లో భూగర్భజలం వివిధ రసాయన మూలకాల వల్ల కలుషితమవుతోంది. దేశంలో 19 రాష్ట్రాల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఉంది. పన్నెండో పంచవర్ష ప్రణాళిక కార్యబృందం పరిశీలన ప్రకారం ఇనుము (21), సోడియం క్లోరైడ్‌ (15), నైట్రేట్‌ (12), ఆర్సెనిక్‌ ఎనిమిది రాష్ట్రాల్లో భూగర్భజలాలను కలుషితం చేస్తున్నాయి. ఆయా మూలకాలతో కలుషితమవుతున్న నీటిని తాగుతున్నవారు సంబంధిత వ్యాధుల బారినపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో...

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితిలో పెద్ద మార్పులేదు. ఆంధ్రప్రదేశ్‌లో 34శాతం మేరకు నీటి సరఫరాలో లోటు కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రకారం సగటు తలసరి నీటి లభ్యత అందుబాటు 135లీటర్ల మేరకు ఉండాలి. 80లీటర్లు మాత్రమే సరఫరా అవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 111 మునిసిపాలిటీల్లో 82 పురపాలక సంఘాల్లో ప్రజల అవసరాలకు తగినమేర నీరు సరఫరా కావడం లేదు. తెలంగాణలోనూ పరిస్థితి బాగాలేదు. ఒకప్పుడు 1,920 చెరువులతో కళకళలాడిన రాజధాని హైదరాబాద్‌లో నేడు 525 చెరువులు మాత్రమే మిగిలాయి. చెరువుల పూడికతో 48శాతం సాగునీరు నష్టపోయినట్లు అంచనా. 25,034 జనావాసాల్లో ఫ్లోరైడ్‌ సమస్య ఉంది. అదే ఆంధ్రప్రదేశ్‌లో 47,197 గ్రామాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. 2015లో ఆంధ్రప్రదేశ్‌లో 11.46మీటర్లకు, తెలంగాణలో 6.64మీటర్లకు జలమట్టాలు పడిపోయినట్లు నమోదైంది. వాస్తవిక దృష్టి, పటిష్ఠ కార్యాచరణ, సక్రమ అజమాయిషీతో మాత్రమే నీటిఎద్దడి సమస్యను పారదోలగలం. ఆంధ్రలో నీరు-చెట్టు కార్యక్రమం, తెలంగాణలో మిషన్‌ కాకతీయ వంటి కార్యక్రమాలు ఇందుకు కొంతమేర ఉపయోగపడగల వీలుంది.

మానవాళిని భయపెడుతున్న నీటి సమస్యకు చాలావరకు మానవ తప్పిదాలే పుణ్యం కట్టుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన ‘జీవనం కోసం జలం’ దశాబ్ద కార్యక్రమం జలవనరుల సంరక్షణలో ముందడుగు. ఈ విషయంలో దశాబ్దంలో జరిగిన ప్రగతిని సమితి నిరుడు డిసెంబరు 19న పరిశీలించింది. లోటుపాట్లను పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి గత మార్చిలో సమీక్షా సమావేశం నిర్వహించింది. జూన్‌లో కజకిస్థాన్‌లోని దుషాంబేలో అంతర్జాతీయ ఉన్నతస్థాయి సదస్సు ఏర్పాటు చేసింది. జలవనరుల సక్రమ అభివృద్ధికి మరో దశాబ్దం అన్న నినాదంతో ఆ సదస్సు ముగిసింది.

ఐక్యరాజ్య సమితి లక్షిస్తున్నట్లు 2050నాటికి నీటి సమస్య నుంచి బయటపడాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి ‘జలదీక్ష’ పూనాలి. జల పథకాల నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి. అవగాహన కార్యక్రమాల కోసం స్వచ్ఛంద సేవాసంస్థలకు ఏటా నిధులు అందజేయాలి. ప్రపంచంలో జల సంరక్షణకు పేరెన్నికగన్న ఇజ్రాయెల్‌, సింగపూర్‌, హంగెరీల్లో అనుసరించిన విధానాలను క్రోడీకరించి నీటిఎద్దడి ఉన్న దేశాల్లో ఆ పద్ధతులు అమలయ్యేలా కొత్త దశాబ్దంలో చర్యలు తీసుకొంటేనే ప్రయోజనం ఉంటుంది.

- ఆచార్య పొదిల శంక‌ర‌పిచ్చయ్య
(ర‌చ‌యిత - భూ విజ్ఞాన‌శాస్త్ర విభాగం, ఆచార్య నాగ‌ర్జున విశ్వ‌విద్యాల‌యం)
Posted on 29-12-2015