Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పల్లెకు పట్టం కడతారా?

* కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు

ఈసారి బడ్జెట్‌ ఎలా ఉండబోతోందన్న అంచనాలు ఒకవైపు జోరందుకుంటుంటే- మరోవైపు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థికవేత్తలనుంచి విరివిగా సూచనలు, సిఫార్సులు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యక్ష పన్ను రేట్లకు ప్రభుత్వం సాధ్యమైనంత మేర కోతపెట్టాలన్న సూచన వివిధ వర్గాలనుంచి ప్రముఖంగా వినిపిస్తోంది. దేశంలో నగదు సరఫరాకు చురుకు పుట్టిస్తే డిమాండ్‌ ఊర్థ్వముఖం పడుతుందన్నది ఆర్థికవేత్తల సూచన. పారిశ్రామిక సేవా రంగాలు కొత్త కళను సంతరించుకుంటే ఆర్థిక మాంద్యానికీ ముకుతాడు పడుతుంది. కానీ, భాజపా ఆర్థిక విభాగం అంచనాలు ఇందుకు కాస్త భిన్నంగా ధ్వనిస్తున్నాయి. ఆర్థిక మంత్రికి ఇటీవల ఈ విభాగం ఓ నివేదికను సమర్పించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై, మౌలిక సౌకర్యాల విస్తరణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి ఆ నివేదికలో సూచించారు. పీఎం-కిసాన్‌, ‘నరేగా’ కార్యక్రమాలకు గరిష్ఠంగా నిధులు కేటాయిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి నగదు ప్రవాహం ఇనుమడిస్తుందని ఆ కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే రేపటి బడ్జెట్లో పల్లెపట్టులకు కొత్త ఊపిరి పోసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలోని కీలక వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి పల్లెల వ్యవసాయ కార్యక్రమం కింద 22వేల గ్రామీణ విపణులకు అంకురారోపణ చేయనున్నట్లు తెలుస్తోంది. 2019-20లో గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమానికి రూ.60వేల కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం- ఈ దఫా ఆ మొత్తాన్ని రూ.70వేల కోట్లకు పెంచబోతున్నట్లు సమాచారం.

‘నరేగా’పై ప్రత్యేక దృష్టి
పల్లెల్లో నగదు సరఫరా పెంచే చర్యల్లో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ చెల్లింపుల తీరును ప్రభుత్వం పునస్సమీక్షించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ‘నరేగా’ కేటాయింపుల్లో 60శాతాన్ని వేతనాలకు, 40శాతాన్ని సాధన సామగ్రికి పంచాయతీ స్థాయిలో చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2016 బడ్జెట్లో మోదీ ప్రభుత్వం 60:40 నిష్పత్తిలో వేతనాలు-సాధన సామగ్రికి కేటాయింపులను జిల్లా స్థాయికే పరిమితం చేసింది. జిల్లాస్థానే పంచాయతీల ప్రాతిపదికన ఈ నిష్పత్తిలో వేతనాలను కేటాయిస్తే పల్లెపట్టులకు మరింత డబ్బు సమకూరుతుందనడంలో సందేహం లేదు. ఉపాధి హామీని మరింత విస్తృతీకరించే క్రమంలో ‘హర్‌ ఘర్‌ జల్‌’ (ఇంటింటికీ నల్లా నీరు) కార్యక్రమాన్ని అందులో అంతర్భాగంగా మార్చేందుకు ప్రభుత్వం చురుగ్గా కదులుతోంది. ‘నరేగా’ కార్మికుల వేతనాలను ఎనిమిది శాతం నుంచి 10శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను ఆర్థిక మంత్రి చురుగ్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘నరేగా’ కార్మికుల జాతీయ సగటు వేతనం రోజుకు రూ.181.57గా ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న కనీస వేతనాలతో పోలిస్తే- ‘నరేగా’ వేతనాలు మరీ దిగనాసిగా ఉన్నాయని అంగీకరించక తప్పదు. జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వాటా 1991లో 55శాతం కాగా- 2019నాటికి అది ఆందోళనకర స్థాయులకు పడిపోయింది. దేశవ్యాప్తంగా 55శాతం జనాభా పశువుల పెంపకం, వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాల్లో ఉపాధి పొందుతున్నప్పటికీ- జీడీపీలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వాటా అంతకంతకూ పతనమవుతుండటం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం.

విత్తలోటు వల్ల దేశ ఆర్థిక సమతుల్యత దెబ్బతింటున్న మాట నిజమే అయినప్పటికీ, దాని గురించి మరీ అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది భాజపా ఆర్థిక విభాగం అభిప్రాయం. దానికి బదులు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు కొత్త జవసత్వాలు కల్పించేందుకు వీలుగా వాటికి నిధుల తోడ్పాటు విస్తరించాలని; తొలితరం ఔత్సాహికవేత్తలకు ఆర్థిక మద్దతు పెంచాలని ఆ విభాగం ఆర్థిక మంత్రికి సిఫార్సు చేసింది. న్యాయ వివాదాలు, వ్యాజ్యాలు చుట్టుముట్టడంతో ఎంఎస్‌ఎంఈ రంగం కుదేలవుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ తలపోస్తోంది. రేపటి బడ్జెట్లో ఎంఎస్‌ఎంఈలకు రూ.12,000 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపించారు. కిందటి బడ్జెట్లో ఎంఎస్‌ఎంఈలకు రూ.7,011 కోట్లు కేటాయించారు. దేశ ఉత్పత్తి రంగంలో 45శాతానికి, ఎగుమతుల్లో 40శాతానికి, జీడీపీలో 28శాతానికి ప్రాతినిధ్యం వహించడంతోపాటు 11.10కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలను ఏ రకంగానూ విస్మరించడానికి వీల్లేదు. మరోవంక ఇళ్లు కొనుగోలు చేసినవారి కేసులనూ ‘దివాలా స్మృతి’ పరిధిలోకి చేర్చడంతో ఆ చట్టం అమలుకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా గృహాల కొనుగోలు కేసులు ఎంతకూ తెమలడం లేదు. దివాలా స్మృతి పరిధినుంచి స్థిరాస్తి కంపెనీల (దివాలా విచారణ ఎదుర్కొంటున్న)ను మినహాయించి- దానికోసం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు. దేశవ్యాప్తంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా వాటి రుణ వితరణ బాగా కోసుకుపోయింది. వాటిచుట్టూ నిబంధనల ఉక్కుచట్రం బిగియడంతో 2019 సెప్టెంబరునుంచీ ఎన్‌బీఎఫ్‌సీలు తీవ్రమైన నగదు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యలనుంచి ఎన్‌బీఎఫ్‌సీలను బయటపడవేసేందుకు ప్రభుత్వం సుమారు రూ.32 వేల కోట్లతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా, సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఆస్తులను కొనుగోలు చేసి వాటికి ఊరట కలిగించేందుకు ఆర్థిక మంత్రి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆదాయ మార్గాల అన్వేషణ
ప్రభుత్వ ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉంటే విత్తలోటు ఏర్పడుతుంది. దీని గురించి సాధారణంగా ఆర్థిక వేత్తలే ఎక్కువగా మాట్లాడుతుంటారు. విత్తలోటు అన్నది తమకు సంబంధం లేని వ్యవహారమని సామాన్య ప్రజలు భావిస్తుంటారు. విత్తలోటు ఎంత విస్తరిస్తే ప్రభుత్వ రుణాలపై వడ్డీ రేట్లు అంత పెరుగుతాయి. దానివల్ల గృహ, వాహన, విద్య, వ్యాపార, వ్యక్తిగత రుణాలపై వడ్డీలు భారమై సామాన్య జన జీవనం దుర్భరమవుతుంది. పకడ్బందీ చర్యలతో విత్తలోటును తగ్గించగలిగినట్లయితే సామాన్యులతోపాటు కార్పొరేట్లూ ఊపిరి పీల్చుకుంటాయి. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఊపందుకుంటాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల వ్యవధిలోనే విత్త లోటు 8.2 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయింది. తద్వారా ఆదాయ-వ్యయాల మధ్య అగాధాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం మరిన్ని అప్పులు చేసింది. ఫలితంగా ఆర్థిక స్థితి సమస్యనుంచి సంక్షోభంలోకి జారుకొంది. వివిధ ఆర్థిక సంస్థలనుంచి భారీగా రుణాలు తీసుకుంటున్న మాట నిజమే అయినప్పటికీ- సమస్యలనుంచి తేరుకునేందుకు కేవలం అప్పులే మార్గమని ప్రభుత్వం భావించడం లేదన్న సమర్థన సైతం ఇంకోవైపు వినిపిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలనుంచి పెట్టుబడుల ఉపసంహరణను ఆదాయ సముపార్జనకు కీలక మార్గంగా భావిస్తున్నారనడంలో సందేహం లేదు. ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్షన్నర కోట్ల రూపాయలు సముపార్జించాలన్నది విత్త మంత్రిత్వ శాఖ లక్ష్యం. ఎయిర్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం, రైల్వే కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, తెహ్రీ జలాభివృద్ధి సంస్థ, ఈశాన్య విద్యుత్‌ శక్తి సంస్థతోపాటు మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా లక్ష కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలన్నది ఆర్థికశాఖ ప్రణాళికగా కనిపిస్తోంది. 2019-‘20 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1.05 లక్షల కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 9నాటికి కేవలం రూ.18,095 కోట్లు మాత్రమే సాధించగలిగింది. ఆదాయం కోసుకుపోయి, వ్యయాలు కట్టుతప్పుతున్న ప్రస్తుత తరుణంలో సానుకూల చర్యలతో ఆర్థిక వ్యవస్థను నిర్మాణాత్మక పంథా తొక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను సమస్యలు, సవాళ్లు అలముకున్న పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ను జాతి గతికి కీలక నిర్దేశంగానే పరిగణించాల్సి ఉంటుంది.

అసమానతలెన్నో...
ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలు దేశంలోని మారుమూల పల్లెలకూ చేరినప్పుడే గ్రామీణ పేదరికానికి ముకుతాడు పడుతుంది. స్థూల దేశీయోత్పత్తిలో గ్రామీణ ఆర్థికం వాటా క్రమక్రమంగా కోసుకుపోతుండటం విస్తరిస్తున్న అసమానతలకు దర్పణం పడుతోంది. రుణమాఫీ వంటి పథకాలు తాత్కాలిక ఊరటగా మాత్రమే అక్కరకొస్తాయని- రైతులోకం సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక విధానాలు అన్వేషించాలన్న ఆర్థిక నిపుణుల సూచనలకు మన్నన దక్కని ఫలితమే ఈ దురవస్థ. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాల్లో ఆశించిన స్థాయి పెరుగుదల లేదు. దేశంలో పల్లెలకూ, పట్టణాలకూ మధ్య ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తున్న అంతరాలు దేశాభివృద్ధికి గుదిబండగా నిలుస్తున్నాయి. గ్రామాలకు కొత్త ఊపిరి పోయాల్సిన అత్యవసర పరిస్థితి ఉరుముతున్న తరుణంలో కేంద్ర బడ్జెట్‌ తీరుతెన్నులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గ్రామీణ పేదరికం
జాతీయ గణాంక కార్యాలయ అంచనాల మేరకు 2011-18 మధ్యకాలంలో దేశంలోని పల్లెల్లో పేదరికం నాలుగు పాయింట్లు హెచ్చి సుమారు 30శాతానికి చేరింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదల శాతం ఇలా ఉంది.

తగ్గుతున్న కమతాల విస్తీర్ణం
కమతాల సంఖ్య పెరుగుతున్నా, రైతులు కలిగి ఉండే సగటు భూమి విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. ఫలితంగా వారి ఆదాయాలు అంతకంతకు కోసుకుపోతున్నాయి. ఇందిరాగాంధీ అభివృద్ధి-పరిశోధన సంస్థ అధ్యయనం ప్రకారం- 45 ఏళ్ల క్రితం దేశంలో సుమారు ఏడు కోట్ల కమతాలు ఉంటే 2015-16 నాటికి అవి 14.50 కోట్లకు పెరిగాయి. కమతాల సగటు విస్తీర్ణం మాత్రం తగ్గింది. అంటే గతంలో ఒక్కో రైతు సగటున రెండు హెక్టార్ల భూమిని కలిగి ఉండగా, 2015-16 నాటికి ఆ విస్తీర్ణం 1.08 హెక్టార్లకు తగ్గింది.- రాజీవ్‌ రాజన్‌
Posted on 31-01-2020