Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సముద్ర జలాల్లో సవాళ్లు

* బలోపేతం కావాల్సిన భారత నౌకాదళం

భారతదేశానికి సువిశాల సముద్రతీరం ఆర్థికంగా, అంతర్జాతీయ వాణిజ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను కలుగజేస్తోంది. అయితే తీర ప్రాంత పరిరక్షణలో కీలకభూమిక వహించే నౌకాదళానికి రక్షణ కేటాయింపులు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రక్షణ రంగంలో నౌకాదళానికి 18 శాతం కేటాయింపులు ఉండగా, ప్రస్తుతం 13 శాతానికి తగ్గడాన్ని భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్‌ ప్రస్తావించారు. తాజా కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు కొంతమేరే పెరిగాయి. ఇప్పటికే అనేక కీలక ప్రాజెక్టుల్లో కోత విధించిన నౌకాదళానికి ఈ పరిణామం ఇబ్బందికరమే!

నిరంతర నిఘా కీలకం
భారత్‌కు మూడు వైపులా సముద్రతీరం ఉండటం అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రపంచంలోని పలుదేశాల మధ్య చమురు, ఆహార ధాన్యాలు తదితరాల రవాణా సముద్రాల ద్వారానే జరుగుతోంది. సముద్ర జలాల్లో ఎలాంటి అలజడులు ఏర్పడినా దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పడుతుంది. అందువల్ల భారతీయ నౌకాదళాలను మరింతగా పటిష్ఠపరచుకోవాలని రక్షణ నిపుణులు సూచిస్తున్నారు. భారత్‌కు సముద్ర తీరంతోపాటు అండమాన్‌ నికోబార్‌, లక్షదీవులు కూడా ఉన్నాయి. మరోవైపు భారత ప్రాదేశిక జలాల్లోకి ఇతర నౌకలు రాకుండా నిరంతర నిఘా నిర్వహించాల్సి ఉంటుంది. కొద్దినెలల క్రితమే అండమాన్‌ సమీపంలో చైనా నౌక ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రవేశించింది. భారత నౌకాదళం గట్టి హెచ్చరికలతో తిరుగుముఖం పట్టింది. దాదాపు ఏడు, ఎనిమిది చైనా నౌకలు నిత్యం మన తీరప్రాంతంపై నిఘా పెడుతున్నాయన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

తూర్పు హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహాసముద్రాలను మలక్కా జలసంధి ద్వారా అండమాన్‌ సముద్రం అనుసంధానిస్తోంది. రక్షణపరంగా భారత్‌ పైచేయి సాధించేందుకు అండమాన్‌ దీవులు దోహదపడుతున్నాయి. మలక్కా జలసంధి ద్వారానే చైనాకు మధ్యాసియా నుంచి చమురు సరఫరా జరుగుతోంది. దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనని వాదిస్తున్న చైనా, హిందూ మహాసముద్రం మాత్రం అందరిదని చెబుతుండటం విస్మయకరం. ముత్యాలసరం (స్ట్రింగ్‌ ఆఫ్‌ పెరల్స్‌) ప్రాజెక్టుతో భారత్‌ చుట్టూ నౌకా స్థావరాలు నిర్మిస్తున్న బీజింగ్‌, మియన్మార్‌తోనూ సన్నిహిత సంబంధాలు పెంచుకుంటోంది. మియన్మార్‌ తీరంలోని క్యాక్‌ప్యు నుంచి చైనాలోని కున్మింగ్‌ రాష్ట్రం వరకు చమురు, సహజవాయు సరఫరాకు పైప్‌లైన్‌ నిర్మించారు. మలక్కా జలసంధిలో ఏదైనా అలజడి ఏర్పడితే ఇక్కడి నుంచే చమురు సరఫరా చేయాలన్నది చైనా యోచన. అయితే భారత్‌, మియన్మార్‌, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా, మలేసియాల మధ్య ఉన్న అండమాన్‌ సముద్రంలో ఎటువంటి హక్కూలేని చైనా, చొచ్చుకువచ్చేందుకు యత్నిస్తుండటంపై భారత రక్షణ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

మియన్మార్‌తో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలు ఉగ్రవాద శిబిరాలు ఆ దేశంలో ఉన్నాయి. ఉభయదేశాలు నిరుడు ‘ఆపరేషన్‌ సన్‌షైన్‌’తో పలు ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించాయి. ఇలాంటి పరిస్థితుల్లో మియన్మార్‌ సముద్ర జలాల్లోకి చైనా ప్రవేశం దిల్లీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే భారత్‌కు సమీపంలోని పాక్‌లోని గ్వదర్‌, శ్రీలంకలోని హంబన్‌టొట నౌకాశ్రయాల్లో తిష్ట వేసిన చైనా, తాజాగా హిందూ మహాసముద్రంలో తన ఉనికిని చాటుకోవడానికి యత్నిస్తోంది. చైనాకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, ఇండియాలు కలిసి చతుర్భుజి కూటమిగా ఏర్పడ్డాయి. హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును అడ్డుకోవడంలో భారత్‌దే కీలకపాత్ర అని అమెరికా భావిస్తోంది. ఈ అవకాశాన్ని భారత్‌ సద్వినియోగపరచుకోవాలి. ఆ మేరకు నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఉపక్రమించాలి.

హెర్ముజ్‌ జలసంధి ద్వారా ప్రపంచానికి దాదాపు 60 శాతంపైగా చమురు సరఫరా జరుగుతోంది. అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో హిందూ మహాసముద్రంలో రవాణా నౌకలకు భద్రత పెంచాలని భారత నౌకాదళం నిర్ణయించింది. గత ఏడాది నుంచి ‘ఆపరేషన్‌ సంకల్ప్‌’ పేరిట పర్షియన్‌ గల్ఫ్‌నుంచి భారత్‌కు రవాణా చేసే అన్ని నౌకలకు రక్షణ కల్పిస్తోంది. ఇన్ని సవాళ్లు పొంచి ఉండగా నౌకాదళానికి ఏటా బడ్జెట్‌ కేటాయింపులు తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోందని రక్షణ నిపుణులు వాపోతున్నారు. సుదీర్ఘ సముద్రతీర పరిరక్షణకు కనీసం మూడు విమాన వాహక నౌకలు అవసరం. ప్రస్తుతం ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య మాత్రమే అందుబాటులో ఉంది. మరో నౌక విక్రాంత్‌ 2021కి విధుల్లోకి రానుంది. ఈ నౌకను పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధనౌకల సంచారం పెరగడంతో అక్కడ శాశ్వతంగా ఒక విమాన వాహక నౌకను ఉంచడం భారత రక్షణకు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దుకోవాలన్న ప్రధాని మోదీ కల సాకారం కావాలంటే సైనికపరంగానూ భారత్‌ ప్రబల శక్తిగా అవతరించాలి.

ప్రైవేటుకు ప్రోత్సాహకాలు
తూర్పు, పశ్చిమాసియా, ఆఫ్రికాల మధ్య జరుగుతున్న సముద్ర వాణిజ్యంలో భారత్‌ వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. అందువల్ల నౌకాదళం ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. నౌకా నిర్మాణం సుదీర్ఘమైన ప్రక్రియ. భారీగా నిధులు అవసరం. ప్రాజెక్టు-75లో భాగంగా మొత్తం ఆరు జలాంతర్గాములు నిర్మిస్తారు. ఇప్పటికే రెండింటిని నౌకాదళానికి అప్పగించారు. వీటితోపాటు అణుశక్తితో నడిచే అరిహంత్‌ కూడా ఉంది. ‘భారత్‌లో తయారీ’లో భాగంగా యుద్ధనౌకల నిర్మాణాన్ని పెద్దయెత్తున చేపట్టాలని రక్షణ నిపుణులు కోరుతున్నారు. ప్రస్తుత ఏకధ్రువ ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తిమంతమైన దేశంగా ఉండటానికి నౌకాదళ పాటవమే కారణం. దీన్ని గ్రహించిన చైనా సైతం యుద్ధనౌకల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టింది. అటు పాకిస్థాన్‌ కూడా తన నౌకాదళాన్ని ఆధునీకీకరిస్తోంది. భారత నౌకాదళానికి 200 యుద్ధనౌకల సామర్థ్యం అవసరం. నిధుల కొరత, ప్రాజెక్టుల నత్తనడక, అధికార యంత్రాంగ అలసత్వం వంటి కారణాల వల్ల ప్రస్తుతం 130 నౌకలే ఉన్నాయి. కొత్తగా 50 నౌకలను నిర్మిస్తున్నారు. అయినప్పటికీ 20 నౌకల వరకు కొరత ఉంటుంది. ‘భారత్‌లో తయారీ’లో భాగంగా కేంద్రం మరిన్ని ప్రైవేటు సంస్థలను నౌకా నిర్మాణంలో పాల్గొనేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరముంది!

- కొలకలూరి శ్రీధర్‌
Posted on 02-02-2020