Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

న్యాయం పల్లెబాట!

భారతావని భాగ్యోదయానికి గ్రామ స్వరాజ్య భావనే చుక్కాని కాగలదని గట్టిగా విశ్వసించారు మహాత్మాగాంధీ. పల్లెలకు పంచాయతీయే చట్టసభగా, సచివాలయంగా, న్యాయ పాలికగా సమస్త పనులూ చక్కబెట్టాలన్న బాపూ మాటల్లోని వికేంద్రీకరణ స్ఫూర్తి ఏడు దశాబ్దాల గణతంత్ర భారతంలో పూర్తిగా వట్టిపోయింది. గ్రామీణులకు చేరువగా, సత్వర న్యాయం అందించేదిగా ప్రతీతమైన గ్రామ న్యాయాలయాల చట్టం 2009లో గాంధీ జయంతి నాటినుంచే అమలులోకి వచ్చినా- దీటైన కార్యాచరణ కొరవడి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. జాతీయ ఉత్పాదక మండలి అధ్యయనం మేరకు 2009-‘18 సంవత్సరాల మధ్య కేవలం 11 రాష్ట్రాలే గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ వెలువరించాయని, వాటిలో కూడా 320 న్యాయాలయాలకుగాను 204 మాత్రమే పని చేస్తున్నాయంటూ ‘నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సొసైటీస్‌ ఫర్‌ ఫాస్ట్‌ జస్టిస్‌’ నిరుడు సెప్టెంబరులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రస్తుత న్యాయ వ్యవస్థ చేతిలో గ్రామీణ పేదలు బాధితులుగా మారారంటూ రాజ్యాంగంలోని 39-ఏ అధికరణకు అనుగుణంగా అట్టడుగు స్థాయిలో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు చట్టం నిర్దేశించినా- ఆ స్ఫూర్తి కొడిగట్టిపోవడంపై దాఖలైన వ్యాజ్యం విచారణలో భాగంగా సుప్రీం త్రిసభ్య ధర్మాసనం మేలిమి ఆదేశాలు వెలువరించింది. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఇప్పటిదాకా సమకట్టని రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా సంబంధిత నోటిఫికేషన్లు జారీ చేయాలని జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ కృష్ణ మురారిల ధర్మాసనం విస్పష్ట ఉత్తర్వులు ఇచ్చింది. న్యాయాలయాల ఏర్పాటు, వాటిలో సభ్యుల నియామకాలు పెండింగులో ఉన్న చోట్ల ఆ ప్రక్రియను వేగవంతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సంప్రదింపులు జరపాలనీ స్పష్టీకరించింది. గత ఉత్తర్వుల మేరకు ఛత్తీస్‌గఢ్‌ గుజరాత్‌ హరియాణా తెలంగాణ పశ్చిమ్‌ బంగ ఉత్తరాఖండ్‌ ఒడిశా ప్రమాణ పత్రాలు సమర్పించక పోవడాన్నే తీవ్రంగా పరిగణించిన న్యాయ పాలిక ములుగర్రతో పొడుస్తున్న నేపథ్యంలో- పల్లెలకు సత్వర న్యాయంపై కొత్త ఆశలు మోసులెత్తుతున్నాయి!

ఊరు, దానికొక కట్టుబాటు అనాదిగా భారతావని విలక్షణ సంస్కృతి. గ్రామ పెద్దలు రచ్చబండ దగ్గర చేసే వివాద పరిష్కారం ధర్మబద్ధమైనదిగా మన్ననలందుకొని న్యాయార్థులెవరూ పొలిమేర దాటాల్సిన అవసరం లేకుండా చేసేది! గ్రామీణులకు న్యాయం అంటూ నాలుగు దశాబ్దాల క్రితం దేశవ్యాప్తంగా 30వేల న్యాయ పంచాయతీలు ఏర్పాటైనా, కాలక్రమంలో అవి రాజకీయ కోర్టులుగా భ్రష్టు పట్టిపోయాయి. మూడు దశాబ్దాల క్రితం ఎన్‌టీఆర్‌ సర్కారు మండల ప్రజా న్యాయ పరిషత్తు బిల్లును చట్టసభలో నెగ్గిస్తే, అధికారం తన చేతికి రాగానే కాంగ్రెస్‌ పార్టీ దానిపై వేటు వేసింది. పునరధికారం చేపట్టాక 1995లో మళ్ళీ ఎన్‌టీఆర్‌ ఆ బిల్లుకు ప్రాణ ప్రతిష్ఠ చేసినా, మరుసటి ఏడాదే దానికి నూకలు చెల్లాయి. చిట్టచివరి పంక్తిలోని కడపటి వ్యక్తికీ న్యాయం దక్కాలన్న నెహ్రూ ఆదర్శాన్ని ప్రస్తావిస్తూ మన్‌మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం గ్రామ న్యాయాలయాల చట్టం చేసి- గ్రామానికో కోర్టు ప్రతిపాదనను ఆమోదించింది. దేశీయంగా తొలిదశలో అయిదు వేల పైచిలుకు న్యాయాలయాలు ఏర్పాటు కానున్నాయన్న ప్రకటనలు జోరెత్తినా- మొదట దానికి జై కొట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ దరిమిలా వాటి అవసరం లేదని మాట ఫిరాయించడంతో, ఆ వ్యవస్థ ఆదిలోనే పిల్లిమొగ్గలేసింది. తెలంగాణవ్యాప్తంగా 55, ఆంధ్రప్రదేశ్‌లో 82 న్యాయాలయాల ఏర్పాటుపై నిరుడీ రోజుల్లో కొంత కదలిక కనిపించినా- ఆ చొరవ అంతటితో కనుమరుగైంది. న్యాయ పాలికలో నాలుగో అంచెగా గ్రామ స్థాయికి న్యాయ సేవల్ని వికేంద్రీకరించే ఈ ఏర్పాటు సత్వరం సువ్యవస్థితం అయితే- పల్లెలే కాదు, యావద్దేశమూ ఎంతగానో తేరుకొంటుంది!

పాలను కల్తీ చేశాడంటూ విజేంద్ర అనే యూపీ వ్యక్తిపై 1979లో దాఖలైన కేసును సుప్రీంకోర్టు నిరుడు జులైలో కొట్టేసింది. మొదట మేజిస్ట్రేట్‌ కోర్టు, పిమ్మట సెషన్స్‌ కోర్టు, దరిమిలా హైకోర్టు, తరవాత సుప్రీంకోర్టు- ఇలా నాలుగు దశాబ్దాలు దేకిన కేసు పాలలో నీళ్ల కల్తీకి సంబంధించినదంటే ఏమనుకోవాలి? అన్ని అంచెల్లో మూడు కోట్ల పైచిలుకు పెండింగ్‌ కేసుల భారం, హైకోర్టు న్యాయ పీఠాల్లో వందల సంఖ్యలో, సబార్డినేట్‌ కోర్టుల్లో వేల ఖాళీలు వెక్కిరిస్తున్న దేశం మనది. పలుపుకోసం కోర్టుకెక్కి బర్రెను తెగనమ్ముకోవాల్సి వచ్చే దుస్థితిని గ్రామీణులకు సంప్రాప్తింపజేసేలా ఉన్న న్యాయ వ్యవస్థ దేశ జనాభాలో 70శాతంగా ఉన్న పల్లె ప్రజలకు అక్షరాలా అన్యాయమే చేస్తోంది! సహజ న్యాయ సూత్రాల అనుసారం పనిచేసే న్యాయాలయాలు పౌరస్మృతి, సాక్ష్యాధారాల చట్టానికీ లోబడనక్కర్లేదని, కొని పరిధులకు లోబడి సివిల్‌ క్రిమినల్‌ కేసుల్ని ఆరు నెలల వ్యవధిలో పరిష్కరించాలని చట్టం నిర్దేశిస్తోంది. సమాజంలో అట్టడుగు వర్గాలకు దూరాభారం, ఏళ్లూపూళ్లూ కాలహరణం, వ్యయ ప్రయాసల వంటివేమీ లేకుండా న్యాయాలయాల్ని ఏర్పాటు చేస్తే ఎగువ కోర్టులపై పనిభారమూ తగ్గుతుందని లా కమిషన్‌ 1986నాటి నివేదికలోనే సూచించింది. దేశవ్యాప్తంగా గల దాదాపు 50వేల బ్లాకుల్లో న్యాయాలయాలు ఏర్పాటైతే- గుండెలు రగిలే మండుటెడారిలో అది ఒయాసిస్సే అవుతుంది. ఆయా న్యాయాలయాల ఏర్పాటుకు, నిర్వహణకు అయ్యే వ్యయ పరిమితుల్ని నేటి అంచనాలకు తగ్గట్లు సవరించి, రాష్ట్రాలకు కేంద్రం చేదోడుగా నిలవాలన్న కక్షిదారుల వాదనకూ త్రిసభ్య ధర్మాసనం తథాస్తు పలికింది. ‘అందరికీ న్యాయం’ అన్నది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అయినప్పుడు దాన్ని తొక్కిపట్టే ధోరణుల్ని సహించబోమన్నట్లుగా సుప్రీం న్యాయపాలిక వెలువరిస్తున్న ఆదేశాల్ని సహర్షంగా స్వాగతించాలి!

Posted on 05-02-2020