Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

కబళిస్తున్న గాడ్జిల్లా!

* తడాఖా చూపిస్తున్న ‘ఎల్‌ నినో’
* ఐదు ఖండాల్లో వైపరీత్యాలు
* 50 ఏళ్లలో ఇదే అతిపెద్దది
* దీనివల్లే మనకూ వర్షాభావం

ఐదు ఖండాలు అల్లకల్లోలమైపోతున్నాయి. ఏడాదిగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఎక్కడా సానుకూలంగా లేవు. ఒకవైపు వరదలు, మరోవైపు క్షామాలు.. ఎటుచూసినా వైపరీత్యాలే తాండవిస్తుండటం వాతావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. పసిఫిక్‌ మహా సముద్రంలో నెలకొన్న ‘ఎల్‌ నినో’ పరిస్థితులే దీనంతటికీ మూలమనీ, పైగా ఇంతటి తీవ్రమైన ఎల్‌ నినో గత యాభై ఏళ్లలో ఎన్నడూ సంభవించలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటి వరకూ ప్రపంచ దేశాలన్నింటినీ కకావికలం చేసిన 1997-98 ఎల్‌ నినోనే అతిపెద్దదని అంతా భావిస్తూ వచ్చారు.. కానీ తాజా వాతావరణ పరిస్థితులు ఆ రికార్డులను తిరగరాస్తున్నాయి. అందుకే దీన్ని ‘గాడ్జిల్లా ఎల్‌ నినో’ అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలేమిటీ ఎల్‌ నినో, దీనివల్ల మనం కూడా ప్రభావితమయ్యామా? మున్ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది కీలకంగా తయారైంది.

ప్రపంచ పటం మీద ఎక్కడా వాతావరణం కుదురుగా లేదు. దీనికి పసిఫిక్‌ మహా సముద్రంలో నెలకొన్న ‘ఎల్‌ నినో’ పరిస్థితులే కారణమని, పైగా ప్రస్తుతం నెలకొన్నది అతిపెద్ద ‘ఎల్‌ నినో’ అంటున్నారు. నిజానికి ఎల్‌ నినోలు మనకు కొత్తేం కాదు. పసిఫిక్‌ సముద్ర జలాలు బాగా వేడెక్కిపోయి, ఎల్‌ నినో పరిస్థితులు సంభవించటమన్నది దాదాపు ప్రతి 4-7 ఏళ్లకోసారి చూసేదే. సాధారణంగా ఈ పరిణామం అక్టోబరులో మొదలై జనవరి వరకూ ఉద్ధృతంగానే ఉంటుంది. అరుదుగా ఏడాది పాటు కూడా కొనసాగుతుంది. ఈ ఉష్ణోగ్రతలు ఓ మోస్తరు వరకూ ఉంటే పెద్ద నష్టం ఉండదుగానీ అప్పడప్పుడు మరింత తీవ్రతరమై, ప్రపంచం మొత్తాన్ని విపత్తుల్లోకి నెడతాయి. ఇప్పటి వరకూ 1997-98లలో నెలకొన్న ఎల్‌ నినోనే అత్యంత తీవ్రమైనదని భావిస్తూవచ్చారు. అప్పట్లో దాని కారణంగా ఆస్ట్రేలియాను తీవ్రమైన వేడిగాలులు వణికించేశాయి, ఇండొనేషియాలో దావానలం వ్యాపించింది, పెరూ-క్యాలిఫోర్నియాలను వరదలు ముంచెత్తటంతో దాదాపు 23,000 మంది మృత్యువాతపడ్డారు. ఈక్వడార్‌, పెరూ, బొలీవియాల్లో అపారమైన ఆస్తినష్టం సంభవించింది. ఇండొనేసియా, మలేషియాల్లో పామాయిల్‌ ఉత్పత్తి పూర్తిగా దెబ్బతిని ధరలు ఆకాశాన్నంటాయి. ఎల్‌ నినో తీవ్రత ఎంత భయానకంగా ఉండగలదో ప్రపంచం మొత్తం చవిచూసింది.

అయితే తాజా పరిస్థితులు దానికి ఏమాత్రం తీసిపోయేలా లేవని నాసా విడుదల చేసిన శాటిలైట్‌ చిత్రాలు, వివిధ దేశాల్లో తలెత్తుతున్న వైపరీత్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా దక్షిణ తీరం వెంబడి క్యాలిఫోర్నియా తదితర రాష్ట్రాల్లో వరద బీభత్సం మొదలైంది, ఉత్తర రాష్ట్రాల్లో వర్షాభావం నెలకొంది. దక్షిణాఫ్రికాలో దుర్భిక్షం తాండవిస్తోంది. ఆస్ట్రేలియాలో వాతావరణం పూర్తిగా పొడిబారి, అడవుల్లో కార్చిచ్చు రేగుతోంది, వందలాది ఇళ్లు ఆహుతి అయ్యాయి. దక్షిణ, ఆగ్నేయాసియాల్లో రుతుపవనాలు బలంగా లేక, వర్షాలు కొరవడి పంటలు ఎండిపోతున్నాయి. సహజంగా ఏర్పడే ఎల్‌ నినోకు ఈ దఫా భూతాపం, దాని తాలూకూ దుష్ఫలితాలూ తోడవటంతో పరిస్థితులు అనూహ్యంగా కూడా తయారయ్యాయని శాస్త్రవేత్తలు వాపోతున్నారు.

ముందేం జరగబోతోంది?

పసిఫిక్‌ సముద్ర ఉష్ణోగ్రతలు, ఎల్‌ నినో పరిస్థితులు డిసెంబరు చివరికి తారస్థాయికి చేరుకున్నాయని భావిస్తున్నారు. దీనివల్ల ఈ 2015-16 శీతాకాలం మొత్తం అస్తవ్యస్తమవుతుందని, ఇది మరింత ముదిరి- ఫిబ్రవరి, మార్చిల్లో తీవ్ర ప్రభావాలు తలెత్తుతాయని, ఇవి వేసవి నాటికి క్రమేపీ బలహీనపడొచ్చని అంచనా వేస్తున్నారు. లెక్క ప్రకారం అప్పటికి సముద్ర ఉష్ణోగ్రతలు తటస్థ స్థితికి రావాలి. కానీ ఆస్ట్రేలియా పరిశోధకులు మాత్రం ఎల్‌ నినో మరింతగా బలహీనపడి త్వరలో దీనికి పూర్తి విరుద్ధమైన ‘లా నినా’ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు వేడెక్కిన జలాలే బాగా చల్లబడటం వల్ల తలెత్తేది- లా నినా. దానివల్ల పరిస్థితి పూర్తిగా తిరగబడి- ఇప్పుడు క్షామాలు నెలకొన్న ప్రాంతాల్లోనే భారీ వర్షాలు; వరదలు ముంచెత్తిన చోటే దుర్భిక్షాలు తలెత్తుతాయి. మొత్తానికి అప్పుడూ ఎదురయ్యేది వైపరీత్యాలే. కాబట్టి పరిస్థితి ‘లా నినా’కు దారితీసినా, తీయకున్నా మరికొద్ది నెలల పాటు తీవ్ర వాతావరణం తప్పదని మాత్రం అర్థమవుతోంది.

ఎల్‌ నినో వస్తే మనకేంటి?

ఎక్కడో పసిఫిక్‌ మహా సముద్రం నడిమధ్యలో తలెత్తే ఎల్‌ నినో ప్రభావం మన మీద ఏముంటుందని అనుకోవచ్చుగానీ సముద్ర ఉష్ణోగ్రతలు అస్తవ్యస్తం కావటం వల్ల ఆ ప్రభావం ప్రపంచమంతా పరుచుకుంటుంది. దీనివల్ల మన దేశంలో కూడా వేడిగాలులు పెరిగి, ఇది రుతుపవనాలకు విఘాతంగా తయారవుతుంది. ఈ విపరిణామాన్ని గిల్బర్ట్‌ వాకర్‌ అనే వాతావరణ శాస్త్రవేత్త 1930ల్లోనే గుర్తించాడు. అందుకే ఎల్‌ నినోను శాస్త్రవేత్తలు ‘రుతుపవన శత్రువు’గా కూడా భావిస్తుంటారు. ఈ సారీ ఇదే జరిగింది. ఎల్‌నినో కారణంగా రుతుపవనాలు ఆలస్యంగా రావటంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తి, వరి, గోధుమ, కాఫీ వంటి పంటలన్నీ దెబ్బతిన్నాయి. మరోవైపు ఈ శీతాకాలం చలి పెద్దగా లేకపోవటానికి కూడా ఎల్‌ నినోనే కారణంగా భావిస్తున్నారు. గత 114 ఏళ్లలో చలికాలం ఇంత వేడిగా ఉండటమన్నది మరెన్నడూ లేదని వాతావరణ విభాగం విస్తుబోయింది. పసిఫిక్‌ సముద్రంలో తలెత్తిన ఎల్‌ నినో కారణంగా- బంగాళాఖాతం బాగా వేడెక్కింది. ఇటీవల చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తటానికి ఇదే మూలమని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎల్‌ నినో కారణంగా దక్షిణ భారత దేశంలో వర్షపాతం సాధారణ స్థాయిని మించి అధికంగానే ఉండబోతోందని ఐరాస నివేదిక అంచనా వేసింది. రానున్న వేసవి మన దేశంలో చాలా తీవ్రంగా ఉంటుందని, ఎండలు 45 సెల్సియస్‌ డిగ్రీలను దాటిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో హిందూ మహా సముద్రం చల్లగా ఉంటుంది కాబట్టి.. భూఉపరితలం వేడిగా, సముద్ర తలం చల్లగా ఉండటం వల్ల సముద్రం మీది నుంచి తడిగాలులు భూభాగం వైపు దూసుకొచ్చి, హఠాత్తుగా వేసవిలో భారీ వర్షాలు పట్టుకునే అవకాశమూ ఉంటుంది.

ఎల్‌ నినో: పసిఫిక్‌ సముద్రంలో భూమధ్య రేఖ వెంబడి ప్రాంత సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కిపోయి.. ఉపరితల గాలుల్లో తేడాలు వచ్చి.. దాని కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొనటాన్నే ‘ఎల్‌ నినో’అంటారు. ఈ పరిణామాన్ని జాలర్లు 1600ల్లోనే గమనించారు. స్పానిష్‌ భాషలో ‘ఎల్‌ నినో’ అంటే పసిబాలుడని (బాల క్రీస్తు) అర్థం. సముద్ర జలాల్లో ఈ మార్పులు చాలావరకూ డిసెంబరు నెలలో, అదీ క్రిస్‌మస్‌కు కాస్త అటూఇటూగా తటస్థిస్తుండటంతో దీన్నా పేరుతో పిలవటం మొదలుపెట్టారు. ఎల్‌ నినో పరిస్థితులు నెలకొన్నప్పుడు సాధారణంగా అమెరికా, బ్రెజిల్‌ తదితర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి, అకాల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతాయి. మరోవైపు ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్‌, ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని, క్షామాలు సంభవిస్తాయి.

పసిఫిక్‌ సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కిపోయి, తీవ్ర ఎల్‌ నినో పరిస్థితులు నెలకొన్నాయని పట్టి చూపించే శాటిలైట్‌ చిత్రాలివి. నాసా విడుదల చేసిన ఈ చిత్రాల్లో మొదటిది 1997లోనూ, రెండోది 2015 అక్టోబరులోనూ తీసినవి. వీటిలో పసుపు/నారింజ/ఎరుపు రంగులో కనిపించేదంతా అత్యధిక ఉష్ణోగ్రతలు నెలకొన్న సముద్ర జల ప్రాంతం. పోల్చి చూస్తే- వీటిలో 1997లో కంటే ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని తేలికగానే అర్థమవుతుంది. అందుకే దీన్ని ‘అతి పెద్ద ఎల్‌ నినో’గా గుర్తించారు. మన దేశంలో ఇటీవలి వర్షాభావ పరిస్థితులకు, తాజా శీతాకాలంలో చలి లేకపోవటానికి కూడా ఇదే కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. వాతావరణ చరిత్ర చూసుకుంటే ఇప్పటి వరకూ- 1982-83లో ఒకసారి, 1997-98లలో మరోటి- రెండు ‘సూపర్‌ ఎల్‌ నినో’లు వచ్చాయి. వాటితో పోలిస్తే ప్రస్తుత 2015-16 పరిస్థితి మరింత తీవ్రతరంగా ఉంది. అందుకే దీన్ని ‘గాడ్జిల్లా ఎల్‌ నినో’ అంటున్నారు.

మరో ముప్పు బ్లాబ్‌?

ఎల్‌ నినో కంటే తీవ్రమైన వాతావరణ పరిణామం మరోటి చోటు చేసుకుంటోంది. ‘బ్లాబ్‌’ అనే ముద్దు పేరుతో పిలుస్తున్న ఆ పరిణామాన్ని 2014లో నిక్‌ బాండ్‌ అనే శాస్త్రవేత్త గమనించారు. ఉత్తర అమెరికా పశ్చిమ తీరం వెంబడి భారీఎత్తున సముద్ర జలాలు బాగా వేడెక్కిపోవటం (సాధారణం కంటే 5 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఎక్కువగా) దీని ప్రత్యేకత. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రస్తుతం మెక్సికో నుంచి అలాస్కా వరకూ, అలాగే 60 అడుగుల లోతు జలాల వరకూ కూడా విస్తరించింది. దీనివల్ల అమెరికా, కెనడా తీరాలు, అక్కడి వాతావరణం, జంతుజాలం ఎన్నడూ లేనంతగా దెబ్బతింటున్నాయి. ఉత్తర కాలిఫోర్నియా తీరాల్లో సీళ్లు, సముద్ర సింహాల వంటివి బక్కచిక్కి. ఎముకల పోగులా తయారై వేల సంఖ్యలో, దాదాపు చనిపోయే స్థితిలో ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. అలాగే చన్నీటిలో బతికే చేపలు తీరానికి దూరంగా వెళ్లిపోగా, వేడిని తట్టుకునే ప్రమాదకర జీవాలు తీరాలకు వచ్చేస్తున్నాయి.

- ఈనాడు ప్రత్యేక విభాగం
Posted on 10-1-2016