Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

యాంత్రిక విద్యకు మరమ్మతు!

దేశ జనాభాలో 54 శాతానికిపైగా పాతికేళ్ల యువతతో వచ్చే రెండున్నర దశాబ్దాలపాటు పరవళ్లెత్తనున్న భారతావని, ఎంతమాత్రం వినదలచుకోని మాట- నిరుద్యోగిత. చదువుకు బతుకుతెరువుకు ఏనాడో లంకె తెగిపోయిన గడ్డమీద, సరైన ఉపాధికి నోచనివారి నిష్పత్తి నాలుగున్నర దశాబ్దాల గరిష్ఠ స్థాయికి చేరి ఉరుముతోందన్నది అధికారిక అంచనా. దేశవ్యాప్తంగా విద్యావంతులైన యువజనుల్లో 90శాతం మేర ఉద్యోగాలకు అవసరమైన డిజిటల్‌ మెలకువలు కొరవడ్డాయని నిపుణులు మొత్తుకుంటున్నారు. ఏటా పది లక్షలమంది వరకు ఇంజినీరింగ్‌ పట్టాలు పొంది ఉపాధి వేటలో అడుగిడుతున్నా, వారిలో అరవైశాతం దాకా తగిన ఉద్యోగాలు దక్కక నిరాశా నిస్పృహల్లో కమిలిపోతున్నట్లు అధ్యయనాలు, గణాంకాలు చాటుతున్నాయి. ఈ దుస్థితిని చెదరగొట్టేందుకంటూ, ఇంజినీరింగ్‌ పట్టభద్రుల ఉద్యోగార్హతల్ని పెంపొందించే నిమిత్తం- పట్టణ స్థానిక సంస్థల్లో ఇంటర్న్‌షిప్స్‌ను ఇటీవలి కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదించింది. వాస్తవానికి కిలా (కేరళ స్థానిక పాలన సంస్థ), సుచిత్వ మిషన్‌, క్లీన్‌ కేరళ సంస్థ తదితరాల్లో ఏడాదిపాటు ఇంజినీరింగ్‌ పట్టభద్రులు, సార్వత్రిక పట్టభద్రులు పనిచేసే ఉభయతారక విధాన ప్రతిపాదన గత డిసెంబరులోనే వెలుగుచూసింది. ఎంపికైనవారికి పదివేలనుంచి పదిహేను వేల రూపాయల వరకు ఉపకార వేతనం ఇవ్వనున్నట్లు అప్పట్లో వెల్లడించారు. రెండేళ్ల క్రితం అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సైతం ఈ తరహా ప్రతిపాదనలు వెలువరించింది. నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ చదువు పూర్తయ్యేలోగా ఏదైనా సంబంధిత సంస్థలో 12-24 వారాలపాటు ప్రతి విద్యార్థీ విధిగా పనిచేయాలని 2017లో ఏఐసీటీఈ నిర్దేశించిన దరిమిలా కొంత పరివర్తన నమోదైనా- మౌలికాంశాలపై పట్టు సాధించడంలో అత్యధికులు వెనకబడే ఉంటున్నారు. బడ్జెట్లో వెలిబుచ్చిన సంకల్పాన్ని సాకారం చేసేందుకు కేంద్రం యుద్ధప్రాతిపదికన కదలాల్సి ఉందిప్పుడు!

దేశంలో వేలంవెర్రి చదువులకు మచ్చతునక- ఇంజినీరింగ్‌ విద్య. లక్షలమంది యంత్రవిద్యా పట్టభద్రుల్లో ఉద్యోగార్హత కలిగినవారు కేవలం నాలుగోవంతేనని ప్రఖ్యాత మెకిన్సే సంస్థల వంటివి కొన్నేళ్ల క్రితమే నిగ్గుతేల్చినా- సరైన దిద్దుబాటు చర్యలు పట్టాలకు ఎక్కనేలేదు. సీఎస్‌ఈ, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, మెకాట్రానిక్స్‌ వంటి విభాగాలతో పోలిస్తే మెకానికల్‌, ఎలెక్ట్రానిక్స్‌, సివిల్‌, ఎలెక్ట్రికల్‌ లాంటి సంప్రదాయ కోర్సుల్లో అధికంగా సీట్లు ఖాళీగా మిగిలిపోవడం చూస్తున్నాం. మంజూరైన సీట్లలో 30 శాతమైనా నిండని కళాశాలల్ని, కోర్సుల్ని చాపచుట్టేయాలన్న యోచనల నేపథ్యంలో- పనికొచ్చే సీట్లు పెంచాలన్న సూచనలు జోరెత్తుతున్నాయి. భవిష్యత్తులో విప్పారే అవకాశాలను ఒడుపుగా అందిపుచ్చుకోగలిగేలా మేలిమి కోర్సుల ఎంపిక ఎంత కీలకమో, ఉద్యోగం వరించేలా నైపుణ్యాలు ఒంటపట్టించుకోవడం అంతే ముఖ్యం. ఆ మధ్య ఇంటర్న్‌షిప్స్‌పై అఖిల భారత సాంకేతిక విద్యామండలి పట్టుపట్టిన దరిమిలా చిన్న మధ్యతరహా సంస్థల్లో, జాతీయ రహదారి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కార్యాలయాల్లో పనిపోకడల్ని ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం లక్షన్నర మంది వరకు విద్యార్థులు ముందుకొచ్చారు. కొన్నాళ్లుగా భారతీయ రైల్వే- వేసవిలో రెండు నెలలపాటు బీటెక్‌, ఎంబీయే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తోంది. యూపీ, మహారాష్ట్ర, హరియాణా ప్రభృత రాష్ట్రాల్లో జిల్లా మేజిస్ట్రేట్ల చొరవతో అటువంటివి మొదలైనా నెల్లాళ్లకు పరిమితమవుతున్నాయి. ఒక్క ఇంజినీరింగ్‌ విద్యార్థులనేముంది- దేశంలో ఉద్యోగార్థులందరికీ తగిన ఉపాధి అవకాశం లభింపజేయడమన్నది ఇటువంటి అరకొర యత్నాల ద్వారా సాధ్యపడేది కాదు. బడి దశ నుంచే పనికొచ్చే చదువులకు ఒరవడి దిద్దాలి. అందుకు అనుగుణంగా విద్యావ్యవస్థలో సమగ్ర సంస్కరణలకు చోటుపెట్టాలి.

ఉపాధికి గట్టి నిచ్చెన వేసే లక్ష్యంతో, సుమారు నాలుగేళ్ల క్రితం కేంద్రం ‘నైపుణ్య భారత్‌ మిషన్‌’ ఆవిష్కరించింది. ప్రారంభంనుంచి ఏటా సగటున కోటిమంది వరకు సుశిక్షితుల్ని తీర్చిదిద్దినట్లు అది చాటుకున్నా, వాస్తవిక కార్యాచరణలో చతికిలపాటుకు సీఎమ్‌ఐఈ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ) నివేదికే రుజువు. వృత్తి ఉద్యోగాలకు సన్నద్ధంగా ఉన్న నిపుణుల ప్రాతిపదికన 63 దేశాల జాబితాలో భారత్‌ 53వ స్థానాన అలమటించడం, జాతికే తలవంపులు. యూకే 68శాతం, జర్మనీ 75శాతం దాకా యువతను నిపుణ శ్రామికులుగా తీర్చిదిద్దుతుండగా- దక్షిణ కొరియాలో ఆ రేటు ఎకాయెకి 96శాతం! ఇండియాలో అది అయిదు శాతం లోపేనంటే- విధానపరంగా, వ్యవస్థాగతంగా ఏళ్ల తరబడి ఇక్కడి అలవిమాలిన అలసత్వం ప్రస్ఫుటమవుతుంది. నాణ్యమైన విద్య సమకూర్చి నైపుణ్యాలతో రాటుతేల్చి సమధిక మానవ పెట్టుబడులకు నెలవులుగా నార్వే, ఫిన్లాండ్‌, స్విట్జర్లాండ్‌, డెన్మార్క్‌, జర్మనీ లాంటివి వెలుగొందుతున్నాయి. వాటితో మనమూ పోటీపడాలంటే వచ్చే 40, 50 ఏళ్లపాటు ఏయే రంగాల్లో ఎన్నెన్ని నిపుణ మానవ వనరుల అవసరం ఉందో మదింపు వేసి, అందుకు తగిన కోర్సులు రూపొందించి, ఉత్తమ బోధన సిబ్బందితో కళాశాలల్ని విశ్వవిద్యాలయాల్ని పరిపుష్టం చేయాలి. పొట్టపోసుకోవడం కోసం చిన్నా చితకా ఉపాధి అవకాశాలకూ వెంపర్లాడే యువతను కాదు- కృత్రిమ మేధ, డేటా ఎనలిటిక్స్‌, సైబర్‌ భద్రతవంటి విభాగాల్లో నిష్ణాతుల్ని ప్రభుత్వాలు అవతరింపజేయాలి. యువత సాధికారతను, ఆత్మగౌరవాన్ని పెంపొందింపజేయడంలో నైపుణ్యాభివృద్ధి పాత్ర ఎనలేనిది. దాన్ని ఏ దశలోనూ విస్మరించకుండా- పునాదినుంచే పిల్లల్లో పరిశోధన, సృజనలపట్ల ఆసక్తిని మొలకెత్తించి వారు ఎంచుకున్న రంగంలో నిపుణ శక్తులుగా ఎదిగే వాతావరణ పరికల్పన బాధ్యత ప్రజాప్రభుత్వాల భుజస్కంధాలపైన ఉంది!

Posted on 08-02-2020