Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

రైతుకేదీ ‘సహకార’ బలం?

* ఎన్నికలప్పుడే సంఘాల హడావుడి

తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌) పాలక వర్గాల పదవీకాలం 2018 ఫిబ్రవరితోనే ముగిసింది. తెలంగాణలో ఏడేళ్ల తరవాత నేడు ఎన్నికలు జరగనుండగా, ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారో ఇంకా తేల్చలేదు. పూర్తిగా రైతులే సభ్యులుగా ఉండే ఈ సంఘాలు పంటల సాగు మొదలు అమ్మకాలదాకా ఏడాది పొడవునా అన్నదాతకు అన్నిరకాల సేవలు అందిస్తూ ఇతోధికంగా సాయపడాలి. రాజకీయాలకు తావులేకుండా సంఘాలను నడపాలని, పారదర్శకంగా ఉండాలని సహకార చట్టమే చెబుతోంది. వాస్తవంలో- ఎన్నికల నిర్వహణ, పాలకవర్గాల ఎన్నికలు మొదలుకొని సంఘం నిర్వహణదాకా అంతటా రాజకీయాలతో నిండిపోతున్నాయి. కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక సంఘాలు రాజకీయ నేతల కనుసన్నల్లో పని చేస్తున్నాయి. ఈ కారణంగానే దేశంలో 38,036 సంఘాలు నష్టాల జాబితాకెక్కాయి. వీటి నష్టాలే రూ.3,200 కోట్లకు పైబడ్డాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో నూతన పాలకవర్గాల చేతిలోకి సంఘాల పాలన రానుంది. సహకార సంఘాల పరిస్థితులపై అవలోకన జరపాల్సిన తరుణమిది.

పాలక వర్గం... అక్రమాలమయం
గడచిన దశాబ్ద కాలం(2008-19)లో దేశంలో రైతులకిచ్చే పంట రుణాల మొత్తం మూడు లక్షల కోట్ల రూపాయల నుంచి రూ.12.55 లక్షల కోట్లకు చేరినట్లు నాబార్డు ప్రకటించింది. వచ్చే ఏడాది రూ.15 లక్షల కోట్ల రుణాల పంపిణీతో వ్యవసాయ రంగానికి మరింత చేయూతనిస్తామని కేంద్రం ఇటీవలి బడ్జెట్లో వెల్లడించింది. ఈ అంకెలు ఘనంగా ఉన్నా లోతుకెళ్లి పరిశీలిస్తే రైతులకెంత సాయం అందుతుందనేది అంతుపట్టడం లేదు. రైతులకు చేరువగా గ్రామస్థాయిలో అందుబాటులో ఉండేది ప్యాక్స్‌, సహకార బ్యాంకులే. దేశంలో సహకార రంగం ద్వారా రైతులకు పంపిణీ అయ్యే సొమ్ము మొత్తం వ్యవసాయ రుణాల్లో 2015-19 మధ్య నాలుగేళ్ల వ్యవధిలోనే 17 నుంచి 12 శాతానికి తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో దేశవ్యాప్తంగా రూ.12.55 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలుగా ఇస్తే రూ.1,53,882 కోట్లే సహకార రంగం ద్వారా రైతులకు అందాయి. వ్యవసాయ రుణాల పంపిణీలో వాణిజ్య బ్యాంకుల వాటా 76 శాతానికి చేరింది. ఈ వాణిజ్య బ్యాంకులన్నీ గ్రామాల్లో రైతులకు అందుబాటులో లేవు. అందుబాటులో ఉండే సహకార సంఘాలు రుణాలివ్వవు. ఈ సంఘాల నుంచి రైతులకు రుణాలు, సేవలు అందాలంటే ‘జిల్లా కేంద్ర సహకార బ్యాంకు’(డీసీసీబీ) లేదా రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకుల నుంచి నిధులు రావాలి. నిధులిచ్చి సాయపడే డీసీసీబీలకుగానీ, అపెక్స్‌ బ్యాంకులకుగానీ సంఘాలపై పర్యవేక్షణ, నియంత్రణ అధికారం లేదు. సంఘం పాలకవర్గం చేతిలోనే పెత్తనం ఉంది. బ్యాంకుల నుంచి రైతులకిస్తామని తీసుకున్న నిధుల్ని పాలకవర్గం దుర్వినియోగం చేస్తే అడిగే నాథుడే లేడు. తీరిగ్గా ఏళ్ల తరవాత ఎప్పుడో ఒకసారి అరకొరగా అక్రమాలు బయటపడితే వాటిపై విచారణ జరిపే అధికారం రాష్ట్ర సహకార శాఖ అధికారులకే ఉంటోంది. ఆ అధికారులను సంఘాల పాలకవర్గాల్లో అక్రమాలకు పాల్పడిన నేతలు మభ్యపెడితే అవినీతి మరుగునపడిపోతోంది. తెలంగాణలో మొత్తం 909 ప్యాక్స్‌కుగాను, 34 శాతం సంఘాలు నష్టాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2,051 ప్యాక్స్‌కుగాను 811 నష్టాల బాటలో ఉన్నాయి. తెలంగాణలో 384 సంఘాలు నష్టాల కారణంగా సరైన వ్యాపారం చేయలేక, రైతులకు సేవలందించలేక నామమాత్రంగా నడుస్తున్నాయి. ఈ సంఘాలే కాకుండా- వీటికి నిధులిచ్చి సాయపడాల్సిన డీసీసీబీల్లో సైతం కొన్నిచోట్ల అక్రమాలు, నష్టాలు తప్పడం లేదు. దేశంలో కేరళను మినహాయిస్తే అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా పేరొందిన వాటిలోనూ సహకార సంఘాలు, డీసీసీబీల్లో అక్రమాలు, నష్టాలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదాహరణకు 2017-18లో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 363 డీసీసీబీల నష్టాలు రూ.893 కోట్లదాకా ఉన్నట్లు నాబార్డు తాజా నివేదికలో ఎండగట్టింది. సంఘాలు, డీసీసీబీలపై రాజకీయ నాయకులు పెత్తనం చేస్తూ దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతంతో వాటిని భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలున్నాయి.

వాస్తవానికి రైతులకు అనేక రకాల సేవలు అందించే పరపతియేతర వ్యాపారానికి నిధులు అవసరం లేదు. ఎరువులు, విత్తనాలు, యంత్రాలు వంటివాటిని కంపెనీల నుంచి అప్పు రూపంలో తీసుకుని అమ్ముకుని లాభాలు ఆర్జించేందుకు ప్యాక్స్‌కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఏటా 45 లక్షల టన్నులదాకా ఎరువులు కొంటున్నారు. వీటిని ప్యాక్స్‌ ద్వారానే సక్రమంగా రైతులకు నిర్ణీత ధరలకు అమ్మితే వందల కోట్ల రూపాయల కమిషన్‌ దక్కుతుంది. ఎరువులు తెచ్చుకోవడానికి ముందుగా ఎవరికీ సంఘాలు పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ సహకార మార్కెటింగ్‌ సమాఖ్యలే నేరుగా కంపెనీల నుంచి ఎరువులు కొని సంఘాల వద్ద నిల్వ చేసి అందిస్తున్నాయి. వాటిని అప్పుపై తీసుకుని రైతులకు సక్రమంగా అమ్మి తిరిగి సమాఖ్యలకు సొమ్ము చెల్లించలేని అధ్వాన స్థితిలో సంఘాలుండటం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు తీసుకున్న ప్యాక్స్‌ పాలకవర్గాలు వాటిని అడ్డదారిలో అమ్ముకుని లాభాలు దండుకుంటున్నాయి. విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ యంత్రాలు మొదలుకొని పంటల కొనుగోలు, విక్రయాలతోపాటు ఇంకా అనేక రకాల సేవలను రైతులకు అందించేందుకు ప్యాక్స్‌కు అవకాశాలున్నా ఉపయోగించుకోవడం లేదు.

బహుళ సేవల కేంద్రాలుగా మారాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్యాక్స్‌కు ఏటా ఎలాంటి ఆర్థిక సహాయం లేకపోవడం మరో పెద్దలోపం. గ్రామస్థాయిలో ప్రజలకు సేవలందించే ‘ఉమ్మడి సేవా కేంద్రాల’ను ప్యాక్స్‌ల్లోనే ఏర్పాటుచేస్తే వాటిపై కమిషన్‌ రూపంలో ఆదాయం అందుతుంది. ఇవి బహుళ సేవల కేంద్రాలుగా మారినప్పుడు ఆదాయం పెరుగుతుంది. సభ్యులందరికీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటివాటిని కంపెనీ నుంచి నేరుగా తక్కువ ధరలకు కొని ఇవ్వడం మంచిది. వాతావరణం ఆధారంగా ఆయా ప్రాంతాల్లో అధికంగా పండే పంటలను ‘పంటకాలనీలు’గా సాగు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచిస్తోంది. ఇలా పండించే రైతులు అక్కడే సంఘంగా ఏర్పడి వాటిని విదేశాలకు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. ప్రస్తుతమున్న ప్యాక్స్‌లన్నీ రాజకీయాలతో నిండిపోవడంతో కొత్తగా ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాల’ (ఎఫ్‌పీఓ) పేరుతో మళ్లీ రైతులతోనే కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేస్తున్నారు. ఇలాకాకుండా, ఇప్పటికే ఎంతోకొంత మౌలిక సౌకర్యాలతో ఉన్న ప్యాక్స్‌నే- ఎఫ్‌పీఓల తరహాలో అభివృద్ధి చేసే దిశగా ఆలోచించాలి. అల్లకల్లోల పరిస్థితులున్న దేశాల్లో సైతం సహకార సంఘాలు నిలదొక్కుకుని ప్రజల అభివృద్ధికి సాయపడ్డాయి. న్యూజిలాండ్‌ వంటి చిన్నదేశంలోని పాల ఉత్పత్తిదారుల సంఘాలు ప్రపంచ పాల విపణిని శాసిస్తున్నాయి. భారత్‌లోనూ గుజరాత్‌ పాడిరైతుల సంఘాలు లాభాలు ఆర్జిస్తున్నా- తెలుగు రాష్ట్రాల్లో సంఘాల అభివృద్ధి ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. ప్యాక్స్‌లలో పదవుల్ని కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న రాజకీయ నేతలు- రైతులకు సేవలు, రుణాలు అందిస్తూ పంటల దిగుబడి పెంచేలా సంఘాలను తీర్చిదిద్దితేనే దేశ, రాష్ట్ర, గ్రామాల ఆర్థికాభివృద్ధి సాధ్యపడు తుంది. సంఘాలకు చేయూతనిచ్చి రైతులకు, గ్రామాలకు సేవలందించే ‘వనరుల కేంద్రం’గా మార్చేందుకు అన్నిస్థాయుల్లోని ప్రజాప్రతినిధులూ కృషి చేస్తేనే సహకార స్ఫూర్తి పరిఢవిల్లుతుంది.

భరోసా ఇస్తేనే మనుగడ
దేశంలో మొత్తం 95,595 ప్యాక్స్‌లలో 13.12కోట్ల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. మొత్తం సభ్యుల్లో కేవలం 40 శాతం (5.20 కోట్ల మంది) మాత్రమే వ్యవసాయ రుణాలు పొందుతున్నారు. సగానికి పైగా సభ్యులకు రుణాలివ్వకపోవడం వెనక అనేక లొసుగులున్నాయి. సంఘాలకు నిధులిచ్చే సంస్థలకు ఏమాత్రం అధికారం లేకుండా- పూర్తిగా పాలక వర్గాల చేతిలో అధికారాలు పెట్టడంవల్ల వారి రాజకీయాలు, అక్రమాలతో కొన్ని అధోగతి పాలవుతున్నాయి. వైద్యనాథన్‌ కమిటీ సిఫార్సులతో స్వయం ప్రతిపత్తినిస్తే కొన్ని సంఘాల పాలకవర్గాలు దాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చొరవగా శ్రద్ధ చూపిన చోట మాత్రమే ప్యాక్స్‌ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఉదాహరణకు, కేరళలో విదేశాల నుంచి తమ కుటుంబ సభ్యులు పంపే నిధులను సైతం అక్కడి రైతులు సహకార సంఘాల్లో డిపాజిట్‌ చేస్తున్నారు. ఆ డిపాజిట్లు గల్లంతైతే వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు చట్టపరంగా బీమా సదుపాయాన్ని కేరళ ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసింది. ఇలా తమ డిపాజిట్లకు ప్రభుత్వం ద్వారా రక్షణ ఉండటంతో కేరళీయులు ప్యాక్స్‌లను నమ్ముతున్నారు. దేశం మొత్తమ్మీద ప్యాక్స్‌లో రూ.1.15 లక్షల కోట్ల వరకు డిపాజిట్లుంటే- మూడొంతులకుపైగా కేరళ సంఘాల్లోనే ఉన్నాయి.- మంగమూరి శ్రీనివాస్‌
Posted on 15-02-2020