Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

మాదక ద్రవ్యాల పంజా(బ్‌)!

* పాక్‌ ఉగ్రదాడికి వూతం
పఠాన్‌ కోట్‌ వైమానిక స్థావరంపై పాక్‌ ఉగ్రవాదుల దాడి, టెర్రరిజానికీ మాదక ద్రవ్య వ్యాపారానికీ మధ్య ఉన్న ప్రమాదకరమైన పొత్తును బయటపెట్టింది. పాకిస్థాన్‌ నుంచి మాదక ద్రవ్య అక్రమ రవాణాకు స్మగ్లర్లు ఉపయోగించే మార్గం ద్వారానే టెర్రరిస్టులు పంజాబ్‌లోకి చొరబడ్డారని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. స్మగ్లర్లు మొదట మాదకద్రవ్యాలతోపాటు ఆయుధాలనూ పఠాన్‌ కోట్‌ పరిసరాలకు చేర్చారనీ, వారి వెనుక పంజాబ్‌లో ప్రవేశించిన టెర్రరిస్టులు ఆ ఆయుధాలతో వైమానిక స్థావరంపై దాడికి దిగారని తెలుస్తోంది. పఠాన్‌ కోట్‌ ఉదంతంలో టెర్రరిస్టులు కిడ్నాప్‌ చేసి తరవాత తీరిగ్గా విడచిపుచ్చారని చెబుతున్న పోలీస్‌ సూపరింటెండెంట్‌ సల్వీందర్‌ సింగ్‌కు స్మగ్లర్లతో సంబంధాలు ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవలి వరకు గురుదాస్‌ పూర్‌ జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్‌పీ హోదాలో ఉన్న సల్వీందర్‌ అయిదుగురు మహిళా కానిస్టేబుళ్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు రావడంతో ఆయన్ను జలంధర్‌కు బదలీచేశారు. దాడి జరిగే సమయానికి సల్వీందర్‌ గురుదాస్‌ పూర్‌ నుంచి పొరుగు జిల్లా పఠాన్‌ కోట్‌కు ఎందుకు వెళ్లినట్లు? అదీ స్మగ్లర్ల రూటుకు దగ్గర్లోని కొలియాన్‌ గ్రామం వద్ద ఎందుకు సంచరించినట్లు? అని అనుమానాలు రేకెత్తాయి. తన మిత్రుడు, ఆభరణ వ్యాపారి రాజేశ్‌ వర్మ, వంటవాడు మదన్‌ గోపాల్‌లతో కలిసి జనవరి 1 అర్ధరాత్రి ఒక ప్రార్థన మందిరానికి వెళ్లానని సల్వీందర్‌ చెబుతున్నారు. అక్కడ టెర్రరిస్టులు తారసపడి సల్వీందర్‌ అధికార వాహనాన్ని హైజాక్‌ చేశారట! సల్వీందర్‌ బృందంలోని ముగ్గుర్నీ ప్రాణాలతో విడచిపెట్టారట! సొంత పని మీద వెళ్లేటప్పుడు అధికార వాహనాన్ని ఉపయోగించడమెందుకో! సల్వీందర్‌ కథనంతో సంతృప్తి చెందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆయనకు మాదకద్రవ్య మాఫియాతో సంబంధాలున్నాయా అనే కోణం నుంచి దర్యాప్తు జరుపుతోంది.

అకాలీ మంత్రుల మిలాఖత్‌?
ఆయన సంగతి అటుంచితే, పాక్‌ స్మగ్లర్లతోపాటు అకాలీదళ్‌, కాంగ్రెస్‌ నాయకులతోనూ సంబంధాలున్న 80మంది పోలీసు అధికారుల జాబితాను మాజీ అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్‌) శశి కాంత్‌, 2014లోనే పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు సమర్పించారు. మాదక ద్రవ్య స్మగ్లర్లతో పోలీసులే కాదు, సరిహద్దు భద్రతా దళ (బిఎస్‌ఎఫ్‌) సిబ్బంది కూడా కుమ్మక్కు అయ్యారని చాలాకాలం నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా కనీసం ముగ్గురు నలుగురు బీఎస్‌ఎఫ్‌ కమాండెంట్లు, అనేకమంది జవాన్లు, దిగువస్థాయి అధికారులు కటకటాల పాలయ్యారు. సరిహద్దులో పహరా లోపాలను పఠాన్‌ కోట్‌ దాడి మరొక్కసారి బయటపెట్టింది. స్మగ్లర్లు పాకిస్థాన్‌ నుంచి పంజాబ్‌కు రెండు మార్గాల గుండా మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారు. కరెంటు కంచె ఉన్న చోట పీవీసీ పైపుల్లో మాదకద్రవ్య పొట్లాలు పెట్టి పంజాబ్‌ వైపు తోస్తున్నారు. కరెంటు కంచె కింద తవ్విన గోతుల ద్వారా కూడా మాదకద్రవ్యాలను నెడుతున్నారు. అక్కడి నుంచి కిలోకు రూ.60,000 చొప్పున చెల్లించి ‘కొరియర్ల’ ద్వారా లోతట్టు ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. నిఘా వ్యవస్థ కళ్లు గప్పడానికి భారతీయ స్మగ్లర్లు పాకిస్థానీ ‘సిమ్‌’ కార్డులనూ, పాక్‌ స్మగ్లర్లు భారతీయ ‘సిమ్‌’ కార్డులను ఉపయోగిస్తున్నారు. సరిహద్దుల్లో పక్కా రోడ్డు లేకపోవడం స్మగ్లర్లకు కలిసివస్తోంది.

మాదకద్రవ్య అక్రమ రవాణాకు స్మగ్లర్లు ఎంచుకున్న రెండో మార్గం-నదీ మార్గం. రావి, బియాస్‌ నదులు ప్రవహించే 100 కిలోమీటర్ల ప్రాంతం గుండా మత్తుమందులను పడవల్లో రవాణా చేస్తున్నారు. ఈ నదీ పరీవాహక ప్రాంతం గురుదాస్‌ పూర్‌, పఠాన్‌ కోట్‌ జిల్లాల సమీపంలోనే ఉంది. గురుదాస్‌ పూర్‌ ప్రాంతం మాదక ద్రవ్య అక్రమ రవాణాకు ఆయువుపట్టుగా మారింది. ఈ జిల్లాలో టెర్రరిస్టులు సరిహద్దు దాటడం ఇది రెండోసారి. ఆరు నెలల క్రితం పాక్‌ టెర్రరిస్టులు ఇదే జిల్లాలో చొరబడి ఒక బస్సుపై కాల్పులు జరిపి, దీనా నగర్‌ పోలీస్‌ స్టేషన్‌పై దాడికి దిగారు. ఈ ఉదంతంపై ఎన్‌ఐఏ పరిశోధనకు రాష్ట్ర పోలీసులు మోకాలడ్డారనీ, మాఫియాతో పోలీసుల మిలాఖత్‌కు అదే నిదర్శనమని మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎస్‌.ఎస్‌.విర్క్‌ వ్యాఖ్యానించారు. దీనా నగర్‌ కేసులో కుమ్మక్కును అప్పుడే బయటపెట్టి ఉంటే పఠాన్‌ కోట్‌ దాడి జరిగి ఉండేది కాదన్నారు. పాక్‌ నుంచి పంజాబ్‌లో ప్రవేశించిన మత్తుమందులు స్థానిక రాజకీయ నాయకులు, పోలీసుల అండతో మార్కెట్లోకి ప్రవహిస్తున్నాయని చాలాకాలంనుంచి ఆరోపణలు వినవస్తున్నాయి.

కనీసం ఆరుగురు అకాలీ మంత్రులకు మాదక ద్రవ్య మాఫియాతో సంబంధాలున్నాయని పంజాబ్‌ అంతటా చెవులు కొరుక్కుంటున్నారు. అర్జున అవార్డు పొందిన మల్లయోధుడు, మాజీ డి.ఎస్‌.పి జగదీశ్‌ భోలా నాయకత్వంలోని రూ.700కోట్ల ‘నార్కో’ ముఠాను 2014లో విచ్ఛిన్నం చేసినప్పుడు, రాష్ట్ర మంత్రి బిక్రం సింగ్‌ మజీతియాకు మాదక ద్రవ్య వ్యాపారంతో సంబంధం ఉందని భోలా బయటపెట్టారు. మజీతియా స్వయాన ఉప ముఖ్యమంత్రి సుఖ్‌ బీర్‌ సింగ్‌ బాదల్‌ బావమరిది. ఇక సుఖ్‌ బీర్‌ సాక్షాత్తూ పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడు. మజీతియాకు 2007-2012 మధ్యకాలంలో రూ.35లక్షలు లంచంగా చెల్లించానని సింథటిక్‌ మందుల వ్యాపారి జగ్జిత్‌ సింగ్‌ చవాల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు లిఖితపూర్వకంగా తెలిపాడు. మజీతియాపై ఆరోపణలను కొట్టివేసిన ఉప ముఖ్యమంత్రి సుఖ్‌ బీర్‌ బాదల్‌, సదరు ఆరోపణలు రుజువైతే చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసులు, రాజకీయనాయకుల కుమ్మక్కుతో విజృంభించిన మాదక ద్రవ్య (నార్కో) వ్యాపారం టెర్రరిజానికి నిధులు సమకూరుస్తోందని మాజీ డీజీపీ శశికాంత్‌ వివరిస్తున్నారు. ‘నార్కో’ నిధులను పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వెచ్చించారని పటియాలా సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ హర్‌దయాళ్‌ సింగ్‌ మాన్‌ నిర్ధారించారు. ఇవాళ 50శాతంమంది పంజాబ్‌ పోలీసులు మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డారనీ, వారితో ఆ అలవాటు మాన్పించడానికి ప్రత్యేక సంఘాలు ఏర్పాటుచేశారనీ వార్తలు వస్తున్నాయి.

ఇక పౌర సమాజంలో మాదకద్రవ్యాలు సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. భూసార క్షీణం, తరిగిపోతున్న పంట దిగుబడులు, భారీ వ్యవసాయ రుణ భారం పంజాబ్‌ ఆర్థిక వ్యవస్థను కుంగదీశాయి. ఈ నిరాశామయ వాతావరణంలో యువజనులు మత్తుమందులకు తేలిగ్గా బానిసలైపోతున్నారు. రాష్ట్రంలో 75శాతం యువజనులు మాదకద్రవ్యాలను రుచిచూశారని అంచనా. నేడు 67శాతం పంజాబ్‌ గ్రామీణ కుటుంబాల్లో మాదక ద్రవ్య అలవాటుకు బానిసైన వ్యక్తి కుటుంబానికి కనీసం ఒక్కరైనా ఉన్నారని పంజాబ్‌ సామాజిక భద్రత శాఖ సర్వే తేల్చింది. 2013లో మాదకద్రవ్య నిషేధ చట్టం (ఎన్‌డీపీఎస్‌) కింద దేశమంతటా నమోదైన కేసుల్లో సగం పంజాబ్‌లోనే దాఖలయ్యాయి. 2011లో బీఎస్‌ఎఫ్‌ 67కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంటే, 2014లో 324 కిలోలు పట్టుకుంది. దాడులలో పట్టుబడిన మాదకద్రవ్యాల్లొ కేవలం 10శాతాన్ని మాత్రమే పోలీసులు ధ్వంసం చేస్తున్నారని పంజాబ్‌, హరియాణా హైకోర్టు దృష్టికి వచ్చింది. పోలీసులు తగులబెడుతున్న మాదకద్రవ్య కుప్పలు ఆవు పేడ తప్ప మరేమీ కాదని సాక్షాత్తు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పట్టుబడిన మాదక ద్రవ్యాలు తిరిగి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయనీ కోర్టు వ్యాఖ్యానించింది.

తాలిబన్‌, లష్కరే తోయిబాలతోపాటు అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)లు కూడా మాదకద్రవ్య వ్యాపారం ద్వారా వచ్చే నిధులను టెర్రరిస్టు కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి. దీంతో పంజాబ్‌తోపాటు యావత్‌ భారతదేశానికీ ముప్పు పెరగబోతోంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే పంజాబ్‌ మరో మెక్సికోలా మారే ప్రమాదం ఉందని మాజీ డీజీపీ శశికాంత్‌ హెచ్చరిస్తున్నారు. 2015లో ఒక్క మెక్సికోలోనే మాఫియా హింసాకాండకు 20,000మంది బలయ్యారు. పఠాన్‌ కోట్‌ దాడి తరవాత మెక్సికోలో ప్రపంచ మాదకద్రవ్య రారాజు జొవాకిన్‌ గుజ్‌మన్‌ అరెస్టు కావడం కాకతాళీయమే కావచ్చు. కానీ, గుజ్‌మన్‌ నేతృత్వంలోని సినలోవా మాఫియాకు భారత్‌, టర్కీలలోని నేరస్థుల ముఠాలతో సంబంధాలున్నాయని అమెరికన్‌ నిపుణుడు ఎడ్గార్డో బుస్కాగ్లియా వెల్లడించారు. గుజ్‌ మన్‌ ముఠా అఫ్గానిస్థాన్‌, టర్కీల నుంచి హెరాయిన్‌, కొలంబియా నుంచి కొకైన్‌ కొని అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో విక్రయిస్తోంది. నేడు ప్రపంచ హెరాయిన్‌ సరఫరాల్లో 90శాతం అఫ్గానిస్థాన్‌ నుంచే వస్తోందని బుస్కాగ్లియా తెలియజేశారు.

ఆయుధాలకు ప్రధాన వనరు
అఫ్గానిస్థాన్‌ నుంచి పాకిస్థాన్‌ మీదుగా పంజాబ్‌కు నల్లమందు, హెరాయిన్‌ ధారాళంగా ప్రవహిస్తున్నాయి. ఈ మాదక ద్రవ్యాలతోపాటు పంజాబ్‌లో తయారవుతున్న సింథటిక్‌ మత్తు మందుల్లో 40-50శాతం అమెరికా, కెనడా, ఐరోపా దేశాలకు అక్రమంగా రవాణా అవుతున్నాయి. కెనడాలోని పంజాబీ మాఫియా మాతృదేశం నుంచి హెరాయిన్‌, మెక్సికో నుంచి కొకైన్‌ తీసుకొచ్చి కెనడాలో విక్రయిస్తోంది. ఎనిమిదో దశకం మధ్యనాళ్లలో ఖలిస్థానీ ఉద్యమానికి కెనడా సిక్కులు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమ నీడలోనే పాక్‌ సైనిక గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ పంజాబ్‌లో మాదకద్రవ్య అక్రమ రవాణాకు తెరలేపింది. పంజాబ్‌ నుంచి మత్తుమందులు దిల్లీ, ముంబయ్‌, గోవా తదితర భారతీయ నగరాలకు ప్రవహిస్తున్నాయి. ఈ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్న దావూద్‌ ఇబ్రహీం ముఠా 2014లో తన వూడలను ఆఫ్రికాకు కూడా విస్తరించి, నైజీరియాలోని ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ బోకో హరాంతో చేతులు కలిపింది. ఇటీవల భారత్‌లో నైజీరియా మాదకద్రవ్య బేహారుల కార్యకలాపాలు పెరగడం ఇక్కడ గమనార్హం. భారత్‌, తదితర దేశాలలో మాదక ద్రవ్యాలు విక్రయించగా వచ్చే డబ్బుతో ‘బోకో’ ఆయుధాలు కొంటోంది. ఇతర టెర్రరిస్టు సంస్థలదీ ఇదే బాణీ. 2014లో టెర్రరిజం వల్ల ప్రపంచవ్యాప్తంగా 32,658మంది హతమయ్యారు. టెర్రరిజానికీ మాదక ద్రవ్య మాఫియాకూ మధ్యనున్న లంకెపై భారతదేశం అప్రమత్తం కావాలి. మాదకద్రవ్య సమస్య కేవలం పంజాబ్‌కు సంబంధించినదనే అపోహను విడనాడి టెర్రరిస్టులతోపాటు మాదకద్రవ్య మాఫియా పని పట్టడానికీ జోరుగా చర్యలు తీసుకోవాలి.

- ఏఏవీ ప్రసాద్‌
Posted on 18-1-2016