Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

‘ఈ-పాలన’తో సామాజిక న్యాయం

* బడుగుల దరికి ‘సంక్షేమం’

ప్రజాసంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేయడానికి ‘ఈ-పాలన’ అవసరం అంతకంతకు పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని ‘ఈ-పాలన’గా వ్యవహరిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం త్వరితగతిన మారిపోతుండటంతో బ్యాంకింగ్‌ రంగంలోనూ పెనుమార్పులు వస్తున్నాయి. నగదు రహిత సేవలు పుంజుకోవడంతో ‘ఈ-పాలన’ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఆర్థిక అక్షరాస్యతను మెరుగుపరచడమే కాకుండా, డిజిటల్‌ లావాదేవీలను ప్రజలకు చేరువ చేయడానికీ తోడ్పడుతోంది. ‘ఈ-గవర్నెన్స్‌’ అమలు ద్వారా పారదర్శకత పెరిగింది. ఇరువైపులా సత్వర సమాచార మార్పిడి సులభసాధ్యమైంది. దీంతో ప్రతి పౌరుడికి నాణ్యమైన సేవలు అందించాలనే కల సాకారమవుతోంది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అరికట్టడానికి ఈ మార్పు ఎంతగానో దోహదపడుతుందనడంలో మరోమాట లేదు.

‘ఈ-పాలన’ అమలు ద్వారా సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వస్తున్న మార్పులు, అభివృద్ధిపై పడుతున్న సానుకూల ప్రభావాన్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పరిపాలన సామర్థ్యం మెరుగుపడి సామాజిక అభివృద్ధి సాధనాలైన విద్య, వైద్యం, రవాణా, భద్రత, నీటి సరఫరా లాంటి నాణ్యమైన పౌర సేవలకు అవకాశం కల్పిస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు; ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులకు అన్ని సేవలను ఎలెక్ట్రానిక్‌ రూపంలో అందుబాటులోకి తీసుకురావడాన్నే ‘ఈ-పాలన’గా వ్యవహరిస్తారు. ‘స్మార్ట్‌ గవర్నెన్స్‌’ అనేది దీనికి మరోపేరు. బాధ్యతాయుతంగా, పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగడంవల్ల అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా చేరడానికి అవకాశాలు ఏర్పడతాయి. ప్రజల సామాజిక, ఆర్థిక, సుస్థిరాభివృద్ధికి ఈ మార్పు ఎంతో కీలకం. భూ సంబంధమైన లావాదేవీలనూ ఆధునిక సాంకేతిక వినియోగం ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వాలు ఉపక్రమిస్తున్నాయి. భూ రికార్డులను డిజిటలీకరిస్తున్నారు. ‘జియోగ్రాఫిక్‌ సమాచార విధానం’ ద్వారా పంట ఉత్పత్తిని పెంచే మార్గాలు, తెగులు నివారణ సలహాలు, పర్యావరణ హితకరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడం... వంటి చర్యలూ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ప్రజల్లో ఆర్థిక సాంకేతిక అక్షరాస్యతను పెంపొందించేందుకూ పాలకులు చర్యలు చేపడుతున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌ (పీఎంజీడీఎస్‌ఏ) అందులో ఒకటి. కుటుంబంలో కనీసం ఒకరికి సాంకేతిక అక్షరాస్యత కల్పనే ఈ పథకం నిర్దేశిత లక్ష్యం. ‘ఈ-పాలన’ విధానాల అమలుకు పునాదిగా ఇది ఉపయోగపడుతుంది. ఆధార్‌ ఆధారిత చెల్లింపు విధానం (ఏఈపీఎస్‌), బిమ్‌-యూపీఐ, భారత్‌ క్యూఆర్‌ కోడ్‌, నేషనల్‌ ఎలెక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్స్‌ వంటి సేవలూ ఈ-పాలనలో భాగాలే. ‘యూనిఫైడ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ఫర్‌ న్యూ ఏజ్‌ గవర్నెన్స్‌ (ఉమాంగ్‌)’ ద్వారా దేశంలోని పదమూడు భాషల్లో సుమారు 490 కేంద్ర ప్రభుత్వ సేవలను ఒకే ‘యాప్‌’ ద్వారా పొందవచ్చు. ఉద్యోగులు తమ పింఛను వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే సదుపాయం కల్పించారు. ‘నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌’ రాకతో విద్యారంగంలో ఉపకార వేతనాల నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడింది. వాటిని విద్యార్థులకూ నేరుగా అందజేసే సౌలభ్యాన్ని సాంకేతిక పరిజ్ఞాన వినియోగం సాకారం చేసింది. ఉత్సాహవంతులు స్వయంగా విద్య అభ్యసించేందుకు కేంద్రప్రభుత్వం ‘ఆన్‌లైన్‌’లో ఉచితంగా కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ‘జాతీయ విజ్ఞాన వ్యవస్థ’ ద్వారా ఉన్నత విద్యాసంస్థలనూ అనుసంధానిస్తున్నారు. దీనివల్ల విద్యాసంస్థల్లో నాణ్యమైన బృంద పరిశోధనలకు అవకాశం కలుగుతుంది. నవకల్పనలకు ఊతమిచ్చే ఈ మార్పు మేధా వలసల నియంత్రణకూ దోహదపడుతుంది. ఈ-ఆస్పత్రుల ఏర్పాటు మరో మేలిమి పరిణామం. పథకాల అమలు తీరుపై అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ‘మై గవర్నమెంట్‌ సిటిజన్‌ పోర్టల్‌’ అవకాశం కల్పిస్తోంది. ‘ఈ-పాలన’ బహుముఖాలుగా విస్తరిస్తోందనడానికి ఈ పథకాలు తిరుగులేని దాఖలాలు.

రాష్ట్రాలు సైతం ‘ఈ-పాలన’ విధానాలను అందిపుచ్చుకొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ‘రియల్‌ టైం గవర్నెన్స్‌’, పింఛన్ల పంపిణీ, ఇతర పథకాల అమలులో సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నారు. తెలంగాణలో పౌర సరఫరా విభాగంలో ‘ఈ-పీడీఎస్‌’ అమలవుతోంది. దీనివల్ల నకిలీ రేషన్‌ కార్డుల ఏరివేత సాధ్యపడుతోంది. కేరళలో ‘ఫ్రెండ్స్‌’ రాజస్థాన్‌ ప్రవేశపెట్టిన ‘జన సోచ్నవేదిక’, కర్ణాటకలోని ‘ఖజానే ప్రాజెక్ట్‌’- ‘ఈ-పాలన’కు బాటలు పరుస్తున్నాయి. ఈ విధానం అమలులో ప్రారంభ వ్యయం ఎక్కువ కావచ్చు, ప్రజలు సాంకేతికతకు అలవాటు పడటంలో బాలారిష్టాలూ అనివార్యం కావచ్చు. కానీ, లబ్ధి ఫలాలు అంతిమంగా ప్రజలకు నిరాటంకంగా చేరడానికి ‘ఈ-పాలన’ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రజలూ క్రమేణా వీటికి అలవాటుపడుతున్న వైనం కొంతకాలంగా ప్రస్ఫుటమవుతోంది. అయినా చేయవలసింది ఎంతో ఉందన్నది నిర్వివాదాంశం.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘డిజిటల్‌ ఇండియా’తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ‘ఈ-పాలన’ ప్రాధాన్యం గుర్తించాల్సి ఉంది. అందుకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు తగిన శిక్షణ అందజేయడం అవసరం. సాంకేతిక మార్పుల గురించి ప్రజలకు సులభంగా అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు రూపొందించి అమలుపరచాలి. ‘ఈ-పాలన’ విజయవంతం కావాలంటే ఈ ప్రక్రియలో ప్రజలనూ భాగస్వాములను చేయడం కీలకం!

- డాక్టర్‌ ఎం.బుచ్చయ్య
(రచయిత- వాణిజ్యశాస్త్ర నిపుణులు)
Posted on 22-02-2020