Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అంతర్జాలమే తరగతి గది!

* ఉన్నత విద్యలో తొలగుతున్న దూరాభారాలు
ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేవనుంది. అహ్మదాబాద్‌లో ఇటీవల ఓ కీలక సమావేశంలో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఉపాధ్యక్షులు చేసిన ప్రకటన ఆ మేరకు నిర్దిష్ట సంకేతాలు అందించింది. దేశంలోని 850కిపైగా ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ కొత్త మార్పులు అందిపుచ్చుకొనేందుకు సమాయత్తం కావాలన్న ‘యూజీసీ’ పిలుపు ఒకరకంగా ‘వర్సిటీల’ మొద్దునిద్ర వదిలించేదే! ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా అభ్యసించడానికి వీలుగా ‘ఆన్‌లైన్‌ కోర్సు’లు రూపొందించాలన్న అంశంపై ఆ సమావేశం ఎక్కువగా దృష్టి సారించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ‘మూక్స్‌’ తరహాలో యువత కోసం ‘స్వయం’ పోర్టల్‌ను మానవ వనరులశాఖ ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికే కొన్ని కోర్సులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

సరికొత్త పోకడ
భారత ప్రభుత్వం నూతన విద్యావిధానం ఆవిష్కరించడానికి ముందే రెండు ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఒకటి ఐచ్ఛికంగా ఎంచుకొనే ‘క్రెడిట్ల’ పద్ధతి. రెండోది- అంతర్జాలం ద్వారా విద్యార్జన మార్గాలకు ద్వారాలు తెరచుకోవడం. విద్యార్థులు తాము ఎంచుకొనే ‘క్రెడిట్ల’ పద్ధతిలో ప్రధాన పాఠ్య విభాగాలతోపాటు, వారికి ఆసక్తి ఉన్న లేదా అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి ఉపకరించే అంశాలను మొత్తం కోర్సులో 20శాతం మేర ఎంపిక చేసుకునే అవకాశం అతి త్వరలో రాబోతోంది. ఇక ఉన్నత విద్యలో అంతర్జాల కోర్సులకు ఆదరణ క్రమేపీ పెరుగుతోంది. ఓ అంచనా ప్రకారం ఆరున్నర లక్షల మంది భారతీయులు ఇప్పటికే ఎడక్స్‌, కోర్స్‌ఎరా వంటి అంతర్జాల కోర్సులు అందించే సంస్థల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. విద్యను అభ్యసించడంలో యువతలో మారుతున్న అభిరుచికి ఇది సంకేతం. పేర్లు నమోదు చేసుకున్నవారిలో నేరుగా తరగతి గదులకు హాజరవుతున్న విద్యార్థులూ లక్షల సంఖ్యలో ఉండటం కొత్త కోణం. ఒకరకంగా ఇది మంచి పరిణామం. నేటి యువతకు సమాచార సాంకేతిక రంగాలకు సంబంధించిన వివిధ అప్లికేషన్లలో ప్రావీణ్యం తప్పనిసరి అవసరం అయింది. వారి అభ్యసన, ఉద్యోగ, దైనందిన అవసరాల్లో ఈ అప్లికేషన్ల వినియోగం అనివార్యంగా మారుతోంది. యువతకు కొత్త అవకాశాలు కల్పించే దిశగా విధానకర్తలను, విద్యావేత్తలను ప్రేరేపిస్తున్న పరిణామమిది. రాన్రాను అంతర్జాల బోధన, అభ్యసనలకు ఉన్నత విద్యావ్యవస్థలో చోటు పెరుగుతోంది. అభ్యసిస్తున్న డిగ్రీల్లో ఇరవై శాతానికి సమానమైన అంతర్జాల కోర్సులను గుర్తింపు పొందిన ఇతర విశ్వవిద్యాసంస్థల నుంచి పొందవచ్చునని యూజీసీ విధాన నిర్ణయం తీసుకొంది. ఆ మేరకు ప్రకటన వెలువడటమే తరువాయి. విద్యావ్యవస్థను సాంకేతిక పథం తొక్కిస్తున్న ఈ పరిణామాలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నాయి. హైస్కూలు నుంచి విశ్వవిద్యాలయాల వరకు అనేక కోర్సులను ముఖాముఖి పద్ధతిలో విన్న అనుభూతి కలిగించే విధంగా అంతర్జాలం ద్వారా రకరకాల కోర్సులు అందించేందుకు యూజీసీ కృతనిశ్చయంతో ఉన్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్‌పీటీఈఎల్‌ (సాంకేతిక విజ్ఞానంతో అభ్యసనను కొనసాగించే జాతీయ కార్యక్రమం) 23 పాఠ్యాంశాల్లో సుమారు తొంభైకిపైగా కోర్సులు అందిస్తోంది. యూజీసీ ప్రయోగానికి వూపునిచ్చే పరిణామమిది.
సాంకేతిక విజ్ఞాన సాయంతో అత్యధిక సంఖ్యలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం గట్టి సవాలే. అయితే, విద్యారంగం ఏనాటి నుంచో ఎదుర్కొంటున్న మరో నాలుగు సవాళ్లనూ ఈ సందర్భంగా చర్చించుకోవాల్సి ఉంది. అవి: అందరికీ అందుబాటులో విద్య, చదువుల్లో నాణ్యత, సమకాలీన అవసరాలకు తగిన విద్య, సమృద్ధిగా నిధులు. ఈ నాలుగూ దేశంలో విద్యారంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు. ఇటీవలి అధ్యయనాల్లో దేశంలో కేవలం 23శాతం విద్యార్థులు మాత్రమే వయసుకు తగిన విద్య అభ్యసిస్తున్నారని తెలియజేస్తున్నాయి. మరోవంక నాణ్యమైన విద్యకు సంబంధించి జవాబులు వెదకాల్సిన ఎన్నో ప్రశ్నలు మనముందున్నాయి. ప్రస్తుత అవసరాలకు తగిన విద్య అందించడంలోనూ వెనకబాటు కనిపిస్తోంది. ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో సుమారు ఎనభైశాతం నిరుద్యోగులుగానే మిగిలిపోతుండటం శోచనీయం. ప్రమాణాలు పెంచేందుకు తగినన్ని ఆర్థిక వనరులు లభించకపోవడం బాధ కలిగించే విషయం. ఆర్థిక వనరుల సమస్య ఈనాటిది కాదు. అది 1968నుంచీ ఉన్న పరిస్థితే. నిధుల కేటాయింపులో 1998నుంచి కొంత పెరుగుదల ఉన్నప్పటికీ కాలంతోపాటు పెరుగుతున్న సవాళ్ల స్థాయికి తగినట్లుగా మాత్రం అవి లేవు.
ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నాసిరకం విద్య అందించడంలో పోటీపడుతున్నాయి. అడుగంటుతున్న విద్యా ప్రమాణాలు ప్రభుత్వాన్నే నిర్ఘాంతపరుస్తున్నాయి. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఆచరణలో ఎంతగా విఫలమవుతుందో కళ్లకు కనిపిస్తూనే ఉంది. వ్యవస్థలోని లోపాలను ఎక్కడికక్కడ అలాగే ఉంచి, కళాశాలల్లో తనిఖీలకు ప్రభుత్వ యంత్రాంగం పరిమితమవుతుండటం పతనమవుతున్న ప్రమాణాలకే నిదర్శనం. విద్యార్థులు విషయాలను అవగతం చేసుకుని, నేర్చుకొనే పద్ధతుల్లోనూ ఎన్నో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు భారతీయ సమాజంలో వెన్వెంటనే అంతర్భాగంగా మారిపోతున్నాయి. సమస్యను సరైన కోణంలో అర్థంచేసుకొని పరిష్కారాలు చూపాల్సిన బాధ్యత- విద్యావేత్తలది, విధానకర్తలది! బోధన, అభ్యసనల్లో నాణ్యత అన్నవి పరస్పరం ప్రభావితమయ్యే అంశాలు. బోధన రంగంలో ఆశించిన మార్పులు తీసుకురావడం అనుకున్నంత తేలిక కాదు. బోధనలో నాణ్యత పెంచడానికి ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఓపెన్‌, దూరవిద్య విధానాలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పాలి. సమాచార సాంకేతిక ఆధారిత బోధన పద్ధతులూ విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్‌ సాంకేతిక పరిజ్ఞాన ఆగమనంతో విద్యార్జనలో నూతన శకం మొదలైంది. భారత ప్రభుత్వం ఇటీవల ‘ఈ-పాఠశాల’కు అంకురారోపణ చేయడం ద్వారా బహుముఖ కోణాల్లో జ్ఞానాన్ని సముపార్జించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో తరగతుల నిర్వహణకు తగిన సాధన సంపత్తి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

దారిచూపిన పశ్చిమ దేశాలు
అంతర్జాల విద్యకు సంబంధించి విదేశాలు భారత్‌తో పోలిస్తే ఎంతో ముందున్నాయి. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధిపరచిన ‘కోర్స్‌ఎరా’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడినుంచైనా అనేక రకాల కోర్సులు చదువుకోగల అద్భుత అవకాశం ఆవిష్కృతమైంది. సుమారు 20కిపైగా ఉన్న ఇలాంటి అంతర్జాలయ విద్యాసంస్థల్లో అధికంగా నమోదు చేసుకుంటున్నవారిలో అమెరికన్లది తొలిస్థానం. రెండో స్థానంలో భారతీయులు ఉండటం గమనార్హం. శాస్త్ర సాంకేతిక కోర్సులతోపాటు సామాజిక, మానవీయ శాస్త్రాల్లోనూ ఈ సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. ఒకేచోట తరగతి గదులు, బోధన కార్యకలాపాల నిర్వహణ అనే పద్ధతిని ఎమ్‌ఐటీ, హార్వర్డ్‌ వంటి సంస్థలు సమూలంగా మార్చివేశాయి. ఈ విద్యాసంస్థలు అందించే కోర్సులను తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో అందిపుచ్చుకొంటున్నారు.

కాలానుగుణ మార్పులు
పదేళ్ల క్రితమే భారత్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎమ్‌లు ఈ తరహా కోర్సులను అంతర్జాలం ద్వారా అందించడం ప్రారంభించాయి. విద్యాబోధనలో చాపకింద నీరులా విస్తరిస్తున్న మార్పులను, ఆయా రంగాల్లో వస్తున్న నూతన ధోరణులను గమనించి కాలానుగుణంగా కోర్సులను అభివృద్ధి చేయడం తప్పనిసరి. సాంకేతిక విజ్ఞాన సాయంతో పాఠ్యాంశాలను అభ్యసించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలూ మెండుగా ఉంటున్నాయి. కాలంతోపాటు వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు ఈ కోర్సుల్లో భాగం చేయాలి. ఆ రకంగా నేటితరానికి అంతర్జాల విద్యాకోర్సులు తిరుగులేని వరాలుగా మారబోతున్నాయి. ఆయా రంగాల్లో ఆధునిక మార్పులను గుర్తించి ఎప్పటికప్పుడు కోర్సులను నవీకరించడం ఎంతో అవసరం. అంతర్జాల విద్యావిధానం ప్రపంచాన్ని పలకరించి ఇప్పటికే దశాబ్దం దాటిపోయింది. అన్ని వయసులవారూ ఈ పద్ధతి ద్వారా విద్య అభ్యసించేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల బోధకులకూ ఎంతో వెసులుబాటు లభిస్తోంది. తాజా మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, తమను తాము నవీకరించుకునేందుకు ఈ ఆధునిక విద్యావిధానం వారికి అవకాశం ఇస్తోంది. విద్యార్థుల అభ్యసనం తీరుతెన్నులను నిర్దిష్టంగా మదింపు చేసి, వారిని మరింత సానపట్టేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది. పాఠ్యాంశానికి సంబంధించిన సమాచారం, చిత్రాలు, వీడియోలు, పట్టికలు వంటి వనరులన్నీ ఒకేచోట లభించడంవల్ల, ఆయా అంశాలను నేర్చుకోవడం- ఆసక్తికరం, విజ్ఞానదాయకం! యూజీసీ సూచించబోయే నూతన విధానంలో విద్యార్థులు 60శాతం నుంచి 70శాతం వరకు పాఠ్యాంశాలకు సంబంధించిన మౌలిక విషయాలను సంప్రదాయ పద్ధతిలోనే నేర్చుకుంటారు. మిగిలిన 30శాతం పాఠ్యాంశాలను మారుతున్న అవసరాలకు తగిన నైపుణ్యాలను అలవరచుకునేందుకు ఉపకరించే కోర్సులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ తరహా నైపుణ్యాలను వివిధ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎమ్‌లు వంటి విఖ్యాత సంస్థలు అందించే అంతర్జాల కోర్సులను ఎంపిక చేసుకోవడం ద్వారా పెద్దగా శ్రమ, ఖర్చు లేకుండానే నేర్చుకోవచ్చు. ఆ మేరకు సునాయాసంగా డిగ్రీలూ పూర్తిచేయవచ్చు. ఈ తరహా సమ్మిళిత కోర్సుల అభ్యసనంవల్ల పట్టాల విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఈ తరహా మార్పులను సమర్థంగా అమలు చేయాలంటే ఉన్నత విద్యాసంస్థలు, వివిధ విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారం చాలా అవసరం. జ్ఞానాన్ని మించిన సంపద లేదు. అజ్ఞానంకంటే పేదరికంలేదు. గతిశీల ప్రపంచం నిరంతరం మనకందిస్తున్న విలువైన సూత్రమిది. దీన్ని ఆచరణలోకి మార్చుకోవడమే ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం.

- ఆచార్య ఇవటూరి రామబ్రహ్మం
Posted on 01-06-2016