Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పప్పుల ధరలతో తిప్పలు

* నష్టపోతున్న రైతులు, వినియోగదారులు

దేశవాసుల ఆహార అవసరాల్లో పప్పు దినుసులకు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం దేశంలో సుమారు 2.2 కోట్ల హెక్టార్లలో 1.4 కోట్ల టన్నుల పప్పు దినుసులు పండించేవారు. నాటి డిమాండ్‌కు ఆ మాత్రం ఉత్పత్తి సరిపోయింది. కానీ, 2010నాటికి పరిస్థితులు మారాయి. పప్పు ధాన్యాలకు దేశవ్యాప్తంగా గిరాకీ ఇనుమడించింది. మొత్తంగా 2.6 కోట్ల హెక్టార్లలో సుమారు 1.6 కోట్ల టన్నులు పండించినా- డిమాండ్‌ పెరిగినందువల్ల ఆ ఉత్పత్తి సరిపోలేదు. ఫలితంగా అప్పట్లో 40 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. 2015నాటికి దేశీయంగా పప్పు ధాన్యాలకు గిరాకీ క్రమంగా పెరిగి 2.2 కోట్ల టన్నులకు చేరింది. ఫలితంగా దిగుమతులు సైతం 50 లక్షల టన్నులకు పెరిగాయి. 2015లో కందిపప్పు ధర మార్కెట్లో కిలో 180 రూపాయలకు చేరిన విషయం గమనార్హం. ఆ పరిస్థితుల్లో 56 లక్షల టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాది అదే పరిస్థితి కొనసాగడంతో 63 లక్షల టన్నుల దిగుమతి జరిగింది. భారీ దిగుమతుల వల్ల దేశీయంగా ధరలు అదుపులోకి వచ్చాయి. అయితే క్రమంగా మార్కెట్లో పప్పు ధాన్యాల రేట్లు పడిపోయి రైతులు పెద్దయెత్తున నష్టపోయారు. ఫలితంగా భారత ఆహార సంస్థ జోక్యం చేసుకొని రైతులనుంచి పప్పు దినుసులు భారీగా కొనుగోలు చేసింది. చివరికి ఆ సంస్థ వద్ద కూడా 20 లక్షల టన్నుల సరకు మిగిలిపోయింది. దాంతో రైతులు, ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోవాల్సివచ్చింది. రేట్లు తగ్గడంవల్ల అప్పట్లో సామాన్య వినియోగదారులకు కొంత ఊరట కలిగిన మాట నిజమే! ఆ పరిణామాల దృష్ట్యా దేశీయంగా పప్పు ధాన్యాల పంట విస్తీర్ణం మూడు కోట్ల హెక్టార్లకు పెంచారు. ఈ ఏడాది విదేశాలనుంచి పప్పు ధాన్యాల దిగుమతులు పది లక్షల టన్నులకంటే తక్కువే ఉండవచ్చు! ధరలూ ఓ మేరకు అదుపులోనే ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందన్నది ప్రశ్న.

దిగుబడులపై దృష్టి
పప్పు దినుసులు ప్రధానంగా వర్షాధారపు పంటలు. ధరల విషయంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిమారుస్తూనే మరోవంక పప్పు ధాన్యాల దిగుబడులు పెంచడం ఒకరకంగా సవాలే. దేశంలో దిగుబడులను పెంచే నూతన వంగడాల తయారీ ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్నాయి. కాన్పూర్‌లోని పప్పు దినుసుల పరిశోధన సంస్థ దీనిపై అనేక పరిశోధనలు చేస్తోంది. 2030 నాటికి దేశ జనాభా 150 కోట్లు దాటవచ్చు. అప్పటికి పప్పు ధాన్యాలకు గిరాకీ బాగా పెరిగి 3.3 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. హెక్టారు పొలంలో ఇప్పుడు సగటున 835 కిలోల పప్పు దినుసులు పండిస్తున్నారు. భవిష్యత్తు డిమాండ్‌ దృష్ట్యా హెక్టారుకు 30శాతం దిగుబడులు పెరగాల్సి ఉంటుంది. గడచిన దశాబ్దంలో ఎంత ప్రయత్నించినా పప్పు ధాన్యాల సగటు దిగుబడి 20శాతానికి మించి పెరగలేదు. దిగుబడులు పెంచడంతోపాటు పండించిన పంటకు చక్కటి రేటు దక్కే వెసులుబాటు కలిగిస్తే రైతుల కష్టాలు తీరతాయి. ఇదే క్రమంలో సామాన్యులకు పప్పు దినుసుల ధరలు అందుబాటులో ఉండేటట్లు చూడటం కీలకం. పప్పు ధాన్యాలు ప్రధానంగా వర్షాధార పంటలు కాబట్టి- స్వల్పకాలంలో చేతికి వచ్చే వంగడాలు తప్పనిసరి. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరగాలి. మరోవంక పురుగుబారినపడి పంట భారీగా దెబ్బతింటోంది. కంది పంటను అత్యధికంగా నాశనం చేసేది కాయ తొలుచు పురుగు. పత్తి పంటనూ ఇదే పురుగు దెబ్బకొడుతోంది. దీన్ని అదుపులోకి తెచ్చేందుకు రైతులోకం విచ్చలవిడిగా పురుగుమందులు వాడుతోంది. అయినప్పటికీ ఈ పురుగు 50శాతం మేర పంటకు నష్టం కలిగిస్తోంది. దీన్ని తట్టుకునే వంగడాలను పరిశోధనల ద్వారా కొంతమేర తయారు చేయగలిగారు కానీ- ఈ క్రమంలో మరిన్ని పరిణత పరిశోధనలు అవసరం. నీటి ఎద్దడి కారణంగా దిగుబడుల్లో పదిశాతానికిపైగా కోసుకుపోతున్నాయి. సూక్ష్మ నీటి పారుదల పద్ధతుల ద్వారా పంటకి ఒకటి రెండు సార్లు నీరు పెట్టగలిగితే నష్టాన్ని నివారించవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టాలి. నీటిని అతి తక్కువగా వాడే పంటలలో పప్పు దినుసులూ ఒకటి. ఈ మొక్కల వేళ్లు భూమిలో లోతుగా వెళ్ళగలుగుతాయి కాబట్టి ఇవి తక్కువ నీటితోనే పండుతాయి. వీటి వేళ్లు భూమిలో నత్రజని పెంచే శక్తి కలిగి ఉంటాయి. ఈ పంటలు వాతావరణ పరిరక్షణకు చాలా ఉపయోగపడతాయి. ఈ కారణం చేత కూడా వీటిని అధికంగా పండించాలి.

దళారులకే లాభాల పంట
రైతులకు అందే ధర, ప్రజలు మార్కెట్లో కొనే ధరల మధ్య అంతరం ఎక్కువగా ఉంటోంది. లాభాలు చాలావరకు దళారులకే చేరుతున్నాయి. రైతులను ప్రత్యక్ష విపణితో అనుసంధానించే మార్గాలు అన్వేషించాలి. ఇందుకు డిజిటల్‌ అంతర్జాల విపణులు బాగా ఉపయోగపడతాయి. రైతు సమూహాలతో ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి వాటికి అధికారాలు కట్టబెట్టాలని, తద్వారా ధరలకు సంబంధించి లోటుపాట్లను అధిగమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఈ రకంగా పదివేల సంస్థలను ఏర్పాటు చేయాలని సర్కారు తలపోస్తోంది. ఇందుకు రైతులు సానుకూలంగా స్పందించాల్సి ఉంది. ఈ ఉత్పత్తి సంఘాలు పప్పు ధాన్యాలను పల్లె స్థాయిలోనే శుద్ధి చేసి తగిన రీతిలో ‘ప్యాకింగ్‌’ చేసి- అమెజాన్‌, బిగ్‌ బాస్కెట్‌ వంటి అంతర్జాల విపణులకు; నగరాలూ పట్టణాల్లోని దుకాణాలకు సరఫరా చేయవచ్చు. దీనివల్ల రైతుకి మంచి ధర దొరుకుతుంది. వినియోగదారులకు సైతం కనిష్ఠ ధరకే పప్పు ధాన్యాలు అందుబాటులోకి వస్తాయి. రేషన్‌ దుకాణాల ద్వారా చేసే పంపిణీలో వీటిని అంతర్భాగంగా మార్చాలి. మరోవంక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంలో పప్పు ధాన్యాలను తప్పనిసరి చేయాలి. తద్వారా భవిష్యత్తు తరాలకు పౌష్టికాహారం చేరువవుతుంది. సహేతుక ప్రోత్సాహకాలతో పప్పు ధాన్యాల దిగుబడిని పెంచితే అది జాతి ఆర్థిక, సామాజిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పరిశోధనలకు పదును పెట్టాలి
జాతీయ ఆహార భద్రతా మిషన్‌ కింద పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు అనేక ప్రాజెక్టులు చేపట్టారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో పంట విస్తీర్ణం పెంచేందుకు రూ.296కోట్లు కేటాయించారు. చెరకు పంట మధ్యలో పప్పు దినుసులను మిశ్రమ పంటగా వెయ్యడాన్ని ప్రోత్సహించేందుకు ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. సార్వా వరి తరవాత వేసే మినుము, పెసర పంటలను అదనంగా 12 లక్షల హెక్టార్లలో పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం మొదలుపెట్టారు. దేశంలో పప్పు ధాన్యాల దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి నాణ్యమైన వంగడాలు కొరవడటమే ముఖ్య కారణం. పురుగుల తాకిడిని తట్టుకు నిలబడి, చక్కటి దిగుబడులను ఇచ్చే వంగడాలకోసం మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉంది.

- విన్నకోట రామచంద్ర కౌండిన్య
(రచయిత- భారత విత్తన పారిశ్రామిక సమాఖ్య డైరెక్టర్‌ జనరల్‌)
Posted on 25-02-2020