Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అవ్యవస్థకు సరైన మందు!

స్వల్ప అనారోగ్యం పాలబడినవారు మొదలు దీర్ఘకాల రోగపీడితుల వరకు దేశవ్యాప్తంగా అసంఖ్యాకులకిది నిస్సంశయంగా తీపికబురు. మందుల ధరలకు కళ్లెం వేయాలన్న కేంద్రప్రభుత్వ చొరవతో విపణిలో 80శాతందాకా ఔషధాలు చౌకగా లభించనున్నాయంటున్నారు. కేంద్ర ఔషధశాఖ గణాంకాల ప్రకారం నియంత్రిత ధరల విధానం వర్తించని(నాన్‌-షెడ్యూల్డ్‌) మందుల సంఖ్య సుమారు పది వేలు. విటమిన్‌ మాత్రల నుంచి యాంటీబయాటిక్స్‌ దాకా ఎన్నో ఆ జాబితాలోనివే. వాటిపై లాభం 30శాతానికి మించరాదన్న కేంద్రప్రభుత్వ ప్రతిపాదనకు ఔషధ తయారీదారులు, పంపిణీదారుల సానుకూల స్పందన సహర్షంగా స్వాగతించదగింది. క్యాన్సర్‌ రోగులకు వినియోగించే ఖరీదైన మందులపై విక్రేతల లాభాలు 30శాతానికి పరిమితమయ్యేలా ఎన్‌పీపీఏ (జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ) ఆంక్షలు అమలుకు నోచుకున్న దరిమిలా, తక్కినవాటికి సంబంధించీ సహజంగానే డిమాండ్లు పెరిగాయి. వాటిపై నీతిఆయోగ్‌తోపాటు ఔషధశాఖ, ఎన్‌పీపీఏల నెలల తరబడి కసరత్తుకు ఫలశ్రుతే తాజా పరిణామం! కొత్తగా పేటెంట్‌ పొందిన ఉత్పత్తులతోపాటు అరుదైన వ్యాధులకు ఉపయోగించే మందుల్ని భారతీయ విపణిలో ప్రవేశపెట్టింది లగాయతు అయిదేళ్లపాటు ధరల నియంత్రణ నుంచి మినహాయింపు వర్తింపజేస్తూ ఈ సంవత్సరం మొదట్లో ఔషధ విభాగం నోటిఫికేషన్‌ జారీ చేయడం తెలిసిందే. పేటెంట్‌ మందుల్ని నియంత్రణ పరిధి ఆవలకు నెట్టేయడం తీవ్ర ఆక్షేపణీయమని అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తరహా మినహాయింపుల మెలికలేమీ పెట్టకుండా ఔషధాలన్నింటి ధరల తెగ్గోతకూ కేంద్రనిర్ణయం దోహదపడితే వినియోగదారులకు సాంత్వన దక్కుతుంది.

ప్రాణాలు నిలబెట్టగల ఔషధాలకూ ప్రస్తుత కల్తీయుగంలో నాసి అనుకరణలనేకం పుట్టుకొస్తున్నాయి. మలేరియా, న్యుమోనియాల చికిత్సలో నకిలీ మందుల ఉరవడి కారణంగా ప్రపంచ దేశాల్లో ఏటా రెండున్నర లక్షల పసిప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్న యథార్థం నిర్ఘాంతపరుస్తోంది. 2008 సంవత్సరంలో 75 దేశాల్లో 29 నకిలీ ఔషధాల బాగోతాలు వెలుగుచూశాయి. పదేళ్ల వ్యవధిలో డూప్లికేట్ల జాబితా 95కు, బాధిత దేశాల సంఖ్య 113కు విస్తరించడం- చాపకింద నీరులా తీవ్రతరమవుతున్న సంక్షోభాన్ని కళ్లకు కట్టింది. ఈ నాసి నకిలీ మందుల ఉత్పాతం భారత్‌, చైనాల్లోనే అధికమని గణాంకాలు ఘోషిస్తున్నాయి. నకిలీ ఔషధాల కేసులలో నేరం రుజువైతే ఐరోపా దేశాల్లో పదిహేనేళ్ల వరకు జైలులో మగ్గాల్సిందే. అక్కడితో పోలిస్తే ఔషధ కల్తీదారులకు ఇక్కడ సకల విధాల అనుకూల వాతావరణం నిక్షేపంగా కొనసాగుతుండటం వల్ల, ప్రజారోగ్యానికి తూట్లు పడుతున్నాయి. సర్కారీ ఆస్పత్రుల్లో పంపిణీ చేస్తున్న మందుల్లోనే 11 శాతం దాకా నాణ్యత పరీక్షలో విఫలమవుతున్నాయి. దేశీయ విపణిలో నాలుగోవంతు ఔషధాలు నకిలీవేనన్న ‘అసోచామ్‌’ (వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య) ఇండియాలో సుమారు రూ.30 వేలకోట్ల మేర అక్రమ దందా సాగుతున్నట్లు నాలుగేళ్ల క్రితమే మదింపు వేసింది. వాస్తవానికి, ఔషధ రంగాన దేశం పరువు ప్రతిష్ఠల్ని నిలబెట్టేలా వ్యవస్థాగతంగా ఎక్కడెక్కడ ఏమేమి చర్యలు అత్యావశ్యకమో మషేల్కర్‌ కమిటీ గతంలోనే విశదీకరించింది. తక్షణ కార్యాచరణ కొరవడటమే అక్రమార్కులకు కోరలు, కొమ్ములు మొలిపిస్తోంది. కొన్నాళ్లుగా నకిలీ మందుల ఏరివేతకు బ్లాక్‌చెయిన్‌ సాంకేతిక పరిజ్ఞాన వినియోగ ప్రతిపాదనలు వెలుగుచూస్తున్నాయి. ఈ కీలకాంశంపై ఇక ఎంతమాత్రం జాప్యం పనికిరాదు. భారతీయ ఔషధ రంగానికి మాయదారి మందుల పీడ విరగడై, వినియోగదారులూ తెరిపిన పడేలా- పటిష్ఠ జాతీయ కార్యాచరణ ప్రణాళిక చురుకందుకోవడం తక్షణావసరం.

దేశంలో జనరిక్‌ (మూల ఔషధం) ఉత్పత్తులకు తగినంత ప్రాచుర్యం లభించినట్లయితే, పేద రోగులకు ఈ సరికే కొంత స్వస్థత చేకూరేది. చౌకలో నాణ్యమైన ఔషధ సేవలకు జనరిక్‌ మందులు పెట్టింది పేరు. అయిదు వేలకుపైగా జనరిక్‌ ఔషధ కేంద్రాల ద్వారా సరసమైన ధరలకు మందులు అందుబాటులో ఉంచుతున్నట్లు కేంద్ర అమాత్యులు చెబుతున్నారు. అధికారిక ప్రకటనలకు, క్షేత్రస్థాయి స్థితిగతులకు మధ్య భారీ అంతరం నెలకొనడమే విషాదం! అమెరికాలో వైద్యులు మూడొంతులకు పైగా జనరిక్‌ ఔషధాలే సూచిస్తున్నారని, బ్రిటన్‌లో ఇంకా ఎక్కువని అధ్యయన నివేదికలు స్పష్టీకరిస్తున్నాయి. అంతర్జాతీయంగా తక్కువ ధరలో జనరిక్‌ మందుల్ని సరఫరా చేయడంలో ముందున్నది భారతదేశమే. ఇండియా ఔషధ ఎగుమతుల్లో 30శాతం అమెరికాకు, 19 శాతం ఆఫ్రికా దేశాలకు, 16 శాతం ఐరోపా దేశాలకు వెళ్తున్నాయి. రష్యా, నైజీరియా, బ్రెజిల్‌, జర్మనీలకూ ఇక్కడి నుంచి సరఫరాలు అందుతున్నాయి. అటువంటిది దేశీయంగా జనరిక్‌ మందుల వినియోగం ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి వివిధ అంశాలు పుణ్యం కట్టుకుంటున్నాయి. జనరిక్‌ ఔషధాల నాణ్యతపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం ప్రజల్లో అపోహలు పెంచి- పలు సంస్థలకు, ఆస్పత్రులకు, వైద్యులకు లాభాల పంట పండిస్తోంది. దేశ రాజధానిలోని నాలుగు ప్రముఖ చికిత్సాలయాలు ధరల నియంత్రణ పరిధిలో లేని మందులపై 160-1200 శాతం, నియంత్రణ పరిధిలోని వాటిపై 115-360 శాతం మేర లాభాలు దండుకుంటున్నట్లు ఎన్‌పీపీఏ నిరుడు వెల్లడించిన వివరాలు గగ్గోలు పుట్టించాయి. తరతమ భేదాలతో దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న దోపిడి పర్వం జనం జేబులు కాల్చేస్తూ అనేక కుటుంబాలను నిలువునా కూల్చేస్తోంది. రోగి చికిత్స వ్యయంలో 70 శాతం దాకా మందులకు వెచ్చించాల్సి వస్తున్న దేశంలో- ఔషధాల ధరలకు అధికారికంగా కళ్లెం వేయడంతోపాటు నకిలీలకు దారులు మూసేసి, జనరిక్‌ ఉత్పత్తుల విస్తృత వినియోగాన్ని పెంపొందించే చర్యలూ సత్వరం చేపట్టాల్సి ఉంది. ఆ మేరకు సమగ్ర కార్యాచరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యమే- జాతి ఆరోగ్యాన్ని సంరక్షించగలిగేది!

Posted on 29-02-2020