Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అప్పుడు అతివృష్టి ఇప్పుడు అనావృష్టి

* బ్యాంకుల ‘రుణ సంక్షోభం’ తీరిది

బ్యాంకులకు రుణ ఎగవేతలవల్ల పారు బాకీలు పెరిగిపోయాయి. అనేక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సహకార బ్యాంకులు కుప్పకూలాయి. ఈ పరిణామాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. దీంతో బ్యాంకింగ్‌ రంగం, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల పనితీరు దెబ్బతింది. 2007-12 మధ్యకాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సగటున ఎనిమిది శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేసింది. ఆర్థిక వ్యవస్థ దివ్యంగా ఉన్న ఆ రోజుల్లో బ్యాంకులు భారీగా రుణాలిచ్చేవి. కొన్ని సమయాల్లో బ్యాంకు రుణాలు 25 శాతం వృద్ధిని నమోదు చేశాయి. సులువుగా రుణాలు దొరుకుతున్నాయని కంపెనీలు అవసరానికి మించి అప్పులు తీసుకున్నాయి. ఆ డబ్బుతో తమకు అనుభవంలేని రంగాల్లోకీ విస్తరించి చేతులు కాల్చుకున్నాయి. తీసుకున్న అప్పుల్ని పెట్టుబడిగా పెట్టి లాభాలు ఆర్జించడంలో విఫలం కావడంతో బడా కార్పొరేట్లు సైతం బ్యాంకు రుణాలను ఎగవేయసాగాయి. ఫలితంగా బ్యాంకుల మూలధనానికే ఎసరు వచ్చింది. అయినా అవి సొంత ఇంటిని చక్కదిద్దుకోకుండా పాత అప్పులను పునర్వ్యవస్థీకరించాయి. పారు బాకీలను ఉన్నవి ఉన్నట్లుగా ప్రకటించకుండా వాటి చెల్లింపు గడువును పెంచడం, వాయిదాలపై చెల్లింపును సరళీకరించడం వంటి పనులకు దిగాయి. దీనివల్ల పరిస్థితి చేజారిపోవడమే తప్ప మెరుగైంది లేదు. 2015 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బ్యాంకు రుణాల పునర్వ్యవస్థీకరణను రిజర్వు బ్యాంకు నిషేధించింది.

డిజిటల్‌ మోసాలతో ఆందోళన
వరస మోసాల దెబ్బకు పీఎస్‌బీ అధికారులు కొత్తగా అప్పులు ఇవ్వాలంటేనే భయపడిపోతున్నారు. మోసగాళ్లకు సరే- నిజాయతీపరులైన వ్యాపారులకు రుణాలివ్వడానికీ జంకుతున్నారు. ఒకవేళ నిజంగా వ్యాపారం ప్రారంభించినా నష్టాలు వస్తే బ్యాంకు రుణాలు తిరిగి వసూలు కాని సందర్భాలు ఉంటాయి. ఎవరు రుణాలు ఎగవేసినా సరే బ్యాంకు అధికారులు సుదీర్ఘ విచారణను ఎదుర్కోవలసి వస్తుంది. కొంతమంది శిక్షకు గురికావచ్చు. 90 శాతం మోసాలు బ్యాంకు రుణాలకు సంబంధించినవే కాబట్టి ఉన్నతాధికారుల మెడకు చుట్టుకొంటున్నాయి. దీనివల్ల వారి పదవీ విరమణ ప్రయోజనాలకూ ఎసరు వస్తోంది. మోసాలు, ఎగవేతలు గతంలోనూ జరిగినా- పరిస్థితి ఇంత తీవ్రంగా ఎప్పుడూ లేదు. ముఖ్యంగా రిజర్వు బ్యాంకు ఏక్యూ ఆర్‌ ప్రక్రియను చేపట్టినప్పటి నుంచీ బ్యాంకు అధికారుల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. ఫలితంగా కంపెనీలకు భారీ రుణాలు ఇచ్చే ప్రక్రియ దాదాపు స్తంభించిపోయింది. రుణ మంజూరు రేటు గతంలోకన్నా తగ్గిపోతోంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా విలీనం చేసిన తరవాతా పరిస్థితి మెరుగుపడలేదు. చైనా, తైవాన్‌, దక్షిణ కొరియాల్లో మెగా బ్యాంకులు రెండంకెల ఆర్థికాభివృద్ధి రేటు సాధనకు తోడ్పడ్డాయి. ఆర్థిక మాంద్యంలోనూ రుణ వితరణ కొనసాగించగల సత్తా మెగా బ్యాంకులకు ఉండటమే దీనికి కారణం. మెగా బ్యాంకులకు భారీ నగదు నిల్వలు ఉంటాయి కాబట్టి నష్టభయం లేకుండా మౌలిక వసతుల ప్రాజెక్టులకు పెద్దయెత్తున రుణాలు ఇవ్వగలుగుతాయి. కానీ, ఈ ప్రక్రియ భారత్‌లో సమర్థంగా అమలు కావడం లేదు. ఇటీవలి కాలంలో డిజిటల్‌ బ్యాంకింగ్‌ మోసాలు పెచ్చరిల్లడం సరికొత్త ఆందోళనకర పరిణామం. బ్యాంకుల్లో సైబర్‌ భద్రతా ప్రమాణాలు అంతంతమాత్రంగా ఉండటమే దీనికి కారణం. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని డిజిటల్‌ కార్యకలాపాలపై ఖాతాదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి బ్యాంకులు ప్రత్యేక అంబుడ్స్‌మన్‌ను నియమించాలని రిజర్వు బ్యాంకు ఇటీవల ఆదేశించింది. డిజిటల్‌ మోసాలను అరికట్టడానికి సైబర్‌ భద్రతా చర్యలను పటిష్ఠపరచాలనీ పేర్కొంది. మోసాల వల్ల బ్యాంకులకు జరిగే నష్టానికి తోడు వ్యాపార సంస్థలకు ఇతరత్రా వాటిల్లే నష్టాలూ చాలానే ఉన్నాయి. సాధారణంగా పెద్ద కంపెనీలు ఏకకాలంలో రకరకాల వ్యాపారాలు చేస్తుంటాయి. అందుకోసం వేర్వేరు యూనిట్లు ఏర్పాటు చేస్తాయి. ఒక యూనిట్‌ మోసానికీ లేదా ఎగవేతకు పాల్పడితే దాని ప్రభావం ఇతర యూనిట్ల మీద కూడా పడుతుంది. మొత్తం సరఫరా గొలుసు విచ్ఛిన్నమై భావి వ్యాపార అవకాశాలూ దెబ్బతింటాయి. సదరు వ్యాపారాలపై ఆధారపడిన అసంఘటిత కార్మికులు జీవనోపాధి కోల్పోతారు. వేతన కూలీల పరిస్థితి దుర్భరమవుతుంది. దీనివల్ల స్థూల ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. మోసాలు బ్యాంకులనే కాకుండా ఆర్థిక రంగంలోని ప్రతి పార్శ్వాన్నీ దెబ్బతీస్తాయి.

అధికారుల కుమ్మక్కుతోనూ చిక్కులు
ప్రభుత్వం ఎంత పకడ్బందీగా నియంత్రణల చట్రాన్ని రూపొందించినా, వ్యవస్థలను పటిష్ఠపరచి పారదర్శకత పెంచినా మోసగాళ్లకు, అధికారులకు మధ్య కుమ్మక్కు కొనసాగినంత కాలం ఆశించిన ప్రయోజనం సిద్ధించదు. ఈ కుమ్మక్కు చాప కింద నీరులా సాగిపోతూ నిఘా నేత్రాలకు అందడం లేదు. చట్టాలు, నియమనిబంధనలు కాగితం మీద ఉండిపోతున్నాయి. అవి పేరుకు అమలవుతున్నట్లే కనిపించినా, ఆచరణలో చిత్తశుద్ధి లోపిస్తోంది. అందుకే బ్యాంకింగ్‌ వ్యవస్థలో మోసాలను సకాలంలో గుర్తించి అరికట్టలేకపోతున్నాం. రుణాల ఎగవేత వంటి నేరాలను దివాలా వ్యవహారాలపరిష్కార బోర్డు (ఐబీబీఐ)కి నివేదించి పరిష్కరించవచ్చు. కానీ, తెలిసో తెలియకో అనర్హులకు, మోసగాళ్లకు రుణాలు ఇచ్చి, పారు బాకీలు పెరిగిపోవడానికి కారకులయ్యారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్యాంకు అధికారులకు మళ్ళీ భరోసా కలిగించడమెలా అన్నది ప్రశ్న. ఈ ఆరోపణల వల్ల బ్యాంకర్లు రుణాలమంజూరుకు వెనకాడుతున్నారు. రుణాలు లేకపోతే పెట్టుబడులూ ఉండవు. అవి లేకుంటే ఆర్థిక రథం ముందుకు సాగదు. ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారుల్లో ఏర్పడిన సంకోచం, భయాలు కింది స్థాయి ఉద్యోగులకూ పాకుతాయి. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారైతే మరింత జంకుతారు. ఫలితంగా రుణ మంజూరు ప్రక్రియకు భంగం కలుగుతుంది. పీఎస్‌బీ ఉద్యోగుల్లో స్థైర్యం సన్నగిల్లడం వల్ల ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న నష్టాన్ని గ్రహించిన ప్రభుత్వం రుణ మంజూరుకు దన్నుగా నిలిచే చర్యలను తీసుకోవాలని యోచిస్తోంది. బ్యాంకర్లు అయినదానికీ కానిదానికీ విచారణను ఎదుర్కోవలసిన అగత్యాన్ని నివారించి ధైర్యంగా రుణ మంజూరు నిర్ణయాలను తీసుకునే వాతావరణాన్ని కల్పించాలని భావిస్తోంది. ఎవరైనా బ్యాంకు ఉద్యోగి లేదా అధికారి రుణ మంజూరులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణ వస్తే దాన్ని నేరుగా సీబీఐకి పంపించకూడదని నియమం విధించింది. బ్యాంకులు ఏర్పాటు చేసుకునే అంతర్గత కమిటీ సమ్మతించిన తరవాతే సీబీఐ దర్యాప్తు చేపట్టేట్లు చర్యలు తీసుకుంది. ఇకపై ఏ బ్యాంకు లేదా బ్యాంకు అధికారి మీద ఏ దర్యాప్తు సంస్థా తనంత తానుగా దర్యాప్తు చేపట్టడానికి వీల్లేదు. బ్యాంకు కేసు దాఖలు చేసి దర్యాప్తు కోరితేనే ఆ ప్రక్రియ మొదలుపెట్టాలి. ఈ మార్పుల వల్ల ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారులు సంకోచాలు వీడి మళ్ళీ రుణాలు, పెట్టుబడులు సమకూర్చే పని మీద శ్రద్ధ పెట్టగలుగుతారని ప్రభుత్వం ఆశిస్తోంది. అంతమాత్రాన బ్యాంకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించకూడదు. మోసాలను ముందుగానే పసిగట్టడానికి అంతర్గత నియంత్రణను పటిష్ఠపరచాలి. అర్హులకు రుణాలు అందించి ఆర్థిక రథానికి కొత్త ఊపు తీసుకురావాలి.

కొరవడిన ముందు జాగ్రత్త
గతంలో మహా సులువుగా బ్యాంకు రుణాలు లభించేవి కనుక చాలా కంపెనీలు ఆ డబ్బును ప్రకటిత వ్యాపారానికి కాకుండా వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకునేవి. ఈ సందర్భంగా మోసాలు పెచ్చరిల్లాయి. ఎడాపెడా రుణాలు ఇచ్చేసినందువల్ల వాటి వినియోగం సక్రమంగా జరుగుతోందా లేదా అని తనిఖీ చేసుకునే ఓపిక, తీరిక బ్యాంకులకు తగ్గిపోయింది. అంతా బాగానే ఉందనే భ్రమలో ముందు జాగ్రత్త చర్యలను అధికారులు గాలికి వదిలేశారు. ఫలితంగా మోసాలు విజృంభించాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలు నికరమైన ఆస్తుల సృష్టికి దోహదం చేయలేకపోయాయి. దీంతో రిజర్వు బ్యాంకు ఆస్తుల నాణ్యతను సమీక్షించడం (ఏక్యూఆర్‌) తప్పనిసరి అని ప్రకటించింది. బ్యాంకు రుణాలను మరింత నిశితంగా పరిశీలించడానికి, పారదర్శకతను పెంచడానికి ఏక్యూఆర్‌ తోడ్పడింది. అయినా కూడా బ్యాంకులను మోసగించే ఆగడాలకు తెరపడటమే లేదని 2019 డిసెంబరులో రిజర్వు బ్యాంకు ఆర్థిక సుస్థిరత నివేదిక వెల్లడించింది. గత అయిదేళ్లలో రూ.1,13,374 కోట్ల మేర 4,412 మోసాలు జరిగాయి. ఈ మొత్తంలో 90.6 శాతం బ్యాంకు రుణాలకు సంబంధించినవే. వీటివల్ల బాగా దెబ్బతిన్నది ప్రభుత్వరంగ బ్యాంకులే! గడచిన 11 ఏళ్లలో మోసాల వల్ల రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. ఇందులో 90 శాతం పీఎస్‌బీలకే దాపురించింది.

- డాక్టర్‌ కె. శ్రీనివాసరావు
(రచయిత- హైదరాబాద్‌ ఐఐఆర్‌ఎంలో అనుబంధ ఆచార్యులు)
Posted on 29-02-2020