Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సమర్థ మానవ వనరులే బలిమి

* జనగణనకు రంగం సిద్ధం

ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే దేశ జనగణన ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభం కాబోతోంది. స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఆరు పర్యాయాలు జనాభాను గణించారు. వాటితో పోల్చుకుంటే ఈసారి కులాలవారీగా వివరాలు సేకరించాలన్న డిమాండు ముందుకు వస్తోంది. ఒక దేశ జనాభాలోని పని చేసే సామర్థ్యం ఉన్నవారివల్ల ఆర్థిక వ్యవస్థకు చేకూరే వృద్ధిని ‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’గా భావిస్తారు. ఇటీవలి కాలంలో జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలు సంక్షేమ పథకాల హామీలు గుప్పిస్తున్నాయి. వాటి రూపకల్పనకు జనాభా వివరాలు ఎంతో అవసరం. రిజర్వేషన్ల కల్పనలోనూ ఇవి కీలకం. సామాజిక మార్పు సాధనకు నాణ్యమైన విద్య ఎంతో అవసరం. దానివల్ల సమర్థ మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి. అందుకు విరుద్ధమైన ఫలితాలు వస్తే జనాభా పెరుగుదల అనేది దేశానికి శాపమవుతుంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా (2019) నివేదిక ప్రకారం భారత దేశ జనాభా 2027 నాటికి చైనాను అధిగమించి, అగ్రస్థానానికి చేరుతుంది.

జన సంఖ్య నియంత్రణకు 50 ఏళ్లుగా భారత్‌ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ విధమైన చర్యలు జనాభా పెరుగుదలకు కారణమవుతున్న సామాజిక, ఆర్థిక కోణాల్ని గుర్తించడంలో విఫలమయ్యాయి. జనాభా వృద్ధి వల్ల ఎదురయ్యే సవాళ్లను సరికొత్త దృక్కోణంలో విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనాభా పెరిగితే ప్రజల తలసరి ఆదాయం తగ్గి దేశం పేదరికంలోకి జారుతుందన్నది సహజ భావన. 21వ శతాబ్దంలో దృక్పథాలు, అవసరాలు మారాయి. ఒకప్పుడు తల్లిదండ్రులు యుక్తవయసులో పిల్లల్ని భవిష్యత్‌ ఆదాయవనరుగా చూసేవారు. వృద్ధాప్యంలో ఆసరాగా భావించేవారు. దీనివల్ల అధిక సంతానం వైపు మొగ్గుచూపేవారు. వైద్య సౌకర్యాలు మెరుగుపడటంతో మరణాల రేటు తగ్గుముఖం పట్టింది. నిరక్షరాస్యత, ఆచార సంప్రదాయాలు అధిక సంతానానికి కారణమయ్యాయి. భిన్న జాతులు, మతాలు, సంస్కృతులు జనవృద్ధికి దోహదపడ్డాయి.

పేదరికం, నిరక్షరాస్యత, విద్య వైద్యం వంటి మౌలిక సౌకర్యాల కొరతవల్ల ఆసియాలో మరెక్కడా లేనివిధంగా జనాభా పెరుగుదల రేటు భారత్‌లో తక్కువగా నమోదవుతోంది. 1951-71 మధ్యకాలంలో జనాభా వృద్ధి 2.1 శాతం. 1971-91 మధ్యకాలంలో 2.2 శాతం. 1991-2011 మధ్య అది 1.8 శాతానికి తగ్గింది. 2011-2016 మధ్యకాలంలో మరింత మందగించి 1.3 శాతంగా నమోదైంది. ఆర్థికసర్వే (2019) ప్రకారం సగటు వార్షిక జనాభా వృద్ధి 2011-12 సంవత్సరంలో 1.1 శాతంగా ఉంది. 2021-2031 మధ్యకాలంలో అది 0.7 శాతం, 2031-2041 మధ్యకాలంలో 0.5 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. ఇక దేశంలో లింగ నిష్పత్తి పరంగా పురుషుల కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉందన్నది తెలిసిన విషయమే.

మనదేశంలో యువకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వచ్చే దశాబ్ద కాలంలో శ్రామిక సామర్థ్యం ఉన్న 20-59 వయోపరిమితి వారు మొత్తం జనాభాలో అధికంగా ఉంటారు. 2041 నాటికి వీరి సగటు వయసు 59 ఏళ్లవుతుంది. ‘శాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం డేటా’ ప్రకారం బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అధిక సంతానోత్పత్తి నియంత్రణకు చర్యలు చేపట్టి జనాభా స్థిరీకరణకు ప్రయత్నించాలి. నాణ్యమైన జీవితం, డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌, పట్టణ జనాభా పెరుగుదల, ఆదాయ అసమానతలు వంటివాటిని భవిష్యత్‌ సవాళ్లుగా పేర్కొనవచ్చు. ‘ఇండియా ఏజింగ్‌’ నివేదిక (2017) ప్రకారం 60 ఏళ్ల వయసువారు 2015లో ఎనిమిది శాతం ఉన్నారు. 2050 నాటికి వారి సంఖ్య 19 శాతానికి చేరుకుంటుందని అంచనా.

ప్రజలు సమర్థ మానవ వనరులుగా రూపొందాలి. అందుకోసం విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు సమూలంగా సంస్కరణలు రావాలి. విద్యార్థుల్లో పరిశోధన పరమైన ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వాలి. యువతలో నైపుణ్యాలను అభివృద్ధి పరచడానికి ‘స్కిల్‌ ఇండియా’ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయి. ఇవి నిరంతర ప్రక్రియగా సాగాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా వృత్తి విద్య నైపుణ్యాలను అందించాలి. ప్రాథమిక స్థాయిలోనే రుగ్మతలను గుర్తించేలా గ్రామీణ వైద్యానికి ప్రాధాన్యం పెంచాలి. అంతిమంగా సమర్థ మానవ వనరులను తీర్చిదిద్దుకుని వారిని సంపద సృష్టికర్తలుగా మలచుకోవాలి. కొంతకాలంగా దేశంలో ఆర్థిక మందగమన ఛాయలు కనిపిస్తున్నాయి. అయినా విదేశాల పనిచేస్తున్న చిరుద్యోగుల నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల వరకు ఎందరి నుంచో మారక ద్రవ్యం దేశానికి అందివస్తోంది. నిపుణులైన మానవ వనరులు దేశ ఆర్థికానికి ఎంత బలిమో ఇలాంటి సందర్భాల్లోనే అవగతమవుతోంది. ప్రపంచంలో చైనా జనాభాయే అధికం. అయినా ప్రజలు అన్ని రంగాల్లో తమ నైపుణ్యాలకు సాన పట్టుకోవడం ద్వారా జన చైనా ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగడానికి అన్ని అర్హతలు సంపాదించుకుంది. అమెరికాకు సైతం సవాలు విసరుతోంది. నైపుణ్యాలు ఉన్నప్పుడు అధిక జనాభా దేశానికి వరమవుతుందనడానికి చైనాయే ఉదాహరణ. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే అధిక జనాభా శాపమవుతుంది. కనుక ఈ విషయంలో భారత్‌ అప్రమత్తంగా ఉండాలి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్లుగా ‘బేటి పడావో బేటి బచావో’ లాంటి పథకాల ద్వారా దేశంలోని మహిళలు శ్రామిక శక్తిలో భాగస్వాములు అవుతారు. సంపద సృష్టించే ఆర్థిక వనరులుగా తయారవుతారు. ఈ తరహా కార్యక్రమాల వల్ల దేశానికి ‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’ అందివస్తుంది. ఉపాధి అవకాశాలు మెరుగై, నిరుద్యోగిత తగ్గుముఖం పడుతుంది. ఆర్థిక వృద్ధి సాకారమవుతుంది. కనుక ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు అమలుచేసినా అవి ప్రజలను సంపద కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. సమర్థ మానవ వనరుల బలిమి ద్వారానే దేశ ఆర్థికం బలోపేతమవుతుంది. అప్పుడే జనాభా పెరుగుదల దేశానికి వరంలా మారుతుంది.

- డాక్టర్‌ ఎం.బుచ్చయ్య
(రచయిత - వాణిజ్యశాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యులు)
Posted on 02-03-2020