Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

టెలికాం రంగంలో సంక్షోభం

అయిదేళ్లలో బ్రాడ్‌బ్యాండ్‌ను అందరికీ చేరువ చేయాలని, స్థూల దేశీయోత్పత్తిలో ఆరున్నర శాతంగా ఉన్న టెలికాం రంగం వాటాను ఎనిమిది శాతానికి పెంచాలని 2018నాటి జాతీయ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ విధానం లక్షించింది. అనర్థకారక స్పర్ధతో కర్ణుని రథచక్రంలా కుంగిన కీలక రంగానికి ఇతోధిక పెట్టుబడులతో కొత్త సత్తువ కల్పించి నాలుగేళ్లలోనే 40లక్షల ఉద్యోగాల సృష్టినీ నూతన టెలికాం విధానం ప్రస్తావించింది. అయిదోతరం (5జి) సాంకేతికత అవకాశాల స్వర్గాన్ని కళ్లకు కడుతున్నా, దాన్ని అందిపుచ్చుకొని దేశ బహుముఖ వికాసానికి మేలు బాటలు పరవాల్సిన ప్రైవేటు టెలికాం సంస్థ (టెల్కో)లు దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్‌)లో కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్ట వాటా ఇవ్వడానికి 1999లో అంగీకరించిన ప్రైవేటు టెల్కోలు- కేంద్ర ప్రభుత్వ టెలికాం విభాగం ఏజీఆర్‌కు ఇచ్చిన నిర్వచనం సరికాదంటూ కోర్టులకెక్కాయి. కేంద్రానికి టెల్కోలు చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిలు లక్షా47వేల కోట్ల రూపాయలు. ఏజీఆర్‌ చెల్లింపులపై రాజీపడేది లేదంటూ జనవరి 23లోగా మొత్తం చెల్లించాల్సిందేనని నిరుడు అక్టోబరులోనే స్పష్టీకరించింది సుప్రీంకోర్టు. నాటి ఆదేశాలు అమలు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించి మార్చి 17లోగా బకాయిలు చెల్లించకుంటే టెలికాం సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లే తన ముందు హాజరుకావాల్సి వస్తుందన్న సుప్రీం హెచ్చరికల నేపథ్యంలో- నెత్తిన వేలాడుతున్న కత్తి నుంచి తప్పించుకోవడం ఎలాగో తెలియక అవి సతమత మవుతున్నాయి. టెలికాం విభాగం అంచనాల మేరకు భారతీ ఎయిర్‌టెల్‌ రూ.35వేల కోట్లు, వోడఫోన్‌ ఐడియా రూ.53వేల కోట్లు, టాటాటెలీ రూ.14వేల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. సొంత అంచనాల ప్రకారం అయితే రూ.15-18వేల కోట్లు చెల్లిస్తే సరిపోతుందని ఎయిర్‌టెల్‌, రూ.18-23వేల కోట్లు మాత్రమే బాకీ అని వోడఫోన్‌ ఐడియా భావిస్తున్నాయి. సొంత అంచనాలు సక్రమంగా ఉన్నాయో లేదో ఈ వారం పరిశీలిస్తామంటున్న టెలికాం విభాగం- సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమను ఎలా ఒడ్డున పడేయదలచిందీ గుప్పిట విప్పడం లేదు. ఉభయతారకంగా వివాదం పరిష్కారమైతేనేగాని టెలికాం రంగం తెరిపిన పడలేదు!

ఇండియాలో మొబైల్‌ వినియోగదారులు తలసరి సగటున ప్రతినెల 11 గిగాబైట్ల డేటాను వినియోగిస్తున్నారని, 2018లో దేశవ్యాప్తంగా నెలకు లెక్కతేలిన 460కోట్ల గిగాబైట్ల డేటా, 2024నాటికి 1,600కోట్ల గిగాబైట్లకు చేరనుందని అధ్యయనాలు చాటుతున్నాయి. అరచేతిలో అంతర్జాలమై ఒదిగే స్మార్ట్‌ ఫోన్లు సౌకర్యం భద్రతలతోపాటు బహుముఖ సేవల్నీ అందిస్తుండటం; అదీ అత్యంత చౌకగా డేటా అందుబాటులో ఉండటంతో- 2024నాటికి దేశంలో స్మార్ట్‌ఫోన్ల సంఖ్య 110కోట్లు దాటిపోనుంది. బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య 2018లో 61కోట్లు; అది మరో నాలుగేళ్లలో 125కోట్లకు పెరగనుంది! జియో రాక దరిమిలా ఒక గిగాబైట్‌ డేటా ప్రపంచంలోనే కారుచౌకగా ఎనిమిది రూపాయలకే లభ్యమయ్యేలా వాణిజ్య స్పర్ధ ముమ్మరించి 2017-19 సంవత్సరాల మధ్య టెలికాం సంస్థల స్థూల రాబడుల్లో పాతికశాతం కోతపడింది. ‘సుప్రీం’ తీర్పు అనుసారం ఏజీఆర్‌ బకాయిలు కట్టాల్సిన టెల్కోలు పదిహేను ఉన్నా, వాటిలో ప్రస్తుతం మనుగడలో ఉన్నవి కేవలం మూడు! రూ.53వేల కోట్లూ వెంటనే చెల్లించాలంటే తెల్లజెండా ఎత్తేయడం తప్ప తాము చెయ్యగలిగిందేమీ లేదని వోడఫోన్‌ ఇప్పటికే ప్రకటించింది. లైసెన్సు ఫీజు, దానిపై వడ్డీ, అపరాధ రుసుము, దానిపై వడ్డీలతో నడ్డివిరిగిన టెల్కోలకు తొలుత సేవాపన్ను తరవాత కాలానికి జీఎస్టీలు చెల్లించాలని తాజాగా నోటీసులు జారీ అవుతున్నాయి! మూలిగే నక్కమీద తాటిపండు పడటం అంటే... ఇదే! ఏజీఆర్‌ బకాయిల విషయంలో కొన్ని సడలింపులు ప్రకటించాలని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ కోరుతుంటే మొబైల్‌ డేటా రుసుమును ఇప్పటికంటే ఏడెనిమిది రెట్లు పెంచనిదే మనుగడ దుర్లభమని వోడఫోన్‌ వాపోతోంది. డిజిటల్‌ ఇండియా స్వప్నం సాకారం కావాలంటే కేంద్ర ప్రభుత్వమే కీలక నిర్ణయాలు తీసుకోవాలిప్పుడు!

‘ప్రతి పౌరుడికి భిన్న సేవలు అందించడంలో సమర్థ చోదక శక్తులుగా ఎదిగిన ఐటీ, టెలికాం రంగాలు- ఎప్పటికప్పుడు విజ్ఞాన ఫలాల్ని పంచుకొనే వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూ దేశప్రగతికి దోహదపడుతున్నా’యని పదిహేనేళ్ల క్రితం రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలాం శ్లాఘించారు. నానాటికీ కొత్త పుంతలు తొక్కుతున్న సమాచార సాంకేతికత (ఐటీ) ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌)కీ బాటలు పరవగా, 5జి వాటిని సామాన్యులకు చేరువ చేయనుంది. వివిధ ప్రపంచదేశాలతో పాటు 2020లోనే 5జీని ఇక్కడా అందుబాటులోకి తీసుకురావాలని 2018నాటి టెలికాం విధానంలోనే కేంద్రం సంకల్పించింది. ఒక్కో మెగాహెర్జ్‌కు రూ.492కోట్లను ప్రాథమిక ధరగా 2018 ఆగస్టులో నిర్ణయించిన ‘ట్రాయ్‌’ దానిపై పునరాలోచన ప్రసక్తే లేదంటోంది. 5జీకి పెద్దస్థాయిలోనే స్పెక్ట్రమ్‌ అవసరపడుతుందని, అలా రూ.50వేల కోట్లను దానికోసం వెచ్చించటం తమకు సాధ్యపడదంటూ వేలంపాటలో పాల్గొనబోమని ఎయిర్‌టెల్‌ ఇప్పటికే ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 40 టెలికాం సంస్థలు ఈసరికే 5జి సేవల్ని ప్రారంభించేయగా, అందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు ఏవీ సిద్ధం కాక, దేశీయ టెల్కోల ఆర్థిక స్థితిగతులు బాగోలేక ఇండియా కిందుమీదులవుతోంది. పాశ్చాత్య దేశాలకు పోటీగా చైనా అభివృద్ధి చేసిన 5జి సాంకేతికత ఇండియాకు అన్ని విధాలా సానుకూలమంటున్నా- దేన్ని స్వీకరించాలన్న దానిపై కేంద్రం సత్వరం రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. అదే సమయంలో స్పెక్ట్రమ్‌ ధరల తగ్గింపు, బకాయిల పిడుగు మీదపడిన టెల్కోలకు తగు ఊరడింపు ద్వారా 5జి సాంకేతికత ప్రయోజనాల్ని ఒడిసి పట్టేందుకూ పూనిక వహించాలి.

Posted on 03-03-2020