Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఆమె భాగస్వామ్యం అభివృద్ధికి కీలకం

* రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో మహిళలు ఎంతో గొప్ప విజయాలు సాధిస్తున్నారు. మహిళా సమానత్వ సాధనలో మరింత ముమ్మర కృషి చేయాలని పిలుపిస్తూ ఏటా మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొంటున్నాం. లింగ సమానత్వం వెల్లివిరిసే ప్రపంచం మరింత ఆరోగ్యవంతంగా, సుసంపన్నంగా, సామరస్యంగా కళకళలాడుతుంది. ఐక్యరాజ్యసమితి 2030కల్లా సాధించాలని తీర్మానించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో అయిదోది- మహిళలు, బాలికలకు సమానత్వం, సాధికారత. ఇది మానవాళి ప్రగతికి ఊతమిచ్చే లక్ష్యం. ‘స్త్రీ మేధాపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పురుషుడికి సమఉజ్జీ. ఆమె ఎటువంటి కార్యకలాపాల్లోనైనా మగవారికి దీటుగా రాణించగలదు’ అని మహాత్మాగాంధీ ఉద్ఘాటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇతర దేశాల మహిళలకు, భారతీయ మహిళలకు మధ్య పోలికలు, తేడాలను, సమానత్వ సాధనలో భారతీయ మహిళకు ఎదురవుతున్న సవాళ్లను పరిశీలించడం అవసరం. 2020 సంవత్సర అంతర్జాతీయ మహిళా దినోత్సవ నినాదం- ‘నేను సమతా తరాన్ని: మహిళా హక్కులు సాధిస్తా’. పదహారేళ్ల స్వీడిష్‌ పర్యావరణ కార్యకర్త గ్రెటా థున్‌ బెర్గ్‌ వాతావరణ మార్పులను నిరోధించాలంటూ చేపట్టిన ఉద్యమం ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు పొందింది. తనతోపాటు భావి తరం హక్కుల కోసం ఆమె పోరాడుతున్నారు. అభిజిత్‌ బెనర్జీ, మైకేల్‌ క్రెమెర్‌లతోపాటు ఎస్తర్‌ డఫ్లో ఆర్థిక శాస్త్ర నోబెల్‌ బహుమతి సాధించారు. 1969లో ఈ బహుమతిని ఇవ్వనారంభించినప్పటి నుంచి దాన్ని పొందిన రెండో మహిళ ఆమె. నోబెల్‌ ఆర్థిక బహుమతిని అందుకున్నవారిలో అత్యంత పిన్నవయస్కురాలు కూడా డఫ్లోనే. ఫిన్లాండ్‌కు ప్రధానమంత్రిగా ఎన్నికైన మరీన్‌ సనా ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలైన ప్రధానిగా చరిత్రకెక్కారు. ఇలా అనేక రంగాల్లో ప్రకాశిస్తున్న మహిళలు ప్రపంచమంతటా కనిపిస్తారు.

అంతటా రాణిస్తున్న ఆధునిక స్త్రీ
భారతదేశంలో ఆర్థిక, వ్యాపార, రక్షణ, విద్య, క్రీడా, రాజకీయ, సాహిత్య, సంగీత, కళా రంగాల్లో ఉన్నత స్థానాలను మహిళలు అలంకరిస్తున్నారు. విమానాలను నడిపే పైలెట్లుగా ముందంజ వేస్తున్నారు. గతేడాది స్విట్జర్లాండ్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ గెలిచిన తొలి భారతీయ మహిళ పీవీ సింధు. భారతదేశానికి పూర్తికాల ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న తొలి మహిళ నిర్మలా సీతారామన్‌. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మహిళా స్వయంసహాయక సంఘాలు, కేరళలో కుటుంబశ్రీ కార్యక్రమం స్త్రీల చొరవతోనే విజయవంతమయ్యాయి. చాలామంది మహిళలు పంచాయతీ సర్పంచులుగా చక్కని పనితీరు కనబరుస్తున్నారు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా భారత సైన్యంలో నియమితులైన మహిళా అధికారులకు వారి సర్వీసు కాలంతో నిమిత్తం లేకుండా శాశ్వత హోదా, కమాండ్‌ పదవులను ఇచ్చే విషయం పరిశీలించాలని గత నెలలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక రూలింగ్‌ ఇచ్చింది. దీన్ని కాదనడం సమానత్వ సూత్రాన్ని పాటించే చట్టాలకు విరుద్ధం కాబట్టి ప్రతికూల మనస్తత్వాన్ని మార్చుకోవాలని పిటిషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మహిళలు- పురుషులతో పోలిస్తే శారీరకంగా బలహీనులని, అబలలని భావిస్తూ పోరాట విధులకు వారిని దూరంగా పెడుతున్నారు. కార్మిక విపణిలో భారతీయ మహిళల భాగస్వామ్యం బాగా తక్కువగా ఉండటం, ఇక్కడ లింగ అసమానత్వానికి ప్రధాన కారణం. 2004-05లో 45.4 శాతంగా ఉన్న మహిళా భాగస్వామ్యం తరవాత 20 శాతం తగ్గి 2017-18కల్లా 25.3 శాతానికి పడిపోయింది. ఇదే కాలంలో బయటి పనులు వదలి ఇంటి పనులకే పరిమితమైన మహిళల సంఖ్య 46 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఆర్థిక మందగతి వల్ల ఉపాధి అవకాశాలు క్షీణించడం దీనికి కారణంగా చెప్పుకోవాలి. మహిళా భాగస్వామ్యం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ‘ముద్ర, స్టాండప్‌ ఇండియా, భద్రమైన గృహవసతి, రాష్ట్ర్రీయ మహిళా కోశ్‌, జాతీయ గ్రామీణ జీవనాధార యోజన’ వంటి పథకాలను చేపట్టింది. పని స్థలాల్లో మహిళా భద్రతకు చర్యలు తీసుకుంది. ఎంత చేసినా మహిళా భాగస్వామ్యం అంచనాల మేరకు లేకపోవడం గమనార్హం.

మహిళా వ్యవస్థాపకులకు 2030నాటికి 15 నుంచి 17 కోట్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించే సత్తా ఉందని ‘గూగుల్‌, బెయిన్‌ అండ్‌ కంపెనీ’ సంయుక్త అధ్యయనం సూచించింది. వారికి సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధితో సహా అన్నివిధాలా అండదండలనిస్తే ఈ లక్ష్యం సుసాధ్యమవుతుంది. రాష్ట్ర స్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) అమలుకు సంబంధించిన సూచీని నీతి ఆయోగ్‌ వెలువరించింది. అందులో మహిళా సమానత్వానికి సంబంధించి హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, జమ్మూకశ్మీర్‌ అగ్ర స్థానాల్లో నిలిచాయి. మిగతా రాష్ట్రాలూ ఈ స్థాయికి ఎదగాల్సి ఉంది. కేంద్ర పాలిత రాష్ట్రాలన్నింటిలో మహిళా సమానత్వంలో దిల్లీ అధమ స్థాయిలో ఉన్నది. ప్రజలకు కనీస ఆదాయానికి భరోసా ఇచ్చే సర్వజన మౌలిక ఆదాయ పథకం (యూబీఐ) గురించి ఈ మధ్య ప్రపంచమంతటా చర్చలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకాన్ని ధనిక, పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాలకూ వర్తింపజేయాలా లేక కొన్ని నిర్దిష్ట వర్గాలకే పరిమితం చేయాలా అనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. యూబీఐ కింద డబ్బును నేరుగా మహిళలకు చెల్లిస్తే కుటుంబం కోసం సద్వినియోగం అవుతుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. అధికాదాయ వర్గాలకు చెందిన మహిళలు ఈ కనీసాదాయాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలి. వంటగ్యాస్‌ సిలిండర్ల విషయంలో ఇదే జరిగింది.

ఆందోళనకర స్థాయిలో అఘాయిత్యాలు
భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బాలురు, బాలికల నిష్పత్తిలో చాలా అంతరం ఉంది. ఆడ శిశువు పట్ల విచక్షణ మూలాన ప్రపంచం ఏటా 10కోట్ల మంది మహిళలను కోల్పోతోందని అమర్త్యసేన్‌ 30 ఏళ్లనాడే ఆందోళన వ్యక్తీకరించారు. మగ బిడ్డలే కావాలన్న తపన దీనికి మూల కారణం. భారత్‌, చైనాలలో ఈ జాడ్యం చాలా ఎక్కువ. లింగ నిర్ధారణ పరీక్షలు సులువుగా అందుబాటులో ఉన్నందున ఆడ శిశువులను గర్భంలోనే హతమార్చడం, ఆడ పిల్లలకు పౌష్టికాహారం అందించకపోవడం వల్ల- స్త్రీల జనాభా తగ్గిపోతోంది. ఈ అవాంఛనీయ పరిస్థితిని చక్కదిద్దడానికి భారత్‌, చైనాలు రెండూ ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా గట్టి చర్యలు తీసుకొన్న హరియాణాలో పరిస్థితి మెరుగుపడుతోంది. అక్కడ 2011లో ప్రతి వెయ్యి మంది బాలురకు 833 మంది బాలికలు ఉండగా, 2019లో ఆ నిష్పత్తి 1000:920 కి పెరిగింది. ఇతర రాష్ట్రాలూ ఈ విజయాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. చైనాలోనూ మగ బిడ్డలకు ప్రాధాన్యమిచ్చే ధోరణి తగ్గుముఖం పడుతోంది. చాలా గ్రామాల్లో ఒకే ఆడ బిడ్డ ఉన్న కుటుంబాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, భారత్‌తోపాటు అనేక దేశాల్లో మహిళలపై నేరాలు పెరగడం అత్యంత ఆందోళనకర పరిణామం. ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు శారీరక, లైంగిక హింసకు గురైనవారే. భారత్‌లో మహిళలపై నేరాల్లో అత్యాచారాలు మొదటి స్థానం ఆక్రమిస్తున్నాయి. వీటిని అరికట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాలు తీసుకొంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకూ స్ఫూర్తిదాయకం. కంపెనీల పాలనా బోర్డుల్లో, ప్రభుత్వంలో, సమాచార సాధనాల్లో, కార్య స్థానాల్లో, క్రీడల్లో, ఆరోగ్య, ఆర్థిక రంగాల్లో మహిళా సమానత్వ సాధనకు నేడు ప్రపంచమంతటా కృషి సాగుతోంది. దీనికి అడ్డుపడుతున్న అంశాలు సంస్కృతిలో, చట్టాల్లో చాలానే ఉన్నాయి. వీటిని సత్వరం తొలగించాలి. భారతదేశాన్ని అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందించాలంటే, జనాభాలో సగభాగమున్న మహిళల భాగస్వామ్యమూ ఎంతో అవసరం. 2020 సంవత్సరం మహిళలు, బాలికలకు మరిన్ని విజయాలు చేకూర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు రూపొందించాలి.

పీడిస్తున్న అసమానతలు
భారతీయ సమాజంలో లింగపరమైన అసమానత్వం వేళ్లూనుకుందనేది నిష్ఠుర సత్యం. మహిళలు పుట్టుకనుంచే అడుగడుగునా దుర్విచక్షణను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) విడుదల చేసిన 2019 లింగ అసమానత్వ సూచీలో భారత్‌ ఎక్కడో అడుగున 112వ స్థానంలో ఉంది. లింగ సమానత్వం, దేశాభివృద్ధిలో మహిళా భాగస్వామ్యానికి సంబంధించి దేశం గతంలోకన్నా నాలుగు స్థానాలు దిగజారింది. మహిళా ఆరోగ్యం, ఆర్థిక స్థాయికి సంబంధించి అట్టడుగు అయిదు స్థానాల్లో ఉంది. డబ్ల్యూఈఎఫ్‌ 2006లో మొట్టమొదటిసారి ప్రకటించిన లింగ అసమానత్వ సూచీలో భారత్‌ 98వ స్థానంలో ఉండేది. ఈ సూచీలో ర్యాంకులు ఇవ్వడానికి నాలుగు కొలమానాలను తీసుకుంటారు. 2007 నుంచి సూచీలో భారత్‌ నానాటికి తీసికట్టుగా తయారైంది. మహిళా ఆరోగ్య కొలమానంలో ఇండియా ఇప్పుడు 150వ స్థానం, మహిళా విద్యలో 112వ స్థానం, ఆర్థికపరంగా 149వ స్థానంతో సరిపెట్టుకొంటోంది. కంపెనీ పాలనా బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం 13.8 శాతానికి మించదని డబ్ల్యూఈఎఫ్‌ వెల్లడించింది. ఇందులో ఉత్తర ఐరోపా దేశాలు అగ్ర స్థానాలను ఆక్రమించాయి. ఒకటో ర్యాంకులో ఐస్‌ల్యాండ్‌, రెండో ర్యాంకులో నార్వే, మూడో ర్యాంకులో ఫిన్లాండ్‌, నాలుగో ర్యాంకులో స్వీడన్‌ నిలుస్తున్నాయి. తొలి పది ర్యాంకుల్లో మిగిలిన స్థానాలను నికరాగువా, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, స్పెయిన్‌, ర్వాండా, జర్మనీ ఆక్రమిస్తున్నాయి. చివరకు బంగ్లాదేశ్‌ సైతం మనకన్నా ఎంతో మెరుగ్గా 50వ ర్యాంకు సాధించింది.

Posted on 07-03-2020