Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

నారీ భేరి మోగాలి!

మానవాళి మహోదయానికి తరంతరం నిరంతరంగా పురిటి నొప్పులు పడుతోంది మహిళ. ‘ఆకాశంలో సగం’ అంటూ తగరపు కిరీటాలు తొడగడమేగాని, మనిషిగా స్వీయ సామర్థ్యం మేరకు ఎదిగే సమానావకాశాలు కల్పించని పురుషాధిక్య భావజాల ప్రపంచం ఆగడాలు ఇంకానా?- అన్నది కోట్లాది స్త్రీమూర్తులు సంధిస్తున్న సూటి ప్రశ్న! మానవ హక్కులే మహిళల హక్కులని నినదిస్తూ ఐక్యరాజ్య సమితి సారథ్యంలో 189 దేశాల ప్రతినిధులు పాల్గొన్న అంతర్జాతీయ మహిళా సదస్సు- మార్పు మా తీర్పు అని స్పష్టీకరిస్తూ బీజింగ్‌ డిక్లరేషన్‌ వెలువరించి పాతికేళ్లు అయింది. ఆ సందర్భంగా ఈ ఏటి అంతర్జాతీయ మహిళాదినోత్సవానికి- బీజింగ్‌ తీర్మానాలవల్ల స్త్రీ జాతికి ఇదమిత్థంగా ఒనగూడిందేమిటన్నదే ముందుమాట అయింది. సమానత్వ తరాన్ని ఈ ఏడాది నినాదంగా స్వీకరించి, పాతికేళ్ల సాఫల్య వైఫల్యాల్ని సక్రమంగా మదింపు వేసి, ప్రభుత్వాలకు సరైన దిశానిర్దేశం ద్వారా ముందడుగు వెయ్యాలన్న సంకల్పం ఎంతైనా మెచ్చదగింది. లింగ విచక్షణ రూపుమాసిపోతే, ఎక్కడికక్కడ మంచిగా రూపాంతరం చెందే సమాజాల్లో మహిళలు, ఆడపిల్లలే కాదు- ప్రతి వ్యక్తీ ఎంతో ప్రయోజనం పొందుతాడన్న సమితి మహిళావిభాగ సారథి వ్యాఖ్య పూర్తిగా అర్థవంతమైనది. 1995 నాటితో పోలిస్తే స్త్రీల సగటు ఆయుర్దాయం ఎనిమిదేళ్లు పెరిగింది. పాఠశాల గుమ్మం తొక్కని బాలికల సంఖ్య రెండు దశాబ్దాల్లో దాదాపు ఎనిమిది కోట్లు తగ్గిపోయినా కొరగాని చదువులవల్ల వారి సాధికారత నేతిబీరలో నెయ్యి చందంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కౌమార దశలోని బాలికలు 110 కోట్లమంది ఉన్నారన్న సమితి- వారికి చదువు అందించడం ఒక్కటే చాలదని, సామాజిక ధోరణుల్లోనూ గుణాత్మక మార్పు రావాలనీ ఎలుగెత్తుతోంది. 2016లో మానవ అక్రమ రవాణాలో 70శాతం స్త్రీలు, ఆడపిల్లలే ఉన్నారంటున్న అధ్యయనాలు- అబలలపై మృగోన్మాద దాడుల విశ్వరూపాన్ని కళ్లకు కడుతున్నాయి. కేవలం ఆరు దేశాల్లోనే పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులున్నాయని నిరుడు మార్చిలో ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. అలాంటప్పుడు ‘సమానత్వ తరం’ ఎప్పటికి సాకారం అవుతుందంటే జవాబు చెప్పగలవారేరీ?

పంచపాండవులంటే, మంచంకోళ్లులా ముగ్గురంటూ రెండు వేళ్లు చూపించి, ఒకటి వెయ్యబోయి సున్నా పెట్టిన చందంగా బీజింగ్‌ సదస్సులోనే ప్రపంచ దేశాలు కొద్దిబుద్ధుల్ని ఎండగట్టుకొన్నాయి. స్త్రీల సముద్ధరణే లక్ష్యమంటూ ఆర్భాటంగా 150 దేశాలు ప్రకటనలు గుప్పించినా, తీర్మానాల అమలుకు ముందుకొచ్చినవి అందులో సగం కూడా లేవు; కేటాయింపుల విషయానికొచ్చేసరికి నిర్మాణాత్మకంగా స్పందించినవి కేవలం అయిదు! అంతెందుకు? మహిళలు, బాలికల్ని ప్రధానంగా లక్షించి స్థూల దేశీయోత్పత్తిలో ఆరు శాతాన్ని విద్యాభివృద్ధికి వ్యయీకరించనున్నామని అప్పటి రాజీవ్‌ ప్రభుత్వం బీజింగ్‌ సదస్సులో ఘనంగా చాటింది. పాతికేళ్ల తరవాతా విద్యారంగానికి జీడీపీలో ఆరుశాతం కేటాయింపులు మరీచికగానే మిగిలాయి. మేధా, మనో వికాసానికి, ఆర్థిక స్వాతంత్య్ర సాధనకు అక్కరకొచ్చే చదువులే స్త్రీ సాధికారతకు మేలు బాటలు పరవగలుగుతాయి. మహిళాభివృద్ధికోసం విస్పష్టంగా ఏమీ చెయ్యని దేశాల్లోనే ఏకంగా 280 కోట్లమంది స్త్రీలు, బాలికలు భారంగా బతుకులీడుస్తున్నారని నిరుడు జూన్‌నాటి ప్రపంచ లింగ సమానత్వ సూచీ వెల్లడించింది. పేదరికం, ఆరోగ్యం, విద్య, రాజకీయ ప్రాతినిధ్యం, పని ప్రదేశాల్లో సమానత్వ ప్రాతిపదికల ఆధారంగా వెలువరించిన వివరాల మేరకు- మొత్తం 162 దేశాల జాబితాలో ఇండియా 122వ స్థానంలో నిలిచింది. శ్రామిక విపణిలో పురుషుల వాటా 78.8శాతం; స్త్రీలు 23.6శాతంగా ఉన్నారని, తలసరి స్థూల దేశీయోత్పత్తి పురుషులకు రూ.10,712; అదే మహిళలకు రూ.2,625గా నమోదైందని గణాంకాలు చాటుతున్నాయి. దేశ జనాభాలో సగంగా ఉన్న మహిళల్ని సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్దుకోలేక, సమానావకాశాలతో సామాజిక సమన్యాయ భావనకు పట్టం కట్టలేకపోబట్టే- ఇప్పటికీ వర్ధమాన దేశంగా ఇండియా కిందుమీదులవుతోంది!

చదువుకొని జీవితాల్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలన్న చేతన ఈతరం ఆడపిల్లల్లో పురివిప్పుతున్నా- పేదరికం నుంచి సామాజిక పీడన దాకా ఎన్నో ప్రతిబంధకాలు ఎదురవుతూనే ఉన్నాయి. 1950-51లో కేవలం పాతిక శాతంగా ఉన్న విద్యార్థినుల సంఖ్య నేడు యాభై శాతానికి చేరింది. పాఠ్యప్రణాళికల్లో డొల్లదనం వారి చేవ-చొరవల్ని గుల్లబారుస్తుంటే, ఆడపిల్లలపై ఏటికేడు పెరుగుతున్న దాష్టీకాలు తీవ్రాందోళనకరంగా పరిణమిస్తున్నాయి. సమితి విజ్ఞప్తి మేరకు ఇండియాలో మహిళల స్థితిగతులపై కేంద్రం 1971లో ఏర్పాటు చేసిన కమిటీ- లింగ సమానత్వంపై రాజ్యాంగ విహిత బాధ్యతల్ని నిర్వర్తించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని స్పష్టీకరించింది. 2013లో నియుక్తమైన ఉన్నతాధికార కమిటీ రెండేళ్ల నిశిత అధ్యయనం దరిమిలా సమర్పించిన నివేదిక- భిన్న అంశాలపై విపుల సూచనల్ని చేసింది. శతాబ్దాల తరబడి పురుషాధిక్య సమాజమైన ఇండియాలో సరళీకృత ఆర్థిక వ్యవస్థ స్త్రీలకు మంచి చదువు, ఉద్యోగాలు, అవకాశాల్ని కల్పిస్తుంటే; ఇంటాబయటా హింసకు వారే లక్ష్యంగా మారుతున్నారని, వేతనాల్లో వ్యత్యాసాలు, దుర్విచక్షణలు కొనసాగుతున్నాయన్న కమిటీ- అయిదేళ్ల క్రితం చేసిన సిఫార్సులకు ఏ గతి పట్టిందీ అగమ్యం. మానవాభివృద్ధి సూచీల్లో ఇండియా మెరుగైన స్థానం సాధించాలంటే, సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో అయిదోదిగా ఉన్న లింగ సమానత్వంపై దృష్టి సారించడం నేటి అవసరం. ఇండియాలో సొంత కాళ్లపై నిలబడిన 5.85కోట్ల మందిలో మహిళలు 80లక్షల మందేనని ఆరో ఆర్థిక గణన చాటుతోంది. నారీలోకం నారి సారించే సానుకూల వాతావరణం కల్పించినప్పుడే- అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యాన్ని ఇండియా ఛేదించగలిగేది!

Posted on 09-03-2020