Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సత్వర స్పందనే రక్షరేకు!

* విపత్తులపై సమగ్ర ప్రణాళిక
సాంకేతికంగా, ఆర్థికంగా ఎంత పురోగమించినా ప్రపంచంలో ఏ దేశమూ ప్రకృతి విపత్తులను, మానవ కల్పిత ఉత్పాతాలను తప్పించుకోలేదు. వీటికి అతీతమైన ప్రాంతం ఈ భూగోళంపై ఎక్కడా లేదు. ఇటీవల టెక్సస్‌ నుంచి బీజింగ్‌ వరకు, లండన్‌ నుంచి పారిస్‌ వరకు నగరాలు వరదల్లో మునిగిపోవడం చూస్తే, ప్రకృతి ప్రకోపాలు పేద, ధనిక దేశాల మధ్య తేడా చూపవని అర్థమవుతుంది. ఉత్పాతాలు విరుచుకుపడినప్పుడే పౌరుల ప్రాణ, ఆస్తుల రక్షణలో ప్రభుత్వాల సత్తాకు పరీక్ష ఎదురవుతుంది. ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశమూ పలు ప్రకృతి ఉత్పాతాలను ఎదుర్కొంది. ఉత్తరాఖండ్‌, కశ్మీర్‌, చెన్నైలలో వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వీటి వల్ల లక్షలాదిమంది జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. విలువైన ఆస్తులు దెబ్బతిన్నాయి. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీన జాతీయ ప్రకృతి ఉత్పాత నిర్వహణ ప్రణాళిక (ఎన్‌డీఎంపీ)ని ప్రకటించింది. జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రణాళికను చేపట్టడం ఇదే మొదటిసారి. ప్రకృతి విపత్తుల నుంచి వెంటనే తేరుకోవడానికి, పౌరుల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ఇది అగ్ర ప్రాధాన్యమిస్తోంది. ఐక్యరాజ్య సమితి ఆమోదించిన సెండయ్‌ ప్రాతిపదిక ఒప్పందంలోని నాలుగు ప్రాథమ్యాల పునాదిపై ఎన్‌డీఎంపీని చేపడుతున్నారు. 15 ఏళ్ల కాలపరిమితి గల సెండయ్‌ ఒప్పందాన్ని తప్పనిసరిగా అమలు చేయాలనే నిర్బంధమేదీ ప్రభుత్వాలపై లేదు. దీనిపై భారత్‌తో సహా 187 దేశాలు స్వచ్ఛందంగా సంతకాలు చేశాయి. దీని ప్రకారం విపత్తుల నివారణకు కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు రంగం, వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలూ చొరవ తీసుకుంటాయి.

సమన్వయ కార్యాచరణ
సెండయ్‌ ప్రాతిపదికకు అనుగుణంగా భారత ప్రభుత్వం రూపొందించిన ఎన్‌డీఎంపీ కింద ప్రకృతి ఉత్పాతాలు సంభవించే అవకాశాన్ని ముందుగానే పసిగట్టి, నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి పెట్టుబడులు పెడతారు. విపత్తులు సంభవించిన తరవాత పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటారు. ప్రకృతి ఉత్పాతాల రాక గురించి ముందే హెచ్చరించడం, అవసరమైన సందర్భాల్లో వాటి నిరోధం, శీఘ్ర స్పందన, పునరావాస, పునర్నిర్మాణాలకు సమగ్ర ఎన్‌డీఎంపీని రూపొందించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. నేడు విపత్తులు సంభవించినప్పుడు సమర్థ కార్యాచరణ లోపిస్తోందంటే అందుకు కారణం, సిబ్బంది కొరత కాదు. ఆయా ప్రభుత్వ విభాగాల విధులు, బాధ్యతలను స్పష్టంగా నిర్వచించి, వాటిని కార్మోన్ముఖం చేయకపోవడమే అసలు సమస్య. ఫలితంగా ప్రకృతి ఉత్పాతాల వల్ల సామాన్య ప్రజలు కష్టనష్టాలపాలైతే, ప్రభుత్వ విభాగాలు పరస్పరం నిందించుకుంటూ కాలయాపన చేస్తున్నాయి. ఎన్‌డీఎంపీ ప్రణాళిక దీనికి చెల్లుచీటీ ఇస్తూ ఆయా ప్రభుత్వ విభాగాల పరిధిని, బాధ్యతలను స్పష్టంగా నిర్వచించింది. ఎన్‌డీఎంపీ అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంగా పనిచేయడానికి ప్రాతిపదిక కల్పిస్తుంది. దీనికింద మొత్తం 15 రకాల విపత్తుల జాబితా ఇచ్చి, ఏయే మంత్రిత్వ శాఖలు ఏయే ఉత్పాతాలకు స్పందించాలో, వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరించింది. ఉదాహరణకు తుపానులు, సునామీలు సంభవించినప్పుడు వెంటనే రంగంలోకి దిగడం భూవిజ్ఞాన శాస్త్రాలశాఖ బాధ్యత. మట్టిపెళ్లలు విరిగి పడి ప్రమాదాలు సంభవించినప్పుడు గనుల శాఖ, అంటు వ్యాధుల వంటి జీవసంబంధ విపత్తులు సంభవించినప్పుడు ఆరోగ్య శాఖ, నగరాలు, పట్టణాల్లో కుండపోత వర్షాల వల్ల మెరుపు వరదలు విరుచుపడినప్పుడు పట్టణాభివృద్ధి శాఖ సహాయ, పునరావాస చర్యలకు సారథ్యం వహించాలని ఎన్‌డీఎంపీ నిర్దేశించింది. దీంతోపాటు పంచాయతీలు, మునిసిపాలిటీలు, మహానగర పాలికలు నిర్వహించాల్సిన బాధ్యతలనూ వివరించింది. కేంద్ర సహాయ బృందాలు వచ్చేవరకు నిరీక్షించకుండా ఈ స్థానిక సంస్థలు చప్పున రంగంలోకి దిగడానికి ఎన్‌డీఎంపీ ఏర్పాటు చేసింది. పైగా స్థానిక భౌగోళిక పరిస్థితుల గురించి, ప్రజల తక్షణావసరాల గురించి స్థానిక సంస్థలకు తెలిసినంతగా కేంద్ర, రాష్ట్రస్థాయి సహాయ బృందాలకు తెలియదు. కింది నుంచి పైస్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం శీఘ్రంగా సమర్థంగా స్పందించడానికి ఎన్‌డీఎంపీ వీలు కల్పిస్తోంది. విపత్కాలంలో ప్రభుత్వ శాఖలు, సంస్థలు చేపట్టాల్సిన 18 రకాల కార్యక్రమాలను ఈ ప్రణాళిక నిర్దేశిస్తోంది. అవి: ముందస్తు హెచ్చరిక, పటాల (మ్యాపుల) తయారీ, ఉపగ్రహ తదితర సమాచారాల పంపిణీ, ప్రజలు, వారి పశువులు, ఇతర జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వైద్యచికిత్స, తాగునీరు, ఆహారం, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు, విద్యుత్‌, ఇంధనం రవాణా సదుపాయాల కల్పన, జంతు కళేబరాల తొలగింపు, ప్రజలకు తాత్కాలిక ఉపాధి ఏర్పాటు, ప్రమాద సమాచార సేకరణ, నిర్వహణ... ఇలా ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన కార్యక్రమాలను స్పష్టంగా నిర్దేశించడంవల్ల సమష్టి కార్యాచరణ సుగమం అవుతుంది. విపత్తుల పార్శా్వలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రాథమ్యాలవారీగా సహాయ కార్యక్రమాలు చేపట్టడం వీలవుతుంది. ఎన్‌డీఎంపీలో జంతువుల పట్ల కారుణ్యం చూపడం ఎంతో ప్రశంసనీయం. ఇంతవరకు విపత్కాలంలో జంతువుల అతీగతి అంతగా పట్టించుకునేవారు కారు. మండుటెండలతోపాటు అతిశీతల పరిస్థితుల్లోనూ పశుగ్రాసం సరఫరాకు ఏర్పాట్లు చేయాలని, అవి తీవ్ర వాతావరణ వ్యత్యాసాల బారిన పడకుండా రక్షణ కల్పించాలని ఎన్‌డీఎంపీ సూచిస్తోంది.

స్పష్టమైన నిబంధనలు
ప్రకృతి ఉత్పాతాలతోపాటు మానవ కల్పిత విపత్తులతో వ్యవహరించాల్సిన విధానాన్నీ ఎన్‌డీఎంపీ వివరించింది. భోపాల్‌ గ్యాస్‌ ప్రమాదం భీకర స్మృతులు ఇప్పటికీ భారతీయుల మదిని ముప్పిరిగొంటున్నా, ఇలాంటి ప్రమాద సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలేమిటో ఇంతవరకు నిర్దేశించలేదు. ఈ దిశగా పలు కమిటీలు కొన్ని సిఫార్సులు చేసినా అవి అమలుకు నోచుకోలేదు. ఆ లోపాన్ని ఎన్‌డీఎంపీ భర్తీ చేస్తోంది. దీనికింద జీవ, రసాయన, రేడియో ధార్మిక, అణు విపత్తులను మానవ ప్రేరిత విపత్తులుగా వర్గీకరించారు. విపత్తు సమయంలో సమాచార సాధనాలు వ్యవహరించాల్సిన తీరునూ ఇందులో నిర్దేశించడం టీవీ ఛానళ్లకు, పత్రికలకు రుచించకపోవచ్చు. కానీ, ముంబయిపై పాక్‌ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు మీడియా అత్యుత్సాహం కొందరు పోలీసు అధికారుల మరణానికి దారితీసిందని ప్రభుత్వ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. కొన్ని సమాచార సాధనాలు పరిస్థితి తీవ్రత గమనించకుండా సంచలన వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం మనకు అనుభవమే. అయితే, ప్రకృతి ఉత్పాతాలు సంభవించినప్పుడు సహాయ, భద్రత దళాలకన్నా ముందే సమాచార సాధనాలు మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడి దయనీయ పరిస్థితుల గురించి బయటి ప్రపంచానికి వెల్లడించి అనేకమంది ప్రాణాలను కాపాడిన సందర్భాలు అనేకం. ఎన్‌డీఎంపీలో సమాచార సాధనాల పాత్రను నిర్దేశించేటప్పుడు ఈ సానుకూల, ప్రతికూల అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే విపత్తు వేళ సమాచార సాధనాలు స్వీయ నియంత్రణతో సంయమనం పాటించడం అభిలషణీయం. ఈ అంశాన్ని ఎన్‌డీఎంపీలో గుర్తించారు. వ్యక్తుల, బాధిత వర్గాల ఆంతరంగికత, గౌరవాలకు భంగం కలగకుండా ఉత్తమ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వార్తా నివేదన జరగాలని ఎన్‌డీఎంపీ ఉద్ఘాటించింది. అది చేసిన ఇతర సూచనలు- విపత్కాలంలో సంబంధిత ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తూ సమాచార సాధనాలు బాధితులకు సక్రమంగా సహాయం అందేలా చూడాలి. ఉత్పాతాలు సంభవించినప్పుడే కాకుండా, వాటికి ముందూవెనక కూడా ఏయే పనులు చేయాలో, చేయకూడదో ప్రజలకు, మీడియాకు తెలియజెప్పే యంత్రాంగం ఉండాలి. ఈ బాధ్యతను కేంద్ర సమాచార ప్రసార శాఖ, జాతీయ ప్రకృతి ఉత్పాతాల నియంత్రణ సంస్థ కలిసికట్టుగా నిర్వహించాలి. ఈ ప్రతిపాదనలకు అభ్యంతరపెట్టేవారు ఒకసారి అమెరికా అనుభవాన్ని పరిశీలించాలి. 9/11నాటి టెర్రరిస్టు దాడిలో మృతుల దృశ్యాలు, ఫొటోలను అమెరికన్‌ సమాచార సాధనాలు వెల్లడి చేయకుండా ఎంతో సంయమనం పాటించాయి. అదే భారత పార్లమెంటుపై, ముంబయి మీద, ఇతర ప్రదేశాల్లో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు భారతీయ సమాచార సాధనాలు అదేపనిగా ఆ దృశ్యాలను ప్రసారం చేశాయి. ఇలాంటి వాటిని నివారించడానికి ఎన్‌డీఎంపీ కొన్ని జాగ్రత్త చర్యలను ప్రస్తావించింది.

క్షేత్రస్థాయి నుంచి సన్నాహాలు
ఈ విధంగా చిన్నాపెద్ద అంశాలన్నింటినీ కూలంకషగా పరిశీలించి సమగ్ర కార్యాచరణను ప్రతిపాదించడం ఎన్‌డీఎంపీ విశిష్టత. అయితే, ఈ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడమే పెద్ద సవాలు. దీనికోసం పంచాయతీ స్థాయి నుంచి తగిన సదుపాయాలు కల్పించాలి. ఇప్పటికే ఉనికిలో ఉన్న సహాయ సంస్థలను సంస్కరించి పునరుత్తేజం నింపాలి. వాటి నిర్వహణ యంత్రాంగాన్ని సమూలంగా మార్చాలి. అధికారులు, సిబ్బంది చురుగ్గా పనిచేయాలి. భూతాపం వల్ల విపత్తుల తీవత్ర పెరగనుందని గ్రహించి, వాటిని తట్టుకోవడానికి మన పట్టణాలు, నగరాలను ప్రణాళికాబద్ధంగా సమాయత్తం చేయాలి. ఇటీవల భారీ వరదలకు టెక్సస్‌, లండన్‌, పారిస్‌ వంటి సువ్యవస్థిత నగరాలే అల్లల్లాడాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన పట్టణీకరణ ప్రణాళికలపై పునఃపరిశీలన జరపాలి. అమరావతి, హైదరాబాద్‌, విశాఖ, చండీగఢ్‌, లక్నో, చెన్నై... ఇలా నగరమేదైనా విపత్తులను సమర్థంగా అధిగమించేలా ఏర్పాట్లు చేయాలి. మన అణు కేంద్రాల్లో ఫుకుషిమా, చెర్నోబిల్‌ ప్రమాదాల వంటివి జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. వీటన్నింటినీ ఎన్‌డీఎంపీ పరిగణనలోకి తీసుకున్నా, దాన్ని నికరంగా అమలు చేయడం అందరి బాధ్యత!

- మహేంద్రబాబు కురువ
Posted on 10-06-2016