Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

దారి తప్పుతున్న విరాళాలు

* ఎన్నికల బాండ్లు - పారదర్శకత

ఎన్నికల బరిలోకి దిగే పార్టీలకు ప్రచారం, ఇతరేతర ఖర్చులకోసం విరాళాల రూపంలో ప్రభుత్వాలే డబ్బు సమకూర్చాలన్న వాదన ఎప్పటినుంచో వినిపిస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వమూ ఇదే అభిప్రాయంతో ఉంది. 2016లో పెద్దనోట్ల రద్దు తరవాత, లోక్‌సభ రాష్ట్ర అసెంబ్లీలకు జమిలిగా ఎన్నికలను నిర్వహించాలన్న వాదనను మోదీ బలంగా వినిపించారు. ఆ సందర్భంలోనే రాజకీయ స్థాయిలో అవినీతి కట్టడికి ఎన్నికల్లో పార్టీలకు ప్రభుత్వమే నిధులు సమకూర్చాలన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఎన్నికల సంఘం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఇటీవల ఇదే విషయం వెల్లడించారు. ‘ప్రభుత్వమే పార్టీలకు ఎన్నికల విరాళాలు సమకూర్చే పద్ధతికి మేం వ్యతిరేకం. అభ్యర్థులు ఎన్నికల్లో తమ సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారా, వారి తరఫున మరెవరైనా వ్యయం చేస్తున్నారా లేక ఆ డబ్బు ప్రభుత్వమే ఇచ్చిందా అన్న విషయాలను నిర్ధారించడం సాధ్యమయ్యే పనికాదు. ఈ క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారానికి ఎన్నికల ఖర్చుకు సంబంధించిన మౌలిక వ్యవస్థలోనే సమూల మార్పులు తీసుకురావలసి ఉంది. విరాళాల స్వీకరణ, నిధుల వ్యయం తీరుతెన్నులపై విషయంలో పారదర్శకత నెలకొనడం అవసరం’- అని ఎన్నికల సంఘం ప్రభుత్వానికి వెల్లడించినట్లు పార్లమెంటులో అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు. దేశంలోని ఏడు జాతీయ పార్టీలు 2018-‘19లో ఎవరో ఏమిటో తెలియని సంస్థలనుంచి, వ్యక్తులనుంచి మొత్తంగా 67శాతం నిధులు సేకరించినట్లు ‘ఏడీఆర్‌’ సంస్థ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల విరాళాలు, నిధుల వినియోగంలో పారదర్శకత వంటి అంశాలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి.

ప్రభుత్వమే పార్టీలకు విరాళాలు సమకూర్చాలన్న ప్రతిపాదనను ఎలెక్షన్‌ కమిషన్‌ వ్యతిరేకించినప్పటికీ- భారతీయ ఎన్నికల వ్యవస్థలో డబ్బు ప్రభావానికి కోత పెట్టేందుకు తాము కంకణబద్ధమై ఉన్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఉద్ఘాటించారు. రాజకీయ విరాళాల వ్యవస్థలో పారదర్శకతను పాదుగొల్పడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. నగదు లావాదేవీలను నిరుత్సాహపరచి, పార్టీలకు విరాళాలు ఎవరిస్తున్నారో నిర్దుష్టంగా తేల్చేందుకే ఆదాయ పన్ను చట్టంలో మార్పులు తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. పూర్తి సమాచారం వెల్లడించని వారినుంచి పార్టీలు స్వీకరించే విరాళాలను ప్రభుత్వం గరిష్ఠంగా రూ.2,000కు పరిమితం చేసింది. రాజకీయ విరాళాల్లో పారదర్శకతే లక్ష్యంగా కచ్చితమైన ఆడిట్‌ తనిఖీలతో కూడిన ఎలక్టొరల్‌ బాండ్స్‌ విధానాన్ని 2018లో ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకొంది. ఎలక్టొరల్‌ బాండ్ల ద్వారా దేశ రాజకీయ విరాళాల వ్యవహారంలో గుణాత్మక మార్పులు సాకారమయ్యాయా అన్నది చర్చించాల్సిన అంశం. ఈ బాండ్ల ఆగమనం తరవాత పార్టీలకు ఇచ్చే విరాళాల వ్యవస్థలో పారదర్శకత నెలకొనడానికి బదులు- అది మరింత సంక్లిష్టంగా తయారైంది. ముఖ్యంగా దేశంలోని పెద్ద పార్టీలు ఈ విధానాన్ని తెలివిగా ఉపయోగించుకుంటుంటే- ప్రాంతీయ స్థాయిలో కొత్తగా ఏర్పాటైన రాజకీయ పక్షాలు మాత్రం ఎటూ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

తాజా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో కనీసం ఒక శాతం గెలుచుకున్న పార్టీలు మాత్రమే ఎలక్టొరల్‌ బాండ్లు స్వీకరించి, వాటిని సొమ్ము చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే కొత్తగా ఏర్పాటైన పార్టీలకు ఎన్నికల బరిలో నిలిచి ఒక శాతం ఓట్లు సాధించడం అంత సులభం కాదు. కాబట్టి ఈ విధానం కొత్త పార్టీలకు కంటకంగా మారింది. భారతీయ పౌరులుగానీ, దేశంలో ఏర్పాటైన కంపెనీగానీ ఎలక్టొరల్‌ బాండ్లను వెయ్యి, పదివేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయల చొప్పున- ఎంపిక చేసిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలలో కొనుగోలు చేసి వాటిని తమకు నచ్చిన పార్టీలకు ఇచ్చే అవకాశం ఉంది. ఆ బాండ్లను ఆయా రాజకీయ పార్టీలు 15 రోజుల్లోగా బ్యాంకులకు సమర్పించి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకత పేరిట ప్రవేశపెట్టిన ఈ బాండ్లను కొనుగోలు చేస్తున్నవారు బ్యాంకుకు తమ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఫలితంగా ఈ బాండ్ల ఏర్పాటులోని ఉద్దేశమే నీరుగారిపోయింది. విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ)లోనూ సవరణలు తీసుకువచ్చారు. లెక్కాపత్రం లేకుండా దేశంలోని పార్టీలకు విదేశాలనుంచి చేరే విరాళాలతో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎన్నికల్లో ధన బలాన్ని రూపుమాపేందుకు తీసుకువచ్చిన ఈ బాండ్లు మరింత గోప్యతకు బాటలు పరవడంతో- పార్టీలకు ప్రభుత్వమే నిధులు సమకూర్చాలన్న వాదన ఊపందుకుంది. 2019 ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కలిసికట్టుగా 60వేల కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌ విధించిన గరిష్ఠ వ్యయ పరిమితిని దాదాపుగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఉల్లంఘిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలేవీ అభ్యర్థుల్లో జవాబుదారీతనాన్ని పాదుగొల్పేందుకు అక్కరకు రావడం లేదన్నది కఠిన వాస్తవం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల వ్యవస్థ సమగ్ర ప్రక్షాళనతోనే రాజకీయ విరాళాల సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుంది.

- ప్రొఫెసర్‌ సంజయ్‌ కుమార్‌
(రచయిత- దిల్లీలోని ‘అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం (సీఎస్‌డీఎస్‌)’లో ఆచార్యులు)
Posted on 11-03-2020