Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

గూడు పోయి... గోడు మిగిలి!

* విపత్తులు - నిరాశ్రయులు

విపత్తులు విరుచుకుపడినప్పుడు దేశాల ఆర్థిక స్థితిగతులు కుదేలవుతున్న మాట ఎంత నిజమో- సామాజిక వ్యవస్థలు అదే స్థాయిలో కకావికలవుతున్నాయన్నదీ అంతే వాస్తవం. వాతావరణ సంక్షోభాలు జనజీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన ప్రపంచ వలసదారుల నివేదిక విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 148 దేశాల్లో తట్టాబుట్టా నెత్తినపెట్టుకుని ఒక ప్రాంతంనుంచి మరొక ప్రాంతానికి అంతర్గతంగా వలసవెళ్ళినవారి సంఖ్య 2018 చివరినాటికి 2.8 కోట్లు అని ‘సమితి’ నివేదిక తేల్చింది. వీరిలో దాదాపు 61శాతం ప్రజలు వాతావరణ మార్పులు- విపత్తుల కారణంగా నిరాశ్రయులైతే- 39శాతం కల్లోలాలు, ఘర్షణల మూలంగా చెలరేగిన హింసాకాండ వల్ల నిర్వాసితులయ్యారని ఆ నివేదిక వెల్లడించింది. గడచిన అయిదారేళ్లుగా వాతావరణంలో తీవ్ర మార్పులవల్ల నిరాశ్రయులవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందంటూ తాజా నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. కొంతకాలంగా భారత్‌లో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయి. వాతావరణంలో గాలి నాణ్యత క్షీణించి- ఇంటి బయట కాలుపెట్టలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆకస్మికంగా కుండపోత వర్షాలు పడుతున్నాయి. వరదలు పోటెత్తి ఊళ్లు, పట్టణాలు మునిగిపోతున్నాయి. వీటివల్ల ప్రజలు మరో దిక్కులేక ఉన్న చోటిని వదిలి మరో ప్రాంతానికి తరలిపోతున్నారు.

బంగ్లాదేశ్‌, ఇండొనేసియా, మలేసియా, భారత్‌ వంటి దేశాల్లో జనాభా విస్తరిస్తున్న కొద్దీ పేదరికం పెరుగుతోంది. నిరుద్యోగం ఇంతలంతలవుతోంది. కనీస సదుపాయాలు కొరవడుతున్నాయి. ఈ సమస్యలతోపాటు పెరుగుతున్న జనాభా వాతావరణంపై, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. వాతావరణ మార్పుల దుష్పరిణామాలు పెను విపత్తు సృష్టించకముందే కళ్లు తెరవాలి. మంచుపర్వతాలు వేగంగా కరిగిపోతుండటంతో సముద్ర మట్టాలు ప్రమాదకర స్థాయికి పెరుగుతున్నాయి. శీతకాలంలోనూ భగభగమంటున్న ఎండలు భూమిని వేడెక్కిస్తున్నాయి. పీల్చేగాలి విషతుల్యమై పాణాల్ని తోడేస్తోంది. వాయు కాలుష్యం మితిమీరి దిల్లీలో జనం వీధుల్లోకి రావాలంటేనే జంకుతున్నారు. దక్షిణాదిన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, కేరళ ప్రాంతాలను వరదలు తరచూ బెంబేలెత్తిస్తున్నాయి. కనీస సౌకర్యాలకూ రోజుల తరబడి అంతరాయం ఏర్పడి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఈ వాతావరణ విపత్తులే ప్రజలను నిరాశ్రయులను కావిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా నిర్వాసితులై ఆశ్రయం కోరి వచ్చిన ప్రజలను తిరస్కరించరాదంటూ సభ్యదేశాలను ఉద్దేశించి ‘సమితి’ ఇటీవల ఓ కీలక ప్రకటన వెలువరించింది.

వాతావరణపరమైన వైపరీత్యాలు ప్రత్యేకించి ఆసియాలోనే ఎక్కువ. బంగ్లాదేశ్‌, భారత్‌, పాకిస్థాన్‌లకు విపత్తుల ముప్పు చాలా ఎక్కువని; భారీయెత్తున ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఈ ప్రాంతాల్లోనే ఉందని ‘సమితి’ నివేదిక హెచ్చరించింది. భారతావనిలోనే 2018లో భారీ వర్షాలు, తుపానులు, వరదల బారినపడి 20.7లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రత్యేకించి సముద్ర మట్టాల్లో పెరుగుదల ఆసియా- పసిఫిక్‌ ప్రాంతానికి పొంచి ఉన్న భయంకరమైన వైపరీత్యంగా తాజా నివేదిక పేర్కొంది. సముద్ర మట్టాలు ఒక్క మీటరు మేర పెరిగితే ప్రత్యేకించి తూర్పు ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో 3.70 కోట్ల మంది తమ ఆవాసాలు కోల్పోయి నిరాశ్రయులుగా మారుతారని, ఆ మట్టాలు రెండు మీటర్లు పెరిగితే- నిరాశ్రయులయ్యే వారి సంఖ్య రెట్టింపవుతుందని నివేదిక పేర్కొంది. ఆసియా- పసిఫిక్‌ ప్రాంతాల్లోని సముద్ర తీర నగరాలైన ముంబయి, బ్యాంకాక్‌, జకార్తా, హోచిమిన్‌, గ్వాంగ్‌జోలు ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. పర్యావరణ సంక్షోభానికి దారితీస్తున్న కార్యకలాపాలకు కళ్లెం వేయడమే ప్రపంచ దేశలముందున్న తక్షణ కర్తవ్యం. విపత్తుల కారణంగా మరో దేశం తలుపుతట్టే శరణార్థులకు ఆశ్రయమివ్వాలన్న ‘సమితి’ తీర్మానం ఎంతమేరకు అమలవుతుందన్నది సందేహాస్పదమే. అయిదేళ్లక్రితం మధ్య పసిఫిక్‌ ప్రాంతంలోని కిరిబతి రిపబ్లిక్‌కు చెందిన టిటియోటా అనే పౌరుడు తనను తాను వాతావరణ మార్పుల శరణార్థుడిగా ప్రకటించుకున్నారు. తాను ఆశ్రయం పొందేందుకు న్యూజిలాండ్‌ను అనువైన ప్రాంతంగా ఎంచుకున్నాడు. హింసాత్మక ఘటనలు, పర్యావరణ క్షీణత, పంటల నష్టం, కాలుష్యభరితమైన జలవనరులు వంటి వాతావరణ సంక్షోభాల కారణంగా తాను తన ఊరును వదిలివెళ్ళాలనుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో సురక్షితమైన ప్రాంతంలో తలదాచుకోవాలనుకుంటున్నట్లు తన దరఖాస్తులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన అభ్యర్థనను న్యూజిలాండ్‌ ప్రభుత్వం తిరస్కరించింది. అప్పుడు ఆయన ‘సమితి’ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే కిరిబతి ప్రాంతంలో జీవనానికి, సంరక్షణకు తగిన పరిస్థితులు ఉన్నందున అతడికి శరణార్థిగా మరో దేశం ఆశ్రయం కల్పించాల్సిన అవసరం లేదని ‘సమితి’ వ్యాఖ్యానించింది. మానవహక్కుల సంఘం గడపను తాకిన తొలికేసుగా దీన్ని పరిగణించవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ‘సమితి’ ఈ ఏడాది జనవరి 21న చరిత్రాత్మక తీర్మానం వెలువరించింది. ఈ తీర్మానం కార్యరూపం దాల్చాల్సి ఉంది. ‘సమితి’ ప్రకటనకు ముందే జర్మనీలో ఓ వాతావరణ శరణార్థి ఆశ్రయాన్ని కోరిన ఘటనలోనూ ఆ అభ్యర్థన తిరస్కరణకు గురైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ‘వాతావరణ శరణార్థిగా’ ఎవరిని పరిగణించాల్సి ఉంటుంది అన్న విషయంలో స్పష్టమైన వర్గీకరణ అవసరం. వాతావరణ వైపరీత్యాల మూలంగా మానవ సమూహాలపై ఒత్తిడి పెరుగుతోంది. పర్యావరణ హితకరమైన విధానాలను రూపొందించుకొని- సుస్థిరాభివృద్ధి సాధనే పరమావధిగా ముందుకు సాగే పాలన వ్యవస్థలు నేడు అవసరం. బాధ్యతాయుతమైన పౌరసమాజం, ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా కార్యోన్ముఖం కావాలి. కలిసికట్టుగా వాతావరణ వైపరీత్యాల ప్రభావాన్ని కనిష్ఠస్థాయికి తీసుకురాగలిగే ప్రయత్నాలను ముమ్మరం చేయాలి.

- డాక్టర్‌ జీవీఎల్‌ విజయ్‌కుమార్‌
(రచయిత- భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు)
Posted on 13-03-2020