Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

కరోనాపై ఉమ్మడి పోరు!

వెంట్రుక వాసిలో 900వ వంతు పరిమాణంగల కరోనా వైరస్‌ నేడు 780కోట్ల ప్రపంచ జనావళిని వణికిస్తోంది. మహమ్మారి (పాన్‌డెమిక్‌)గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించే నాటికే పదుల సంఖ్యలో దేశాల్ని చుట్టబెట్టేసిన వైరస్‌ ఇప్పుడు 141 దేశాలకు, లక్షన్నరకు పైగా కేసుల రూపేణా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరువేలకు చేరువ అవుతున్న మృతుల సంఖ్యలో సింహభాగం జన చైనాదే! ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, అమెరికా వంటివీ వైరస్‌ తాకిడికి గురై కిందుమీదులవుతున్నాయి. ఇండియాలో నమోదైన వందకుపైగా కేసుల్లో 90శాతంపైగా విదేశీ గడ్డమీద వైరస్‌ సోకినవే కాగా, రోగగ్రస్తుల నుంచి బంధుమిత్రులకు సంక్రమించినవి కొన్నే కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ విజృంభణ ప్రక్రియలోగల మొత్తం నాలుగు కీలక దశల్లో ఇది రెండోది. బాధితులతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేనివారికీ విస్తరించి సామాజికంగా గగ్గోలు పుట్టించేది మూడో దశ అని, జాతీయ స్థాయిలో కోరసాచి ఎప్పటికి ఉపశమిస్తుందో తెలియని భయానక స్థితి నాలుగో దశ అని వివరిస్తున్న నిపుణులు- ఇటలీ ప్రస్తుతం ఆ విపత్కర స్థితిలో ఉందంటున్నారు. జన సమూహాలు ఒక్కచోట కూడటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో దేశ దేశాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి; పరీక్షలు, ఎన్నికలు వాయిదా పడ్డాయి. పారిశ్రామికోత్పత్తి కుంగి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి 2.8 నుంచి 1.6శాతానికి పడిపోనుందన్న హెచ్చరికలూ చెవినపడుతున్నాయి. కరోనా ప్రభావం దీర్ఘకాలం కొనసాగితే, ప్రపంచం మాంద్యంలోకి కూరుకుపోయే ముప్పు తప్పదంటున్న అధ్యయనాలు- పొంచి ఉన్న సామాజిక ఆర్థిక సంక్షోభాన్ని కళ్లకుకడుతున్నాయి. జాతీయ ఆత్యయిక స్థితి ప్రకటించిన అమెరికా దాదాపు మూడు లక్షల 65వేల కోట్ల రూపాయల నిధితో కరోనా ఉపద్రవాన్నికాచుకొనేందుకు ఉద్యుక్తమవుతోంది. అంటురోగాల చట్ట నిబంధనల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం- కరోనా తాకిడిని మొట్టమొదటిసారి ‘విపత్తు’గా ప్రకటించింది. మహమ్మారిపై సాగించాల్సిన ముప్పేట యుద్ధంలో ప్రభుత్వాలూ ప్రజలూ నిబద్ధ సైనికులై కదం తొక్కాల్సిన సమయమిది!

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని నానుడి. హుబీ ప్రావిన్స్‌ రాజధాని వుహాన్‌లో తొలి కరోనా కేసు నిరుడు డిసెంబరులో బయటపడినప్పుడు దానిపై పెద్దగా శ్రద్ధ చూపని చైనా, పట్టుమని మూడు నెలల్లోనే ఆ ఉదాసీనతకు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. హుబీ ప్రావిన్స్‌ దాటి విజృంభించిన కరోనా మోగించిన మరణ మృదంగం అక్కడ 3,200 మందిని బలిగొనగా, 81వేల మంది ప్రాణాలతో చెలగాటమాడింది. నేటికీ దాదాపు 11వేల మంది కరోనా బాధితులకు నిరంతర వైద్యసేవలందిస్తున్న చైనా, వైరస్‌ విస్తృతిని కట్టడి చెయ్యగలుగుతోంది. వ్యాధి నిర్ధారణ- చికిత్సలపై పూర్తిగా దృష్టిసారించిన దక్షిణ కొరియా రోజుకు పదివేలకుపైగా పరీక్షలతో కరోనా అదుపులో కొత్తగా విజయం సాధిస్తోంది. ప్రైవేటు భాగస్వామ్యంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల్ని శీఘ్రతరంగా, సురక్షితంగా నిర్వహించే ప్రణాళికతో అమెరికా ప్రభుత్వం ముందడుగేస్తుంటే, వ్యాధి సోకే అవకాశం ఉన్నవారు ‘క్వారంటైన్‌’ మార్గదర్శకాల్ని పట్టించుకోకుండా తప్పించుకుపోయే ప్రమాదం ఇండియాను చైనా తరహా ఉత్పాతంవైపు నెట్టేస్తోందని నిపుణులు మొత్తుకొంటున్నారు. వచ్చే నెల రోజుల్లోగా కరోనా వ్యాధి విస్తరణలో ఇండియా మూడో దశకు చేరలేదంటే, పెద్ద గండం గడిచి గట్టెక్కినట్లేనని భారతీయ వైద్య పరిశోధనామండలి డైరెక్టర్‌ జనరల్‌ స్పష్టీకరిస్తున్నారు. ఏ మాత్రం ఏమరుపాటైనా ఎంత ఉత్పాతం కలిగించగల అవకాశం ఉందో చైనా అనుభవం ఎలుగెత్తుతున్నందున- ప్రతి వ్యక్తీ పౌర బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయమిది. ఒకరి నుంచి పలువురికి సోకే ప్రాణాంతక వైరస్‌కు ఎవరూ తాము వాహకంగా మారకుండా, పరిశుభ్రతా నియమాలు పాటించడం నుంచి, ఏ మాత్రం అనుమానం వచ్చినా క్వారంటైన్‌కు సిద్ధపడటం ద్వారా కరోనా కట్టడికి గట్టి సంకల్పం ప్రకటించాలి!

‘ఒక్కరి కోసం అందరు, అందరికోసం ఒక్కరు’ అన్నది సంక్షేమ రాజ్య భావనకు పునాది. మందూమాకూ అందుబాటులో లేని కరోనా మహమ్మారి కర్కశంగా కోరసాచే పరిస్థితుల్లో- అశాస్త్రీయ చిట్కా వైద్యాలకు చెవులొగ్గడం మాని, సర్కారీ మార్గదర్శకాలను నిష్ఠగా పాటించేందుకు ప్రతి ఒక్కరూ సమకట్టాలి. ఎండలు ముదిరితే వైరస్‌ అదే చస్తుందన్న ధీమా కూడా సరికాదని- అదే నిజమైతే, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌లో కరోనా అసలు వ్యాపించేదే కాదన్న నిపుణుల హెచ్చరికలు తోసిపుచ్చలేనివి. వందేళ్లక్రితం యావత్‌ ప్రపంచాన్ని వణికించిన స్పానిష్‌ ఫ్లూ ఎకాయెకి అయిదుకోట్లమంది అభాగ్యుల ప్రాణాలు తోడేయగా, అందులో సగంమంది ఇండియాలో బలయ్యారని చరిత్ర చెబుతోంది. 120 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ప్రాణ, ఆర్థిక నష్టాల్ని మిగిల్చిన ఆ మహమ్మారి- 1911-1921 నడుమ జన సంఖ్యలో పెరుగుదల లేకపోగా తగ్గుదలకు కారణమైంది. ఆర్థిక నష్టాలపరంగా ఇప్పటికే దాన్ని గుర్తుకు తెస్తున్న కరోనా- ఇండియాలో అరకొర వైద్య సదుపాయాలు, రోగ నిర్ధారణ కేంద్రాలకు సవాళ్లు రువ్వుతోంది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కరోనా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న ప్రకటనల సంగతి దేవుడెరుగు- ఇళ్లలో చేతులు శుభ్రం చేసుకునేందుకు నీళ్లు, సబ్బులూ అందుబాటులో లేని పేద కుటుంబాల సంఖ్య దేశంలో దండిగా పోగుపడి ఉందని 2015-16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదించింది! ఈ తరహా ప్రతికూలతల్నీ అధిగమించి నిబ్బరంగా కరోనా ముప్పును ఎదుర్కోవాలంటే జన జాగృత కార్యక్రమాల ద్వారా పౌర సమాజాన్ని చైతన్యవంతం చెయ్యడం, వైద్య సేవల విస్తరణపై సర్కార్లు చిత్తశుద్ధితో కృషి సాగించడం- నేటి అవసరం!

Posted on 16-03-2020