Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పచ్చదనమే పెట్టుబడి

* సమృద్ధ జీవజలమే రాబడి
పారిశ్రామిక విప్లవం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనంలో పెనుమార్పులకు దారితీసి, ప్రగతి రథాన్ని పరుగులు తీయించగలిగింది. అదేసమయంలో పారిశ్రామికీకరణవల్ల పర్యావరణ వ్యవస్థకు తీవ్ర హాని జరిగింది. హద్దు, అదుపులేని పారిశ్రామికీకరణ కారణంగా పట్టణాలు విస్తరించాయి. నగరాలుగా మారాయి. ఆ క్రమంలో అడవులు, కొండలు, గుట్టలు, పంట భూములు, ఉద్యాన వనాలు అంతకంతకూ తరిగిపోయాయి, పోతున్నాయి. ప్రతి ప్రాంతంలో మూడోవంతు భాగం పచ్చదనంతో కళకళలాడుతూ ఉండాలి. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 46శాతం అడవులను నేలకూల్చారు. రానున్న రోజుల్లో ఈ కోత 46శాతం నుంచి 54శాతానికి పెరగవచ్చని అంచనా. భారత దేశంలో ప్రస్తుతం అటవీ ప్రాంతం 23.3శాతం. ఉండాల్సినది 33.3శాతం. అంటే, యథార్థస్థాయికన్నా 10శాతం తక్కువగా ఉందన్న మాట. దీని పర్యవసానాలను రోజూ ఏదో ఒక రూపంలో ప్రజలు చవిచూస్తున్నారు. విపరీతమైన ఎండలు లేదా అధిక వర్షాలు లేక అతలాకుతలం చేసే తుపానులతో సతమతమవుతూనే ఉన్నారు.

నీటి వృథాకు అడ్డుకట్ట
సకల జీవరాశులకు అవసరమైన నీటి వనరులను అందించడంలో, వాటిని సరైన పద్ధతిలో పరిరక్షించడంలో చెట్లు కీలకపాత్ర పోషిస్తాయి. చెట్లు సమృద్ధిగా పెరిగే ప్రాంతంలోనే వాతావరణం చల్లగా ఉంటుంది. చెట్లు భూగర్భ జలాన్ని, భూ ఉపరితల జలాన్ని అంతగా ఆవిరి కాకుండా కాపాడతాయి. తద్వారా ఆ ప్రాంతం చల్లగా ఉండటానికి దోహదపడతాయి. నీరు చల్లగా ఉందంటే, అందులో ప్రాణవాయువు అధిక స్థాయిలో ఉన్నట్లే! ఒక భారీ చెట్టు రోజుకు సుమారుగా 300 నుంచి 400 లీటర్ల నీటిని ఆవిరి రూపంలో మార్చగలదు. దానివల్ల, వాతావరణం చల్లగా ఉండటమే కాదు, వర్షాలూ అధికస్థాయిలో పడటానికి ఆస్కారం ఏర్పడుతుంది. చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే వర్షాలు ఎక్కువగా కురుస్తాయనడంలో సందేహం లేదు. చెట్లు ఉన్న ప్రాంతంలో వర్షపు నీరు భూమిలోకి ఎక్కువగా చొచ్చుకుపోయి భూగర్భ జలంగా మారుతుంది. చెట్లకు తల్లి వేర్లు, పిల్ల వేర్లు ఉంటాయి. మొదటి రకం వేర్లు భూమిలోకి నిట్టనిలువుగా చొచ్చుకొని పోయి, చెట్లకు బలమైన పునాది ఏర్పరుస్తాయి. రెండోరకం వేర్లు అన్ని వైపులకు విస్తరించి, మొదటి వేర్లకు సహాయకారిగా ఉండటమే కాదు... నేలను అంటిపెట్టుకొని ఉంటాయి. రెండు రకాల వేర్లు భూమిలో విస్తరించి ‘స్పాంజ్‌’ మాదిరిగా పనిచేస్తాయి. వర్షం పడినప్పుడు నీటిని భూమిలోకి పంపడానికి మార్గం సుగమం చేస్తాయి. వర్షాల వల్ల మట్టి కొట్టుకుపోకుండా చెట్లు అడ్డగిస్తాయి. దీనివల్ల భూసారం యథాతథంగా కొనసాగుతుంది. భూమిలో విస్తరించే చెట్ల వేర్ల అల్లిక ఆనకట్టలా పనిచేసి నీటిని అడ్డుకుంటాయి. ఎక్కువ నీరు భూమిలోపలి పొరల్లో నలువైపులా విస్తరించడానికి సహాయపడతాయి. సాధారణంగా, మట్టిలో ఇంకే నీటికన్నా చెట్ల వేర్ల మధ్యగల మట్టిలో నీరు వేగంగా, ఎక్కువగా భూమిలోకి చేరుతుంది. ఆహారం తయారుచేసుకోవడానికి, ఆవిరి రూపంలో వాతావరణంలో మేఘాలు ఏర్పరచడానికి చెట్లకు ఆ నీరు ఉపయోగపడుతుంది. అనుకూల వాతావరణంలోనే, అంటే- పరిసరాలు చల్లగా ఉన్నప్పుడే మేఘాలు వర్షిస్తాయి. చెట్లు బతకడానికి ఎంత నీటిని తీసుకుంటాయో, వర్షాకాలంలో అంతకంటే రెట్టింపు స్థాయిలో నీరు భూమిలోకి తిరిగి చేరడానికి దోహదపడతాయి. ఇది నిరంతరం చక్రంలా జరిగే సహజసిద్ధమైన ప్రక్రియ.

ఉద్యమస్థాయిలో ముందడుగు
చెట్ల వల్ల మరో ఉపయోగమూ ఉంది. పరిశ్రమల నుంచి వచ్చే విష వాయువులను చెట్లు పీల్చుకుని, సకల జీవకోటికి అవసరమైన ప్రాణవాయువును బయటకు వదులుతాయి. కలుషితమైన నీటిని గ్రహించి, భూగర్భ జలాలను శుద్ధి చేసి సంరక్షిస్తాయి. చిత్తడి నేలల్లో చెట్ల వేర్లు ఎక్కువగా విస్తరించడం వల్ల నీరు అధికంగా నిల్వ ఉంటుంది. దాంతో ఆ పాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. కాబట్టి, రోడ్లకు ఇరువైపులా విరివిగా చెట్లు పెంచాలి. చెట్ల మొదళ్లను సిమెంటు, తారుతో మూసివేయరాదు. అలాచేస్తే, చెట్ల వేర్లకు నీరు అందదు. చెట్ల నుంచి నీరు ఆవిరి రూపంలో బయటకు రాదు. దానివల్ల మేఘాలు ఏర్పడవు. వర్షాలు పడవు. భూగర్భ జలాలు పెరగవు. కొండలపై ఉన్న చెట్లనూ నరకరాదు. అక్కడ ఎలాంటి కట్టడాలు నిర్మించరాదు. పంట భూములను ఇతర అవసరాలకు వాడరాదు. యుద్ధప్రాతిపదిక మీద అడవులను విస్తరించాలి. ఖాళీ స్థలాల్లో చెట్ల పెంపకం, ఉద్యాన వనాలను అభివృద్ధి చేయడం, ఇంటింటా చెట్లు పెంచడం వల్ల వాతావరణంలో సహజత్వం ఏర్పడుతుంది. అప్పుడు వాతావరణం చల్లబడి, చక్కటి వర్షాలు పడతాయి. ప్రకృతి పరిరక్షణకు చెట్లు ఎంత అవసరమో, వర్షపు నీటి సంరక్షణకు అవసరమైన పద్ధతులు (ఇంకుడు గుంతలు, చెక్‌ డ్యాములు, రాక్‌ఫిల్‌ డ్యాములు తదితరాలు) అంతే అవసరం. చెట్ల వల్ల చేకూరే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. చెట్ల సంరక్షణ ద్వారా ప్రకృతిని పరిరక్షించగలిగితే అవి స్వచ్ఛమైన ప్రాణవాయువు, నీటిని అందజేసి మానవాళికి జీవం పోస్తాయి. ఆ వర్షకాలంలో చెట్ల పెంపకం, వృక్షాల సంరక్షణ దిశగా ప్రజలు, ప్రభుత్వాలు ఒక్కుమ్మడిగా ముందుకు కదిలితే- పచ్చదనాల పరిసరాలు ప్రజలకు అనునిత్యం ఆహ్లాదం, ఆరోగ్యం పంచుతాయి.

- ఆచార్య నందిపాటి సుబ్బారావు (భూవిజ్ఞాన శాస్త్ర విభాగం, ఆంధ్ర విశ్వవిద్యాల‌యం)
Posted on 10-06-2016