Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

రాష్ట్రాల నెత్తిన శాశ్వత బరువు?

మున్ముందు యుద్ధాలు మరెంతో సంక్లిష్టభరిత వాతావరణంలో జరిగే అవకాశం ఉన్నందున సైన్యానికి సంబంధించిన ప్రతి విభాగాన్నీ ఆధునికీకరించాల్సి ఉందని ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ బిపిన్‌ రావత్‌ సూచించి రెండేళ్లు దాటింది. చాణక్యనీతి, అర్థశాస్త్రాల సారాన్ని గ్రహించి సైనిక బలగాల ఆధునికీకరణను వేగవంతం చేయాలన్న ఆయనే సంయుక్త త్రివిధ దళపతిగా ఆ బాధ్యతను నెరవేర్చాల్సి ఉన్న తరుణంలో- క్షేత్ర స్థాయి వాస్తవాల్ని పార్లమెంటరీ స్థాయీసంఘం తాజాగా వెల్లడించింది. త్రివిధ దళాల నవీకరణకు అవసరమైన మొత్తాలకు, బడ్జెట్లో కేటాయింపులకు లంగరందకపోవడం- రక్షణ సామర్థ్యాన్ని దారుణంగా కుంగదీస్తోందన్నది స్థాయీసంఘం ఆక్షేపణ. రక్షణ రంగ అవసరాల నిమిత్తం ప్రత్యేక నిధి ఏర్పాటు అత్యవసరమన్నది దాని విస్పష్ట సూచన! 2015-’16 లగాయతు ఎన్నడూ త్రివిధ దళాల అవసరాల మేరకు బడ్జెట్‌ కేటాయింపులు జరగనే లేదన్న స్థాయీసంఘం- మొత్తం మీద నిధుల లోటు సగటున 35శాతానికి చేరిందని నిష్ఠుర సత్యం పలికింది. ద్వీపకల్ప దేశమైన ఇండియా నౌకాదళాన్ని దుర్నిరీక్ష్య శక్తిగా తీర్చిదిద్దుకోవాల్సి ఉండగా, కొనుగోళ్ల బడ్జెట్‌లో లోటు ఖాతా దానికే అత్యధికంగా ఉండటం నిశ్చేష్టపరుస్తోంది. ఆర్థిక వనరులు లేకపోవడంతో డిఫెన్స్‌ స్పేస్‌ ఏజెన్సీ (డీఎస్‌ఏ), డిఫెన్స్‌ సైబర్‌ ఏజెన్సీ (డీసీవైఏ) వంటి వాటి ఏర్పాటు ఆగిపోవడాన్ని ప్రస్తావించిన స్థాయీసంఘం- ఆధునిక రణతంత్ర సన్నద్ధత ఆవశ్యకతను గుర్తు చేస్తోంది. యుద్ధ ఫలితాన్ని ఇండియాకు అనుకూలంగా అనుశాసించడానికే కాదు, కాలుదువ్వడానికే శత్రు దేశాలు భయపడాలన్నా అన్ని విభాగాల్లోనూ అత్యధునాతన ఆయుధ సంపత్తి అవసరం ఎంతో ఉందన్న సంఘం- స్థిర నిధి ఏర్పాటుతోనే సుస్థిర రక్షణ సాధ్యపడగలదంటోంది. నిజానికి ఈ మొత్తుకోలు కొన్నేళ్లుగా స్థాయీసంఘం నోట వెలువడుతున్నదే. వార్షిక, పంచవర్ష, పదిహేనేళ్ల దీర్ఘకాలిక రక్షణ ప్రణాళికలతో నియమబద్ధ కేటాయింపులతో ముందడుగేయాలన్న సూచనలు అవశ్యం ఆచరణయోగ్యమైనవే!

సైనిక బలగాల సంఖ్యాపరంగా చైనా తరవాత రెండో స్థానంలో ఉన్న ఇండియా రక్షణ వ్యయం ప్రాతిపదికన అమెరికా, చైనా, రష్యా, సౌదీ అరేబియా తరవాత అయిదో స్థానం ఆక్రమిస్తోంది. 2020-’21 ఆర్థిక సంవత్సరంలో రక్షణ పద్దు రూ.3.37 లక్షల కోట్లతో చూపులకు ఏపుగానే ఉన్నా, ఆధునికీకరణకు అందులో దక్కుతోంది పట్టుమని 35 శాతమే! దేశీయంగా రక్షణ పరిశ్రమ పడుతూ లేస్తూ ఉండటంతో 60శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడుతున్న ఇండియా- ఆర్థిక వనరుల కొరత కారణంగా ఈసురోమంటున్న దుస్థితి దశాబ్దాలుగా దూరదృష్టిలేని విధానాల పుణ్యమే! భారీ రక్షణ కొనుగోళ్లలో పైకి తేలుతున్న కుంభకోణాలు, ‘బ్రహ్మోస్‌’ తరహాలో సాంకేతిక పరిజ్ఞాన బదిలీ సహా సంయుక్త నిర్మాణాలకు తగు చొరవ చూపలేకపోవడం, దేశీయంగా రక్షణ రంగ పరిశ్రమలకు కొరవడిన ప్రోత్సాహం, పరిశోధన- అభివృద్ధిని అలక్ష్యం చెయ్యడం వంటివన్నీ ఇండియాకు గుదిబండలుగా మారుతున్నాయి. పరిమిత వనరుల్ని గరిష్ఠ ప్రయోజనదాయకంగా మార్చుకునేలా- తక్షణ, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల మేరకు రక్షణ కొనుగోళ్ల అమలు బాధ్యతను సంయుక్త దళపతికి కట్టబెట్టాలని రెండున్నర నెలల క్రితం స్థాయీసంఘం సూచించింది. రక్షణ ప్రణాళికల మేరకు కొనుగోళ్లపై తుది నిర్ణయం తీసుకొనే ఓ ఉన్నతాధికార కమిటీ ఏర్పాటు కావాలని, ప్రపంచ గతిరీతుల్ని అవలోకిస్తూ జాతీయ భద్రతా సూత్రావళికి అనుగుణంగా ఎప్పుడేవి అవసరమో అదే నిర్ధారించాలని సిఫార్సు చేసింది. ఏదైనా కొనాలంటే 11 స్థాయుల్లో అనుమతులకోసం అనవసర కాలదహనంతో ఆధునికీకరణకు కేటాయించిన అరకొర నిధులూ ఏటా మురిగిపోతున్నాయని రక్షణ శాఖ చిరకాలంగా మొత్తుకొంటోంది. అయిదేళ్ల రక్షణ పద్దుకు ప్రధాని మోదీ ఈ మధ్యనే తథాస్తు పలకడం, సంయుక్త దళపతి నియామకాలూ పూర్తి కావడంతో- సైనికదళ ఆధునికీకరణపై కొత్త ఆశలు మోసులెత్తుతున్నాయి!

రక్షణ రంగ పద్దులో నవీకరణ నిధులు మురిగిపోయే దురవస్థను తప్పించేందుకంటూ పద్దెనిమిదేళ్ల క్రితమే పార్లమెంటరీ స్థాయీసంఘం ప్రత్యేక నిధి ప్రతిపాదన చేసింది. దాన్ని ఔదలదాలుస్తూ నాటి విత్తమంత్రి జశ్వంత్‌ సింగ్‌ 2004 బడ్జెట్లో నిధి ఏర్పాటును ప్రకటించారు. అధికారం యూపీఏ హస్తగతమయ్యాక దాన్ని పట్టించుకొన్న నాథుడు లేడు! భిన్న కారణాల్ని ఏకరువు పెడుతూ 2018లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖా ఆ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. తాము చేసే కొనుగోళ్లపై వసేప (జీఎస్‌టీ)తో పాటు కస్టమ్స్‌ సుంకమూ విధిస్తుండటంతో భారం తడిసిమోపెడవుతోందన్న రక్షణశాఖ విజ్ఞప్తిని మన్నించి నిరుడు సుంకాన్ని మినహాయించారు. రక్షణ, జాతీయ భద్రతల నిమిత్తం తగినన్ని నిధులు ఎన్నడూ మురిగిపోకుండా నిరంతరం అందుబాటులో ఉండాలన్న అంశాన్ని పరిశీలించాలంటూ కేంద్ర క్యాబినెట్‌- దాన్ని పదిహేనో ఆర్థిక సంఘానికి నివేదించింది. 2025 దాకా రక్షణ నిధికి ఎంత మొత్తం అవసరమో రాజ్‌నాథ్‌ సింగ్‌ సారథ్యంలోని మంత్రిత్వశాఖ ఆర్థిక సంఘానికి పూసగుచ్చింది. ‘రాష్ట్రీయ సురక్షా నిధి’ పేరిట ఏర్పాటయ్యే ప్రత్యేక పద్దు భారాన్ని రాష్ట్రాలూ నెత్తికెత్తుకోవాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రం చెంత సంచిత నిధిగా పోగుపడే మొత్తంలో ‘సురక్షా నిధి’కి మొదట కేటాయించేసి, మిగిలిన మొత్తంలోనే రాష్ట్రాలకు వాటా వెయ్యాలన్నది కేంద్రం అభిమతం. వేదాలు, పురాణాలు, అర్థశాస్త్రాలను ఉటంకిస్తూ ‘ప్రతి పౌరుడూ దేశ రక్షణకు తోడ్పాటునందించా’లన్నది ఆర్థిక సంఘానికి కె.పరాశరన్‌ ఇచ్చిన న్యాయ సలహా సారాంశం. అటు తిరిగి, ఇటు తిరిగి దేశ భద్రత పద్దు- రాష్ట్రాల ఆర్థిక సత్తువను మరింతగా చిత్తు చెయ్యనుండటమే విడ్డూరం!

Posted on 17-03-2020