Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

వ్యర్థాలతో అనర్థం

ఆస్పత్రి ప్రాంగణంలో అడుగుపెట్టగానే అక్కడి పరిశుభ్ర, ఆహ్లాద వాతావరణం రోగుల్ని సాంత్వనపరచాలి. సత్వర స్వస్థత చేకూరుతుందన్న భరోసా కలిగించాలి. స్వాస్థ్య సేవల అందుబాటు, నాణ్యతల ప్రాతిపదికన 195 దేశాల జాబితాలో 145వ స్థానానికి పరిమితమైన భారత్‌లోని వివిధ చికిత్సాలయాల్లో క్షీణ ప్రమాణాలది ఏళ్ల తరబడి అంతులేని కథ. వ్యర్థాలు, విసర్జితాలు పేరుకుపోయి దవాఖానాల్లో పాదం మోపితే మరెన్ని రోగాలు దాపురిస్తాయోనని అభాగ్యజనం తల్లడిల్లే దుస్థితి తరతమ భేదాలతో దేశం నలుమూలలా తాండవిస్తోంది. దేశ దేశాల్ని చుట్టబెట్టేస్తున్న కరోనా వైరస్‌ తాకిడి నేపథ్యంలో వ్యర్థాలపై నిబంధనల ఉల్లంఘనలు పెచ్చరిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా 84వేలకుపైగా ఆస్పత్రుల్లో సొంతంగా వ్యర్థాల నిర్మూలన ప్లాంట్లు కలిగినవాటి సంఖ్య రెండు వందలకు లోపేనని కొన్నేళ్లక్రితం లఖ్‌నవూ ఐఐఎమ్‌ అధ్యయనం దిగ్భ్రాంతకర వాస్తవం వెల్లడించింది. అనంతర కాలంలో పెద్దగా మార్పు చోటు చేసుకోనేలేదని నిర్ధారిస్తూ విడ్డూర ప్రహసనాలిప్పుడు వెలుగు చూస్తున్నాయి. కేరళనుంచి కర్ణాటకకు లారీల్లో తరలిస్తున్న జీవ వ్యర్థాలను స్థానికులు అడ్డుకుని వెనక్కి తిప్పి పంపిన ఘటనలు మైసూర్‌, కోయంబత్తూర్లలో నమోదయ్యాయి. బయో- మెడికల్‌ వ్యర్థ పదార్థాలపై 2016నాటి నిబంధనల్ని ఉల్లంఘించాయంటూ హరియాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిరుడు 22 ప్రైవేటు ఆస్పత్రుల మీద కొరడా ఝళిపించింది. ఆ తరహా ఆరోపణలపైనే దిల్లీలోని 48 వైద్య సంస్థలు ఇటీవలే బోనెక్కి జరిమానా చెల్లించాల్సి వచ్చింది. కేంద్రం ‘విపత్తు’గా ప్రకటించిన కరోనా తాకిడి ముమ్మరించిన పక్షంలో, ఆస్పత్రుల్లో ఇంతలంతలయ్యే జీవ వ్యర్థాల నిర్వహణ అత్యంత విషమ సమస్య కానుంది. అందుకు విరుగుడుగా పకడ్బందీ జాతీయ వ్యూహ రచనకు, సమర్థ కార్యాచరణకు ప్రభుత్వాలు చురుగ్గా సన్నద్ధం కావాలి!

వైద్యాలయాల్లో ఒక్కో పడకకు దాదాపు 400 గ్రాముల వంతున గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే రోజూ 50 టన్నుల దాకా జీవ వ్యర్థాలు వెలువడతాయని అంచనా. 2022నాటికి దేశీయంగా ఆ రాశి 775 టన్నులకు పైబడనుందన్నది భారత వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య (అసోచామ్‌) మదింపు వేసిన లెక్క. 48 గంటల్లోగా వాటిని జాగ్రత్తగా నిర్మూలన కేంద్రాలకు చేర్చాలి. నిర్ణీత ప్రమాణాల మేరకు వ్యర్థాల్ని విచ్ఛిన్నం చేయకపోతే అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌ గాలిలోకి చేరి ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తాయి. ఆ ప్రమాదాన్ని నివారించేందుకే ఆస్పత్రుల్లో వ్యర్థాల నిర్వహణపై 1986లో రూపొందించిన నియమ నిబంధనల్ని మూడు దశాబ్దాల విరామానంతరం ప్రక్షాళించినా- అమలులో వైఫల్యాలు నిశ్చేష్టపరుస్తున్నాయి. ఏ ప్రాంతంనుంచి ఎంత పరిమాణంలో జీవ వ్యర్థాలు ఉత్పత్తయ్యాయి, ఎక్కడి నిర్మూలన ప్లాంటుకు ఎన్ని తరలించారన్న సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వెబ్‌సైట్‌లో నమోదు కావాల్సి ఉన్నా- చాలాచోట్ల ఆనవాయితీగా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. శాస్త్రీయ పద్ధతిలో జీవ వ్యర్థాల నిర్మూలన ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఆస్పత్రుల్లో వ్యర్థాల నిర్వహణ సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేస్తున్న కేంద్రాల నిర్వాహకుల్లో అత్యధికులు- నాలాలు, మురుగు కాల్వలు, పట్టణ శివారు ప్రాంతాల్లో వాటిని దిమ్మరిస్తున్నారు. అవినీతి మత్తులో కాలుష్య నియంత్రణ మండళ్లు నిష్పూచీగా పొద్దుపుచ్చుతుండగా- జీవ వ్యర్థాల నిర్వహణ తీరుతెన్నులు జనసామాన్యంలో ‘బయో’త్పాతం పుట్టిస్తున్నాయి.

వేలాది కరోనా వైరస్‌ బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సేవలందించే నిమిత్తం కేవలం తొమ్మిది రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించగలిగిన చైనాకే- రోజుకు 240 టన్నులకుపైగా వుహాన్‌ నగరంలో పోగుపడుతున్న జీవ వ్యర్థాలు గడ్డు సవాలు విసరుతున్నాయి. ఘన వ్యర్థాల్లో 47 శాతం మేర పునర్వినియోగిస్తూ, 36శాతాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బుగ్గి (ఇన్సినిరేషన్‌) చేస్తున్న జర్మనీ వంటివి మెరుగ్గా రాణిస్తున్నాయి. అక్కడి సన్నద్ధతతో పోలిస్తే ఇక్కడి ఆస్పత్రుల నిర్వహణ లోపభూయిష్ఠమే. అస్వస్థతతో ఆస్పత్రిని ఆశ్రయించిన రోగుల్లో సుమారు 10శాతం సూక్ష్మక్రిముల దాడికి గురై కొత్త ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదికే ధ్రువీకరించింది. వైద్య వ్యర్థాలపై ఎవరికి వారు చేతులు దులిపేసుకుంటున్న బాగోతాలకు కొదవ లేదు. జీవ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్య పోకడల్ని అరికట్టేందుకంటూ ప్రత్యేక వెబ్‌సైట్‌, మొబైల్‌యాప్‌ అందుబాటులోకి తెచ్చిన చోట్లా అవినీతి వాటావరణం వర్ధిల్లుతోంది! వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనా మహమ్మారి బారిన పడకుండా తప్పించుకున్నవారూ, ఏ చిన్నపాటి రుగ్మతతో ఆస్పత్రి తలుపు తట్టినా- అంతకుమించిన ముప్పును ఎదుర్కోవాల్సిన దురవస్థ నేడుంది. రాష్ట్రాల పరిధిలోని ప్రజారోగ్యాన్ని జాతీయ ప్రాధాన్యాంశంగా గుర్తించి తోడ్పాటు అందిస్తున్నట్లు చాటుకున్న కేంద్రం, మరింత ఉదారంగా స్పందించాల్సిన సంక్లిష్ట తరుణమిది. స్థూల దేశీయోత్పత్తిలో 6.36 శాతం నిధుల్ని జనారోగ్య పరిరక్షణకు చైనా వెచ్చిస్తుండగా, భారత్‌ తనవంతుగా జీడీపీలో 1.28 శాతమే కేటాయించడం- ఆరోగ్య రంగాన్ని కుంగదీస్తోంది. అత్యవసర పరీక్షలు, చికిత్సా సదుపాయాలు మొదలు జీవ వ్యర్థాల నిర్వహణవరకు పరిస్థితిని కుదుటపరచి, ప్రతి అంచెలోనూ పర్యవేక్షణ, జవాబుదారీతనాలకు ప్రోది చేసే వాతావరణ పరికల్పనే- జాతిని గట్టెక్కించగలుగుతుంది!

Posted on 18-03-2020