Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

గ్రామాలకు రక్షరేకు!

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇండియాపైనా కోరసాచిన తరుణంలో- అంటువ్యాధిగా అది ప్రబలకుండా పౌరులంతా ఇంటికే పరిమితమయ్యే కార్యాచరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకట్టాయి. దేశవ్యాప్తంగా పౌర సమాజం జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన నేపథ్యంలో- అంతర్రాష్ట్ర సరిహద్దుల్ని మూసేసి ప్రజా రవాణాను బందు చేసి ఈ నెలాఖరు దాకా ప్రజలంతా ఇంటిపట్టున ఉండాలంటూ ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రభుత్వాలు జన సామాన్యానికి విజ్ఞప్తి చేశాయి. కొవిడ్‌ జాడ కనబడిన 82 జిల్లాల్లో ‘పూర్తి మూసివేత’ అమలు కావాలని కేంద్రమూ నిర్దేశించినా, ప్రజల్లో పొడగడుతున్న బేపర్వా ధోరణి నిశ్చేష్టపరుస్తోంది. కాబట్టే, నిష్పూచీగా వీధుల్లోకొస్తున్నవారిపై చట్టబద్ధ చర్యలు చేపట్టాలంటూ ప్రధాని మోదీ సూచించారు. ప్రాణాంతక కరోనా మహమ్మారిపై దేశం మొత్తం కలిసికట్టుగా సాగించాల్సిన దీర్ఘకాలిక సమరంలో పౌరుల కదలికలపై విధించిన నిషేధాలు- కేవలం తొలి అడుగులు! ఈ తరహా నియంత్రణలు చేపట్టక పోబట్టే ఇటలీలాంటివి కొవిడ్‌ విలయంలో చిక్కి విలవిల్లాడుతున్నాయి. చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టిన వైరస్‌ మొదట్లో అక్కడ తీరైన చొరవ చూపకపోవడంతో విష కోరలతో విజృంభించి వేలమందిని బలిగొంది! విదేశీ ప్రయాణికులనుంచే ఇండియాలోకి దిగబడిన కరోనా- తొలి దశలో వారికి, మలి దశలో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకే పరిమితమై రెండో దశకు చేరింది. అక్కడికే దాన్ని అదుపు చేసి నియంత్రించాలంటే- ప్రభుత్వాల నిర్దేశాల మేరకు పౌరులంతా ఇళ్లకే పరిమితం కావడం తప్పనిసరి. భారత్‌లోని వైద్యారోగ్య రంగం స్థితిగతులు అందరికీ తెలిసినవే కాబట్టి- 66శాతం జనాభాకు నెలవులైన గ్రామాలకు కరోనా వైరస్‌ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం తక్షణావసరంగా గుర్తించాలి. ఎక్కడికక్కడ గ్రామాల్ని దిగ్బంధించి, పల్లెల మధ్యా రాకపోకల్ని రద్దుచేసి మహమ్మారి క్రీనీడ సైతం వాటిపై పడకుండా కాచుకోవడంలోనే ‘జాతి భద్రత’ ముడివడి ఉంది. తల్లిలాంటి పల్లెసీమల్ని కాపాడుకోవడం- ఈ కరోనా పరచిన అసుర సంధ్యలో ప్రభుత్వాలతోపాటు పౌరులందరి ప్రాథమిక విధి!

ప్రాణాంతక వైరస్‌లు కోరసాచే వేళ- దిగ్బంధం అన్నది శిక్షకాదు, రక్ష! మనకేం కాదులే అన్న దిలాసాతో తిరిగే వ్యక్తే వైరస్‌ వాహకంగా మారి తనతోపాటు ఎంతోమంది బతుకుల్నీ బుగ్గిపాలు చేసే ప్రమాదాన్ని సమర్థంగా తప్పించడానికే ఈ సామాజిక దిగ్బంధ వ్యూహ రచన! చైనాలో కరోనా వైరస్‌ తొలి వందనుంచి వెయ్యి కేసులకు విస్తరించడానికి ఆరు రోజులు, వెయ్యినుంచి అయిదు వేలకు చేరడానికి నాలుగు రోజులు పడితే, అయిదునుంచి పదివేల కేసులుగా పడగెత్తడానికి పట్టింది మూడు రోజులే! స్పెయిన్‌, అమెరికాల్లో అయిదునుంచి పదివేల కేసులకు పాకడానికి కరోనా తీసుకొంది కేవలం రెండు రోజులే. ప్రభుత్వాలూ ప్రజలూ ఏమాత్రం ఉదాసీనంగా ఉండటానికి వీల్లేదని రుజువు చేసే గణాంకాలివి. హుబీ ప్రాంతంనుంచి తక్కిన చోట్లకు కరోనా విస్తరించకుండా చైనా జనవరి 23నుంచి చేపట్టిన రోగగ్రస్త ప్రాంత దిగ్బంధం వంటి చర్యలు ఫలించి 67శాతం రోగులు, 97శాతం మరణాలు అక్కడికే పరిమితం అయ్యాయి. కరోనా విరుచుకుపడ్డా వుహాన్‌లో మరణాల రేటు 3.1 శాతమైనా తక్కిన చోట్ల 0.16 శాతానికి పరిమితం అయిందంటే- దిగ్బంధ వ్యూహం చలవే! చైనాలో పలు గ్రామాలు పొలిమేరల్లో బ్యారికేడ్లు కట్టి వెలుపలి వారెవర్నీ అనుమతించకపోవడం ద్వారా కరోనాను కట్టడి చేసిన తీరు స్ఫూర్తిమంతం. అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలోని గ్రామాలూ నేడు పఠిస్తున్నది అదే మంత్రం! అంతెందుకు? దాదాపు ఆరువేలకు చేరిన మరణాలతో అతలాకుతలమవుతున్న ఇటలీ సైతం- దేశీయంగా ప్రయాణాలపై కఠిన ఆంక్షల కొరడా ఝళిపిస్తోంది. కంటికి కనపడని శత్రువు కరోనా చావు దెబ్బను కాచుకోవాలంటే- మూడింట రెండొంతులకుపైగా జనాభాగల గ్రామాలను కట్టుదిట్టంగా దిగ్బంధించి రక్షరేకు కట్టాలి!

ప్రస్తుతానికి మందూమాకూ లేని కరోనాను మట్టగించే వ్యాక్సిన్‌ మునుముందు ఎప్పటికి వస్తుందో తెలియదు! ఈలోగా కోట్లాది ప్రజల ప్రాణాలు గాలిలో దీపం కాకుండా ఉండాలన్నా, పల్లెల్లో కరోనా సృష్టించగల మహోత్పాతం దేశ వైద్య ఆరోగ్యరంగాన్ని కుదేలు చెయ్యకుండా కాచుకోవాలన్నా- స్వయం దిగ్బంధానికి గ్రామాలు ప్రతిన పట్టాలి. వందేళ్ల క్రితం మొదటి ప్రపంచ యుద్ధం చివర్లో ఇండియాను చుట్టుముట్టిన స్పానిష్‌ ఫ్లూ- మహా సమరంలో మొత్తం మరణించినవారి సంఖ్యను మించి భారత్‌లో అభాగ్యుల్ని బలిగొంది! ఏ మాత్రం ఉదాసీనత అయినా, అంతే ఉత్పాతం సృష్టించగలదన్న అవగాహనతో ప్రజలు, ప్రభుత్వాలు అకుంఠిత దీక్షతో ఒక్కతాటిపై కదలాల్సిన సమయమిది. దేశవ్యాప్తంగా నిర్బంధం అమలయ్యే పల్లెలు, పట్టణాలు, నగరాలు- అన్నింటికీ అవసరమైన నిత్యావసరాల సక్రమ సరఫరాలకు ప్రభుత్వాలే పూనిక వహించాలి. దేశీయంగా 50 కోట్ల పైచిలుకు శ్రామిక శక్తిలో 85శాతం అసంఘటిత రంగం వాటాయే కాగా, వారిలోనూ పనీపాటలతో పల్లెపట్టుల్లో పొట్టపోసుకొనేవారి సంఖ్యే అధికం. వారి మౌలికావసరాలు తీర్చడం, గ్రామాలకు వస్తు సంబారాల కొరత లేకుండా కాచుకోవడం, పల్లెల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడం ప్రభుత్వ యంత్రాంగాల పని కావాలి. కరోనా తాకిడినుంచి గ్రామాల్ని సమర్థంగా రక్షించుకోగలిగితే- అది ఇండియాకు ఘన విజయం అవుతుంది. కరోనాపై ఉమ్మడి పోరుకు పౌర బాధ్యతతో ప్రతి ఒక్కరూ నిబద్ధ సైనికుడై కదిలినప్పుడే- మహమ్మారి పీడనుంచి దేశం విముక్తం కాగలిగేది!

Posted on 24-03-2020