Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

మహమ్మారులు... మానవాళికి సవాళ్లు

* ‘స్పానిష్‌ ఫ్లూ’ చెబుతున్న పాఠం

యుద్ధాలు దేశాల సరిహద్దులను చెరిపివేయగలవని చరిత్ర చెబుతోంది. కానీ, కంటికి కనిపించని ఒక వైరస్‌ కూడా ఆ పని చేయగలదన్నది వర్తమానం చెబుతున్న చేదు నిజం. మానవాళి మనుగడను అనేక వ్యాధులు నిరంతరం సవాలు చేస్తూనే ఉన్నాయి. పలురకాల సూక్ష్మాతి సూక్ష్మమైన వ్యాధి కారక వైరస్‌/ బ్యాక్టీరియాలు మనిషి ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఎదురు నిలిచి వణికించాయన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. ప్రస్తుతం కరోనా వైరస్‌ కోరల్లో చిక్కి విలవిలలాడుతున్న ప్రపంచం- మానవ జాతి చరిత్రలో అత్యంత భయానకమైన ఖండాంతర వ్యాధుల్లో ఒకటైన ‘స్పానిష్‌ ఫ్లూ’ సృష్టించిన మారణ హోమాన్ని ఈ సందర్భంలో మననం చేసుకోవాలి. సుమారు వందేళ్ల క్రితం, 1918లో అంతర్జాతీయ సమాజం సంఘర్షణ వాతావరణంలో ఉండగా, ఒక వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం ప్రారంభించింది. చివరికి, భూమిపై ప్రతి ముగ్గురిలో ఒకరికి సోకింది. కనీసం 10 కోట్ల మంది చనిపోయారన్నది ఒక అంచనా. గత 500 సంవత్సరాల్లో సుమారు 15 సార్లు ఫ్లూ మహమ్మారి మానవాళిపై విరుచుకుపడింది. కానీ, చివరి అయిదు సందర్భాల్లో మాత్రమే దానిపై శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం జరిగింది. 1957లో ఆసియా ఫ్లూ, 1968లో హాంకాంగ్‌ ఫ్లూ రెండింటిపై అత్యంత ఆధునిక క్షేత్రీయ కొలమానాలతో అధ్యయనం జరిగింది. వీటి కారణంగా మరణాలు గరిష్ఠంగా సుమారు 20 లక్షలకు పరిమితమయ్యాయి.

జనాభాను తగ్గించిన ప్లేగు
మానవ చరిత్రలోనే మరువలేనంత స్థాయిలో మరణాలు 1918 నాటి ఉదంతంలో నమోదయ్యాయి. 1918 ఫ్లూ మహమ్మారి బారిన పడిన ప్రపంచంలోని కొన్ని దేశాల్లో చైనా కూడా ఉంది. అక్కడే ముందుగా వ్యాధి ప్రబలిందన్నది కొందరి వాదన. అమెరికాలోని కాన్సాస్‌ పట్టణం నుంచి లేదా బ్రిటిష్‌ సైనిక దళాల్లో ఇది మొదలై ఉండొచ్చనే మరో వాదన కూడా ఉంది. 1918 ఫ్లూ చైనాలో ఉద్భవించిందనే ఊహాగానాలకు దారి తీసింది. అది తరవాత అమెరికాలోని బోస్టన్‌ సమీపంలో పరివర్తనం చెంది, అక్కడ నుంచి ఫ్రాన్స్‌, ఐరోపా యుద్ధభూమిలో, మిత్ర రాజ్యాల సైనికులు, నావికుల ద్వారా వ్యాప్తి చెందింది. బ్రిటిష్‌, ఫ్రెంచ్‌ సైనికుల సహాయార్థం సుమారు 96 వేల మంది చైనా కార్మికులను సమీకరించడం కూడా ఈ మహమ్మారి వ్యాప్తికి మూలకారణమై ఉండొచ్చని కొంతమంది వాదన. మొదటి ప్రపంచ యుద్ధం చివరి భాగంలో సైనిక దళాల కదలికలు పెద్దయెత్తున సాగడంతో మహమ్మారి వ్యాప్తి మరింత వేగవంతంగా సాగింది. అంతేకాదు, అప్పటికే వ్యాప్తి చెందిన ఫ్లూ వైరస్‌ రూపాంతరం చెంది మరింత బలం సంతరించుకోవడం కూడా ఒక కారణం. అనేక మంది సైనికులు అప్పటికే పోషకాహార లోపంతో బలహీనపడగా, రసాయన దాడుల నేపథ్యం అగ్నికి ఆజ్యం పోసింది. అప్పటి ఆధునిక రవాణా వ్యవస్థలతోపాటు, సైనికులు, నావికులు పౌర ప్రయాణికులకూ వ్యాధిని వ్యాప్తి చేశారు. 1918 నవంబర్లో ఫ్రాన్స్‌ నుంచి స్పెయిన్‌కు మారిన తరవాత మహమ్మారి పత్రికల దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది. నిజానికి స్పెయిన్‌ ఆ యుద్ధంలో పాల్గొనలేదు. అందుకని పత్రికా స్వేచ్ఛపై యుద్ధకాలపు నిషేధాన్ని విధించలేదు. ఫలితంగా అనేక మరణాలను నిజాయితీగా వెలుగులోకి తెచ్చి ప్రచురించి ప్రాచుర్యం కలిపించింది. మరణాల సంఖ్యపై భిన్న కథనాలున్నప్పటికీ, బహుశా 10 కోట్ల మంది, అంటే అప్పటి ప్రపంచ జనాభాలో 1-6 శాతం మధ్య ఉండొచ్చని ప్రాథమికంగా గుర్తించారు. మానవ చరిత్రలో అత్యంత వినాశకరమైన మహమ్మారిలో ఒకటిగా, ‘బ్లాక్‌డెత్‌’గా పిలిచే ప్లేగువ్యాధి 14వ శతాబ్దంలో అప్పటి ప్రపంచ జనాభాను 47.5 కోట్ల నుంచి 35-37.5 కోట్లకు తగ్గించి ఉండవచ్చని అంచనా.

వ్యాప్తికి కారణాలెన్నో!
స్పానిష్‌ ఫ్లూ మహమ్మారి బారిన పడి మరణించిన వారిలో దాదాపు సగం మంది 20 నుంచి 40 సంవత్సరాల వయసు గల యువతే. 99% మరణాలు 65 ఏళ్లలోపు వారిలో సంభవించాయి. వాస్తవానికి, 1918 నాటి ఫ్లూ ద్వారా మరణించిన వారిలో గర్భిణులు అధికంగా ఉన్నారు. సాధారణంగా శీతాకాలంలో అధ్వానంగా ఉండే ఫ్లూ వ్యాప్తి- నాటి కాలంలో వేసవి, శరదృతువుల్లో (ఉత్తరార్ధగోళంలో) విస్తృతంగా వ్యాపించడం మరో విచిత్రం. అనేక వైరస్‌లు కేవలం వాతావరణ పరిస్థితులపై మాత్రమే కాకుండా ఆయా దేశాల భౌగోళిక, నైసర్గిక స్వరూపాలపై కూడా ఆధారపడి వ్యాప్తి చెందుతాయి. 1918 నాటి ఫ్లూలో అత్యంత ప్రమాదకరమైన దశ కొన్ని నెలల తర్వాత తిరిగొచ్చింది. ఆగస్టు నుంచి మొదలై, అక్టోబర్‌ నాటికి మరింత తీవ్రస్థాయికి చేరి మరింత పెద్దసంఖ్యలో మరణాలకు కారణమైంది. వైరస్‌లో చోటుచేసుకున్న ఉత్పరివర్తనే దీనికి కారణం కావచ్చు. మొదటిసారి ఫ్లూ నుంచి కోలుకున్న వారిలో చాలామంది రోగనిరోధక శక్తి సముపార్జించుకున్నట్లు తేలింది. ఆ సమయంలో బ్రిటిష్‌ పాలనలో ఉన్న భారతదేశంలో 1.2-1.7 కోట్ల మంది చనిపోయినట్లు అంచనా. మానవాళి అంతరించే చివరి అంచులదాకా తీసుకెళ్లిన ఈ ఫ్లూ వ్యాధి అకస్మాత్తుగా కనుమరుగైంది. 1918 నవంబర్‌ నాటికి అనేక నగరాల నుంచి దాదాపుగా అదృశ్యమైంది. వ్యాధి తీవత్ర వేగంగా క్షీణించడానికి కారణం- చికిత్సలో వైద్యులు మరింత నిష్ణాతులై ఉండటం, వైరస్‌ చాలా వేగంగా తక్కువ ప్రాణాంతక స్థితికి రూపాంతరం చెందడంగా చెప్పవచ్చు. ఈ వ్యాధి ప్రభావంతో తదనంతర కాలంలో అనేక దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించాయి. వైరస్‌ ప్రబలిన సమయంలో జన్మించిన వారిలో శారీరక వైకల్యం రేట్లు పెరిగి, విద్యాసామర్థ్యం తగ్గినట్లు ఒక అధ్యయనంలో తేలింది. ఆ తరవాత కూడా అనేకసార్లు ఫ్లూ పలురకాల అనారోగ్య విస్ఫోటనాలకు దారితీసింది. 2009లో వచ్చిన స్వైన్‌ ఫ్లూ ప్రజారోగ్యంలో మరొక విస్తృత విధ్వంసం సృష్టించింది. అప్పటికి చాలామందిలో ఈ వైరస్‌కి చెందిన రోగ నిరోధక శక్తి లేకపోవడంతో చిన్నారులు మొదలు మధ్య వయస్కులదాకా అనేక మంది మరణాలకు కారణమైంది. మన దేశంలో 937 కేసులలో 218 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కరోనా వైరస్‌పై దేశాలన్నీ ఒక్కటై సాగించే సమరంలో మనవంతుగా ప్రభుత్వం సూచించే అన్ని నివారణ చర్యలను నిక్కచ్చిగా పాటించాలి.

మహాత్ముడికి సైతం...
మహాత్మాగాంధీని సైతం స్పానిష్‌ ఫ్లూ మహమ్మారి వదలలేదు. 1918 ఆగస్టు 11న మహాత్ముడు తీవ్రస్థాయిలో జబ్బు బారినపడ్డారు. ఆయన జీవితంలో అత్యంత సుదీర్ఘంగా సోకిన ప్లూ ఆయనకు ఆహారం, ఆరోగ్యం పట్ల గొప్ప అవగాహనను పెంచింది. కేవలం స్వీయ నియంత్రణ, ఆహారంలో కఠిన మార్పుల ద్వారా ఆయన భయంకరమైన ఫ్లూ నుంచి బయటపడ్డారు.

Posted on 24-03-2020